
పారిశ్రామిక రంగంలో, ప్రభుత్వ పాలన, విధానం లేదా ప్రభుత్వ సంస్థలలో సీనియర్ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రొఫెసర్లు కాకపోయినా, యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ నియామకాలకు అర్హులయ్యేలా ముసాయిదా నిబంధనలు అనుమతిస్తాయి.
న్యూఢిల్లీ: 2025వ సంవత్సరం కోసం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ముసాయిదా నిబంధనల పేరుతో విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం వైస్-ఛాన్సలర్లను నియమించడానికి ముగ్గురు సభ్యుల సెర్చ్-కమ్-సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసే అధికారాన్ని ఛాన్సలర్లు లేదా విజిటర్లకు ఇస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఈ చర్యను “నిరంకుశమైనదిగాను“, “సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడిగాను”, “రాజ్యాంగ విరుద్ధంగాను” ఉందని విమర్శించారు.
జనవరి 6తేదీనాడు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైస్-ఛాన్సలర్ల ఎంపిక, అధ్యాపకుల నియామక ప్రక్రియలో మార్పులను ప్రవేశపెట్టటం కోసం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ముసాయిదా నిబంధనలను (విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అకడమిక్ స్టాఫ్‌ల నియామకం, ప్రమోషన్‌కు కనీస అర్హతలు మరియు ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు చర్యలు) విడుదల చేశారు.
వైస్-ఛాన్సలర్ నియామకాల కోసం ఏర్పాటు చేసే సెర్చ్-కమ్-సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు: విజిటర్ లేక ఛాన్సలర్ నియమించిన వ్యక్తి ఈ కమిటీకి చైర్పర్సన్ గా ఉంటారు. ఇలా నియమించబడిన చైర్ పర్సన్ తో పాటు యుజిసి ఛైర్మన్, విశ్వవిద్యాలయ అత్యున్నత కమిటీ అయిన సెనేట్ లేక సిండికేట్ లకు ప్రాతినిధ్యంవహించే ఇద్దరు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.
ముసాయిదా నిబంధనల ప్రకారం, వైస్-ఛాన్సలర్ నియామకాల కోసం సెర్చ్-కమ్-సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడానికి ఛాన్సలర్లు లేదా సందర్శకులకు అధికారం కల్పించే మార్గదర్శకాలను పాటించకపోతే యుజిసి పథకాలలో పాల్గొనడానికి లేదా డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించడానికి అనర్హతతో పాటుగా ఇతర పరిణామాలు ఉంటాయి.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే అనేక రాష్ట్రాలలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గవర్నర్లే ఛాన్సలర్లు. ఈ చర్య వైస్-ఛాన్సలర్ నియామకాల తీరుతెన్నులను మార్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలు పాలించే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలలో వైస్ చాన్సలర్ ల నియామకాల విషయంలో ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య విభేదాలు తలెత్తాయి.
స్టాలిన్ ‘‘ఎక్స్’’ లో ఇలా వ్రాశాడు: “వైస్ ఛాన్సలర్ల నియామకాలపై గవర్నర్లకు విస్తృత నియంత్రణను కట్టబెట్టటం, విద్యావేత్తలు కానివారు ఈ పదవులను పొందటానికి అనుమతించడమే లక్ష్యంగా విడుదల చేసిన కొత్త యుజిసి నిబంధనలు సమాఖ్యవ్యవస్థ పైన, రాష్ట్రాల హక్కులపైన ప్రత్యక్ష దాడిచేసే విధంగా ఉన్నాయి. బిజెపి నేత్రుత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిరంకుశ చర్య అధికార కేంద్రీకరణకు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరచడానికి ఉద్దేశింపబడింది. విద్య ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల చేతుల్లో ఉండితీరాలి. అంతేగాని బిజెపి ప్రభుత్వ ఆదేశానుసారం వ్యవహరించే గవర్నర్ల చేతుల్లో కాదు.
“మా సంస్థల స్వయంప్రతిపత్తిని తొలగిస్తే అత్యధిక సంఖ్యలో అగ్రశ్రేణి ఉన్నత విద్యా సంస్థలతో దేశంలో అగ్రగామిగా ఉన్న తమిళనాడు మౌనంగా ఉండదు. విద్య మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఉమ్మడి జాబితాలో ఒక అంశంగా ఉన్నందున యుజిసి ఏకపక్షంగా ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని మేము భావిస్తున్నాము. ఈ అప్రజాస్వామిక చర్య ఆమోదయోగ్యం కాదు. దీనిపై తమిళనాడు న్యాయపరంగాను, రాజకీయంగాను పోరాడుతుంది” అని అన్నారాయన.
అంతేకాదు, ఈ నిబంధనలు పారదర్శకత ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతున్నాయి. వైస్-ఛాన్సలర్ ల సెలక్షన్ అవసరాన్ని దేశవ్యాప్తంగా ప్రకటించాలని, నామినేషన్లు లేదా టాలెంట్ సెర్చ్ ప్రక్రియల ద్వారా దరఖాస్తులను అనుమతించాలని నిబంధనలు కోరుతున్నాయి. విజిటర్/ఛాన్సలర్ చేత నియమించబడిన వ్యక్తి సెర్చ్-కమ్-సెలక్షన్ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. అతనితో పాటు యుజిసి ఛైర్మన్ ప్రతినిధి, విశ్వవిద్యాలయ సిండికేట్/సెనేట్ వంటిఅత్యున్నత సంస్థ ప్రతినిధి ఉంటారు.
ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదిక ప్రకారం, పారిశ్రామిక రంగంలో, ప్రభుత్వ పాలన, పాలసీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో సీనియర్ స్థానాలలోవున్న వ్యక్తులు ప్రొఫెసర్లు కాకపోయినా విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ పదవులకు అర్హులు కావడానికి ముసాయిదా నిబంధనలు అనుమతిస్తాయి.
అధ్యాపకుల నియామకాలలో యుజిసి సౌలభ్యాన్ని ప్రవేశపెట్టటం మరొక కీలక పరిణామం. వ్యక్తుల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాలతో సంబంధం లేకుండా యుజిసి-నెట్ లో వారి పనితీరు ఆధారంగా అధ్యాపక స్థానాలకు అర్హత పొందేందుకు వీలు కల్పిస్తుంది. 2020లో ప్రకటించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ ఇ పి) ఊహించిన విధంగా మరింత మల్టీడిసిప్లినరీ అకడమిక్ వాతావరణాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా ఈ మార్పు ఉంది.
ముసాయిదా నిబంధనలలో ఇతర ముఖ్యమైన అంశాలు:
- భారతీయ భాషలకు ప్రాధాన్యత: భారతీయ భాషలలో ప్రచురణను ప్రోత్సహించడం, ఈ భాషలలో విద్యార్హతలను గుర్తించడం.
- మార్కుల సడలింపు: షెడ్యూల్డ్ కులం/షెడ్యూల్డ్ తెగ/ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) (నాన్-క్రీమీ లేయర్)/ఇడబ్యుఎస్/వైకల్యాలున్న వ్యక్తులకు అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో 5% మార్కుల సడలింపుకు ఈ నిబంధనలు అనుమతిస్తాయి.
- గుర్తించదగిన నైపుణ్యాలు, రూపకల్పనలు: వినూత్న బోధన, పరిశోధన లేదా బోధనా ప్రయోగశాల అభివృద్ధి, కన్సల్టెన్సీ సహకారం లేదా ప్రాయోజిత పరిశోధన నిధులను ప్రధాన పరిశోధకుడిగా లేదా సహ-ప్రధాన పరిశోధకుడిగా స్వీకరించటాన్ని పరిగణించడం, అలాగే భారతీయ భాషలలో బోధన వంటి విషయాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు అర్హతలుగా ఉంటాయి.
ముసాయిదా నిబంధనలపై 30 రోజుల్లోగా తమతమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా సంబంధిత భాగస్వాములను, ప్రజలను యుజిసి ఆహ్వానించింది. అమలులోకి వచ్చిన వెంటనే ఈ నిబంధనలు కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ మరియు డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు వర్తిస్తాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.