
ఆర్థికాభివృద్ధి విధానాలు ఆశాజనకంగా ఉండబోతున్నాయన్న నమ్మకంతో ఈక్విటీ ధరలు మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకుని, డొనాల్డ్ ట్రంప్ పాలన శుభారంభాన్నే సాధించింది. కానీ పెట్టుబడిదారుల విశ్వాసం పూర్తిగా సడలిపోవడంతో, స్టాక్ మార్కెట్ కుంగిపోయింది. అమెరికా సంపద పునాదులను, అధ్యక్షుడు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తునప్పుడు, అతను ఇలా ఎందుకు చేస్తున్నాడు? దీనిని ఆపడానికి ఏం చేయవచ్చు అనే ప్రశ్నలు రాకుండా ఉండవు.
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధాన నిర్వహణ ప్రమాదకరంగా మారింది. గతంలో ఏ అధ్యక్షుడికయినా, ట్రంప్ తన మొదటి పదవీకాలంతో సహా ఆర్థిక వ్యవస్థకు ఉద్దేశపూర్వకంగా ఇంతలా హాని కలిగించడం అసాధ్యమని భావించబడేది. ఇప్పటిలాగానే గతంలోకూడా ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన పడినప్పటికీ, ఇంత కంగారు నాకు ఎన్నడూ కలగలేదు. ఆర్థిక మాంద్యం రాకపోవచ్చు. రాజకీయ వ్యవస్థలోని సమతౌల్య శక్తులు త్వరలోనే ఈ పిచ్చికి అడ్డుకట్ట వేయవచ్చు.
ట్రంప్ ప్రచార విధాన ఎజెండాలో మంచి, చెడులు రెండూ ఉన్నాయి. అతని విధానాల్లో స్పష్టమైన లోపాలు ఉన్నప్పటికీ అతను చేయాలనుకున్న చాలా పనులు సంపదను పెంచేవే. ట్రంప్ శుభారంభం చేశాడని నేను జనవరి చివరన రాశాను. దేశీయ ఇంధన ఉత్పత్తిని విస్తరించడం, హానికరమైన నియంత్రణలను తొలగించడం, కార్పొరేట్ పన్నులను తగ్గించడం వంటి చర్యలలాగానే, కృత్రిమ మేధ, యాంటీ ట్రస్ట్ ఎన్ఫోర్స్మెంట్ పట్ల అతని విధానాలు ఆశాజనకంగా ఉన్నాయి. పెట్టుబడిదారులు అతని అంచనాలతో బాగా ఏకీభవించారు. నవంబర్‌లో ట్రంప్ ఎన్నికైన తర్వాత ఎస్అండ్పీ 500, నాస్డాక్ల విలువ మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి వరకూ అలాగే కొనసాగాయి.
ఇటీవలి వారాల్లో ట్రంప్, ఆ శుభారంభాన్ని పోగొట్టుకున్నాడు. ఎలన్ మస్క్‌కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)ప్రకటించుకున్న లక్ష్యాలు- ప్రభుత్వ కార్యకలాపాల పరిధిని తగ్గించడం, వృధా ఖర్చులను నిర్మూలించడాన్ని నేను పూర్తిగా ఆమోదిస్తాను. కానీ DOGE చేసిన గందరగోళం వినియోగదారులను, పెట్టుబడిదారులను భయపెట్టింది. సుంకాలను పెంచడం, తగ్గించడం గురించి ట్రంప్ చేసిన ప్రకటనలు, కీలక వాణిజ్య భాగస్వాముల(కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్) పట్ల బహిరంగ శత్రుత్వం వ్యాపార, వినియోగదారుల సెంటిమెంట్లను దారుణంగా దెబ్బతీశాయి. ద్రవ్యోల్బణం ఎక్కువవుతుందన్న అంచనాలను పెంచాయి. పెట్టుబడులను దిగజార్చాయి. స్టాక్ మార్కెట్లను కుంగదీశాయి. మార్చి 13 నాటికి, ఎస్అండ్పీ 500 తనను తాను తగ్గించుకుంటూ, మూడు వారాల కిందటి దాని రికార్డు గరిష్ఠ స్థాయి నుండి 10% పడిపోయింది.
ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? దీనిని అర్థం చేసుకోవడానికి నేను మూడు వివరణలను ఇస్తాను. మొదటిది మనమందరమూ ఆమోదించక తప్పని ఒక అమర్ధతకు సాక్షులుగా ఉన్నాము. మనకు అందిన సమాచారం మేరకు ఫెడరల్ ఏజెన్సీలలోకి DOGE చొచ్చుకపోయి, అక్కడ పనిచేసే కార్మికులను తొలగించింది. కానీ, వారు ఎంత ముఖ్యమైనవారో అర్థమయ్యాక, తిరిగి కొద్ది రోజులకు మళ్లీ వారిని నియమించడానికి ప్రయత్నించింది. DOGE తను చేస్తున్న “ఖర్చు కోతల” గురించి తప్పుడు లెక్కలతో సమాచారాన్ని పదేపదే పోస్ట్ చేసింది. స్పష్టంగాచెప్పాలంటే, DOGEకు తాను ఏమి చేస్తుందో ఏమాత్రం తెలియదు. దాని ఉన్మాద చర్యలు గందరగోళాన్ని పెంచడానికి తప్ప మరెందుకూ కొరగాలేదు. ఇంతకుముందు ఖర్చులో కోతలుండేవి కావు. ఫిబ్రవరిలో ఫెడరల్‌కు అయిన ఖర్చు మొత్తం మునుపెన్నడు లేనంత ఎక్కువయింది. DOGE చేసిన ఈ అసమర్ధ నిర్వాకం వల్ల ప్రభుత్వ విస్తృతిని, పరిధిని తగ్గించే అవకాశాలు వెనుకపట్టు పట్టవచ్చు.
ట్రంప్ వాణిజ్య విధాన నిర్వహణ కూడా అంతే అసమర్థంగా ఉంది. చాలా మంది ట్రంపాలజిస్ట్లు అధ్యక్షుడు, “ఫైవ్ డైమెన్షనల్ చెస్” వ్యూహాన్ని ఆడుతున్నట్లుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అతను అలా చేయడం లేదు. అలాంటి మాస్టర్ ప్లాన్ ఏదీ లేదు. ఉదాహరణకు మార్చి 4న కెనడాపై పెద్ద ఎత్తున సుంకాల పెంపును అమలు చేయడం, తర్వాత మార్చి 5న ఆటోమొబైల్ తయారీరంగాన్ని దీనినుండి మినహాయించడం, మార్చి 6న యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం(యుఎస్‌ఎంసిఎ)కు అనుగుణంగా ఉన్న కొన్ని వస్తువులను మినహాయించడం వంటి నిర్ణయాల వెనుక ఎటువంటి ప్రధాన ప్రణాళిక లేదు.
రెండవ వివరణ ఏంటంటే, ట్రంప్ ఒక నిజమైన వాణిజ్యవాది. అమెరికా ఏదైనా ఒక దేశంతో ద్వైపాక్షిక వాణిజ్య లోటును కలిగి ఉన్నట్లయితే, ఆ దేశం ముందు అమెరికా ఆర్థికంగా తన విలువ కోల్పుతుందని నిజంగానే నమ్ముతూ, తప్పుడు అవగాహనతో ఉన్నాడు. కెనడా నుండి కలపను దిగుమతి చేసే అమెరికా వ్యాపారాలను అతడు విమర్శించడం దీనికి ఉదాహరణ. “మనం ఉపయోగించగలిగినంత” కలప అమెరికాలోనే ఉన్నప్పుడు కెనడా నుండి దాన్ని దిగుమతి చేయడం ఎందుకన్నది అతని వాదన. కలప దిగుమతులను అతను “సబ్సిడీ” అని అంటాడు.
ట్రంప్ పరిపాలనలో తరచూ విభేదించే అనేక వాణిజ్య విధాన లక్ష్యాలు సమాంతరంగా ఎందుకు కొనసాగుతున్నాయో వివరించడానికి ట్రంప్ వాణిజ్యవాదం సహాయపడుతుంది. సుంకాల విధింపు వల్ల ఫెంటానిల్ దిగుమతులు, అక్రమ వలసలు తగ్గుతాయి. పన్ను కోతలకు ఆర్థిక సహాయం చేయడానికి ఫెడరల్ ఆదాయం లభిస్తుంది. అమెరికా ఎగుమతులపై ఇతర దేశాలు విధించే అడ్డంకులను తగ్గించేలా బలవంతపెడతాయని వైట్ హౌస్ వివిధ సమయాల్లో వాదించింది. ద్వైపాక్షిక వాణిజ్య లోటును తగ్గించడం ఒక విజయంగా ట్రంప్ భావిస్తాడని మనం గుర్తుంచుకున్నట్లయితే, ట్రంప్ చర్యలు తార్కికంగానే కనిపిస్తాయి. అతను ఈ లక్ష్యాలలో కొన్నింటినయినా సాధించగలిగితే, అతని పని నల్లేరుపై నడకవుతుంది.
మూడవ వివరణ మరింత భయాన్ని కలిగిస్తుంది. అమెరికాను తిరిగి ఉన్నతంగా మార్చాలనే(MAGA) దృక్పథాన్ని ట్రంప్ బలంగా నమ్ముతున్నాడు. దానికోసం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన, బాధాకరమైన పరివర్తన అవసరమని ఆయన భావిస్తున్నాడు. ఫాక్స్ బిజినెస్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్చి 9న ఆయన ఇలా చెప్పాడు.
సుంకాల వల్ల కలిగే నష్టం గురించి అడిగినప్పుడు “బడా గ్లోబలిస్టులు ఏళ్ళతరబడి అమెరికాను దోచుకుంటున్నారు. నేను చేయవలసిందల్లా ఒక బలమైన దేశాన్ని నిర్మించడం. స్టాక్ మార్కెట్‌ను మీరు సరిగా అర్థం చేసుకోలేరు. చైనాను మీరు గమనించినట్లయితే వారికి 100 సంవత్సరాలపాటు సరిపడే దృక్పథం ఉంది. కానీ, మనం త్రైమాసికాల ద్వారా వెళ్తున్నాం. మనం అలా ముందుకు వెళ్లలేమ, మా ప్రభుత్వం భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన పునాదిని నిర్మిస్తుంది” అని ట్రంప్ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత “గ్లోబలిస్ట్” అనేది అమెరికా అభివృద్ధికి అస్పష్టమైన పోకడగా పేర్కొంటూ, వ్యాపారానికి అనుకూలమైన పత్రికగా పేరున్న “వాల్ స్ట్రీట్ జర్నల్” పై అదే ఊపులో నిందారోపణలు చేశాడు. ఆర్థికమాంద్యం రాకడని తోసిపుచ్చడానికి పదేపదే నిరాకరించాడు.
ఈ రకంగా ఉన్నత వర్గాల వ్యతిరేక వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం, ఆర్థిక సవాళ్ళకు సిద్ధం కావాలనే పిలుపునివ్వడం వంటి విన్యాసాలు స్టీవ్ బానన్, వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్‌ల MAGA బృందానికి సర్వసాధారణం. కానీ ట్రంప్ నుండి ఈ రకమయిన మాటలు రావడం మాత్రం అసాధారణం. హానికరమైన ఆర్థిక ఫలితాలను స్వాగతించే ఈ సిద్ధాంతానికి అతను నిజంగానే అనుకూలంగా మారాడా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. కానీ ఒకవేళ ప్రస్తుత 2025 కోసం(ఇంకా మున్ముందు కూడా) అతను అలా మారినట్లయితే పరిస్థితి ఆందోళనకరమవుతుంది.
రాజకీయాలను ప్రభావితం చేసే నియమాలేవీ ప్రస్తుతానికి రద్దు కాలేదు. రాజకీయ విజయం అనేది అంతిమంగా విధానపర విజయాల పునాదిపై ఆధారపడి ఉండాలి. అయితే ట్రంప్ విధానాలు విజయవంతం కావడం లేదు. సుంకాల అమలు విధానాలపై 60% కంటే ఎక్కువ మంది ప్రజలు అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. సగానికి మించి, ఎక్కువ మంది బడ్జెట్ నిర్వహణను, ఫెడరల్ ప్రభుత్వ నిర్వహణను అంగీకరించడంలేదు. ట్రంప్ తన పద్ధతులను మార్చుకోకపోతే, ఈ సంఖ్యలు ఇంకా పెరుగుతాయి. ఇవి ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటే, అంత సులభంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడడానికి కాంగ్రెస్ రిపబ్లికన్లకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లకు వీలవుతుంది.
2026 మధ్యంతర ఎన్నికలలో తన పార్టీ బాగా రాణించాలని ట్రంప్ కోరుకునేటట్లయితే, అతను ఈ గందరగోళాన్ని అదుపుచేసి, విధానపర అనిశ్చితిని పరిష్కరించాలి. మరింత బాధ్యతాయుతంగా పాలన చేయడానికి భారీ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొనాలి. నిజానికి ట్రంప్ ఇప్పటికే తన మీద వస్తున్న రాజకీయ ఒత్తిడికి స్పందించాడు. మస్క్, DOGEలమీద బహిరంగంగా పరిమితులను విధించాడు. అధికారాన్ని క్యాబినెట్ కార్యదర్శులకు అప్పగించాడు. అతని సుంకాల ప్రణాళికలకు కూడా అదే గతి పడుతుంది.
అదృష్టవశాత్తూ ట్రంప్ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా పొందాడు. ప్రస్తుత త్రైమాసికానికి సంబంధించిన సమాచారం ఆర్థిక బలాన్ని చూపిస్తూనే ఉంది. ఫిబ్రవరిలో ఆర్థిక వ్యవస్థ 151,000 కొత్త ఉద్యోగాలను కల్పించింది. నిరుద్యోగం తక్కువగా ఉంది. గృహ ఆదాయం దృఢంగా ఉంది. ఫిబ్రవరిలోగానీ మార్చిలోగానీ నిరుద్యోగ భీమా క్లెయిమ్‌లు పెరగలేదు. అంతేకాకుండా, అధ్యక్షుని ఎజెండా సమీప-కాల వృద్ధిని పెంచనుంది. ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టడానికి చాలా మార్పులే రావాలి. ట్రంప్ త్వరగా పెట్టుబడిదారుల, వినియోగదారుల విశ్వాసాన్ని తిరిగి పొందదగలిగితే, ఆ పరిస్థితి రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది.
“తమకు ఏం కావాలో ప్రజలకు తెలిసి ఉండడం, దానిని మరింత బాగా, దృఢంగా పొందడానికి తగిన అర్హత కలిగి ఉండడమే ప్రజాస్వామ్య సిద్ధాంతం” అని హెచ్.ఎల్ మెన్కెన్ అన్నారు. ప్రజలు ట్రంప్‌ను కోరుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను కోరుకోలేదు. ఈ వాస్తవం అమెరికా ప్రజాస్వామిక పెట్టుబడిదారీ వ్యవస్థకు చాలా శక్తినందిస్తుంది.
మిఖాయేల్. ఆర్. స్ట్రెయిన్
అనువాదం : అవ్వారు నాగరాజ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.