
భరించలేని ఎండ వేడితో సతమతమౌతున్నావా?
కసురుకో ఆ రవి చైతన్యాన్నో…
గ్లోబల్ వార్మింగ్ పెంచుతున్న
మా’నవ’ హోమోసేపియన్ జాతినో..
ఆలస్యం చేస్తున్న ఆ రుతుపవనాల బాధ్యతారహిత వైఖరినో!
నీ నిందారోపణలు తట్టుకోలేక వర్షాలు కురుస్తాయ్!!
ఇప్పుడు…
ఎడతెరిపి లేని వర్షం ఇబ్బంది పెడుతోందా?
తిట్టు తనివితీరా!
మబ్బులనో..
వాటిని సాంద్రపరిచిన తేమనో…
లేదా అవి కురిసే భౌతిక స్థితిని కల్పించిన ఊష్ణ పీడనమునో!
నీ బాధాతప్త శాపనార్థాలు సహించలేక వానలు వెనక్కి వెళ్ళి, హాయిని కూర్చే శీతల ఋతువును దఖలు పరుస్తాయ్!!
మరిప్పుడు…
సహించలేని వణుకు పుట్టించే శీతల పవన సహిత చలితో సతమతమౌతున్నావా?
బాధంతా వెళ్లగక్కుకో…
కసితీరా చీదరించుకో..
నెగడులకు ఏ మాత్రం చలించని, వీసమెత్తు తగ్గని పొగరు మంచు పొగనో..
సూర్య కాంతినీ, వేడినీ చట్టన చల్లార్చి, మనసులనూ, మనుషులనూ చైతన్య రహితంగా మార్చి,
చల్లని మత్తులా ఆవహించే, ఆవరించే పులి లాంటి చలికాలాన్నో!
పునరపి తత్కాలం!
పునరపి పునరపి!!
కాల ప్రవాహానికి, ప్రభావానికి ఎదురీది ఏం సాధిద్దామని
ఈ గమనం లేని అగమ్య ప్రయాణం?
ఇక చాలు నీ నిందాస్తుతులు!
ఆరోపణా పర్వములు!!
ఆక్షేపణాలంకారములు!!!
ఏగాలం దాపురించినదో..
ఈ జీవ గేలానికి!!
నీకు పట్టిన దుర్గతికి
ఇంకెవరినో బాధ్యులను చేస్తే ఎలా?
చేతనైతే..
నిన్ను నీవు నిర్దాక్షిణ్యంగా కసురుకో! చీదరించుకో!!
నిలదీసుకో!!!
సమీక్షించుకో!!!!
రవ్వంతయినా దిశ మారి
దశ తిరుగావచ్చు!
ఇంకో శిల్పి ఉలికి నీ శిలను బలి ఇచ్చి,
బాధాగ్రస్త భవితకు బాటలు ఎందుకు వేస్తావ్?
నీ శిల్పాన్ని నీ ఉలితో నీవే చెక్కుకో!!
కనీసం ఈ జీవిత కాల అనుభవమైనా నీకు మిగులుతుంది!!!
లేదా..
మరో శిలకైనా ఒక గొప్ప సజీవ శిల్ప ఉదాహరణగా నిలిచిపోతావ్
గిరిధర్
9849801947
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.