
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మాదిగ కులానికి చెందిన ఎమ్మెల్యేలు కేబినేట్లో తమకు ఈ సారి సరైన ప్రాధాన్యత ఇవ్వవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వైపు కుల వర్గీకరణలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని సీఎం రేవంత్ చెబుతున్నారు. కొత్తగా విస్తరిస్తోన్న కేబినేట్లో అన్ని సామాజికవర్గాలకు సమాన న్యాయం ఎలా చేయబోతున్నారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మాదిగ సామాజికవర్గం నుంచి వస్తున్న డిమాండ్లు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాళ్లుగా మారుతున్నాయి. ఇప్పటికే కేబినేట్లో బెర్త్ కోసం పలు డిమాండ్లు ఇప్పటికే ముఖ్యంత్రి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ సర్వత్ర నెలకుంది.
ప్రస్తుతం తెలంగాణ కేబినేట్లో ముఖ్యమంత్రితో సహా 12మంది మంత్రులు ఉన్నారు. సీఎంను కలుపుకొని వీరిలో నలుగురు రెడ్లు, ఇద్దరు షెడ్యూల్ కులాల మంత్రులు, అందులో ఒకరు డిప్యూటీ సీఎం, ఇద్దరు బీసీలకు చెందినవారు, ఒకరు గిరిజనులు(ఎస్టీ), ఒకరు బ్రాహ్మణ, ఒకరు కమ్మ సామాజిక వర్గంతోపాటు మరో బీసీ కోటాలో మంత్రి ఉన్నారు. అయితే ఇప్పుడు మొత్తం 18 మంది వరకు కేబినెట్ విస్తరించేందుకు వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎంత మంది కొత్త ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కేబినేట్లో అవకాశం కల్పిస్తారనేది ఉత్కంఠగా మారింది.
అసెంబ్లీలో కాంగ్రెస్ సామాజికర్గ సమీకరణలు..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేలు సామాజికంగా చూసినప్పుడు, కుల ప్రాతినిధ్యంలో స్పష్టమైన అసమతుల్యత కనిపిస్తోంది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం మొత్తం రాష్ట్ర జనాభాలో కేవలం 5 శాతం మాత్రమే ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో 30 నుంచి 40 శాతం వరకు రెడ్లు ఉన్నారు. అంటే దాదాపు 19 నుంచి 26 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది వారి జనాభా శాతం కంటే అధిక ప్రాతినిధ్యాన్ని సూచిస్తుందని పలువురుల అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఎస్సీలు రాష్ట్ర జనాభాలో 17 శాతం మేర ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో వారి ప్రాతినిధ్యం కేవలం 15– 20 శాతం మాత్రమే(అంటే దాదాపు 10– 13 మంది మాత్రమే). ఇదే విధంగా బీసీలు రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉండే వర్గం సుమారు 56 శాతం ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో వారికి 15– 25 శాతం మాత్రమే ప్రాతినిధ్యం లభించింది(దాదాపు 10– 16 మంది). రెడ్డి సామాజికవర్గంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అనే విమర్శలు వస్తున్నాయి. గిరిజనులు(ఎస్టీలు) రాష్ట్ర జనాభాలో సుమారు 10 శాతం వరకు ఉన్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో వారిది కేవలం 6–10 మంది ప్రాతినిద్యం మాత్రమే. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు. రాష్ట్రంలో ముస్లిం జనాభా సుమారుగా 12–14 శాతం ఉన్నా, వారి ప్రాతినిధ్యం పూర్తిగా శూన్యంగా మిగిలింది. ఈ గణాంకాలన్నీ చూస్తే, కుల పరంగా కాంగ్రెస్ పార్టీ విజయంలో స్పష్టమైన అసమతుల్యత ఉన్నట్లు స్పష్టమవుతుంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాతినిధ్యం లభించగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు తక్కువ ప్రాధాన్యత ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కుల అసమతుల్యత నేపథ్యంలోనే రాబోయే కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటించాలని, అన్ని వర్గాలకు గౌరవప్రదమైన ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్లు ఇప్పుడు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.
ఏళ్ల తరబడిన నిర్లక్ష్యం..
ఎస్సీ జనాభాలో 60 శాతం, రాష్ట్ర జనాభాలో దాదాపు 9 శాతం ఉన్న మాదిగలు పాలనా వ్యవస్థలో మినహాయింపుగా మిగిలిపోతున్నారు. 2011 జనగణన ప్రకారం మొత్తం 54.32 లక్షల ఎస్సీ జనాభాలో 32.33 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 50 లక్షలుగా అంచనా వేయబడుతోంది. కానీ సంఖ్యల పరంగా ఉన్న బలానికి విరుద్ధంగా, తెలంగాణలో వారి రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానాల్లో ఇద్దరికి మాల కులానికి చెందిన నాయకులే ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎస్సీలకు కేటాయించిన ఏకైక ఎమ్మెల్సీ స్థానం కూడా మాలకే దక్కింది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, స్పీకర్ ఇద్దరూ మాలలకు చెందినవారే. మాదిగలకు కేబినెట్లో ఒక్క ప్రాతినిధ్యం ఉన్నా, అది కూడా మొత్తం ఎస్సీలలో కేవలం 1 శాతం ఉన్న మోచే అనే ఉపకులానికి చెందినవారు. దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న ఐదుగురు మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాబోయే కేబినేట్ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నారు. తమ ఐదుగురులో ఏ ఒక్కరికి అవకాశం కల్పించిన తమ సామాజికవర్గానికి ప్రాద్యానత లభించినట్లు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చరిత్రలో మాదిగల పాత్ర, పార్టీ ల హామీలు..
1956 నుంచి 2000 మధ్య కాలంలో అంటే దాదాపు 44 సంవత్సరాల పాటు ఎస్సీ కోటా ఒకే వర్గంగా ఉండింది. ఈ వ్యవధిలో మాదిగలు దాదాపు 18,000 నుండి 20,000 వరకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందగలిగారు. అయితే ఇది వారి జనాభా శాతానికి తగిన ప్రాధాన్యత కాదన్న భావన అప్పట్లో నుంచే ఉండేది. 2000 నుంచి 2004 మధ్య కాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎస్సీ కులాల మధ్య ఉపవర్గీకరణను అమలు చేసింది. దీంతో ఎస్సీ కోటాను మాదిగ, మాల ఇతరులుగా విడగొట్టి వారికి విడిగా ఉద్యోగాలు, అవకాశాలను కేటాయించే విధానం అమల్లోకి వచ్చింది. ఫలితంగా కేవలం నాలుగు సంవత్సరాల లోపే మాదిగలకు దాదాపు 23,500 ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ మాదిగల డిమాండ్లను సానుకూలంగా స్వీకరించింది. మాదిగల సామాజిక, ఆర్థిక వెనుకబడిన స్థితిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ‘చెవెళ్ల డిక్లరేషన్’ అనే పేరుతో ఓ ప్రత్యేక ప్రకటన చేసింది. ఇందులో ఎస్సీ ఉపవర్గీకరణకు మద్దతు ప్రకటించి. అంతేకాక, ఎన్నికల తర్వాత తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గాల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అసమానతలను గుర్తించే బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది. ఇది మాదిగ వర్గానికి చెందిన నేతలు, సంఘాలు ఎంతో కాలంగా కోరుకుంటున్న ప్రాధాన్యమైన అడుగు. ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమయంలో మాదిగలకు ఒక్క మంత్రి పదవీ కూడా దక్కలేదు. ఎస్సీ కోటాలో ప్రాధాన్యం మాల వర్గానికే ఎక్కువగా దక్కిందనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకిచ్చిన హామీలను అమలు చేయాలని, చారిత్రకంగా జరిగిన ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వస్తున్నాయి. ఈ డిమాండ్లు కేవలం రాజకీయ పదవుల కోసమే కాక, మాదిగ వర్గానికి హక్కుగా భావించిన సామాజిక న్యాయం, ప్రాతినిధ్యం వంటి అంశాలను సాధించడానికని ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు అంటున్నారు.
తమ స్వరం వినిపిస్తోన్న ఐదుగురు మాదిగ ఎమ్మెల్యేలు..
తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎన్నో దశాబ్దాలుగా పార్టీకి విధేయంగా ఉన్న తమ వర్గానికి న్యాయం జరిగేలా కనీసం ఒకరిని అయినా మంత్రివర్గంలో చేర్చాలనీ కాంగ్రెస్ అధిష్టానాన్ని గట్టిగా కోరుతున్నారు. వీరిలో అందరూ కూడా మాదిగ వర్గానికి చెందినవారే కావడం, అలాగే కాంగ్రెస్ ఉద్యమాల్లో పాలు పంచుకున్న కార్యకర్తలుగా గుర్తింపు పొందిన వారు కావడం విశేషం. ఈ ఐదుగురు నేతలు తమలో ఎవరు మంత్రి అయిన తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత పదవుల కోరికకోసం కాదు, తమ వర్గానికి న్యాయం చేయాలనే, సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే న్యాయపరమైన డిమాండ్ కోసం ఆరాటమని వారు పేర్కొన్నారు. “మాలో ఎవరు కేబినెట్‌కు ఎంపికైనా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది వ్యక్తిగతంగా మంత్రిపదవి కోసం పోరాటం కాదు. ఇది మాదిగ వర్గానికి న్యాయం జరగాలనే ఆశయంతో చేస్తున్న విజ్ఞప్తి. మా వర్గం గతంలో ఎప్పుడూ కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా నిలిచింది. ఈసారి జరిగిన 2023 ఎన్నికల్లో కూడా కీలక నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించేందుకు ముఖ్యమైన పాత్ర పోషించింది” అని కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ ‘ది వైర్’తో అన్నారు.
కేబినేట్ కోసం వినిపిస్తోన్న పేర్లు..
కేబినేట్ విస్తరణ నేపథ్యంలో ఎవరు మంత్రి పదవి దక్కించుకుంటారనే ఉత్కంఠ రాష్ట్రమంతటా నెలకొంది. సామాజిక సమతుల్యత, రాజకీయ సమీకరణాలు, పార్టీలో సేవల పరిగణతితో కలిపి ఎన్నో అంశాల ఆధారంగా పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కొన్ని పేర్లను తన పార్టీ అధిష్టానానికి పంపినట్టు చెబుతున్నారు. వీరిలో సామాజిక విభజనకు అనుగుణంగా వివిధ వర్గాలను ప్రతినిధీకరించేలా ఎంపికలు జరిగే అవకాశముంది. జి వివేక్ – ఎస్సీ వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ. సొంతంగా భారీ సామాజిక, ఆర్థిక శక్తిని కలిగిన వ్యక్తిగా పేరున్న వివేక్, టీఆర్ఎస్ నుంచి బీజేపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడు. ఇటీవల పార్టీకి చేసిన సేవల దృష్ట్యా ఆయన పేరు ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. వి శ్రీహరి ముదిరాజ్ బీసీ వర్గంలోకి వచ్చే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్న నేపథ్యంలో శ్రీహరి పేరు కేబినేట్ రేసులో ఉన్నట్లు తెలిసింది. ఎన్ బాలునాయక్ ఎస్టీ వర్గానికి చెందిన నాయకుడు. గిరిజనులకు ప్రాతినిధ్యం ఇచ్చే కొత్త ప్రయత్నాల్లో భాగంగా ఆయన పేరు పరిగణనలో ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురు నేతల పేర్లను పార్టీ హైకమాండ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పంపినట్లు సమాచారం. అయితే ఈ పేర్లలో ఎవరు చివరికి మంత్రివర్గంలోకి ప్రవేశిస్తారు, కొత్తగా ఇంకెవరెవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై అధికారిక ప్రకటన కోసం ఇప్పుడు అందరి చూపూ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్, ఢిల్లీలోని 10 జనపథ్లవైపు మళ్లింది.
సీఎం రేవంత్‌కు అసలైన పరీక్ష..
కుల గణాంకాల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం చేయగలరా? అనే ప్రశ్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. రాష్ట్రంలో జరిగిన 2024 కుల గణాంక సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 96.9 శాతం గృహాలను కవర్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సర్వే ప్రకారం: బీసీలు – 56.33%,ఎస్సీలు – 17.43%, ఎస్టీలు – 10.45%. ఈ గణాంకాల ఆధారంగా రాష్ట్రం వనరులను, సంక్షేమ పథకాలను లక్ష్యంగా రూపొందించనున్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. “తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారింది. మేము గణాంకాల ఆధారంగా పాలనను నడుపుతున్నాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఇప్పుడు జరగబోయే కేబినెట్ విస్తరణలో ఈ గణాంకాల ప్రభావం ఎంత ఉంటుందన్నదే అసలైన సవాల్. ముఖ్యంగా సామాజిక న్యాయం, ప్రాతినిధ్యం అనే రెండు అంశాలపై రేవంత్ రెడ్డికి కఠినమైన పరీక్ష ఎదురవుతోంది. ఇదిలాఉంటే ఈ సర్వేలో ఎస్సీలలో మాదిగలు అత్యధిక శాతం ఉన్నప్పటికీ, ప్రభుత్వాలలో ముఖ్యంగా క్యాబినెట్ స్థాయిలో వారి ప్రాతినిధ్యం దాదాపుగా లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి ఉంది. రాష్ట్రంలోని ఎస్సీ జనాభాలో దాదాపు 60 శాతం మాదిగలే ఉన్నా, ఇప్పటి వరకూ ఒకటి రెండు పదవులకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గం నుంచి వస్తున్న “కేబినేట్లో మా వర్గానికి న్యాయం జరగాలి” అనే డిమాండ్ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.