
1915లో కుంభమేళా సందర్భంగా ‘హిందూ నీరు’, ‘ముస్లిం నీరు’వంటి సాధువుల మూఢనమ్మకాలను, కపటత్వాన్ని గాంధీ తిరస్కరించటం గమనిస్తే 2025 కుంభమేళా సందర్భంగా జరుగుతున్న చర్చలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది.
ఈ మధ్యనే ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళా ప్రారంభానికి ముందు కొందరు సాధువులు, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న కొందరు బీజేపీ నేతలు ముస్లింలను ఈ మేళలో ప్రవేశించకుండా ఆపాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, దక్షిణాఫ్రికాలో తన మొదటి సత్యాగ్రహాన్ని విజయవంతంగా ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1915లో హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో పాల్గన్న సందర్భంగా గాంధీజీ నమోదు చేసిన అనుభవాలను నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది
గాంధీ తన ఆత్మకథ ‘‘మై ఎక్సపెరిమెంట్స్ విత్ ట్రూత్’’లో ఒక అధ్యాయాన్ని కుంభమేళా గురించి ప్రస్తావించారు. ‘‘ఈ సంవత్సరం(1915) కుంభమేళా జరగవలసిన సంవత్సరం, ఇది ప్రతి 12 ఏళ్లకు ఒకసారి హరిద్వార్‌లో జరుగుతుంది. నాకు మేళాలో పాల్గనాలన్నంత ఆసక్తి లేదు, కానీ అక్కడ గురుకులంలో ఉన్న మహాత్మా మున్షిరాం గారిని కలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నాను,’’ అని ఆయన పేర్కొన్నారు. కుంభమేళాలో సేవలు అందించేందుకు పండిట్ హృదయనాథ్ కుంజ్రూ నేతృత్వంలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులను గోపాల్ కృష్ణ గోఖలే పంపారని ఆ తర్వాత గాంధీజీ చెప్పారు. అదేవిధంగా, యాత్రికులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, ఏవైనా అత్యవసర పరిస్థితులను తీర్చడానికి డాక్టర్ దేవ్ అనే వైద్యాధికారిని కూడా గోఖలే పంపించారు. ‘‘ఫీనిక్స్ పార్టీ వాళ్లను సహాయపడేందుకు పంపాలని నాకు ఆహ్వానం అందింది. కానీ అప్పటికే మగన్‌లాల్ గాంధీ వెళ్లారు’’ అని గాంధీ గుర్తు చేసుకున్నారు.
హిందూ నీరు – ముస్లిం నీరు ..
సహారణ్పూర్ నుంచి హరిద్వార్‌లోని కుంభమేళాకు చేరుకోవటానికి తాను చేసిన ప్రయాణం గురించి వివరిస్తూ, యాత్రికులు ఎదుర్కొనే బాధలను కష్టాలను గాంధీ ప్రస్తావించారు. వారు మనుషులు ప్రయాణించే వాహనాలలో కాకుండా ‘‘సరుకులు లేదా పశువులను’’ తరలించేటువంటి కిక్కిరిసిన బండ్లలో ప్రయాణించినట్టు ఆయన చెప్పారు. తలపై కప్పు లేకపోవడం వలన ఓ వైపు పైనుంచి భగభగలాడే మధ్యాహ్నపు ఎండ వేడి, మరో వైపు కింద ఇనుప తలము లాంటి నేల నుండి వచ్చే వేడి మధ్య యాత్రికులు నలిగిపోయారని గాంధీ ఆవేదన చెందారు.
ఈ పర్యటనలో గాంధీ గమనించిన మరో కీలకమైన విషయం కులవివక్ష. భక్తులు మార్గమధ్యంలో అలసిపోయినప్పుడు సమీప గ్రామస్తులు ఇచ్చే త్రాగు నీటిని స్వీకరించటానికి కూడా సిద్ధం కాకపోవటం చూసి గాంధీ కలత చెందారు. దీనికి కారణం గ్రామస్తులు ఇచ్చే నీరు హిందువేతర నీరై ఉంటుందని, దాన్ని ముట్టుకుంటే మైలపడిపోతామేమోనన్న భయంతోనే గొంతెండిపోతున్నా తాగునీరు స్వీకరించటానికి భక్తులు సిద్ధం కాలేదని గాంధీ గుర్తించారు. ‘‘ఇలాంటి కష్టతరమైన ప్రయాణం వల్ల కలిగే దాహం కూడా సనాతన హిందువులను ముసల్మానీ నీళ్ళని స్వీకరించడానికి ఒప్పించలేకపోయింది. వాళ్ళు ‘హిందూ నీరు’ దొరికే వరకు వేచి చూశారు’’ అని గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ హిందువులే అనారోగ్యం కలిగినప్పుడు వైద్యుడు వాళ్లకి వైన్ లేదా బీఫ్ తీసుకోవాలని సూచించినప్పుడు, అలాగే ఒక ముస్లిం లేదా క్రిస్టియన్ కాంపౌండర్ వాళ్లకి నీళ్లు ఇచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నలు, సందేహం లేకుండా తీసుకుంటారు’’ అని గాంధీ తీవ్రంగా విమర్శించారు.
ఆహార, పానీయాలను మత ప్రాతిపదికన విభజించడం పట్ల గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 1915లో ఆయన చేసిన వ్యాఖ్యలు 2014 తర్వాత దేశం ఎదుర్కొంటున్న మతపరమైన విభజనని స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి. 2014 నుంచి మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను, పూర్తిగా తుడిచి పెట్టేయాలని, అలాగే వాళ్ళని సామాజిక ఆర్థిక కార్యకలాపాల నుంచి బహిష్కరించాలని బీజేపీ, హిందుత్వ నాయకులు పిలుపునిస్తున్న తరుణంలో అటువంటి వాదనల పట్ల గాంధీ ఎలా స్పందించారో తెలుసుకోవడం అవసరం. ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దుకాణదారులు తమ పేర్లు ప్రదర్శించాలని డిమాండ్ చేసింది. దీని ద్వారా వాళ్ల కుల, మత గుర్తింపులని బహిర్గతపరిచి వాళ్లు అమ్మే పదార్థాలని ఆయా కుల, మత అస్తిత్వం ప్రకారం గుర్తించబడేలా చేయడం ద్వారా ఆచరణలో ముస్లిం నీరు, హిందూ నీరు అనే భావనను, సారాన్ని బలపరుస్తున్నారు.
కుంభమేళాలో గాంధీ నిర్మాణాత్మక జోక్యం
హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో గాంధీ జోక్యం నిర్మాణాత్మకమైనది, అలాగే సేవాభావంతో కూడినది. పైన పేర్కొన్న డాక్టర్ దేవ్, కుంభమేళాలో కచ్చా మరుగుదొడ్ల కోసం కొన్ని గుంతలు తవ్వి వాటిని శుభ్రపరిచేందుకు వేతనానికి పనిచేసే పారిశుద్ధ కార్మికుల కోసం ఎదురు చూస్తున్నారు. శాంతినికేతన్లో ఉండగా పారిశుద్ధ కార్మికుల పని గురించి స్వయంగా తెలుసుకున్న గాంధీ ఆ అనుభవంతో భారతదేశంలో తన మిగిలిన జీవితాన్ని ఆ పని కోసం అంకితం ఇస్తానని ప్రమాణం చేశారు. ఆ గుంతలలో ఉన్న మలాన్ని మట్టితో కప్పేందుకు ముందుకొచ్చారు. ఆయనతోపాటు మగన్‌లాల్ గాంధీతో సహా ఫీనిక్స్ పార్టీ సభ్యులు కూడా పాల్గన్నారు.
చిత్త శుద్ధి లేని శివపూజ
దక్షిణాఫ్రికాలో గాంధీ చేపట్టిన మొదటి సత్యాగ్రహం విజయవంతమైనప్పటినుంచి అనేకమంది భారతీయుల, యాత్రికుల హృదయాలలో చోటు సంపాదించుకున్న గాంధీని చూడటానికి 1915లో అనేక మంది ఎగబడేవారు. మేళాలో తిరుగుతూ అక్కడి యాత్రికులలో భక్తిహీనత ఉండడం గమనించి ఆయన బాధపడ్డారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే వాళ్ళ ప్రవర్తనలో ‘‘నిరాసక్తత, కపటత్వం, అలసత్వం’’ అనే లక్షణాలు కనిపించాయి. ‘‘అక్కడికి తరలివచ్చిన సాధువుల గుంపు పుట్టింది కేవలం జీవితంలో ఉన్న తాత్కాలిక భోగాలను ఆస్వాదించేందుకే అనిపించింది’’ అని దుఃఖంతో చెప్పారు.
ఐదు కాళ్ళ ఆవు
తొలుత ఒక ఐదు కాళ్ల ఆవును చూసి గాంధీ ముందు ఆశ్చర్యపోయారు. కానీ ఆ తర్వాత ఆ ఐదు కాళ్ళ ఆవు దుర్మార్గుల లోభానికి బలైందని తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. ‘‘ఆ ఐదవ కాలు బతికి ఉన్న ఒక దూడ కాలిని కోసి ఆవు భుజంపై అమర్చినట్టు తెలిసింది’’ అని ఆయన రాశారు. ‘‘అమాయక యాత్రికులు, మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు దోచుకోవడం కోసమే ఈ క్రూరత్వం వెనుక ఉన్న కారణం అని ఆయన గమనించారు. ‘‘ఒక ఐదు కాళ్ళ ఆవుని చూసి ఆకర్షితులవని వాళ్లు హిందువుల్లో ఎవరు ఉండరు, అలాగే అలాంటి అద్భుతమైన ఆవుపై ధారాళంగా దానం ఇవ్వని వాళ్లు కూడా హిందువుల్లో ఎవరు ఉండరు’’అని గాంధీ బాధతో రాశారు.
ఆధ్యాత్మికోద్ధరణ లేని స్థితి ..
హరిద్వార్‌లో కుంభమేళాను ఒక యాత్రికుని భావనతో సందర్శించలేదని గాంధీ దాపరికం లేకుండా చెప్పారు. ‘‘భక్తిని వెతుక్కుంటూ ఆధ్యాత్మిక స్థానాలను సందర్శించాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు’’, అని ఆయన నొక్కి చెప్పారు. అయితే ఆయన ఇలా కూడా అన్నారు, ‘‘అక్కడ ఉన్నట్లు చెప్పబడ్డ 17 లక్షల మంది కాలక్షేపం కోసం వచ్చిన వాళ్లే తామే భగవంతులమని చెప్పుకునే భేషజం ఉన్న వాళ్లో కాదు. వాళ్ళు ఎంతోమంది పుణ్యం సంపాదించడానికి, ఆత్మశుద్ధి కోసం వెళ్లారు’’ అనే దానిలో అనుమానం లేదు. అయితే ఇలాంటి యాత్ర ఏ మేరకు ఆధ్యాత్మిక పునరుద్ధరణకి దోహదపడుతుందో అని సందేహం మాత్రం ఆయనకుంది. అందువల్ల ‘‘ఈ రకమైన విశ్వాసం ఆత్మను ఎంతవరకు ఉత్తేజితం చేస్తుంది’’, అనే విషయం చెప్పడం అసాధ్యం కాకపోయినా కష్టమే’’ ఇటువంటి ఆలోచనలు ఆయన్ని బాగా కలచివేశాయి, దాంతో ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నారు. బాగా ఆలోచించి ఇలా రాశారు. ‘‘చుట్టూ కపటత్వం ఉన్నా కల్మషం లేని పుణ్యాత్ములు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ల సృష్టికర్త ఎదుట వాళ్లు నిర్దోషులుగా ఉంటారు. హరిద్వార్‌కు వెళ్లడమే పాపం అయితే నేను దానిపట్ల బహిరంగంగా నిరసన తెలిపి కుంభమేళా రోజే హరిద్వార్‌ను విడిచిపెట్టాలి. హరిద్వార్‌కి, కుంభమేళాకి వెళ్లడం తప్పు కాదు. కాకపోతే అక్కడ ప్రబలుతున్న అనైతికతకి ప్రాయశ్చిత్తంగా నాకు నేనే స్వయంగా శిక్ష విధించుకుని ఆత్మ శుద్ధి చేసుకోవాలి. ఇది నాకు చాలా సహజంగా అనిపిస్తుంది. నా జీవితం క్రమశిక్షణాత్మక తీర్మానాలపై ఆధారపడి ఉంది.’’
పవిత్ర జంధ్యాన్ని తిరస్కరించడం..
గంగలో స్నానం చేసి బయటికి వస్తున్న గాంధీకి వంటి మీద జంధ్యం, నెత్తిన పిలక లేకపోవడాన్ని ఓ బ్రాహ్మణుడు గమనించాడు. ‘‘ భక్తి విశ్వాసాలున్న ఓ హిందువుగా నిన్ను ఇలా చూడటం బాధగా ఉంది. జంధ్యం, పిలక హిందూమతానికి ప్రతీకలు. ప్రతి హిందువు వీటిని తప్పనిసరిగా ధరించాలి’’ అన్నారట.
ఈ సందర్భంగా గాంధీ తను జంధ్యం వేసుకోవడం వెనుక ఉన్న కథని గుర్తు చేసుకున్నారు. బ్రాహ్మణులు జంధ్యం వేసుకుని దానికి ఒక తాళాల గుత్తిని కట్టే పద్ధతి గాంధీని ఆకర్షించింది. ఆయన కూడా అలాగే చేయాలని అనుకున్నారు. అప్పటికి బ్రాహ్మణులు తప్ప మరెవరు పవిత్ర జంధ్యం వేసుకోవడానికి అనుమతి లేదు. కానీ మొదటి మూడు వర్ణాలకు ఇది అనివార్యంగా ఉండాలని ఒక ఉద్యమం ప్రారంభమైందని ఆయన రాశారు. అందువల్ల గాంధీ కుటుంబంలో ఆయనతో సహా అనేకమంది వేసుకోవడం మొదలుపెట్టారు కానీ గాంధీకి తాళాలు గుత్తి కట్టే అవకాశం మాత్రం దక్కలేదు. తన శరీరంపై ఉన్న జంధ్యం తెగిపోయినప్పుడు ఆయన మళ్లీ ఇంకోటి వేసుకోలేదు. భారతదేశంలో, దక్షిణాఫ్రికాలో ఆయన మళ్లీ జంధ్యం వేసుకోవాలని ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. ‘‘శూద్రులు దాన్ని ధరించకపోతే వేరే వర్ణాల వాళ్ళకి ఏం హక్కు ఉంది?’’ అని ఆయన వాదించారు. ‘‘ఒక అనవసరమైన ఆచారాన్ని పాటించడానికి నాకు సరైన కారణమేది కనిపించలేదు. జంధ్యంపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు కానీ దాన్ని ధరించడానికి కారణాలు మాత్రం నాకు కనబడలేదు’’ అని వాదించారు.
శూద్రుల రక్షణ కోసం గాంధీ..
1915 కుంభమేళాలో జంధ్యాన్ని తిరస్కరించి సాధువుల డొల్లతనాన్ని, మతం పేరిట ప్రబలుతున్న మూఢనమ్మకాలని ప్రశ్నించి శూద్రుల రక్షణ కోసం గాంధీ చేసిన కృషి 2025లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు ప్రయాగరాజ్‌లో కుంభమేళాని వాడుకొని విభజన రాజకీయాలు, అలాగే మెజారిటీ వాదనలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో దాదాపు వందేళ్ల క్రితం కుంభమేళ గురించి గాంధీ ఆలోచనలు, అభిప్రాయలను తెలుసుకోవటం ఉపయుక్తంగా ఉంటుంది. వర్తమాన పరిణామాల్లో భక్తి మాటున సాగుతున్న డొల్లతనాన్నీ, వేర్వేరు లక్ష్యాలు, ఉద్దేశ్యాలతో వచ్చిన ప్రజానీకంలో రాజకీయభావాలు నాటేందుకు మతోన్మాదులు చేస్తున్న ప్రయత్నాలను అర్థం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది.
ఎస్ఎన్ సాహు
(అనువాదం: దీప్తి సిర్లా)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.