కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా అవలీలగా అబద్ధాలు చెప్పి తప్పించుకోగలుగుతున్న వైనం గత పదేళ్లుగా మనం చూస్తున్నదే. దేశంలో అత్యంత వివాదాస్పదమైన ఘటనలు, పత్రికల్లో వచ్చిన వార్తలు, ప్రభుత్వ అధినేతలు, బిజెపి అగ్రనేతల ఉపన్యాసాల విషయంలో కూడా ప్రతిపక్ష సభ్యులు వ్రశ్నలు వేసినప్పుడు తమ వద్ద సమాచారం లేదని బుకాయించటమో, లేక లేనిది ఉన్నట్లు చెప్పి దబాయించటమో జరిగిపోతూ ఉంది. కానీ ఒకేరోజు మంత్రిత్వ శాఖ సమాధానాలు, శాఖ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం పరస్పరం భిన్నంగా ఉండటం గమనిస్తే ప్రశ్నోత్తరాలకు వచ్చే మంత్రులు కనీసం ప్రాథమికమైన హోంవర్క్ కూడా చేయకుండా వస్తున్నారనే సందేహం కలుగుతుంది. పార్లమెంట్ నిర్వహణలో ప్రశ్నోత్తరాలే అత్యంత కీలకమైనవి.
మార్చి 25న పార్లమెంట్లో ఉపాధి హామీ నిధుల విషయంలో ఆస్తికరమైన చర్చ చోటుచేసుకుంది. మూడేళ్ల నుండి బెంగాల్‌కు ఉపాధి హామీ నిధులు విడుదల చేయకపోవటం. కేరళ, తమిళనాడులకు రావాల్సిన దానికంటే తక్కువ నిధులను విడుదల చేయటం గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతిపక్షాల సవాళ్లకు సమాధానమిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉత్తరప్రదేశ్ జనాభా 20 కోట్ల మంది ఉన్నా దానికంటే తక్కువగా ఏడు కోట్ల జనాభా ఉన్న తమిళనాడుకు ఉపాధి హామీ నిధులు ఎక్కువ ఇస్తున్నామని దబాయించారు. అదేవిధంగా బెంగాల్ విషయంలో చాలా పొరపాట్లు ఉన్నాయని, అందువల్లనే నిధులు విడుదల చేయలేదని సమర్థించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సమాధానాలకు నిరసనగా ఆయా రాష్ట్రాల ప్రతినిధులు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనలకు స్పందిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు కోసం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని వేదిక చేసేకోకూడదని రూలింగ్ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల్లో కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేనప్పుడు స్పీకర్ ఇచ్చే ఇటువంటి రూలింగ్స్లు పాలకపక్షానికి వరప్రసాదంలా పని చేస్తాయి.
తమిళనాడు నుండి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ఆదూర్ ప్రకాష్ పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదకను ప్రస్తావిస్తూ తమిళనాడుకు ఉపాధి హామీ నిధులు విడుదల చేయటంలో అంతులేని ఆలస్యం జరుగుతోందని, కేరళకు రావల్సి 811 కోట్లు రూపాయలు ఇప్పటికీ విడుదల చేయలేదని సభ దృష్టికి తెచ్చారు. దీనికి స్పందిస్తూ ధరలు నిరంతరం పెరుగుతున్నాయని, దేశంలో కేరళలో అత్యధిక దినసరి వేతనాలు ఉన్నాయని, ఈ సంవత్సరం ఇప్పటికే మూడు వేల కోట్లకు పైగా ఉపాధి హామీ పథకం కింద నిధులు విడుదల చేశామని తెలిపారు. గత సంవత్సరం 3500 కోట్లు విడుదల చేశామని కూడా పెమ్మసాని సభ దృష్టికి తెచ్చారు.
డీఎంకే ఎంపీ కనిమొళి జోక్యం చేసుకుంటూ ఈ పథకంలో ఎంత మంది పని చేయటానికి ముందుకొస్తే అంతమేర కేంద్రం నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని, తమిళనాడుకు ఇప్పటికే 4034 కోట్లు రావల్సి ఉందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ఉపాధి హామీ వేతనాల విడుదల ఐదు నెలలుగా ఆలస్యం అయ్యిందనీ, వేతన చెల్లింపులు ఆలస్యమైతే ఆ కాలానికి వడ్డీ కూడా ఇవ్వాలని చట్టం చెప్తోందనీ, మరి ఈ వడ్డీ నిధులు కూడా జమ చేసి ఇస్తారా అని టీఎంసీ ఎంపీ హమల్ హాల్డార్ అనుబంధ ప్రశ్న వేశారు.
తమిళనాడు జనాభా కంటే ఉత్తరప్రదేశ్ జనాభా మూడు రెట్లు ఎక్కువ
ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి పెమ్మసాని వేతనాల విడుదలలో జరిగే జాప్యం వలన వచ్చే వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్పారు. ‘‘ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చింది యుపీఏ ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం వేతనాల విడుదలలో 15 రోజుల జాప్యం జరిగితే వేతన విలువలో 0.05 శాతం వడ్డీ జత చేసి చెల్లించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెల్లించాలి. తర్వాతనే కేంద్రం రాష్ట్రాలకు నిధులు జారీ చేస్తుంది.’’ అన్నారు.
‘‘తమిళనాడు విషయానికి వస్తే ఇప్పటికే ఈ సంవత్సరం 7300 కోట్లు విడుదల చేశాము. తమిళనాడు జనాభా ఏడు కోట్లు. ఉత్తరప్రదేశ్ జనాభా 20 కోట్లు. కానీ ఈ పథకం కింద తీసుకొంటోంది కేవలం 10 వేట కోట్లు మాత్రమే. తమిళనాడు 10 వేల కోట్లకంటే ఎక్కువే తీసుకుంటుంది. కాబట్టి నిధులు విడుదల విషయంలో సమస్య ఏమీ లేదు’’ అని సమాధానమిస్తున్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.
గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్సైట్లో ఉన్న సమాచారం మంత్రి ఇచ్చిన సమాధానం కంటే భిన్నంగా ఉంది. ఈ వెబ్సైట్ ప్రకారం తమిళనాడుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024- 25) ఇప్పటి వరకూ తమిళనాడుకు 7414 కోట్లు విడుదల చేయగా, ఉత్తరప్రదేశ్‌కు 9758 కోట్లు విడుదల చేశారు. వెబ్సైట్ సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ ఇప్పటి వరకూ ఈ పథకం కింద పెట్టిన ఖర్చు 11886 కోట్లు కాగా తమిళనాడు ప్రభుత్వం పెట్టిన ఖర్చు 10706 కోట్లు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఇచ్చిన రాతపూర్వకమైన సమాధానంలో 2021- 22, 2023- 24 సంవత్సరాల్లో మినహా అన్ని సంవత్సరాల్లోనూ ఈ పథకం కింద మిగిలిన రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్‌కు ఎక్కువ నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.
2022 నుండి బెంగాల్‌కు నిలిచిపోయిన ఉపాధి హామీ నిధులు
టీఎంసీ ఎంపీ హాల్డర్కు రాసిన సమాధానంలో కేంద్ర క్యాబినెట్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బెంగాల్‌కు 2022 నుండి ఉపాధి హామీ పథకం కింద నిధులు విడుదల చేయలేదని తెలిపారు. దీనిపై మరింత వివరణ ఇస్తూ ఆ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బెంగాల్ నిధుల విడుదల విషయంలో చాలా పొరపాట్లు ఉన్నాయని సభ దృష్టికి తెచ్చారు. ‘‘బెంగాల్లో నిధుల దుర్వినియోగం జరిగింది. పైగా పనులన్నీ విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. మీకు ఇచ్చే సమాచారమంతా వాస్తవమైనదే. ఆడిట్ జరిగింది. 44 పనుల విషయంలో అవకతవకలున్నాయి. అందులో 34 పనుల చేసిన కాంట్రాక్టర్ల నుండి మొత్తం నిధులు వసూలు చేశాము. మరో పది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దుర్వినియోగం విలువ 5.37 కోట్లు. ఇందులో 2.39 కోట్లు వెనక్కి రప్పించాము. కేంద్ర కాబినెట్ మంత్రి సంబంధిత రాష్ట్ర మంత్రితో కూర్చుని సమస్యలు పరిష్కరిస్తారు’ అని చంద్రశేఖర్ వివరించారు. మంత్రి సమాధానానికి స్పందిస్తూ తప్పులు జరిగితే చర్యలు తీసుకోవచ్చు కానీ ఆ కారణంగా నిధులు నిలిపి వేస్తే పని చేసిన కార్మికుల వీధినపడుతున్నారని హల్దర్ కేంద్రం దృష్టికి తెచ్చారు.
ప్రాంతీయ రాజకీయాలకు లోక్‌సభ వేదిక కాకూడదు: స్పీకర్
జనాభా విషయంలో పెమ్మసాని చేసిన వ్యాఖ్యలపట్ల ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. నిరసన మధ్యలోనే ‘అది బెంగాల్ అయినా, తమిళనాడు అయినా మోడీ ప్రభుత్వం ఎవరి పట్లా వివక్ష చూపలేదు. వేతన బకాయిలు సాధ్యమైనంత త్వరలోనే విడుదల చేస్తాము’అని మంత్రి తెలిపారు. యుపీఏ ప్రభుత్వం హయాంలో 2006 నుండి 2014 మధ్య కాలంలో బెంగాల్లో కేవలం 111 కోట్ల రోజులకు మాత్రమే పని కల్పించబడిందనీ, మోడీ ప్రభుత్వంలో గత పదేళ్లల్లో 239 కోట్ల రోజులు పని కల్పించామని సుమారు 54,515 కోట్లు నిధులు బెంగాల్‌కు కేటాయించామని చౌహాన్ తెలిపారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేస్తూ నిలబడ్డారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ స్పందిస్తూ ‘మీరు ప్రశ్నలు అడగవచ్చు. కానీ మీ మీ ప్రాంతీయ రాజకీయాలకు సభను వేదిక చేసుకోకూడదు’ అంటూ సభను వాయిదా వేశారు.
శ్రావస్తి దాస్ గుప్త
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.