
“ఓటర్ ఐడి కార్డును ఆధార్‌తో అనుసంధానించేందుకు ఎన్నికల సంఘం (ECI)చర్యలు ప్రారంభించింది” అని ద హిందూ పత్రికలో ఒక పెద్ద వార్త వచ్చింది. ఎన్నికల సంఘం సాంకేతిక నిపుణులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తల్లో ఉంది. ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. హోం సెక్రటరీ గోవింద్ మోహన్, ఐటీ- ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ ఎస్ కృష్ణన్, UIDAI CEO భువనేష్ కుమార్ ఈ సమావేంలో పాల్గొన్నారు. ఈ చర్యపై కాంగ్రెస్ నాయకులు, నిపుణులు ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’ ఒక ప్రకటనలో స్పందించారు. “ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా తగిన రక్షణలు ఉన్నాయని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత వ్యక్తులతో చర్చించి హామీ ఇవ్వాలి” అని అన్నారు. కానీ, ఎంత రక్షణలు కల్పించినా, పూర్తిగా తప్పు ఇంకా రాజ్యాంగ విరుద్ధమైన చర్యను కాపాడలేమని ఆ పార్టీ గ్రహించి ఉండాల్సింది.
ఎన్నికల సంఘం చెప్పిన దాని ప్రకారం ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డులను (EPIC)ఆధార్‌తో అనుసంధానించడం ఆర్టికల్ 326 ప్రకారం మాత్రమే జరుగుతుంది. ఓటు హక్కు పౌరులకు మాత్రమే ఇవ్వాలని, ఆధార్ కార్డు కేవలం ఒక వ్యక్తి గుర్తింపును మాత్రమే తెలుపుతుందని ఆర్టికల్ 326 చెబుతుంది. అదనంగా, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 23(4), 23(5) ఇంకా 23(6) నిబంధనల ప్రకారం WP (సివిల్) నెంబర్ 177/2023లో సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ అనుసంధానం జరుగుతుంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 23(6) ప్రకారం “ఓటరు స్వచ్ఛందంగా ఆధార్ సమర్పించిన సందర్భాలలో మాత్రమే అనుసంధానం జరుగుతుంది” 2023లో దాదాపు 66.23 కోట్ల ఆధార్ కార్డులను ఎన్నికల జాబితాలను ఖరారు చేసే ప్రక్రియలో అప్లోడ్ చేసినట్లు ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ హామీలు కేవలం మాటలకే పరిమితం. సుప్రీం కోర్టు వేరే విధంగా తీర్పు చెప్పడానికి ముందు, బ్యాంకులు ఆధార్‌ను బ్యాంకు ఖాతాలతో అనుసంధానించడానికి ఎలా ఒత్తిడి చేశాయో, అలాగే ఎన్నికల సంఘం కూడా బలవంతపు చర్యల ద్వారానే ఇది చేసింది. ఇప్పుడు ఈ చర్య నిజాయితీని పరిశీలిద్దాం.
2021లో ఈ అనుసంధానానికి చట్టం రూపొందించే సమయంలోనే, రాజ్యాంగ ప్రవర్తన సమూహం(CCG)104 మంది మాజీ సీనియర్ సివిల్ సర్వెంట్లు సంతకం చేసిన ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. వీరిలో చాలా మందికి ఓటర్ల నమోదు, ఎన్నికలు నిర్వహణలో ప్రత్యక్ష అనుభవం ఉంది. దీన్ని ప్రమాదకరమైన చర్యగా అభివర్ణిస్తూ, ఓటర్ ఐడిల కోసం ఆధార్ ధృవీకరణ అవసరం అనే చర్య లోపభూయిష్టమైనది, చట్టవిరుద్ధమైనది, దురుద్దేశపూర్వకమైనది, రాష్ట్రం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని CCG పేర్కొంది.
సీసీజీ తప్పుగా భావించడానికి కారణాలు..
- ఓటర్ ఐడి పౌరసత్వం ఆధారంగా జారీ చేయబడుతుంది, అయితే ఆధార్ కార్డు పౌరసత్వం రుజువు లేకుండా గుర్తింపు ఆధారంగా జారీ చేయబడుతుంది. ఆధార్ చట్టం 2016లోని సెక్షన్ 9 ప్రకారం ఆధార్‌ను చిరునామా, వయస్సు, లింగం, పౌరసత్వం లేదా సంబంధం రుజువుగా ఉపయోగించకూడదు.
- ఆధార్ నమోదులకు ఇప్పటికే ఉన్న పత్రాలు మాత్రమే అవసరం, కానీ ఓటర్ ఐడిలు బూత్ స్థాయి అధికారి ద్వారా భౌతిక ధృవీకరణ, “ఇంటి సందర్శన” ఆధారంగా ఉంటాయి. ఓటర్ ఐడిని ఎన్నికల నమోదు అధికారి ధృవీకరిస్తారు, అయితే UIDAI ద్వారా ఆధార్ ధృవీకరణ జరగదు.
- ప్రజాప్రాతినిధ్య చట్టం యొక్క సెక్షన్ 23లో ఉప-సెక్షన్లు 4, 5, 6 చట్టం యొక్క సెక్షన్ 28(2)లో ‘hhha’, ‘hhhb’ క్లాజులను చేర్చిన చట్టం, ఆధార్ నెంబర్‌ను ఓటర్ ఐడికి అనుసంధానించడం స్వచ్ఛందమని కేంద్ర ప్రభుత్వం చెప్పడం నిజం కాదని రుజువు చేస్తుంది. ఈ కొత్త చేర్పులు, ఓటరు తన ఆధార్ వివరాలను అందించడం తప్పనిసరి చేస్తాయి.
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రజా పంపిణీ పథకం వంటి ఇతర ప్రభుత్వ కార్యక్రమాల డేటాబేస్ రిజిస్ట్రీలను ఆధార్ డేటాబేస్ ఉపయోగించి శుభ్రం చేయడానికి ప్రయత్నించిన అనుభవం నిరుత్సాహపరిచేదిగా ఉంది. చాలా మంది లబ్ధిదారుల పేర్లను నోటీసు లేకుండా వ్యవస్థల నుండి తొలగించారు.
- ఆధార్ నంబర్లను ఓటర్ ఐడిలకు అనుసంధానించడం వలన ఓటర్ల చట్టవిరుద్ధమైన ప్రొఫైలింగ్ మరియు లక్ష్యంగా చేసుకోవడానికి దారులు తెరుస్తుంది.
- 2016 US అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. డేటా ప్రొటెక్షన్ బిల్లును రూపొందించిన నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ, ఓటర్ ఐడిలను ఆధార్‌తో అనుసంధానించడాన్ని “అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి” అని ఖండించారు.
ఇప్పటివరకు స్పందించని ఎన్నికల సంఘం..
ఇప్పుడు, ఫారం 6బీ (ఓటర్ల ఆధార్ నెంబర్లను సేకరించడానికి ప్రవేశపెట్టబడింది) రూపొందించిన విధానంలో, ఓటర్లు తమ ఆధార్ నెంబర్‌ను అందించకుండా ఉండటానికి అవకాశాలు లేవు. ఆధార్ నెంబర్ ఇవ్వడం లేదా “నాకు ఆధార్ నెంబర్ లేనందున నేను నా ఆధార్‌ను అందించలేను” అని ప్రకటించడం మాత్రమే రెండు అవకాశాలు ఉన్నాయి. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దీనిని సవరించాలి, కానీ ఓటరు తమ ఆధార్ నెంబర్‌ను ఎందుకు అందించడం లేదో వివరణ ఇవ్వాలి. ఇది ఓటరును బలవంతం చేయడం, నమోదు ప్రక్రియలో మోసం చేయడం తప్ప మరొకటి కాదు.
ఆధార్ పత్ర సమగ్రతపై కూడా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. FY-2025 నాటికి మొత్తం 82.93 కోట్ల ఆధార్ నమోదులలో దాదాపు 9.73 కోట్లు డూప్లికేషన్, నాణ్యత లేదా సాంకేతిక కారణాల వల్ల తిరస్కరించబడ్డాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2018 జనవరిలో, ‘ద ట్రిబ్యూన్’ పత్రిక ఒక పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టింది. కేవలం రూ. 500 చెల్లించడం ద్వారా, పది నిమిషాల్లో ఒక బిలియన్ ఆధార్ కార్డు వివరాలను పొందవచ్చని తెలిపింది. “ఈరోజు, ‘ది ట్రిబ్యూన్’ వాట్సాప్ ద్వారా అనామక విక్రేతలు అందిస్తున్న సేవను ‘కొనుగోలు’ చేసింది. ఇది భారతదేశంలో ఇప్పటివరకు సృష్టించబడిన 1 బిలియన్ కంటే ఎక్కువ ఆధార్ నెంబర్ల వివరాలకు అపరిమిత ప్రాప్తిని అందించింది. పేటీఎం ద్వారా రూ. 500 చెల్లించడానికి, పది నిమిషాలు మాత్రమే పట్టింది. ఈ సమూహం ‘ఏజెంట్’ ఒక ‘గేట్‌వే’ ని సృష్టించి, లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌ను అందించాడు. మీరు పోర్టల్‌లో ఏదైనా ఆధార్ నెంబర్‌ను నమోదు చేయవచ్చు. ఇంకా UIDAIకి (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) ఒక వ్యక్తి సమర్పించిన పేరు, చిరునామా, పోస్టల్ కోడ్ (పిన్), ఫోటో, ఫోన్ నెంబర్. ఈమెయిల్ వంటి అన్ని వివరాలను తక్షణమే పొందవచ్చు. అంతేకాకుండా, ‘ది ట్రిబ్యూన్ బృందం మరో రూ. 300 చెల్లించింది, దీని కోసం ఏజెంట్ ఏదైనా వ్యక్తి ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత ఆధార్ కార్డును ముద్రించడానికి వీలు కల్పించే “సాఫ్ట్వేర్”ను అందించాడు.” ఈ అంశాలన్నింటినీ అదే సంవత్సరం మార్చిలో, స్క్రోల్ మాద్యమం నివేదించింది.
ఒక ఫ్రెంచ్ భద్రతా పరిశోధకుడు మూడు గంటల వ్యవధిలో 20,000 ఆధార్ కార్డుల వివరాలను బహిరంగ డొమైన్లో కనుగొన్నట్టు పేర్కొన్నాడు. అంతేకాకుండా ఎలియట్ ఆల్డర్సన్ అనే పేరుతో ట్విట్టర్లో ఉన్న ఈ వినియోగదారు, గత కొన్ని నెలలుగా వివిధ భారత ప్రభుత్వ వెబ్సైట్లలో భద్రతా లోపాలను నివేదించాడు. వీటిలో కొన్ని అతను నివేదించిన తర్వాత పరిష్కరించబడ్డాయి. అయితే UIDAI ఈ నివేదికలను ఖండించడం, వాటిని ప్రచురించినప్పుడు మీడియాను మౌనపరచడానికి ప్రయత్నించడం మాత్రమే చేసింది.
మరోవైపు EPICని ఆధార్‌తో అనుసంధానించడం వలన పెద్ద ఎత్తున ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని కూడా ఆందోళనలు ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణలో ఇలాంటి అనుసంధాన కార్యక్రమం తర్వాత చాలా మంది ఓటర్లు ఎన్నికల జాబితా నుండి తొలగించబడ్డారు. హైదరాబాద్ ప్రాంతంలో అధికారులు ఇంటింటి ధృవీకరణను పూర్తిగా నిర్వహించలేదని నివేదించబడింది. 2018లో ప్రభుత్వ సేవల కోసం ప్రమాణీకరణ వైఫల్యం రేటు 12% వరకు ఉందని UIDAI కూడా తెలిపింది. ఎన్నికల జాబితాలకు వైఫల్యం రేటు చాలా ఎక్కువగా ఉండవచ్చు. ‘న్యాయబద్ధమైన రాష్ట్ర ప్రయోజనం’ నెరవేరుతుందని ఈ అనుసంధానం వాదించబడింది, ఇది గోప్యత యొక్క చొరబాటుకు అనుమతించదగిన పరిమితిని నిర్ణయించేటప్పుడు జస్టిస్ కెఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రమాణాలలో ఒకటి.
కానీ, ఎన్నికల సంఘం పని రాష్ట్ర ప్రయోజనాన్ని చూసుకోవడమా లేదా పౌరుల ప్రయోజనాన్ని కాపాడడమా అనేదే ప్రశ్న. ఆధార్-EPIC అనుసంధానం, బ్యాంకు ఖాతాలతో ఆధార్ నంబర్లను అనుసంధానించడం మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. రెండోది ఎంజి దేవసహాయం, ఇతరులు యూనియన్ ఆఫ్ ఇండియా, మరొకరి కేసులో సుప్రీంకోర్టులో సవాలు చేయబడింది. సుప్రీంకోర్టు దాని రాజ్యాంగబద్ధతను పరిశీలించి, ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానించడాన్ని ‘ఆస్తిని కోల్పోవడం’గా ప్రకటించింది. ఇంకా రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. అదే కార్డును ఓటర్ ఐడితో అనుసంధానించడం పౌరులను ప్రభుత్వం ఎన్నుకునే వారి ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కును కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల రెట్టింపు రాజ్యాంగ విరుద్ధమవుతుంది.
ఈ సంఘటనలో, ఆధార్‌ను EPICతో అనుసంధానించడం కొనసాగిస్తే, భారతదేశ ఎన్నికల వ్యవస్థలో మిగిలిన చిరు ప్రమాణం కూడా నాశనం అవుతుంది. అంతేకాకుండా, ఓటర్ ప్రొఫైలింగ్, ఓటు హక్కును కోల్పోవడం భారతదేశ ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని ముంచేసే ప్రమాదకరమైన కలయికగా మారుతుంది. ఎన్నికల సంఘం(EC) ఈ చర్యను పూర్తిగా విరమించుకోవడం, ఎన్నికల ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన వాటాదారులు CCG, ఇతర నిపుణులు లేవనెత్తిన తీవ్రమైన ఆందోళనలను పరిష్కరించిన తర్వాత మాత్రమే దీనిని చేపట్టడం మంచిది. రాజకీయ పార్టీలతో కేవలం మూసివేసిన తలుపుల సమావేశాలు మరియు చర్చలు సరిపోవు!
ఎంజి దేవసహాయం
(మాజీ ఐఏఎస్ అధికారి, సిటిజెన్స్ కమిషన్ ఆన్ ఎలక్షన్స్ కోఆర్డినేటర్)
అనువాదం : జి తిరుపతయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.