
లోక్‌సభ స్థానాలను జనాభా ఆధారంగా పునర్విభజన చేసే పరిమితీకరణ(డీలిమిటేషన్) ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. 2026 తర్వాత మొదలయ్యే ఈ ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండగా, బీజేపీ మాత్రం బలమైన మద్దతిస్తుంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధించినందుకు శిక్షగా దీన్ని చూస్తున్నాయి. ఈ వ్యతిరేకతకు కారణం ఏంటి? బీజేపీ ఎందుకు సమర్థిస్తోంది? 2000 సంవత్సరం నుంచి దక్షిణ రాష్ట్రాలు జనాభాను ఎలా నియంత్రించాయి? ఉత్తర రాష్ట్రాలు ఎందుకు విఫలమయ్యాయి? జనాభా నియంత్రణ అవగాహన కార్యక్రమాలు, రాజ్యాంగ ప్రక్రియ, 2001లో బీజేపీ సవరణలు లాంటి తదితర అంశాల గురించి పరిశీలిద్దాం.
2000 నుంచి దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణ 2000లో జాతీయ జనాభా విధానం(NPP) ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధించాయి. 1988లోనే కేరళ రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ(TFR 2.1)ని సాధించగా, తమిళనాడు 2000, ఆంధ్రప్రదేశ్ 2004లో సాధించాయి. 2019-21 NFHS-5 ప్రకారం కేరళ (1.8), తమిళనాడు (1.4), ఆంధ్రప్రదేశ్ (1.7), కర్ణాటక (1.7), తెలంగాణ (1.8) TFR రీప్లేస్మెంట్ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి.
తక్కువ ఉండడానికి కారణాలు..
మెరుగైన అక్షరాస్యత(కేరళ 96%, తమిళనాడు 80%), మహిళా సాధికారత, ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ పద్ధతుల విస్తృత వినియోగమే మనకు కారణాలుగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు NPP 2000 లక్ష్యాలను అమలు చేసి, గర్భ నిరోధక సాధనాల మార్కెట్‌ను విస్తరించాయి. ఇందులో భాగంగా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, IUCD,స్టెరిలైజేషన్లు వినియోగం జరిగింది. తమిళనాడు ‘అమ్మ ఆరోగ్య తిట్టం’ (2006) ద్వారా గర్భిణీ సంరక్షణ, కేరళ ‘నవజాత శిశు సంరక్షణ’ (2008) లాంటి పథకాలతో శిశు మరణాల తగ్గింపును ఆ రాష్ట్రాలు సాధించాయి. తెలంగాణలో ‘కేసీఆర్ కిట్’ (2017) ఆర్థిక ప్రోత్సాహకాలతో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించింది. అవగాహన కార్యక్రమాలలో భాగంగా‘మాతృ శిశు ఆరోగ్య ఉద్యమం’(కర్ణాటక), ‘డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి పథకం’(తమిళనాడు) మహిళల్లో చిన్న కుటుంబం ఆలోచనను పెంపొందించాయి.
ఉత్తర రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలం ఎందుకు?
ఉత్తరప్రదేశ్(TFR 2.4), బీహార్(3.0), రాజస్థాన్(2.3) లాంటి ఉత్తర రాష్ట్రాలు స్థాయితో 2000 తర్వాత జనాభా నియంత్రణలో విఫలమయ్యాయి. 1975-77 అత్యవసర పరిస్థితి సమయంలో బలవంతపు స్టెరిలైజేషన్లు ప్రజల్లో అపనమ్మకాన్ని సృష్టించాయి. తక్కువ అక్షరాస్యత(బీహార్ 64%, ఉత్తరప్రదేశ్ 69%), పెద్ద కుటుంబాల సాంస్కృతిక ఆచారం, ఆర్థిక దారిద్ర్యం, రాజకీయ సంకల్పం లేమి కారణాలుగా మనకు కనబడతాయి. అంతేకాకుండా NFHS-5 ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 18% గర్భనిరోధక అవసరాలు తీరలేదు. అదే బీహార్‌లో ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు. ఉత్తర రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు‘ఆశా’(2005),‘జననీ సురక్ష యోజన’(2005)లాంటి పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. కానీ, అమలులో మాత్రం బలహీనంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 2021లో ప్రతిపాదిత జనాభా నియంత్రణ బిల్లు(రెండు పిల్లల విధానం) వివాదాస్పదమైంది. ఎందుకంటే ఇది శిక్షాత్మకంగా ఉంది, సామాజిక అవగాహనపై దృష్టి పెట్టలేదు. బీహార్‌లో ‘సంతాన నియంత్రణ మిషన్’(2010)ప్రచారం గ్రామీణ ప్రాంతాలకు చేరలేదు. ఇటువంటి కారణాల వల్ల ఉత్తర భారత రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలం అయ్యాయి.
జనాభా ఆధారిత పరిమితీకరణ..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా గణన తర్వాత లోక్‌సభ స్థానాలను పునర్విభజన చేయాలి. 1971 జనాభా ఆధారంగా స్థానాలు స్తంభించినప్పటి నుంచి దక్షిణ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణలో పురోగతి సాధించాయి. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్లలో జనాభా విపరీతంగా పెరిగింది. 2031 నాటికి ఉత్తరప్రదేశ్ స్థానాలు 80 నుంచి 143కి, బీహార్ 40 నుంచి 79కి పెరగవచ్చు. అయితే తమిళనాడు 39 నుంచి 31-35కి, కేరళ 20 నుంచి 12-14కి తగ్గవచ్చు. తమిళనాడు దేశ జనాభాలో 5% ఉన్నప్పటికీ, జీడీపీలో 8.5% వాటా ఇస్తుంది. అంతేకాకుండా అక్షరాక్ష్యత 80%+గా ఉంది. ఉత్తరప్రదేశ్ 16% జనాభాతో 8% జీడీపీ ఇస్తూ తక్కువ సాక్షరత(69%)తో ఉంది. జనాభా ఆధారంగా తమిళనాడు స్థానాలు తగ్గితే అభివృద్ధికి దోహదం చేసే రాష్ట్రాలను శిక్షించడం కాదా? ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
రాజ్యాంగ ప్రక్రియ, 2001 సవరణలు డీలిమిటేషన్(పరిమితీకరణ) రాజ్యాంగంలో ఆర్టికల్ 82, 170ల ద్వారా నిర్దేశించబడింది. ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనగణన తర్వాత లోక్‌సభ స్థానాల కేటాయింపు, రాష్ట్రాల విభజన పార్లమెంటు చట్టం ద్వారా జరుగుతుంది. ఆర్టికల్ 170 రాష్ట్ర శాసనసభల స్థానాలను సరిచేస్తుంది. ఈ ప్రక్రియ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది. దీని ఆదేశాలు చట్టబద్ధంగా ఉంటాయి. న్యాయస్థానాల్లో సవాలు చేయలేరు. 1952, 1962, 1972, 2002లో నాలుగు సార్లు ఈ కమిషన్ ఏర్పాటైంది. 1976లో 42వ సవరణ ద్వారా, జనాభా నియంత్రణను ప్రోత్సహించేందుకు 2001 వరకు స్థానాల సంఖ్య స్తంభించింది. 2001లో బీజేపీ నేతృత్వంలోని వాజ్‌పేయి ప్రభుత్వం 84వ సవరణ ద్వారా ఈ స్తంభనను 2026 తర్వాత తొలి జనగణన వరకు పొడిగించింది. 87వ సవరణ (2003) ద్వారా 1991 జనగణన ఆధారంగా సరిహద్దులు పునర్విభజన చేయబడ్డాయి, కానీ స్థానాల సంఖ్య మారలేదు. ఈ సవరణలు జనాభా నియంత్రణ రాష్ట్రాలను రక్షించే ఉద్దేశ్యంతో జరిగాయి. కానీ, ప్రస్తుతం మాత్రం దక్షిణాది రాష్ట్రాలు దీన్ని అన్యాయంగా భావిస్తున్నాయి.
2025 మార్చి 22న చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)పేరుతో దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. సీపీఐ(ఎం)(కేరళ), కాంగ్రెస్(తెలంగాణ, కర్ణాటక), ఆప్ (పంజాబ్)నాయకులు హాజరయ్యారు. టీడీపీ(ఆంధ్రప్రదేశ్) హాజరు కాలేదు, బీఆర్ఎస్(తెలంగాణ) సమావేశంలో పాల్గొన్నది. ఈ సందర్భంగా పలు పార్టీలు స్పందించాయి. తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. “జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం సరికాదు” అని డీఎంకే చెప్పింది. “సమాఖ్య వైవిధ్యం భారత దేశ బలం, కేంద్రీకరణ సరికాదు” అని కేరళ సీపీఐ(ఎం) పేర్కొంది. “తెలంగాణ 5% కంటే ఎక్కువ జీడీపీ ఇస్తోంది, కానీ 2.8% జనాభాతో మా స్థానాలు తగ్గడం అన్యాయం. ఆర్థిక బలం కూడా పరిగణనలోకి రావాలి”అని తెలంగాణ కాంగ్రెస్ తెలియజేసింది. “ఎక్కువ జీడీపీ, ఎక్కువ స్థానాలు ఉండాలి. దక్షిణ రాష్ట్రాలు 36% జీడీపీ ఇస్తున్నాయి, అందుకు తగ్గ ప్రాతినిధ్యం కావాలి” అని బీఆర్ఎస్ వాదించింది. తదుపరి సమావేశం ఏప్రిల్‌లో హైదరాబాద్ వేదికగా జరగుతుంది.
జీడీపీ ఆధారిత డీలిమిటేషన్..
ప్రత్యామ్నాయం డీలిమిటేషన్ కేవలం జనాభాపై ఆధారపడకూడదని, జీడీపీ వాటాను ప్రామాణికంగా తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశ జీడీపీలో దక్షిణ రాష్ట్రాల వాటా 35%కి పైగా, జనాభా 18% మాత్రమే ఉంది. తెలంగాణ 2.8% జనాభాతో 5.2% జీడీపీని అందిస్తుంది. “మేం సంఖ్యలు మాత్రమే కాదు, అభివృద్ధి ఇంజన్లం. ప్రాతినిధ్యంలో జీడీపీ కూడా ప్రతిఫలించాలి” అని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. “జీడీపీ ఆధారంగా స్థానాలు కేటాయిస్తే, అభివృద్ధిని ప్రోత్సహిస్తాం”అని బీఆర్ఎస్ సూచించింది. ఈ ప్రత్యామ్నాయం జనాభా పెరుగుదల కంటే ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచి, దక్షిణాది రాష్ట్రాల స్థానాలను తగ్గకుండా చూడవచ్చు. కానీ రాజ్యాంగ సవరణ, ఉత్తర రాష్ట్రాల వ్యతిరేకత సవాళ్లుగా ఉన్నాయి. జీడీపీ డేటా విశ్వసనీయత, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఆర్థిక సమాఖ్య సవాళ్లు ఆర్థిక సమాఖ్య వ్యవస్థలో అసమానతలు ఈ వివాదాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పన్నులు చెల్లెస్తున్నాయి. కానీ, తక్కువ వాటా పొందుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం కర్ణాటక ఒక రూపాయి పన్నుకు 15 పైసలు, తమిళనాడు 29 పైసలను పొందుతున్నాయి. అయితే, బీహార్ 2.2 రూపాయలు, ఉత్తరప్రదేశ్ 1.8 రూపాయలు పొందుతున్నాయి.
జీఎస్టీ తర్వాత మరో అంశం రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్ర్యం తగ్గింది, కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి. జనాభా నియంత్రణ సాధించిన రాష్ట్రాలు ఆర్థిక సంఘం వాటాలో నష్టపోతున్నాయి. తెలంగాణ, కర్ణాటక ఎక్కువ జీడీపీ ఇస్తున్నా, జనాభా ఆధారంగా తక్కువ నిధులను పొందుతున్నాయి. కేంద్రం సెస్‌లు, సర్చార్జ్లతో 20% పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలకు ఇవ్వవడం లేదు(2023-24లో రూ. 2.5 లక్షల కోట్లు). డీలిమిటేషన్లో స్థానాలు తగ్గితే, ఈ ఆర్థిక అన్యాయాన్ని పార్లమెంట్లో సవాలు చేసే శక్తి తగ్గుతుంది.
బీజేపీ ఎందుకు మద్దతిస్తోంది?
బీజేపీ డీలిమిటేషన్‌కు మద్దతు ఇవ్వడం వెనుక రాజకీయ స్వార్థం ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ బలంగా ఉంది. 2019లో ఉత్తరప్రదేశ్‌లో 80లో 62, బీహార్‌లో 40లో 39 స్థానాలు గెలిచింది. జనాభా ఆధారంగా ఈ రాష్ట్రాల స్థానాలు పెరిగితే, బీజేపీ ఆధిపత్యం పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా 129 స్థానాల్లో 29 మాత్రమే గెలిచింది. ఈ రాష్ట్రాల స్థానాలు తగ్గినా నష్టం తక్కువగా ఉంటుంది. బీజేపీ దీన్ని రాజ్యాంగ బాధ్యతగా చూపిస్తోంది. ఆర్టికల్ 82ని సాకుగా చూపిస్తూ ఒక ఎంపీ 22 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని వాదిస్తోంది. కానీ ఉత్తర రాష్ట్రాల హిందీ బెల్ట్‌ను బలోపేతం చేసే ఉద్దేశం కనిపిస్తోంది. “దక్షిణాది రాష్ట్రాలు ఒక్క స్థానం కూడా కోల్పోవు”అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఇది పూర్తి రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది.2001లో వాజ్‌పేయి ప్రభుత్వం సవరణలు చేసినప్పుడు కూడా ఉత్తర రాష్ట్రాల బలాన్ని కాపాడే ఉద్దేశం ఉందనే విమర్శలు వచ్చాయి.
పరిమితీకరణ తర్వాత ఒక దేశం-ఒక ఎన్నిక..
డీలిమిటేషన్ తర్వాత ఉత్తర రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు పెరిగితే, బీజేపీ ప్రతిపాదించిన ‘ఒక దేశం-ఒక ఎన్నిక’ విధానం దానికి తోడై బీజేపీకి మరింత లాభం చేకూరుస్తుంది. ఒక దేశం-ఒక ఎన్నిక కింద లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. ఈ రాష్ట్రాల స్థానాలు పెరిగితే, జాతీయ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం పెరుగుతుంది.
ఒక దేశం-ఒక ఎన్నిక బీజేపీకి అనుకూలం ఎందుకంటే హిందీ బెల్ట్‌లో ఆ పార్టీ సంస్థాగత బలం, హిందుత్వ ఎజెండా బలంగా పనిచేస్తాయి. 2019లో బీజేపీ ఉత్తర రాష్ట్రాల్లో 60% స్థానాలలో గెలిచింది. కానీ, దక్షిణ రాష్ట్రాల్లో 22% మాత్రమే విజయాన్ని సాధించింది. స్థానాలు ఉత్తరం వైపు మళ్లితే, ఒక దేశం-ఒక ఎన్నికతో బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆధిపత్యం సాధిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు ఈ రెండింటితో(పరిమితీకరణ, ఒక దేశం-ఒక ఎన్నిక)తమ ప్రభావాన్ని కోల్పోతాయి.
జనాభా ఆధారంగా ఉత్తర రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడమనేది అన్యాయమైన చర్యగా పరిగణించాలి. బీజేపీ తన రాజకీయ లాభం కోసం మద్దతిస్తుంది. డీలిమిటేషన్ చేసి, జమిలి ఎన్నికలతో హిందీ రాష్ట్రాల ఆధిపత్యం పెంచడమంటే దక్షిణాది రాష్ట్రాలకు శిక్షించినట్టే అవుతుంది. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం సవరణలు ఉత్తర రాష్ట్రాల బలాన్ని కాపాడేందుకేనని విమర్శలు ఉన్నాయి. జీడీపీ, అభివృద్ధి సూచీలను పరిగణనలోకి తీసుకుని, అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి న్యాయమైన విధానాన్ని రూపొందించాలి. లేకపోతే, ఉత్తర-దక్షిణ విభజన లోతై, దేశ ఐక్యతకు సవాలుగా మారుతుంది.
ఎస్ అక్బర్
తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు
8179492515.
ak007akbar@gmail.com
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.