
చరిత్ర పుస్తకాలు రాయ్ ను చెట్టబుట్ట లోకి తప్పకుండా నెట్టివేస్తాయి. కానీ గత పదేళ్లలో CAG యొక్క మౌనం మన సమిష్టి నైతికత, నైతిక విలువలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (సిఎజి) కార్యాలయానికి గత దశాబ్ద కాలం పాటు సంస్థాగత సెలవ ఏమైనా మంజూరు చేయబడిందా అని చాలా మంది అనుమానాలకు గురౌతున్నారు . ప్రజలను మేల్కొలుపుటకు సరిగ్గా ఈ సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి క్రింది స్థాయి వరకు ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘‘శీష్ మహల్’’ అని పిలిచే దాని గురించి సిఎజి నివేదికను ప్రదర్శిస్తూ, ఆ సంస్థ ఉనికిని మళ్లీ మనకు గుర్తు చేస్తున్నారు.
సిఎజీ ఉనికిలోనే ఉందనీ. దాని ‘నివేదికలు’ మరోసారి రాజకీయ పార్టీలకు మందుగుండు సామగ్రిని అందిస్తున్నాయని మనకు తెలుసు. ‘శీష్ మహల్’ నివేదిక ఎటువంటి ఉత్సాహాన్ని ప్రజలకు కలిగించకపోయినా, మరొక సిఎజీ ‘నివేదిక’ కొన్ని వార్తా సంస్థలకు అందింది. ఇది ఢల్లీి ప్రభుత్వ ఎక్సైజ్ విధానం వల్ల రూ. 2,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ‘‘నష్టం’’ జరిగిందని సూచిస్తుంది.
బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డా కేజ్రీవాల్ పాలనను ‘‘ఉద్దేశపూర్వక వైఫల్యం’’ అని ఆరోపించారు. ఢల్లీి శాసనసభ ఎన్నికలకు కొంచెం ముందుగా ఈ నివేదిక లీక్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే ఈ నివేదికను బిజెపి కార్యాలయాల్లో తయారు చేయబడిన ‘‘నకిలీ నివేదికగా’’ ప్రకటించింది. అక్కడితో ఈ విషయం అయిపోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టను మసకబారడానికి బిజెపీ వీరాభిమానులు సిఎజీ నివేదికను ఉపయోగించుకుంటారని పూర్తిగా నమ్మవచ్చును .
ఈ ‘ఉద్దేశపూర్వక వైఫల్యం’ అనే కథనాన్ని పరిగణనలోకి తీసుకొనే ముందు మనం వినోద్ రాయ్ సిఎజీ అధినేతగా ప్రాచుర్యంలోకి తెచ్చిన మరో వాదన ‘నష్టం జరిగి ఉండవచ్చు’ అన్న వాదనను కూడా గుర్తు చేసుకోవాలి. ‘ఊహాత్మక నష్టం’ అనే వినూత్న సిద్ధాంతాన్ని మన ముందుకు ప్రవేశపెట్టిన అతని నివేదిక, చైతన్యవంతమైన ప్రతి భారతీయుడి మనసును కలవర పరచింది. ఆ నివేదిక మీడియాలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుని విపరీతమైన ప్రచారంతో ప్రజలకు చేరింది. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ శక్తులు దీన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాయి.
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం వినోద్ రాయ్ సృష్టించి ఊహాత్మక నష్టం అన్న పదాన్ని, దాని పర్యవసానాలను గుర్తించక ముందే రాయ్ ఆవిష్కరణలను ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలను రెచ్చగొట్టటానికి చాకచక్యంగా ఉపయోగించుకుంది. కొంతకాలం పాటు రాయ్ మరియు అతని సహచరులు ప్రతిపక్ష ప్రతినిధులుగా ప్రవర్తించారు. రాయ్ విషయానికొస్తే, అతను తనకు తానుగా మీడియా ప్రశంసల మత్తులో సంతోషంగా మునిగి పోయారు.
అంతర్గతంగా కుమ్ము లాటలతో చీలిపోయిన యూపిఎ 2 పాలన రాయ్ యొక్క మోసపూరిత నివేదిక ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాజకీయంగా అప్పుడే రెండో సారి ప్రజామోదం పొంది అధికారం చేపట్టినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి యూపిఎ2 ప్రభుత్వాన్ని బజారుకీడ్చటానికి వినోద్‌రాయ్ విరచిత ‘ఊహాజనిత’ నివేదికను ఉపయోగించుకున్నది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం ఏర్పడిరది. కేజ్రీవాల్, మోడీ వంటి వారు దేశ నాయకులుగా మన ముందుకు వచ్చారు.
ఇప్పుడు రాయ్ మోస పూరిత కథనాల ద్వారా లబ్ది పొందిన రెండు ప్రధాన పార్టీలు ఇప్పుడు ఢల్లీి రాష్ట్ర శాసనసభ గద్దె కోసం పోటీపడుతున్నాయి. ప్రధాన లబ్దిదారు బిజెపి, జూనియర్ లబ్దిదారు అయిన ఆమ్ ఆద్మీ పార్టీని మింగటానికి బయలుదేరింది. ఒకప్పుడు మధ్యతరగతిలో కాంగ్రెస్‌కు ఉన్న పునాదిని కూల్చేయటానికి ఉపయోగపడ్డ సిఎజీ నివేదికే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యతరగతి ప్రజల్లో ఉన్న ఆదరణను ఆర్పేయటానికి పూనుకుంటోంది. అయితే ‘జూనియర్ అన్నా హజారే’ బిజెపి దుష్ట వ్యూహాలకు అంత తేలిగ్గా రెచ్చిపోయి మోసపోనని సూచన ప్రాయంగా తెలియజేశాడు.
సిఎజీ నిశ్శబ్దపు స్వర్ణకమలం
కానీ ప్రజలు ఒక ప్రశ్న అడగాలను కొంటున్నారు. కుక్క ఎందుకు మొరగటం లేదు? రాజ్యాంగపరంగా అధికారం పొందిన జవాబుదారీ సంస్థ సిఎజీ ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? నరేంద్ర మోడీ పాలనలోని గత పదేళ్లలో సిఎజీ తన నివేదికల్లో ‘‘ఆత్మాశ్రయత, అస్పష్టత మరియు పారదర్శకత లేకపోవడం’’ అనే ఏ ఒక్క ఉదాహరణను కూడా ఎందుకు కనుగొన లేకపోయింది. ఈ సంస్థ 2012 నివేదికలో బొగ్గు బ్లాక్‌లు మరియు 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులలో జరిగిన ఊహాత్మక నష్టాల పేరుతో యూపిఎ 2 ప్రభుత్వాన్ని తిట్టడానికి ఉపయోగించిన కొలమానం ఇప్పుడు ఎందుకు ఉపయోగించటం లేదు?
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం తన విశ్వరూపం చూపిస్తూ సర్వ వ్యాపితంగా అన్ని రంగాల్లో విస్తరిస్తున్న తరుణంలో సిఎజీ మౌనం స్వర్ణకమలంగా మారటంతో పాటు చెవిటిది కూడా అయినట్లు కనిపిస్తోంది. ‘‘గుజరాత్ మోడల్’’ ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలు చేయబడుతోంది. గుజరాత్లో వలె, అన్ని విధాన ఉల్లంఘనలు, అధికారిక విచక్షణ, లోపభూయిష్ట పరిపాలనా, అన్ని ఉద్దేశపూర్వక తప్పులు లేదా అనుకోకుండా జరిగే తప్పులు అన్నీ ఇప్పుడు కొన్ని వ్యాపార సంస్థలకు అనుకూలంగా సృష్టించబడుతున్నాయి. ఈ వ్యాపార సంస్థలు ఇప్పుడు మోడీ పాలనను బహిరంగంగ మద్దతుదారులుగా ప్రజల ముందుకు వచ్చారు.
‘‘ఊహాత్మక నష్టం’’ అనే వినోద్ రాయ్ సిద్ధాంతాన్ని ప్రస్తుత సిఎజీ ఎందుకు అమలు చేయటం లేదు ? రాయ్ అనంతర కాలంలో, ఆడిటింగ్ సంస్థ సిఎజీ ఈ ఆలోచనను ప్రమాదకరమైనదిగా భావించిందా? ప్రతి అధికారిక నిర్ణయానికి రాయ్ బూటకపు కొలమానం వర్తింపజేస్తే, మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతుందని వాస్తవం గ్రహింపుకు వచ్చిందా ? బొగ్గు రంగంలో తదుపరి పరిణామాలు రాయ్ అద్భుత సృష్టి అయిన ‘ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయ నష్టం’ సిద్ధాంతం నిరాధారమైనదనటంలో అందరికీ ఏకాభిప్రాయం వచ్చింది.
చరిత్ర పుస్తకాలు, రాయ్‌ను చాలా నీచమైన తక్కువ స్థానానికి నెట్టి వేస్తాయి. అయినప్పటికీ, గత పదేళ్లలో సిఎజీ బంగారుమౌనం మన సమిష్టి నైతిక మరియు నైతిక విలువల భావనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. సిఎజీ నోరు మెదపకుండానే మోడీ పాలనకు క్లీన్ చిట్ ఇచ్చింది. రాయ్ శకంలో సిఎజీ నివేదికలతో విసుగు చెందిన ప్రజలు ‘‘నేను తినను, ఇతరులను తిననివ్వను’’ అని వాగ్దానం చేసిన వ్యక్తిని అభిమానించి ఓట్లు వేసారు. ఆశలన్నీ ఆవిరై కళ్ల ముందు వాస్తవ ప్రపంచం కనపడుతున్నా, మన మధ్యతరగతి ప్రజలు ‘‘క్విడ్ ప్రోకో’’ పాత రోజులకు తిరిగి వచ్చామనే విషయాన్ని జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేరు
అమెరికా దర్యాప్తు సంస్థలు అదానీ అనైతిక ఆర్థిక నేరాల పైన చేసిన అభియోగానికి మన ప్రజల ప్రతిస్పందన ఎంత తక్కువగా ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మన అసమ్మతిని తెలియ చేయడానికి, ఆగ్రహాన్ని ప్రదర్శించటానికి అసలు ఇష్ట పడటం లేదు. ప్రపంచీకరణ విధానాలకు, భారత వ్యవస్థ యొక్క స్థిరత్వం గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్న మన దేశ స్త్రీ, పురుషులు మరియు యువత అమెరికన్ దర్యాప్తు సంస్థ ఆరోపణను ‘అభివృద్ధి చెందుతున్న భారతదేశంపై యుద్ధం’ అనే కుట్ర సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మినట్లు కనిపిస్తోంది. పదేళ్ల క్రితం అవినీతిపై ఆగ్రహించిన మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు గుజరాత్ కేంద్రంగా ఉన్న వ్యాపారవేత్తను ‘మా మనిషి’గా చూడటానికి మొగ్గు చూపుతున్నారు. ఆరోపణల నిజానిజాలు గురించి దర్యాప్తు చేసేందుకు సెబీ సిద్ధపడదు. సిఎజీ కూడా ‘వినోద్ రాయ్ మనస్సాక్షి’ సిద్ధాంతానికి కట్టుబడి చేతులు కట్టుకుని కూర్చుంది. వినోద్‌రాయ్ భూతవైద్యానికి అంజనం వేసినట్లు ఆగిపోయింది.
ప్రభుత్వం చెప్పే మోసపూరిత ‘అవినీతి’ కథనాన్ని ప్రజలచే నమ్మించటం కొరకు మరియు రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వపు విభాగాలైన ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఐబి, ఎన్ఐఎ, మరియు పోలీసు మొదలైన వాటిని ప్రభుత్వం ఉపయోగించు కోవడం ద్వారా రాజకీయ ప్రత్యర్ధుల అవినీతి గురించి వస్తున్న ఆరోపణలు చదివి మనం సరిపెట్టుకుంటున్నాము. మరోవైపు, ప్రభుత్వ ఖాతాలను తనిఖీ చేయటానికి రాజ్యాంగబద్ధ అధికారంతో ఏర్పడిన ఏకైక కార్యాలయం కూడా చల్లగా నిద్రలోకి జారుకుంది.
ప్రభుత్వ ప్రేరేపిత కొత్త తరహా అనైతికతకు మన ప్రజలు పూర్తిగా లోనయ్యారు. ఇకపై నైతికత మరియు అనైతికత మధ్య తేడాను గుర్తించే వివేకాన్ని, ఇంద్రియ జ్ఞానాన్ని మనం కోల్పోయాము. అవినీతి రహిత భారత్ లో మనం ఉన్నామని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము.
హరీష్ ఖరే
(రచయిత యూపిఎ2 ప్రభుత్వంలో ప్రధానమంత్రి మీడియా సలహాదారు)
అనువాదం : పి రామకోటేశ్వర రావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.