
లక్నోలో బీజేపీ కార్యాలయం ఎదుట ఆపరేషన్ సిందూర్‌ను శ్లాఘిస్తూ నిలిపిన ఫ్లెక్సీ. ఫొటో: పీటీఐ
యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జనామోదాన్ని కూడగట్టడానికి తాను నమ్మి, ఆచరిస్తున్న మతతత్వ జాతీయవాదం కొరగాదని తెలిసివచ్చిన మూలంగానే బీజేపీ లౌకిక జాతీయవాద కథనాన్ని ప్రజల ముందు నిలబెట్టింది.
పాకిస్తాన్ మీద చేసిన దాడుల నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా, ప్రజలకు చేరేలా రెండు సమాంతర కథనాలను ప్రచారం చేశారు. మొదటిది, ఈ ఆపరేషన్‌కు “సిందూర్”(కుంకుమ బొట్టు) అని పేరు పెట్టడం ద్వారా పహల్గాం హత్యాకాండకు మతపరమైన స్వభావం ఉన్నదని గుర్తు చెయ్యడంతో పాటు దానికి బదులు చెప్పడంలో కూడా హిందూ పురుషహంకారాన్ని చాటి చెప్పడం. రెండవది, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతిని ఉద్దేశించి యుద్ధ సమాచారం ఇచ్చే తీరులో మన దేశ లౌకికత్వాన్ని చాటి చెప్పుకోవాలి అనే రీతిలో అధికార ప్రతినిధి బృందం ఉండేలా చూసుకోవడం, ఈ ప్రతినిధి బృందంలో ఇద్దరు మహిళలు- ఒకరు హిందువు(అందునా ఎస్సీ వర్గం నుంచి ఎంపిక చెయ్యడం), మరొకరు ముస్లిం మతానికి చెందినవారు కావడంతో పాటు కశ్మీరీ అయిన విదేశాంగ కార్యదర్శి మిస్రీని ఎంపిక చేశారు. భారతదేశంలో మత ప్రాతిపదికన విభజన సృష్టించే ఉద్దేశ్యంతోనే పహల్గాం ఉగ్రవాద దాడి జరిగింది. కాబట్టి ఆ ఎత్తు పారనీయకుండా చెయ్యడానికే భారతప్రభుత్వం, ప్రజానీకం ఈ సవాలును ఐకమత్యంతో ఎదుర్కొంటున్నారని చాటి చెప్పడం సమాంతర కథనం

గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంలోని ద్వంద్వ స్వభావానికి అనుగుణంగానే పై రెండు కథనాలు తీర్చిదిద్దబడ్డాయి.
మొదటి కథనం మత ప్రాతిపదికన ఒక వర్గం ప్రజానీకాన్ని కూడగట్టుకుని మరింతగా సంఘటిత పరుచుకోవడం కోసం ఉద్దేశించినది. అధికారపార్టీ మద్దతుదారులు, సామాజిక మాధ్యమాల్లో “ఇన్ఫ్తూయన్సర్లు” ప్రాయోజిత టీవీ మీడియా ఇవన్నీ పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత బీజేపీ నాయకత్వం చేసిన విద్వేషపూరిత, పరుష ప్రసంగాలకు అనుగుణమైన కథనాలను ప్రచారం చేశాయి.
రెండవ వైపు నుంచి విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక రాయబార మార్గాల ద్వారా ప్రపంచ దేశాలకు హత్తుకునేలా పెద్ద మనిషి తరహా కథనాలను ప్రచారంలో పెట్టారు.
ఉదాహరణకు తీసుకుంటే అక్టోబర్ 7 దాడుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈ దాడులు ఉగ్రదాడులని పేర్కొని తీవ్రంగా ఖండిస్తూ ఇజ్రాయిల్‌కు సంఘీభావం వ్యక్తం చేస్తున్నట్లు ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు. దాంతో మీడియా ఛానళ్లు అన్నీ పాలస్తీనా వ్యతిరేక గ్రాఫీక్ ఇమేజ్‌లతో కూడిన కథనాలను ఎడతెరిపి లేకుండా ప్రసారం చేశాయి. ఇదే సమయంలో విదేశాంగ వ్యవహారాల శాఖ మాత్రం భారతదేశం చారిత్రకంగా అనుసరిస్తూ వస్తున్న విధానానికి అనుగుణంగా ఇరుపక్షాలూ సంయమనం పాటించి, చర్చల ద్వారా ఉద్రిక్తతలు సమసిపోయేలా చూసుకోవాలని ప్రకటించింది. అంతేకాదు, హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి ఆ మేరకు ప్రకటించాలనే ఇజ్రాయిల్ డిమాండ్‌కు భారతదేశం తలొగ్గకుండా తటస్థత పాటించింది. ఇప్పుడు కూడా అదే రీతిన ఆపరేషన్ సిందూర్ అని పేరుపెట్టి పార్టీపరంగా దేశంలో మతపరమైన విభజనకు వీలైనంత అవకాశం కల్పించి. ప్రజాక్షేత్రంలో మద్దతు కూడగట్టుకోవడానికి లౌకిక జాతీయవాది కథనాన్ని రంగం మీద నిలిపింది.తాను నమ్మి ఆచరిస్తోన్న మతతత్వ జాతీయవాదం ద్వారా జనాన్ని అందరినీ కూడగట్టడం సాధ్యం కాదని తెలిసి వచ్చే బీజేపీ ఇలా రెండు మార్గాలను ఎంచుకున్నది.
సరిహద్దుల స్త్రీ మూర్తీకరణ..
ఆధునిక జాతి రాజ్యాల పరికల్పనలలో స్త్రీ దేహం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పటాల రూపంలో జీవం లేకుండా ఉండే సరిహద్దులను స్త్రీ మూర్తిగా మలచడం ద్వారా ఆ సరిహద్దులను కాపాడుకోవాలని, అవసరమైతే అందుకోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమవ్వాలని రాజ్యం ప్రజలను ప్రేరేపిస్తుంది. అందుకే దేశాన్ని “మాతృభూమి” అని, ఆ దేశ ప్రజలు మాట్లాడే భాషను “మాతృభాష” అని ఉద్బోధిస్తారు. పుట్టుకోతోనే ప్రతిపౌరుడికి దేశంతో సోదర సంబంధం ఏర్పడిపోతుంది. ఈ పరికల్పన జనంలో బలంగా నాటుకోకపోతే మనం ఈ భౌగోళిక సరిహద్దుల మధ్యన నివసించే సాదాసీదా ప్రజలుగా మిగిలిపోతాం.
ఈ పరికల్పన మనం ఆవాహన చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అటువంటిది. దేనికైనా విమర్శనాత్మక దృష్టితో పరిశీలించడం, ప్రశ్నించడం పెద్ద నేరంగా భావించే సమాజం మనది. అందులోనూ స్త్రీమూర్తీకరించిన దేశ సరిహద్దుల విషయానికి వచ్చేసరికి జాతిరాజ్యం ఏం చెబితే దానిని అప్రయత్నపూర్వకంగా అంగీకరించే మానసికస్థితికి జనం నెట్టబడతారు. సుమతిరామస్వామి వివరించినట్లు “భారతమాత” చిత్రం హిందూ దేవతకు ప్రతీకగా ఉంటుంది. అలాంటి దేవతా రూపాలని దేశ భౌగోళికపటం మీద “సూపర్ ఇంపోజ్” చేసి చూపడం ద్వారా అనివార్యంగా ఈ దేశం హిందువులదని చాటి చెప్పకనే చెప్పినట్లూ అవుతుంది.
సరిహద్దులను స్త్రీమూర్తీకరించడం ద్వారా సరిహద్దుల మీద జరిగే ఏ దాడిని అయినా మన ఇంటి ఆడవాళ్ల దేహం మీద జరిగిన దాడిగా ప్రచారం చేసి ప్రతీకారానికి పురిగొల్పడం పాలకశక్తులకు వెన్నతో పెట్టిన విద్య. ఉదాహరణకు చూసుకుంటే రాజ్యాంగంలో పొందుపరిచినట్లు పాలనా వ్యవహారాలలో మాకు స్యయం ప్రతిపత్తి ఇవ్వండని కశ్మిరీ ప్రజానికమో, లడాఖ్ ప్రజలో ప్రజాస్వామికంగా డిమాండ్ చేసినా పాలకశక్తులు దాన్ని విచ్ఛిన్నవాదంగా ప్రచారం చేస్తాయి. వేర్పాటువాదాన్ని అనుమతించమని హింసాత్మకంగా అటువంటి డిమాండ్లను అణిచివేస్తాయి. కానీ భరతమాత దేహాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారన్న ప్రచారం ద్వారా, ప్రతీకాత్మక చిత్రాల ద్వారా రాజ్యహింసను జనం వ్యతిరేకించకుండా నిలవరించగలుగుతాయి. భారతమాతను చిత్రించిన దేశపటాలను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ మాత శిరస్సు జమ్మూ కశ్మీర్ ఉన్న ప్రాంతంలో ఉంటుంది. స్వాతంత్య్రానంతర భారతమాత స్థానం అది. సరిహద్దులను స్త్రీమూర్తీకరించిన పర్యవసనంగా దేశభక్తిని చాటి చెప్పుకోవడానికి, శౌర్యప్రతాపాలు చూపించడానికి ఆడవాళ్ల దేహాలు నెలవుగామారాయి.
బ్రిటిష్ వలస పాలకులు మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చి పోతూపోతూ భారత ఉపఖండాన్ని చీల్చిన దరిమిలా చెలరేగిన సరిహద్దుల్లో ఘర్షణలు, మత కలహాల సందర్భంగా ఇరుపక్షాలూ ఆడవాళ్లను ఎత్తుకుపోయి అఘాయిత్యాలు చేసిన హీనచరిత్ర మాయని మచ్చగా నిలిచిపోయింది. దాదాపు 75,000 మంది హిందూ, ముస్లిం, సిక్కు మహిళలు ఇలాంటి అఘాయిత్యాలకు గురయ్యారు, అపహరించబడ్డారు. విధిలేని పరిస్థితుల్లో చాలామంది మహిళలు తమను అపహరించిన వాళ్లనే బలవంతంగా వివాహమాడాల్సిరావడమో లేదంటే మగవాళ్ల చేతులు మారుతూ మారుతూ వాళ్ల కోరికలు తీర్చే దేహాలుగా మిగిలిపోవడమో జరిగింది. భారత్- పాకిస్తాన్ దేశాల ఆవిర్భావ సందర్భంగా మతాధిక్యతను, జాతి ఆధిక్యతను చాటుకోవడానికి మహిళల దేహాలను యుద్ధభూములుగా వాడుకున్నారు.
స్వాతంత్య్రానంతరం భారతదేశం రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పుకున్నది. ఆ స్ఫూర్తితోనే తదనంతర కాలంలో పాకిస్తాన్‌తో ఘర్షణాత్మక పరిస్థితులు తలెత్తి సైనిక చర్యలతో బదులు ఇవ్వాల్సి వచ్చినా ఆ సైనిక చర్యలకు మతపరమైన, జెండర్‌పరమైన పేర్లు లేకుండా జాగ్రత్త వహించింది. 1965లో పాకిస్తాన్‌తో తలపడినప్పుడు ఆ సైనిక చర్యకు “ఆపరేషన్ రిడిల్” అని నామకరణం చేశారు. 1971లో “ఆపరేషన్ ట్రైడెంట్” అన్నారు. 1999లో “ఆపరేషన్ విజయ్” అని పేర్కొన్నారు. 2016, 2019 సంవత్సరాలలో పాకిస్తాన్ భూభాగంలోని లక్ష్యాలను ఛేదించే ఆపరేషన్లను కూడా ఆపరేషన్ “యూరి”, ఆపరేషన్ “బాలకోట్”గా వ్యవహరించారు.
తాజాగా పాకిస్తాన్ మీద తలపెట్టిన సైనికచర్యకు “ఆపరేషన్ సిందూర్” అని పేరు పెట్టడం ద్వారా మోడీ ప్రభుత్వం గత సంప్రదాయాలకు స్వస్థి చెప్పిందని అర్థమవుతుంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం చేపట్టిన ఆపరేషన్ “సిందూర్” ద్వారా పహల్గాంలో భర్తలను కోల్పోయిన మహిళలకు న్యాయం అందించామని ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధిపొందాలనే ఆలోచన ఉందనే విమర్శలు అర్థరహితమని కొట్టిపారెయ్యలేం. పహల్గాం ఘటనలో అనుకోని విషాదాన్ని చవిచూసిన మహిళలు కొందరు తమ తరఫున అర్థంపర్థంలేని రీతిలో ప్రతీకారాలు తీర్చుకుంటామని ప్రకటిస్తుంటే అది తప్పని, ఈ ఘటనను సాకుగా తీసుకుని హిందూ-ముస్లిం గొడవలు రేపడం గానీ, కశ్మీరీలను ఇందుకు బాధ్యులు చెయ్యడం తగదని చెప్పిన పాపానికి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్‌కు, వేధింపులకు గురయ్యారు. బాధిత మహిళల మనోభావాలు, అభిప్రాయాలు పాలక శక్తులు ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయి. కాబట్టి వాళ్ల గొంతు నొక్కేయ్యాలని చూస్తున్నారా?
ఉదారవాద రాజకీయాలు- లౌకిక జాతీయవాదం..
పాకిస్తాన్ మీద చేపట్టదలచిన సైనిక చర్యకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టి మతతత్వ జాతీయవాదులను ఆకట్టుకుని, విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధి బృందం కూర్పు ఉదారవాదులకు గర్వకారణంగా కనిపించేలా జాగ్రత్త వహించింది ప్రభుత్వం. యుద్ధరంగం అంటేనే అదంతా మగవాళ్ల వ్యవహారమని గట్టిగా భావించే మన సామాజిక నేపథ్యంలో ఇద్దరు భారతీయ మహిళలు- ఒక హిందువు, ఒక ముస్లిం- సైనిక దుస్తుల్లో ప్రత్యర్థిపై సాగించిన దాడుల గురించి వివరించడం సహజంగానే లక్షిత ప్రేక్షకులను సూటిగా తాకుతుంది. మన దేశ లౌకికత్వానికి ప్రతీకగా నిలబెట్టిన ఈ బృందం నిజంగానే జనాన్ని మంత్రముగ్ధులనుకావించింది. మనం ఎంతగా ఈ మాయలో పడిపోయాం అంటే ఈ ఉగ్రవాదదాడి వెనుక పొరుగుదేశం పరోక్షహస్తం ఉందని ప్రకటించి, దాని మీద సైనికచర్య తీసుకోమన్న తరుణంలో కూడా దేశంలో ముస్లింల మీద, కశ్మీరీల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? వీటిని ప్రభుత్వం ఎందుకు నిలవరించడం లేదని ప్రశ్నించడం కూడా మరిచిపోయామంటే లౌకిక తరహాను ప్రదర్శిస్తే చాలు ఉదారవాద రాజకీయవాదులు కూడా యుద్ధోన్మాదశక్తులతో చేతులు కలిపేస్తాయా?
బీజేపీ మద్దతుదారులకు ఈ ప్రతీకాత్మక లౌకిక ప్రదర్శన పట్ల ఎంత మాత్రం అభ్యంతరం ఉండదు. పైపెచ్చు దీనిని కూడా వాళ్ల రాజకీయ ఆలోచనలకు అనుగుణంగా మలుచుకుకని ప్రచారం చేసుకోగలరు. ఇస్లాంను ముస్లిం మహిళలను అణిచి ఉంచే మతంగా బీజేపీ ప్రచారం చేస్తుంది. హిజాబ్ మీద నిషేధం విధించాలని గొడవ చెయ్యడం, “ట్రిపుల్ తలాక్” ద్వారా విడాకులు ఇవ్వడం శిక్షార్హమైన నేరంగా పరిగణించడం- వీటి ద్వారా ముస్లిం మహిళల ఉద్ధరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని ప్రచారం చేసుకున్నట్లే ఈ ఘటనను కూడా స్వేచ్ఛ పొందిన ముస్లిం మహిళకు ప్రతీకగా ప్రచారం చేసుకోవచ్చు.
“మత ప్రసక్తి లేకుండా మా దేశం యావత్తు ఐక్యంగా ఉన్నది” అనే విదేశాంగ కార్యదర్శి ప్రకటన ఆహ్వానించదగినదే. కానీ పహల్గాం ఘటన తర్వాత బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల నాయకులు అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ముస్లింల దుకాణాలను మూసి వేయించమనో లేదంటే వెలివేయమనో బహిరంగంగానే పిలుపులు ఇస్తున్న నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి ప్రకటనలో విశ్వసనీయత పాలు ఎంత?
నియంత్రణ రేఖకు ఈవల ఉన్న భారతభూభాగం మీద పాకిస్తాన్ కురిపిస్తున్న బాంబుల వర్షం మూలంగా కేవలం 24 గంటలలో 10 మంది కశ్మీర్ పౌరులు మరణించారు. అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. డజన్ల కొద్దీ కశ్మీరీ కుటుంబాలు విస్థాపనకు గురయ్యారు. భారత క్షిపణి దాడుల్లో 26 మంది పౌరులు మరణించారని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమిస్తే అపారమైన ఆస్తి, ప్రాణ నష్టాలకు దారి తీస్తుంది. నియంత్రణ రేఖ 750 కిలోమీటర్లు ఉంటుంది. అంతర్జాతీయ సరిహద్దులు దాదాపు 3,300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. యుద్ధం మూలంగా ఈ సరిహద్దుల వెంబడి నివసించే ప్రజానీకం అనేక కష్టనష్టాలకు లోనవుతారు. ఇరు దేశాలూ అణ్వాయుధ సామర్థం కలిగి ఉండడం మరింత ఆందోళన కలిగించే అంశం.
ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలు యుద్ధోన్మాద ప్రచారాల్లో పడికొట్టుకుపోకుండా కుదురుగా ఆలోచించి బాధ్యతగా వ్యవహరించాలి. యుద్ధం అపార ఆస్తి, ప్రాణ నష్టాలకు దారి తీస్తుంది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి మన ఆడపడుచుల నుదుట కుంకుమ చెరిపేసిన వాళ్ల భరతం పట్టొద్దా అంటూ “సిందూర్” సెంటిమెంటును ముందు పెట్టినా, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రదర్శిస్తున్న లౌకిక, అభ్యుదయ ప్రవచనాలకూ పడిపోకుండా యుద్ధం వొద్దని గట్టిగా చెప్పండి.
అనువాదం: కె సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.