
విద్యారంగానికి బడ్జెట్లో కేటాయించిన నిధులను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రతిసారీ జరిగిన విధంగానే ఈ సారి కూడా ఆశాభంగమే కలిగింది. ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారని మనం అనుకుంటున్నాము. కానీ విద్యారంగం పట్ల పాలకుల ‘వివక్ష’ మాత్రం మారడంలేదు.
‘‘కొద్ది పాటి వనరులు మాత్రమే లభ్యమయ్యే చోట ప్రాధాన్యతలను బట్టి నిధుల కేటాయింపు ఉంటుంది. అందరిని సంతృప్తి పరచడం ఎవరివల్లా కాదు. ఎందుకంటే రాజకీయ అవసరాలు, ఒత్తిళ్ళు ఉండనే ఉంటాయి. అన్నింటినీ సమపాళ్ళలో మేళవించాల్సిందే కదా! ఎవరు వచ్చినా ఇంతకంటే ఏం చేయగలరు?’’ అనేది పాలకులకు ఎప్పుడూ ఉండే డిఫెన్స్.
మరి విద్యారంగ మేధావులు, ఉపాధ్యాయ నాయకులు, పౌర సమాజపు మేధావులు ఏం చేస్తున్నారు? ఒకటి, రెండు ఖండన మండనలను మినహాయిస్తే, ఒక ఆచరాణాత్మక ప్రణాళిక ఉన్నట్లు తోచదు.
రాష్ట్రం విడివడిన నాటి నుండి బడ్జెట్లలో ‘విద్య’కు కేటాయిస్తున్న నిధులు ఏయేటికాఏడు తగ్గి పోతూనే ఉన్నాయి. 2025- 26లో మొత్తం బడ్జెట్లో 7.36 శాతం నిధులు మాత్రమే విద్యారంగానికి దక్కినవి. ఈ సందర్భంగా రెండు విషయాలను మనం ప్రస్తావించాలి. మొదిటిది ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తున్న నిధుల కంటే బాగా తక్కువగా ఉంటున్నాయి. రెండొవది ఉమ్మడి రాష్ట్రంలో కూడా విద్యకు నేడు తెలంగాణ ప్రభుత్వంలా ఇంత తక్కువ శాతం కేటాయించలేదు.
తెలంగాణ విడిపోవడానికి అనేక కారణాలలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య విద్యా ప్రమాణాలలో వ్యత్యాసం కూడా ఒకటిగా ఉంది. తెలంగాణకు ఈ విషయంలో అన్యాయం జరుగుతోందని, వివక్షకు గురవుతోందని ప్రధానంగా వాదించబడింది. మన ప్రాంతం మనమే పాలించుకుంటే, మనకు చాలినన్ని నిధులు మనమే కేటాయించుకోవచ్చనీ ప్రజలకు చెప్పారు. కానీ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని కేటాయింపుల కంటే, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో నేడు కేటాయిస్తున్నవాటి కంటే తెలంగాణ బడ్జెట్లో విద్యకు తక్కువ నిధులు కేటాయించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? పౌర సమాజపు అచేతన స్థితిని ఎలా చూడాలి?
రెండు రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ డాక్యుమెంట్లను గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడెక్టు(జియస్డిపి)లో విద్యకు ఖర్చు చేసిన శాతాలను, పర్ కాపిటా ఖర్చులో విద్యకు పెట్టిన ఖర్చు శాతాన్ని, మొత్తం కేటాయించిన బడ్జెట్లో ఖర్చు శాతాన్ని లెక్కించిన సాయిచందన్, ఉదహరించిన లెక్కల ప్రకారం..
- రెండు రాష్ట్రాలు ఆర్ధికరంగం పెరుగుదలకు తగ్గట్టుగా విద్యకు ఖర్చు చేయలేదు. నిజానికి ఖర్చు బాగా తగ్గి పోయింది.
- తగ్గిన దాంట్లో కూడా తెలంగాణ ఇంకా ఎక్కువ తగ్గించింది.
- మొత్తం నిధిలో విద్యవాటా శాతం చూసినా తెలంగాణ గణనీయంగా వెనకబడిపోతుంది. ఈ క్రింది టేబుళ్ళను చూస్తే మనకు ఈ విషయం బాగానే అర్ధమవుతుంది.
గత ఏడాదిన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023-24లో 6.68 శాతానికి, 2024-25లో 7.31 శాతానికి విద్యకు కేటాయించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వాటికంటే మెరుగ్గానే కేటాయించింది.
పాలించిన పదేళ్ళలో విద్యారంగాన్ని ఒక్కసారి కూడా సమీక్ష చేయని ముఖ్యమంత్రి ఫాంహౌజ్ పాలన గురించి కాంగ్రెస్ ఆనాడు మాట్లాడింది. పద్నాలుగు నెలలు గడిచినా విద్యాశాఖకు ఒక మంత్రి కూడా లేని దుస్ధితిలో ఉన్నామని నేటి బీఆర్ఎస్ విమర్శిస్తుంది. పాలకులెవరైనా ‘వివక్ష’మాత్రం కామన్‌గానే కొనసాగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే, అందులో 19.4 లక్షల మంది విద్యార్ధులు మాత్రమే చదువుతున్నారు. మరో 5.5 లక్షల మంది రకరకాల గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైవేట్ రంగంలో సుమారు 11 వేల పాఠశాలల్లో 36 లక్షల మందికిపైగా ఉన్నారని అంచనా. ఉన్నత విద్య ఏనాడో పూర్తిగా ప్రైవేట్ ఆధిపత్యంలోనే ఉంది. ఈ ధోరణికి స్కూలు విద్య ఏమీ మినహాయింపు కాదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశామని, అదే పెద్ద విజయమని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. కులాల వారీగా విద్యార్ధులను విడగొట్టి కేవలం అయిదున్నర లక్షల మందికి అవకాశం కల్పిస్తే అది విద్యా ప్రగతికి ఎలా తోడ్పడుతుందనేది ప్రశ్న. ప్రభుత్వ పాఠశాలలను అనాథలుగా చేసి, మౌలిక సదుపాయాలు మెరుగు పర్చకుండా, టీచర్లు లేకుండా, పర్యవేక్షణా బృందం లేకుండా ఎలా విద్యారంగాన్ని పట్టించుకున్నట్టు? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకాలంలో అమెరికన్ తరహా నైబర్ హుడ్ పాఠశాలల గురించి, 6 నుంచి 14 ఏళ్ళ మధ్య ఇవ్వాల్సిన నిర్బంధ ప్రాథమిక విద్య గురించి, 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ గురించి, ఖేర్ కమిటీ నుంచి మొదలుకొని కొఠారి కమీషన్‌తో సహా కేచ్ కమిటీ రిపోర్టు దాకా అనేక విషయాల గురించి మాట్లాడారు. కానీ, తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేజీ టు పీజీ ఉచిత విద్య కాస్తా గురుకులాల మిథ్యగా పరిణామం చెందింది. తెలంగాణ ఏర్పడక ముందు కార్పొరేట్ సంస్ధలు, హైద్రాబాద్‌కు పరిమితమయి ఉన్నాయి. ప్రస్తుతమవి అన్ని జిల్లా కేంద్రాలకు వ్యాపించాయి.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెర్పార్మెన్స్ ఇండెక్స్‌లో తెలంగాణ 31వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉన్నాయి.
పోనీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి ఏమైనా మారిందా అని చూస్తే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎన్నికలవేళ చాలా స్వచ్ఛంద సంస్ధలు కాంగ్రెస్ మానిఫె స్టోలో పెట్టిన 20 శాతం విద్య అనే అంశాన్ని బాగానే ప్రమోట్ చేసి, క్యాంపెయిన్ నిర్వహించాయి. అంతెందుకు ప్రస్తుతం విద్యాకమిషన్ కమిషనర్‌గా ఉన్న ఆకునూరి మురళి ఆధ్వర్యంలో బడి నిద్ర కార్యక్రమం ద్వారా తెలంగాణ బడుల అధ్వాన్నస్థితిని ప్రపంచానికి తెలిపారు. కనీసం 15 శాతం నిధులన్నా బడ్జెట్‌కు కేటాయించాలని కోరారు. రాష్ట్రాల సరాసరి 14.7 శాతం ఉండగా, మనరాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ఎంత వెనుక ఉందో మనం తేలిగ్గానే అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఈ ప్రభుత్వం ఆ గురుకులాలను అలా వదిలేసి, మరో కొత్తరాగం అందుకుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు అందునా కేవలం 58 కొత్త పాఠశాలలకు 11,600 కోట్లు ఖర్చు చేయడానికి నిధులు కేటాయించింది. 2024-25లో కాంగ్రెస్ మొదటి బడ్జెట్లో 8.6శాతం నిధులు మాత్రమే విద్యకు కేటాయించింది. ప్రతిసారీ పాలకులు ఇలా ఒక కొత్త ఆలోచన వైపు ఎందుకు పరుగులు తీస్తున్నారు? దీని వెనుక ఎవరి
ప్రయోజనాలు దాగివున్నాయనేది మన మస్తిష్కాలను తొలుస్తున్న చిక్కు ప్రశ్న, కార్పొరేటీకరణ రెండు తెలుగు రాష్ట్రాలలో సాగినంత వేగంగా, బహుశా భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ సాగడం లేదనిపిస్తోంది.
నేషనల్ క్రైమ్‌బ్యూరో ఆఫ్ రికార్డ్స్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలోని లెక్కల ప్రకారం 2014 నుంచి 2021వ సంవత్సరం నాటికి 3,600 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు.
Accidental Deaths & Suicides in India రిపోర్టు ప్రకారం. ఈ రిపోర్టును తయారు చేసిన సంస్థకు చెందిన కోట నీలిమ వివరాల ప్రకారం ఫీజుల విషయాలు, ఉద్యోగం రాదేమోనన్న భయం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
2007లో నీరదారెడ్డి అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ బృందం ఉమ్మడి ఏపీలో విద్యార్ధుల ఆత్మహత్యల మీద అధ్యయనం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలకు కార్పొరేట్ కళాశాలలే బాధ్యులని తేల్చి చెప్పారు. అవి కళాశాలలు కావు కాన్సన్ట్రేషన్ క్యాంపులని తేల్చారు. దరిమిలా ఈ కళాశాలల్లో సగభాగం పైగా నిర్వహించే వ్యక్తి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రిగా మారారు. సాక్షాత్తూ విద్యాశాఖమంత్రికి వియ్యంకుడయ్యారు.
కాంగ్రెస్ ఇప్పటి మ్యానిఫెస్టోలో ఈ కార్పొరేట్ల వ్యాపారాన్ని అడ్డుకునేందుకు ఒక ‘విజిలెన్స్ కమిషన్’వేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ వాగ్ధానం గురించి మాట్లాడేవారే లేరు. ఆరు గ్యారంటీలకే దిక్కు లేదంటే, దీని సంగతి ఇంకేం చెప్తామని ప్రతిపక్షాలు ముక్కు విరుస్తున్న దృశ్యం కనపడుతోంది.
మహిళా కమీషన్ అధ్యక్షురాలు నేరెళ్ళ శారద ఆయా కార్పొరేట్ కళాశాలలను విజిట్ చేసి ఆమె కూడా విస్మయం ప్రకటించారు. అనేక కళాశాలలకు నోటీసులు ఇచ్చారు. బహుళ అంతస్తుల భవనాలలో, మెయిన్‌రోడ్ పక్కన అనుమతులులేకుండా ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ఈ అంశాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఒక వేళ మూసివేతలున్నా అవి తాత్కాలిక మూసివేతలే.
అడ్డగోలుగా సాగుతున్న విద్యా వ్యాపారానికి చెక్ పెట్టడంలో విఫలం కావటమంటే అర్ధమేంటంటే, అంతమేరకు ఈ రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్ధిక భారం అంతకంతకూ పెంచడం.
ప్రస్తుతం నూతన విద్యావిధానం 2020 ద్వారా పూర్వ ప్రాథమిక విద్య కూడా ఇందులో భాగం కావడంతో బడా, బడా విద్యా పారిశ్రామిక వేత్తలకు ఎర్ర తివాచీ పరచడం మొదలైంది. హైద్రాబాద్‌లో గడిచిన రెండేళ్ళలో ఎన్ని బ్రాండ్లు విద్యారంగంలో ప్రవేశించాయో చూసుకుంటే మధ్యతరగతి జేబులకు ఎంతెంత చిల్లులు పడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ప్రభుత్వ పాఠశాలల్లో నూటికి 80 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల విద్యార్ధులు చదువుతున్నారు. ఇందులో కొందరికైనా గురుకులాల లాటరీ తగలకపోతుందా. మన నాయకుడు ఇప్పించకపోతాడా అనే ఆశతో జీవితాలను కొనసాగిస్తుంటే, ఈ ప్రపంచాన్ని వదిలేసి అప్పు చేసైనా సరే బిడ్డలను చదివించాలని ప్రైవేట్ సంస్ధల వైపు పరుగులు పెడుతున్న మధ్య తరగతి ప్రజానీకం త్రిశంకు స్వర్గంలో ఇంటర్నేషనల్ కర్రిక్యులాలతో ఇంటర్నేషనల్ సంస్ధలలో ధనవంతుల బిడ్డలు మొదటి ప్రపంచంలో కొనసాగుతున్నారు.
ఇటువంటి కీలక విషయాలను ఏ కుల గణన చేయకుండానే అర్ధం చేసుకోగలం. అయినా కుల సంఘాల నాయకులు ఈ సమస్య మీద ఎందుకు ఉద్యమం చేయరు? వారికి ఈ సమస్య పెద్దగా కలిసి రావడం లేదా? మూడవ ప్రపంచంలో ఉన్న ఈ దేశంలో మూడవ రకం పౌరులుగా మనం ఎందుకున్నామనే ప్రశ్న ఏ నాయకుడూ ఎందుకు వేయడం లేదు?
స్కూల్ డ్రాప్ అవుట్స్ ఇక్కడి నుంచే ఎక్కువ ఉంటాయి. తల్లిదండ్రులు డీఎన్టీ అవడంతో అసలు బడి మొఖం చూడకుండానే వలసలు పోతున్నారు. 2024లో 14-18 వయసు పిల్లలు స్కూలులో
ఎన్రోల్ కాకుండా ఉన్నవారిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ సరాసరి 13.2% కాగా, రాష్ట్రం 22.1 శాతంలో అగ్రస్థానంలో ఉందంటే అర్ధం ఏంటి? 17-18 వయసుల మధ్య ఈ శాతం 40.1%గా ఉంది. నెలకు 15 రోజులపాటు పనికి వెళ్ళేవారు ఈ వయసులో 68.7శాతం. 2023- 24 యూడైస్ లెక్కల ప్రకారం 2097 పాఠశాలలో ఒక్క విద్యార్థి ఎన్రోల్ కాలేదు, అన్ని ఖాళీ బెంచిలే (బెంచీలంటూ ఉంటే). ఈ విషయంలో దేశంలో మూడవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. మరో 5,985 పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు, కేవలం 8.7 శాతం పాఠశాలల్లోనే 500కు మించి ఉపాధ్యాయులు ఉన్నారు. 29,383 బాలికల పాఠశాలల్లో 2017 పాఠశాలల్లో టాయిలెట్లు లేవు. మరో 2,277 పాఠశాలలో ఉన్నా పనిచేయటంలేదు. బాలురకైతే 28,969 గాను 4,823 పాఠశాలల్లో టాయిలెట్లు లేవు. మరో 2,618లో పనిచేయవు.
‘అందరికీ ప్రవేశాలు’, ‘విద్య ప్రాథమిక హక్కు’ లాంటి నినాదాలు ఏమయ్యాయి? ఇంత పెద్ద డ్రాపౌటిజంతో బాధపడే తెలంగాణ విద్య, ముందుకెలా వెళ్ళగలుగుతుందనేది ప్రస్తుతం చాలా మందిని కలవరపరస్తుంది. డ్రాప్‌అవుట్ అవుతున్నవారిలో ఎక్కువగా ఎస్టీ పిల్లలు ఉంటున్నారు. ఒక్కోసారి ఇది 60 శాతం దాకా ఉంటోంది.
మొత్తంగా చూస్తే, తెలంగాణ రాష్ట్రసాధన సమయంలో నినాదంగా ఉన్న ఈ విషయం పట్ల ఏ పాలకులకీ చిత్తశుద్ది లేదని భావించాల్సి వస్తోంది. ఆయా కుల సంఘాల నాయకులైనా పట్టించుకున్నారా అంటే అదీ కూడా లేదనిపిస్తోంది. పౌర సమాజపు మేధావులు అస్థిత్వ అంశాలపై కాకుండా ఇటువంటి తీవ్రమైన విషయాలపై ప్రజలను ఏకం చేయడం మంచిదనిపిస్తోంది.
ఐ.వి.రమాణారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.