
ప్రాదేశిక రాజకీయాలకు బలై ఉక్రెయిన్ సర్వం కోల్పోయి తల్లడిల్లుతుంది. ముందు ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందజేసి యుద్ధం చేయమని అగ్రరాజ్యం ప్రోత్సహించింది. వెన్నుదన్నుగా ఉంటామని ఊరించింది. యూరోపియన్ యూనియన్ నాటో పేరుతో యుద్ధాన్ని రక్తికట్టించి, రక్తపుటేరుల్లో ప్రజల ప్రాణాలను పంచభూతాల్లో కలిపింది. నా గట్టుకు వస్తే నేనూరుకుంటానా అంటూ నాటో బూచి చూసి రష్యా యుద్ధాన్ని నడిపింది. చివరికి ప్రాదేశిక రాజకీయాల్లోనే కనీవినీ ఎరుగని మైత్రిని చూడాల్సి వచ్చింది.
భిన్న ధృవ ప్రపంచంలో కంటి సైగతోనే కత్తులు దూసుకున్న వైరిపక్షాలు, ఏకధృవ ప్రపంచంలో చేయి చేయి కలిపి నడుస్తున్నాయి. ఒకరి తీర్మానానికి ఒకరు సహకరించుకుని ఓటెత్తుతున్నాయి. యుద్ధోన్మాదులు వెన్ను, భుజం కలిపి రాసుకుపూసుకుని తిరుగుతున్నారు. బలి పీఠంపై మేక పిల్లలా ఉక్రెయిన్ ప్రస్తుతం ప్రపంచం ముందు చేష్టలుడిగి చూస్తుంది.
అయితే, తాజాగా అమెరికా యూఎన్ఓలో రష్యాకు అనుకూలంగా ఓటు వేసి, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేలా వ్యవహరించింది. ఇదిలా ఉండగా మరో అడుగు ముందుకేసి ఉక్రెయిన్ లేకుండానే సౌది అరేబియాలో రష్యాతో అమెరికా చర్చలు జరిపి, శాంతి మంత్రాన్ని వల్లెవేసింది. కొన్ని రోజుల క్రితం అమెరికా, యూరోపియన్ యూనియన్ నిర్వహించుకున్న సమావేశంలో రష్యా లేకుండానే చర్చలను జరిపారు.
భిన్నధృవ ప్రపంచ నుండి ఏకధృవ ప్రపంచం వైపుకు సాగిన ప్రపంచ ప్రస్థానంలో ప్రాదేశిక రాజకీయాలు కొత్త పోకడలకు పోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో తీవ్ర దుందుడుకుతనపు నేతలు దేశాధ్యక్ష పీఠాలను అధిరోహిస్తున్నారు. తమ నిర్ణయాలతో ప్రపంచాన్ని యుద్ధోన్మాదం వైపు నడిపిస్తున్నారు.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఈ వైఖరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ప్రపంచ దేశాలు ఆ గట్టా ఈ గట్టా అన్నట్టుండేవి. సోవియట్ రష్యాను నిలువరించడానికి దాని భావజాల ఆదర్శాలు, పెట్టుబడిదారి భావజాల సంఘర్షణలు కూటములు కట్టడానికి పురికొల్పాయి. నాటో దేశాలు ఒక వైపు, సోవియట్ రష్యా ఒక వైపు. మరోవైపు తటస్థ దేశాలు ఇట్లా ప్రపంచాన్ని నడిపించాయి.
సోవియట్ యూనియన్‌లో 15 రిపబ్లిక్లలో ఉక్రెయిన్ రెండో పెద్ద రిపబ్లిక్. ఉక్రెయిన్‌కు రష్యాకు ఎక్కడ పొసగలేదని తెలుసుకోవడానికి ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన పరిస్థితులు, ఉక్రెయిన్ అంతర్గత రాజకీయాలు, సాంస్కృతిక విలువల పతనం, ఉజ్జ్వల సోవియట్, రష్యా ఆదర్శాలు పునికి పుచ్చుకోలేని నైతిక పతనం మొదలైన విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లిబరల్ యూరోపియన్ పెట్టుబడిదారి వాసనలు, అవి రేపిన ఆకర్షణలు ఉక్రెయిన్‌లోని ప్రజలను యూరోపియన్ దేశాల ఉదారతకు దగ్గర చేశాయి. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రదేశాలు, రష్యావైపు ఉన్న ప్రాంతాలు, రష్యా భాషను మాట్లాడే తూర్పు ప్రాంతాలు, ఇలా ఉక్రెయిన్‌లో రెండు ఘర్షణలు సాగుతున్నాయి. సరిగా ఈ భావోద్వేగాల పైనే ఆ దేశంలోని రాజకీయాలు ఆధారపడి ఉంటాయి.
సోవియట్ యూనియన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన ఉక్రెయిన్ ఒప్పందం మేరకు తన దగ్గర ఉన్న అణ్వాయుధాలను రష్యాకు అప్పగించాలన్న ప్రాతిపదక ఒకటి. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా ఆయుధాల నిర్వహణ చేస్తుంది. దానికి బదులుగా ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను రష్యా గుర్తిస్తుంది. ఇందులో భాగంగా రష్యా క్రిమియా ద్వీపకల్పాన్ని ఉక్రెయిన్‌కు ఇస్తుంది. ఇది రష్యాకు ప్రాదేశికంగా దగ్గరగా ఉంటుంది.
1922-1991 వరకు సోనియట్ యూనియన్ 15 రిపబ్లిక్లలో ఒక రిపబ్లిక్‌గా ఉక్రెయిన్ ఉండేది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో ఈ 15 రిపబ్లిక్లు విడివిడి దేశాలుగా విడిపోయాయి. ఉక్రెయిన్ తూర్పు భూభాగాలు రష్యాకు సరిహద్దులుగా ఉండటం, పశ్చిమం వైపు యూరప్ భూభాగాల సరిహద్దులు ఉంటాయి. యూరోపియన్ దేశాలు సంయుక్తంగా యూరోపియన్ యూనియన్‌గా ఏర్పడ్డాయి. 27 దేశాలు దీనిలో ఉంటాయి. పరస్పర ఆర్థిక ప్రయోజనాల కోసం దీని ఏర్పాటు జరిగింది. అయితే, ప్రాదేశిక రాజకీయ ప్రాబల్యం కోసం సరిహద్దుల్లో ఉన్న దేశాలను తమ ప్రాబల్యంలో ఉంచుకోవాలని తహతహలాడటంతో రష్యాకు సరిహద్దున ఉన్న ఈస్టోనియా, లాట్వియా, లిత్వినేయా, బలారస్, ఉక్రెయిన్ దేశాలను తమకు అనుకూలంగా ఉండేవిధంగా చేసుకోవాలని రష్యా, యూరప్, అమెరికాలు ఆశించాయి.
ఈస్టోనియా, లిత్వినేయా, లాట్వియా దేశాలు యూరోపియన్ దేశాలలో కలిసిపోయాయి. అంతేగాకుండా నాటోలో కూడా చేరిపోయాయి. ఐతే ఇవి ఉక్రెయిన్‌తో పోల్చుకుంటే చిన్నదేశాలు కాబట్టి రష్యా వైఖరి వీటిపట్ల భిన్నంగా లేదు.
నాటో చరిత్ర
సోవియట్ రష్యా యూరోపియన్ దేశాలను ఆక్రమిస్తుందనే కారణంతో యూరోపియన్ దేశాలు, అమెరికా నాటోగా ఏర్పడ్డాయి. నాటోలో బలారస్, ఉక్రెయిన్ చేరాలని అమెరికా, యూరోపియన్ దేశాలు కోరడంతో రష్యా ఆగ్రహానికి కారణమైంది. ఐతే బలారస్, ఉక్రెయిన్లు ఈస్టోనియా లాంటి దేశాలతో పోలిస్తే పెద్ద దేశాలు. అంతేకాకుండా ఉక్రెయిన్ రష్యాకు దగ్గర ఉంటే, ఇక్కడ నాటో స్థావరాలను పెట్టడమంటే రష్యాను రెచ్చగొట్టడమే అవుతుంది. సరిగ్గా అదే జరిగింది. ఉక్రెయిన్ బలారస్ను నాటోలో చేరవద్దని రష్యా ప్రకటించడంతో బలారస్ నాటో కూటమిలోకి వెళ్ళలేదు. పోతే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నాలు కొనసాగించింది. ఐతే ఉక్రెయిన్ అంతర్గత రాజకీయాలు దేశాన్ని రెండు భావజాలాల సంఘర్షణవైపు నెట్టి వేశాయి. పశ్చిమ దేశాలకు అనుకూల రాజకీయాలు, రష్యాకు అనుకూల రాజకీయాలు, ఉక్రెయిన్‌లో కొనసాగుతుండంతో అంతర్గత సంక్షోభాలు తలత్తేవి. 2010లో రష్యాకు అనుకూల భావజాలమున్న విక్టర్ మాన్కోవిచ్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైననాటి నుండి కొత్త సంఘర్షణలు తలెత్తాయి.
ఉక్రెయిన్ ఆవిర్భావ కాలంలో క్రిమియా ద్వీపకల్పాన్ని ఉక్రెయిన్‌కు ఇవ్వడం జరిగింది. రష్యా రక్షణ బేస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇది నల్లసముద్రంలో ఉంది. ఉక్రెయిన్ ఏర్పాటులో కొన్ని ఒప్పందాల మేరకు 1991 నుండి 2017 వరకు క్రిమియాలో ఉన్న రక్షణ బేస్‌ను ఉపయోగించుకోవచ్చన్నది ఆ ఒప్పందంలో భాగంగా ఉండేది. ఇప్పుడు విక్టర్ దానిని మరికొంత కాలానికి, అంటే 2042 వరకు ఆ కాలాన్ని పొడిగించాడు. దానికి బదులుగా రష్యా తన సహజ వాయువును 30% తక్కువకు ఉక్రెయిన్‌కు ఇస్తుంది. ఈ నిర్ణయంతో దేశంలో నిప్పు రాజుకుంది. రష్యా మిలటరి బేస్‌ను కొనసాగించడమంటే ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని తాకట్టుపెట్టడమేనని పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉండే రాజకీయాలు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఉక్రెయిన్‌లో 70% దాకా ప్రజలు ఉక్రేనియన్ భాషను మాట్లాడతారు, మిగతా 30% దాకా రష్యాను మాట్లాడతారు. ఉక్రేనియన్ భాషను మాట్లాడే ప్రజలు పశ్చిమ దేశాలకు అనుకూల భావజాలం కలిగిఉండి, యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్ చేరాలని, రష్యన్ భాష మాట్లాడే ప్రజలు దీన్ని వ్యతిరేకించడంతో దేశం రెండు భావజాల సంఘర్షణలలోకి నెట్టివేయబడింది. 2013లో మరో సంఘటన జరిగింది. యూరోపియన్ యూనియన్‌లో చేరటానికి దేశాధ్యక్షుడు నిరాకరించడంతో ఉక్రెయిన్‌లో ఆందోళనలు చెలరేగాయి. దీన్ని యూరోమైడెన్ ఉద్యమంగా చెబుతారు. రష్యా అనుకూల ప్రాంతాలుగా ఉన్న లూహాన్స్క్, డొవెటాస్క్, క్రిమియాలలో ఆందోళనలు చెలరేగి తమ ప్రాంతాలు ఉద్యమకారులు, తమ ప్రాంతాన్ని తామే పాలించుకుంటామని ఆందోళనలు ఉధృతం చేశారు. దేశాధ్యక్షుడిని తొలగించివేయడం కూడా జరిగింది. దీన్ని అదునుగా భావించి రష్యా క్రిమియాలోకి తన బలగాలను దింపింది. క్రిమియాను ఆక్రమించి స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. కొద్దికాలానికి క్రిమియాలో ఓటింగ్ పెట్టింది. ఈ రెఫరెండంలో 97% ప్రజలు రష్యాతో ఉంటామని చెప్పటంతో క్రిమియా రష్యాలో చేరిపోయింది. కాని లూహాన్స్క్, డొవెటాస్క్ అట్లాగే ఉండిపోయాయి. 2014లో ఉక్రెయిన్‌లో ఎన్నికల్లో పోరోషెంకో పశ్చిమ దేశాలకు అనుకూల భావజాలం ఉన్న అధ్యక్షుడు ఎన్నిక కావటంతో ఆందోళనలు సాగుతున్న ప్రాంతాలకు మిలటరీని పంపాడు. నిరసనకారులు ఆయుధాలు పట్టడంతో అది కాస్తా తీవ్రరూపాన్ని దాల్చింది. ఆందోళనకారులకు రష్యా అనధికారికంగా ఆయుధాలను, ధనాన్ని ఇవ్వసాగడంతో ఈ పోరాటంలో వేలమంది ప్రజలు నేలకొరిగారు. ఆందోళనకారులు రష్యా సమర్థతతో ఆ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఉక్రెయిన్ ఈ పరిణామాలలో రష్యా మద్ధతుతో కొనసాగుతున్న ఆందోళనలు ఎదుర్కోవాలంటే నాటోలో చేరాలని ఉక్రెయిన్ భావించింది.
రష్యా ఈ లోగా లూహాన్స్క్, డొనెటాస్క్కు స్వాతంత్య్రం ప్రకటించింది. ఈ పరిణామాలు యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ నాటోలో చేరవద్దని రష్యా చెప్పింది. యుద్ధం మొదలైన కొన్నేళ్ల వరకు అమెరికా ఉక్రెయిన్‌కు సహాయం చేసింది. రష్యా, క్రిమియాతో ఆగకుండా ముందుకు సాగుతూపోతే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తరువాత తప్పంతా ఉక్రెయిన్‌దేనని నిందమోపి రష్యా అనుకూల వైఖరి తీసుకోవడం జరిగింది. యుద్ధాన్ని తాను ఆపుతానని దానికిబదులుగా విలువైన ఖనిజ నిక్షేపాలను 50% రాయితీతో అమెరికాకు ఇవ్వాలని గొంతెమ్మ కోర్కెలు ట్రంప్ కోరుతున్నాడు. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు అంగీకరించడం లేదు.
ట్రంప్ ఇప్పుడు రష్యాకు అనుకులంగా ఓటు వేసి యూఎన్ఓలో ప్రాదేశిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసి ప్రపంచాన్ని, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ను నివ్వెరపరిచాడు.
డా. సుంకర రమేశ్
ఆర్ధికశాస్త్ర ఉపన్యాసకులు
9492180764
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.