
ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్న వాస్తవాన్ని పాప్కార్న్ పన్ను వివాదం మరోసారి రుజువు చేసింది. సమస్యల పరిష్కారానికి బదులు సమస్యల బూచిని చూపించి ప్రభుత్వం ప్రజలను భయాందోళనలు గురిచేయబూనుకోవడం అంటే క్షేత్రస్థాయి వాస్తవికతతో ప్రభుత్వ ఆలోచనా విధానానికి మధ్య పొంతలేదని ఒప్పుకోవడమే.
ప్రభుత్వ ప్రకటనలు, విధాన నిర్ణయాలపై జరుగుతున్న బహిరంగ చర్చతో కేంద్ర ఆర్థిక మంత్రికి కోపం తెప్పించినట్లుంది. సామాజిక మాధ్యమాలు ఆర్థికమంత్రి పాప్కార్న్పై విధించిన పన్నుగురించి చర్చించుకుంటున్నప్పటికీ అసలు చర్చ ప్రజలను భయభ్రాంతులను చేసి బిజెపి ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించటమే అసలు చర్చ. ఈ వైఖరి కీలకమైన సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం వైఫల్యాలను చెప్పకనే చెప్తున్నాయి. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో జవాబుదారీతనాన్ని దాటవేస్తూ భక్తజనరంజక విషయాలపై ఎక్కుపెడుతోంది
పాప్కార్న్ పన్ను వివాదం
పాప్కార్న్పై పన్ను వేయాలని డిశంబరు 2024లో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ తీర్మానించింది.
తదనుగుణంగా దేశంలో కాలక్షేపం కోసం తినే రకరకాల పాప్కార్న్పై వేర్వేరు మోతాదుల్లో పన్ను విధిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. తాజా విధానం ప్రకారం ఎటువంటి బ్రాండూ లేకుండా ఉప్పు కలిపి అమ్మే పాప్కార్న్ మీద ఐదుశాతం పన్ను విధిస్తే, బ్రాండెడ్ పాప్కార్న్ మీద 12 శాతం పన్ను, కారమెల్ కాండీ చెక్కరలో ముంచి అమ్మే పాప్కార్న్ మీద 18 శాతం పన్ను అమల్లోకి రానుంది. కొంతమందికి ఇదేదో సాధారణ చర్యగానే కనిపించినా ఎక్కువమంది తీవ్రంగా స్పందించారు. రోజువారీ సాధారణ ప్రజల ఘోష అమాత్యుల చెవికెక్కటం లేదని చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ.
ఇప్పటికే దేశంలో ప్రజలు ధరాభారంతో కుంగుతుంటే జనం కాలక్షేపం కోసం తినే పాప్కార్న్పై పన్నులు వేయటం అర్థరహితం. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు గమనిస్తే ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రజాగ్రహం కేవలం సామాజిక మాధ్యమాలకే పరిమితం కాలేదు. సాంప్రదాయక మీడియాలో సైతం ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే కీలకమైన సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వ స్పందన దున్నపోతు మీద కురిసిన వానలాగా మారిపోతుందని చెప్పటానికి పాప్కార్న్ పన్ను మీద వస్తున్న విమర్శలకు ప్రభుత్వ స్పందన చూస్తే అర్థమవుతుంది. నిరుద్యోగం, ధరలపెరుగుదల, ఆర్థిక అంతరాలు వంటి మౌలి సమస్యలను పట్టించుకోకుండా చిల్లర వ్యవహారాలపై కేంద్రీకరిస్తోంది. ఏనుగులు దూరే కంతలు వదిలిపెట్టి చీమలు దూరే కంతలు పూడ్చుకోవడంపై కేంద్రీకరించిన వైనం కనిపిస్తోంది. ఇటువంటి నిర్ణయాలు ప్రజల వినిమయ సామర్ధ్యాన్ని కుదేలు చేస్తున్నాయి.
వాస్తవాలతో నిమిత్తం లేని పన్ను విధానాలు
పాప్కార్న్ పన్ను ఒక్కటే కాదు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పన్నుల విషయంలో రూపొందించిన పలు విధానాలు వాస్తవ ఆర్థికచిత్రానికి సంబంధం లేకుండా పోవడంతో పలు విమర్శలకు కారణమయ్యాయి.
ఉదాహరణకు పప్పు ధాన్యాలుతో సహా కొన్ని లేబుల్స్ వేసిన ఆహారధాన్యాలపై కూడా 18 శాతం పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రధానంగా దిగువ మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లు పెడుతుంది. గతంలో కూడా మహిళలు ఉపయోగించే శానిటరీ నాప్కిన్స్పై 12 శాతం జిఎస్టీ విధించి ఆనక దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో ఉపసంహరించుకున్నారు. ఈ ఉదాహరణలు పరిశీలిస్తే ప్రజల వాస్తవిక జీవితంతో సంబంధం లేకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్న వైనం మనకు కనిపిస్తుంది.
ప్రజల నిత్యజీవితావసర వస్తువులపై పదేపదే విధిస్తున్న జిఎస్టీ యావత్ సాధారణ ప్రజల జీవితాన్ని మరింత సంక్షుభితం చేయటంతో పాటు సంక్లిష్టంగా మారుస్తోంది. సరళతరమైన పన్నుల విధానాన్ని ఎవరైనా స్వాగతిస్తారు కానీ ప్రస్తుతం అమలు జరుగుతున్న పన్నుల విధానం రోజురోజుకూ సమస్యాత్మకంగా మారుతోంది.
పాప్కార్న్ మీద ఇన్నిరకాల పన్నులు విధించటం గమనిస్తే అధికారుల చేతిలో కీలుబొమ్మగా మారిన పన్నుల వ్యవస్థ అటు ఉత్పత్తిదారులకూ ఇటు వినియోగదారులకూ కొత్త కొత్త సమస్యలు తెచ్చిపెడుతోందని అర్థమవుతుంది. ప్రజా ప్రయోజనం, ప్రజా సంక్షేమం విధాన రూపకల్పన లక్ష్యం అన్న దిశ నుండి ప్రభుత్వం ఎప్పుడో దారిమళ్లిర తీరుకు ఇది ఉదాహరణ. ఓ వైపు ఆర్థిక రంగం నుండి ప్రభుత్వం వైదొలగటమే సంస్కరణల సారాంశం పరమోద్దేశ్యం అని చెప్తూనే మరోవైపు సామాన్య ప్రజల దైనందిన జీవితంతో ముడిపడి ఉన్న ఆర్థిక విషయాలపై ప్రభుత్వ గుత్తాధిపత్యం పెరిగిపోవడాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న జిఎస్టీ విధానం చిన్న మధ్యతరహా పరిశ్రమలపై హానికారకమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ తరహా పరిశ్రమలకున్న పరిమిత వనరుల కారణంగా సంక్లిష్టమైన పన్నుల వలయం నుండి ప్రయాణించేటప్పుడు క్షతగాత్రులై బయటకు వస్తున్నారు. సమయానికి ప్రభుత్వం నుండి రావల్సిన రాయితీలు, రిఫండ్లు రాకపోవటం వలన ఈ సంస్థల ఉత్పాదక సామర్థ్యం, ఉపాధి సామర్థ్యం రోజురోజుకీ కుంటుపడుతున్నాయి.
ప్రజలను భయకంపితులను చేయటం వాస్తవిక సమస్యల నుండి వారి దృష్టి మళ్లించటమే
కేంద్ర ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులు చేసే ప్రకటనలు గమనిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పడవ మునిగిపోయే ప్రమాదానికి చేరువలో ఉందనీ, ఆ ప్రమాదాన్ని నివారించటానికి తక్షణమే కొన్ని చర్యలు తీసుకోవాలన్న భయాందోళనలు జనానికి కలిగించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిణామం మరో విషయాన్నికూడా స్పష్టం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ వనరులను అప్పణంగా నచ్చిన కుబేరులకు కుదవ పెట్టే ప్రయత్నాలు ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనీ, కాబట్టి దేశ భవిష్యత్తు గురించి ప్రత్యేకంగా ఆర్థిక భవిష్యత్తు గురించి మరో పెద్ద బూచిని చూపించి దాని మాటున తన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవడానికి సిద్ధడుతోందన్నది ఆ రెండో విషయం. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనటానికి వాషింగ్టన్ వచ్చినప్పుడు పతనమవుతున్న రూపాయి విలువ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ‘రూపాయి బలహీనపడలేదని. కాకపోతే డాలర్ బలపడిరద’ని చెప్పి తప్పించుకున్నారు. ఇటువంటి వివరణల ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలమని ప్రభుత్వం భావిస్తే అది అక్కరకు రావటం లేదని తేలిపోతుంది.
పాప్కార్న్ పన్ను వంటి వాటి ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న కీలక సమస్యల నుండి ప్రజలు దృష్టి మళ్లించేందుకు ప్రయత్నం సాగుతోంది. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్య. 2023 జూలై ` సెప్టెంబరు త్రైమాసంలో ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధి రేటుతో పోలిస్తే 2024 జూలై`సెప్టెంబర్ త్రైమాసంలో సాధించిన వృద్ధి తక్కువగా ఉంది. నిజానికి ఈ తరుగుదల పొంచి ఉన్న ఆర్థిక మాంద్యానికి చిహ్నం. కానీ ఈ వాస్తవికతను ఎదుర్కొనడానికి సిద్ధంగా లేని ఆర్థిక మంత్రి ఇదేదో తాత్కాలిక విషయమే అని బుకాయిస్తున్నారు.
2023`24లో 8.2 శాతం వృద్ధి రేటు సాధించిన దేశం 2024`25 ఆర్థిక సంత్సరంలో 6.4 శాతం వృద్ధి రేటుకే పరిమితం అయ్యింది. రిజర్వుబ్యాంకు, జాతీయ గణాంక సంస్థలు ఎంతగా లెక్కలు సరి చేసేందుకు ప్రయత్నం చేసినా సగటు వృద్ధి రేటు 6.6 శాతానికి మించి ముందుకుపోవనని మొరాయిస్తోంది.
విదేశీమదుపుదారులు దేశీయ మార్కెట్ నుండి తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు తరిగిపోతనారంభించాయి. ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. ఉత్పత్తిదారుల వద్ద సరుకులు నిల్వపడుతున్నాయి. పారిశ్రామిక రంగంలోనూ, ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు రావడం లేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నా వ్యవస్థను గాడిలోకి తెచ్చేందుకు కావల్సిన ద్రవ్యపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధం కావటం లేదు.
ఛిద్రమవుతున్న ఆర్థిక చిత్రం
పైనుదహరించిన సమస్యల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించటంలో మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు విఫలమయ్యాయని విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ ధాటికి కుదేలైన వస్తూత్పత్తి రంగం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సరుకుల నిల్వలు తరగకపోవటంతో వివిధ ఉత్పత్తి రంగాల్లో కొత్త పెట్టుబడులు రావటం లేదు. కేంద్ర ప్రభుత్వం పైపై లేపనాలకు పరిమితం అవుతుంటే ఆర్థికవ్యవస్థ మాత్రం వ్యవస్థాగత సంక్షోభం దిశగా కదులుతోంది. రూపాయి పతనం, నిరుద్యోగం చరిత్ర చూడని స్థాయికి చేరాయి. తాజాగా ఐటి రంగం కూడా ఉద్యోగులను తొలగించటం కొత్తకొత్త ఉద్యోగాల పట్ల ఆశలు పెట్టుకున్నవారిని బేజారెత్తిస్తున్నాయి.
ఉదాహరణకు జిఎస్టీ సమస్యలు రానురాను ముదిరిపోతున్నాయి. ఈ చట్టం ప్రకారం పన్ను చెల్లింపుదారులకు రావలిసిన వెసులుబాటు, రాయితీలు సకాలంలో రావటం లేదు. దీంతో చిన్నమధ్యతరహా పరిశ్రమలు బాగా ఇబ్బందిపడుతున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించటానికి బదులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అటు పెట్టుబడిదారులనూ, ఇటు ప్రజలనూ ఇబ్బందులకు గురిచేసేవిగా ఉంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ లావాదేవీల మోతాదు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు కూడా తదనుగుణంగా మారాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ లావాదేవీలు, డిజిటల్ లావాదేవీల విస్తృతి, వ్యాప్తి నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోకపోవటం ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
నిర్మాణాత్మక ఆర్థిక విధానం నేటి అవసరం
ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, రూపాయి విలువ స్థిరీకరణ లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఉపాధి అవకాశాలు పెంచేందుకు, మౌలిక వసతుల అభివృద్ధికీ, వ్యాపార వాణిజ్య రంగాలపై భారాలు తగ్గించేందుకు వీలుగా ఆర్థిక విధానాలను పున:సమీక్షించాలి.
కంటితుడుపు చర్యలు స్థానంలో సమగ్ర సంస్కరణలకు కేంద్రం చొరవ చూపించాలి. అటువంటి సమగ్ర సంస్కరణలు లేకపోవటం వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ తన సామర్ధ్యానికి అనుగుణంగా వృద్ధి రేటు సాధించలేకపోతోంది.
ప్రజలందరికీ సులభతరమైన పన్నుల వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుతం ఉన్న జిఎస్టీ వ్యవస్థలో పలురకాల శ్లాబులు, విచక్షణారహితంగా పన్ను రేట్ల మార్పుల స్థానంలో మధ్యతరగతిపై భారాలు తగ్గించేందుకు వీలుగా సరళమైన పరోక్ష పన్నుల విధానం అమల్లోకి తేవాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందన్న నమ్మకం జనానికి కలుగుతుంది. ఆర్థిక విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించే వ్యవస్థలను ప్రజాతంత్రయుతంగా నిర్వహించటం కూడా ఓ కీలకమైన సమస్యే. విధాన రూపకల్పనలో సదరు విధానాల ద్వారా ప్రతికూల ప్రభావానికి గురయ్యే వారిని భాగస్వాములను చేయటం, వారి అభిప్రాయాలకు విలువనివ్వటం, ప్రతిపాదనలను స్వీకరించటం ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పౌరసమాజం, వివిధ రంగాల నిపుణులు, మేధావులను విధాన రూపకల్పనలో భాగస్వాములను చేయటం ద్వారా మెరుగైన ఫలితాలు, విధానపరమైన పారదర్శకత సాధించవచ్చు.
ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్న వాస్తవాన్ని పాప్కార్న్ పన్ను వివాదం మరోసారి రుజువు చేసింది. సమస్యల పరిష్కారానికి బదులు సమస్యల బూచిని చూపించి ప్రభుత్వం ప్రజలను భయాందోళనలు గురిచేయబూనుకోవడం అంటే క్షేత్రస్థాయి వాస్తవికతతో ప్రభుత్వ ఆలోచనా విధానానికి మధ్య పొంతలేదని ఒప్పుకోవడమే. భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదగాలంటే నిర్మాణాత్మక ఆర్థిక విధానాలు రూపొందించాలి. అటువంటి విధాన రూపకల్పనలో పౌరసమాజానికి భాగస్వామ్యం ఉండాలి. ఆర్థికాభివృద్ధి, ప్రజా సంక్షేమం అన్న జమిలి లక్ష్యాలతో విధానరూపకల్పన జరగాలి. ఇందుకు గాను పాప్కార్న్ పన్ను లాంటి కంటితుడుపు చర్యల స్థానంలో ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా పునర్నిర్మించే విధానాల దిశగా అడుగులు వేయాలి.
అమల్ చంద్ర ది ఎస్సెన్షియల్ గ్రంధ రచయిత. విధాన నిపుణుడు, రాజకీయ వ్యాఖ్యాత.
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.