
వివిధ అంతర్జాతీయ వేదికలపై కీర్తిప్రతిష్టలందుకున్న వారిని సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలందుకున్న కొందరు భారతీయుల విషయంలో మాత్రం మోడీ మౌనముద్ర దాల్చటం విశేషం.
భాను ముష్తాక్ తాజాగా అంతర్జాతీయ బుకర్ ప్రైజు అందుకున్న భారతీయ మహిళ. హృదయ దీపాలు అనే కథాసంకలన అనువాదానికి ముష్తాక్ ఈ వార్డు అందుకున్నారు. కానీ ఆమెను ప్రశంసించేందుకు మోడీ నోరు పెగల్లేదు. ఇంకా ఇటువంటి సందర్భాలు కనీసం రెండు ఉన్నాయి.క్రీడలు, విజ్ఞానశాస్త్రం ఇతర రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన వారిని ప్రశంసిస్తూ ట్విట్టర్లో పోస్టు చేయటమో, లేదా క్రీడా మైదానంలోకి దిగి వారితో చెట్టాపట్టాలేసుకుని నడవడమో జరుగుతూ ఉండేది. కానీ ఈ ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మోడీ వైపు నుంచి అటువంటి స్పందన రాలేదు. కొద్దిమంది విషయంలో మాత్రమే మోడీ ఈరకమైన మౌనముద్ర పాటిస్తున్నారు. బహుశా ఆ అవార్డు గ్రహీతలకున్న రాజకీయ దృక్ఫథం కానీ, లేదా వారు కృషి చేయటానికి ఎంచుకున్న రంగం కానీ, అప్పుడప్పుడూ ఈ విశిష్ట వ్యక్తులు ఆధిపత్య రాజకీయాలను, మతోన్మాద రాజకీయాలను విమర్శించటం కానీ, లేదా సామాజికి భౌగోళిక రాజకీయ బహుళత్వానికి కట్టుబడి ఉన్నామని చెప్పటం కానీ కారణం అయి ఉండొచ్చు.
ప్రశంసలకు నోచుకోని మెగస్సెసె అవార్డు గ్రహీతలు..
మెగస్సెసె ఆసియా దేశాల వరకూ నోబెల్ బహుమతితో సమానం. అటువంటి అవార్డు 2019 సంవత్సరానికి గాను హిందీ జర్నలిస్టు రవీశ్ కుమార్ను వరించింది. దేశవ్యాప్తంగా విశేష ప్రశంసలందుకున్న రవీశ్ను ప్రశంసించటానికి మాత్రం మోడీకి మనసొప్పలేదు. అంతేకాకుండా పారిశుధ్య కార్మికుల ఉద్యమ నిర్మాత బెజవాడ విల్సన్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు టిఎం కృష్ణలు సంయుక్తంగా 2016కు గాను రామన్ మెగస్సేసె అవార్డు గెల్చుకున్నారు. వీరిద్దరినీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసించినా మోడీ మాత్రం పల్లెత్తు ప్రశంస చేయలేకపోయారు. బెడవాడ విల్సన్ నిర్మించిన ఉద్యమం పారిశుధ్య కార్మికుల ఉద్యమం. దేశంలో ప్రతి ఇల్లూ పరిశుభ్రంగా ఉండాలన్న విల్సన్ నినాదాం స్వఛ్చభారత్ అన్న మోడీ నినాదానికి మధ్య వ్యత్యాసమేమీ లేదు. అయినా ప్రధాని మాత్రం విల్సన్ కృషిని గుర్తించటానికి సిద్ధం కాలేదు.
హిందీ నవలా రచయిత గీతాంజలిశ్రీ 2022లో బుకర్ ప్రైజు అందుకున్న తొలి హిందీ రచయిత. గీతాంజలిశ్రీ బుకర్ ప్రైజు అందుకున్న తొలి ఆసియా దేశాల భాషా రచయిత్రి. హిందీ భాషా రచనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చినా, హిందీ భాష గురించి ఎంతగానో గొప్పలు చెప్పుకునే ప్రధానికి ప్రశంసించేందుకు మనసొప్పలేదు. ఈ రచన భారతదేశానికి చెందిన హిందు మహిళ, పాకిస్తాన్కు చెందిన ముస్లిం వ్యక్తిని ప్రేమించే కథనంతో ఉన్న ఈ ఇసుక సమాధి నవల భాషా, ప్రాంతీయ బహుళత్వాన్ని, మిశ్రమత్వానికి ప్రాతినిధ్యం వహించే నవల.
బాను ముష్తాక్ 2025 బుకర్ ప్రైజ్ గ్రహీత..
కన్నడ భాషలో బాను ముష్తాక్ రాసిన ఆరు కథల సంకలనానికి 2025 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ వరించింది. రచన హృదయ దీపాలు. ఇప్పటి వరకూ ముష్తాక్ను ప్రధాని మోడీ ప్రశంసించినట్లు సమాచారం లేదు. దేశంలో హిందీ ప్రభావం గురించి తీవ్రమైన చర్చ, అభ్యంతరాలు తలెత్తుతున్న నేపథ్యంలో దక్షిణాది భాషకు అంతర్జాతీయ గుర్తింపు దక్కటం, అందులోనూ ప్రాంతీయ భాషాపరమైన సాంస్కృతిక, లైంగిక, కుల అణచివేతలు వంటి అనేక అంశాలను సృజించిన ఈ కథలకు అంతర్జాతీయ గుర్తింపు రావడాన్ని మోడీ ప్రశంసించలేకపోవటం ఆయన ప్రాతినిధ్యం వహించే ఆధిపత్య రాజకీయాల స్వభావాన్ని గుర్తు చేస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.