
ట్రంప్ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత అనేక వివాదాలకు, విధ్వంసాలకు తెరతీస్తున్నారు. అందులో భాగంగా తాజాగా అణ్వస్త్ర వివాదాలకు తెరతీస్తున్నారా అనే సందేహం అంతర్జాతీయ ఆయుధ నిపుణులను కలవరం కలిగిస్తోంది. 1960లో ఫ్రాన్స్ అణు పరీక్షలు చేపడితే 1964లో చైనా చేపట్టింది. ఇతర దేశాలు కూడా ఈ దారిలో ప్రయాణం ప్రారంభిస్తే అంతర్జాతీయ పరిస్థితులు చేయిదాటిపోతాయనే ఆందోళనతో రష్యా, అమెరికాలు 1968లో అణ్వస్త్ర తయారీ నిరోధక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం లక్ష్యాలు మూడు. అణ్వస్త్రాల అభివృద్ధిని, వ్యాప్తిని అడ్డుకోవడం, శాంతియుత ప్రయోజనాల కోణం అణు ఇంధనాన్ని ఉపయోగించుకోవటం, నిరాయుధీకరణను పెంపొందించటం.
అణ్వాయుధాల తయారీ పట్ల దేశాలకున్న ఉత్సాహాన్ని నీరుగార్చటానికి అమెరికా, రష్యాలు అణ్వస్త్ర ప్రయోగంపై పలు స్వయం ఆంక్షలు విధించుకున్నాయి. ఇరు దేశాలు సాంప్రదాయక యుద్ధం, అణ్వస్త్రప్రయోగ భయాల నుండి తమ మిత్రులను కాపాడేందుకు సిద్ధమని హామీ ఇచ్చాయి. తదనుగుణంగానే అమెరికా నాటో కూటమి భాగస్వామ్య దేశాలకు, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాలకు ఈ రకమైన రక్షణకవచంగా నిలిస్తే రష్యా వార్సా కూటమి సభ్య దేశాలకు రక్షణ కవచంగా నిలిచింది.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం 1970 నాటికి ప్రపంచంలో ఐదు దేశాలు మాత్రమే అణ్వస్త్ర సామర్ధ్యం ఉన్న దేశాలుగా గుర్తించింది. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్లు ఆ దేశాలుగా ఉన్నాయి. తర్వాత కాలంలో భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలు కూడా అణ్వస్త్ర సామర్ధ్యాన్ని సంతరించుకుని పై దేశాల సరసన చేరాయి. కానీ, యూరప్‌లో స్వీడన్, ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా ఖండంలో అర్జెంటీనా, బ్రెజిల్‌లు అణ్వస్త్ర తయారీ ప్రయత్నాలను వదిలి వేశాయి. ప్రత్యేక కేటగిరి దేశాలైన ఉక్రెయిన్, కజకిస్తాన్, బైలోరస్లు తమ స్వాధీనంలోని సోవియట్ యూనియన్ నాటి అణ్వాయుధాలను రష్యాకు అప్పగించాయి.
ప్రస్తుతం స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) అంచనాల ప్రకారం అమెరికలో 3000 అణ్వాయుధాలు ఉంటే, రష్యా వద్ద 4400, ఫ్రాన్స్ వద్ద 290, బ్రిటన్ వద్ద 220, భారత్, పాకిస్తాన్ల వద్ద చెరో 170, ఉత్తర కొరియా వద్ద 50, ఇజ్రాయెల్ వద్ద 90 అణ్వాయుధాలున్నాయి.
అప్పుడప్పుడూ ఉత్తరకొరియా, ఇరాన్, ఇరాక్, లిబియా, సిరియా, తైవాన్‌ల నుండి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో అణ్వస్త్ర దేశాలు అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పంద షరతులను అతిక్రమించటానికి ప్రయత్నం చేశాయి. ఒక దేశం వద్ద అణ్వస్త్రాలుంటే ఆ దేశాలను లిబియా, సిరియా, ఇరాక్లను నలిపి వేసినట్లు, ఇరాన్‌ను బెదిరిస్తున్నట్లు నలిపేయటం, బెదిరించటం సాధ్యం కాదన్నది తాజా అనుభవం నేర్పుతున్న పాఠం.
ఎక్కడో దూరంగా ఉన్న దేశాన్ని కాపాడటానికి మరో దేశం తన వద్ద ఉన్న అణ్వస్త్ర సామర్ధ్యాన్ని ప్రయోగించేందుకు సిద్ధపడటం అంటే సదరు దూర దేశానికి పొంచి ఉన్న ముప్పు, ముప్పు తెచ్చి పెట్టే దేశాలు, వాటి సామర్ధ్యాలు, యుద్ధ వ్యూహాల గురించి విశ్వసనీయమైన సంపూర్ణ సమగ్ర సమాచారం అందుబాటులో ఉండాలి. చిలువలు పలువలుగా వచ్చే వార్తలు, వ్యాఖ్యానాలను ఆధారం చేసుకుని వ్యవహరించేందుకు సిద్ధమైతే ప్రపంచమే నిప్పుల కొలిమి అవుతుంది. దీనికి గాను అణ్వస్త్ర సమాచార పంపిణీ అన్న ప్రతిపాదనను అమెరికా ముందుకు తెచ్చింది. అంటే జర్మనీ, టర్కీ, ఇటలీ, గ్రీస్, బెల్జియం, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఎక్కడెక్కడ అమెరికా ఆణ్వస్త్రాలను అమర్చిందో వెల్లడించటం ఈ ప్రతిపాదన ఉద్దేశ్యం. ఆయా దేశాల్లో నిల్వ ఉన్న అణ్వస్త్రాలు అమెరికా సొంతమే అయినా వాటిని ప్రయోగించేది మాత్రం ఆయా దేశాలే.
ఇప్పటి వరకూ ఈ విధానాలన్నీ ఓ నిర్ణీత అవగాహనతో అమలవుతూ వచ్చాయి. కానీ ట్రంప్ నేతృత్వంలో రిపబ్లికన్ ప్రభుత్వ విదేశాంగ విధానంలో కనిపిస్తున్న ఊపుతాపులు, గాలివాటు ధోరణులు చూస్తే ఇప్పటి వరకూ ప్రపంచ శాంతికి ప్రాతిపదికగా ఉన్న ఈ నియమిత ఉమ్మడి అవగాహనలు ట్రంప్ ప్రభుత్వం విసిరే సవాళ్లను తట్టుకుని నిలుస్తాయా అనే ఆందోళన మొదలైంది. ఇప్పటికే దీర్ఘకాలంగా అమెరికాకు అనుంగు మిత్రులుగా ఉన్న నాటో సభ్య దేశాలను నమ్మలేమని ట్రంప్ ప్రకటించటం దీనికి కారణం.
ఇప్పటి వరకూ అమెరికా అణ్వస్త్ర ఛత్రఛాయల్లో సేదదీరుతున్న దేశాలు ఇప్పుడు ఎక్కువ ఆందోళనకు గురవుతున్నాయి. ఉక్రెయిన్‌పై అణ్వస్త్ర ప్రయోగానికి వెనకాడేది లేదంటున్న రష్యా ఫీుంకారావాలు, బైలోరుస్తో సాగిస్తున్న సంయుక్త సైనిక కసరత్తులు యూరోపియన్ దేశాలలో ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ దేశాల ముందున్న తొలి ప్రత్యామ్నాయం ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ల వద్ద ఉన్న అణ్వస్త్రాల సంఖ్యను పెంచటం ద్వారా మొత్తం యూరప్‌కు శాశ్వత భద్రత కల్పించేందుకు అమెరికాపై ఆధారపడాల్సిన అసవరం లేకుండా చేయటం.
ఈ మధ్యనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఓ ప్రతిపాదన ముందుకు తెచ్చాడు. ఫ్రాన్స్ వద్ద ఉన్న అణ్వస్త్రాలను యూరోపియన్ భద్రతా వ్యవస్థతో మేళవిస్తే మొత్తం యూరోపియన్ దేశాలకు మెరుగైన భద్రత భావం కలిగించేందుకు అవకాశం ఉంటుందని, అందువలన యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలకు తెరతీయాలన్నది ఆ ప్రతిపాదన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. జర్మన్ నూతన అధ్యక్షుడు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు కాకపోయినా ఫ్రాన్స్, బ్రిటన్ల వద్ద ఉన్న అణ్వస్త్ర సామర్ధ్యంతో జర్మనీకి కూడా రక్షణ వ్యవస్థలను విస్తరించేందుకున్న అవకాశాలు చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. ఈ దిశగా అడుగులు పడాలంటే ప్రస్తుతం ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ల వద్ద అంబుల పొదిలో ఉన్న అణ్వస్త్ర సామర్ధ్యం మరింత పెంచుకోవాలి. నాటోలో సభ్యత్వం లేని దేశాలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అదే సమయంలో ఆ దేశాలు తమ అణ్వస్త్రాలపై ఇతర దేశాలకు పెత్తనం అప్పగించేందుకు సిద్ధంగా లేవు.
ఇక రెండో ప్రతిపాదన, ప్రత్యామ్నాయం మరింత ఆందోళనకరమైనది. నాటో నుండి అమెరికా విరమించుకోవడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో నాటో సభ్యదేశాలన్నీ ఎవరికి వారే అణ్వస్త్ర సామర్ధ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేయటం. ఇప్పటికే పోలండ్ అధ్యక్షుడు టస్క్ ‘సొంత అణ్వస్త్రాలుంటే మా భద్రతకు మంచి భరోసా’అని తన ఉద్దేశ్యాన్ని వెల్లడించారు. ‘రాజకీయ భూగోళం పట్ల అమెరికా దృక్ఫథంలో వస్తున్న మార్పులే’ పోలండ్ ఇలా ఆలోచించాల్సి రావడానికి కారణమని కూడా ఆయనన్నారు.
జర్మనీలో కూడా ఇటువంటి వాదనలున్నాయి. కాకపోతే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ పాత్ర గురించిన ప్రాపంచిక అవగాహన నేపథ్యంలో మిగిలిన దేశాలు జర్మనీకి ఆ స్వేచ్ఛనివ్వడం సాధ్యమయ్యేది కాదు. జర్మనీతో సహా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌లతో పొత్తు పెట్టుకుని అణురక్షణ కవచం పరిధిలోకి రావటానికే ఎక్కువ దేశాలు మొగ్గు చూపుతున్నాయి.
అయితే, ఈ రెండు మార్గాల్లోనూ దేనికుండే సమస్యలు దానికున్నాయి. తొలి సమస్య ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌లు తమ అణ్వస్త్రాలపై హక్కును వదులుకోవడానికి సిద్ధపడకపోవటం. యూరోపియన్ యూనియన్ స్థాయిలో ఓ అణ్వాయుధాన్ని తయారు చేయటం అంటే తయారీ సామర్ధ్యాన్ని సభ్యదేశాలందరికీ పంచటం లేదా తయారీలో వివిధ దేశాలను భాగస్వాములను చేయటం. ఇది మరింత ప్రమాదకరమైన ఆలోచన చర్యగా కనిపిస్తుంది. మొత్తం యూరప్‌ను కకావికలం చేసే ప్రతిపాదన. అమెరికా నుండి యూరోపియన్ యూనియన్ భధ్రతకు సంబంధించిన ఊగిసలాట ధోరణి మరో సమస్య. ఈ చర్చలన్నీ గమనిస్తే మొత్తం యూరప్ ఖండమంతా నడీరోడ్డులో ఉన్నట్లు కనిపిస్తోంది. అనిశ్చితితో కూడిన ప్రపంచంలో బలాబలాల మధ్య సంయమనం, సమన్వయం, స్వయం ప్రతిపత్తి, సంకీర్ణం వంటి విషయాల కోసం యూరోపియన్ యూనియన్ మదనపడుతోంది.
తూర్పు ఆసియా ప్రాంతంలో పరిస్థితి మరింత నాజూకుగా ఉంది. ప్రత్యేకించి ఈ ప్రాంతంలోని రెండు దేశాలు అణ్వస్త్ర తయారీ సామర్ధ్యం కలిగిఉన్నవి కావటంతో ఈ సున్నితత్వం మరింత తీవ్రంగా ఉంది. ఉత్తర కొరియా వద్ద అణ్వాయుధాలు ఉండటం, దక్షిణ కొరియాకు అమెరికా ఎంత కాలం రక్షణ కవచాన్ని అందిస్తుందనే విషయంలో సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా ఈ అభిప్రాయానికి రావటం తప్పేమీ కాదని ఆ దేశ నాయకులంటున్నారు. ఆ దేశంలో ప్రజాభిప్రాయం కూడా ఈ దిశగా మళ్లుతోంది.
జపాన్ విషయానికి వస్తే అణ్వాయుధ తయారీ ప్రతిపాదనలు గురించి బాహాటంగా చర్చకు రాకపోయినా అమెరికాకు చెందిన అణ్వాయుధాలకు స్థావరంగా జపాన్ను మార్చటానికి పెద్దగా అభ్యంతరాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అణు ఇంధన రియాక్టర్లకు కీలకమైన ప్లుటోలియం నిల్వలు జపాన్‌లో పుష్కలంగా ఉన్నాయి. జపాన్‌కు ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రీత్యా రానున్న కాలంలో ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేసుకుని జపాన్ తనను తాను సిద్ధం చేసుకుంటుందన్న అనుమానాలు చైనాకు, ఉత్తరకొరియాకు కలగటంలో తప్పేమీ లేదు.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎదుర్కొంటున్న సమస్యలు అమెరికా తన మిత్ర దేశాలకు అణ్వాయుధ విపత్తు నుండి రక్షణ కవచాన్ని అందిస్తుందా లేదా అన్న సమస్య వరకే పరిమితం కాలేదు. ఇప్పటికే వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం, మధ్య శ్రేణి అణ్వాయుధ శక్తుల ఒప్పందం వంటి ఒప్పందాలకు కాలం చెల్లింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు తాజా ఒప్పందానికి వచ్చే ఫిబ్రవరికి కాలం తీరనున్నది. అయినా భాగస్వామ్య దేశాల మధ్య చర్చలకు సంబంధించిన ఊసే లేదు.
సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం నేటికీ అమల్లోకి రాలేదు. ఏ దేశానికి ఆ దేశం ఈ విషయంలో స్వీయనియంత్రణను పాటిస్తున్నాయి. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు 2025 అణ్వస్త్ర పరీక్షలకు తెర తీస్తోంది. రష్యా, చైనా, అమెరికాలు ఇటువంటి పరీక్షలకు సంబంధించిన వసతులన్నీ సిద్ధం చేసుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క దేశం పరీక్షలు చేపట్టినా వరుసగా మిగిలి దేశాలు ఆ బాట పట్టనున్నాయి. దాంతో ప్రపంచ శాంతి ప్రమాదంలో పడుతుంది.
మనోజ్ జోషి
అనువాదం : కొండూరి వీరయ్య
(మనోజ్ జోషి అబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ మేధావి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.