
ప్రపంచ అందాల తారల పోటీలో పాల్గొంటున్న యువతులకు లైంగిక వేధింపులు, అమర్యాదకరమైన ప్రవర్తన ఎదురవుతున్నాయని మిస్ ఇంగ్లాండ్- 2024 మిల్లామ్యాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముగ్గురు సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారులతో ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వం నియమించిన దర్యాప్తు బృందంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(క్రైమ్స్) శిఖా గోయల్, మహిళా రక్షణా విభాగం ఇంచార్జి కూడా ఉన్నారు. ఆమెతో పాటు అదే విభాగానికి చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సాయిశ్రీ, డీసీపీ క్రైం బ్రాంచ్ సైబరాబాద్‌ల పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా 50 మంది నుంచి వాగ్మూలాలు సేకరించారు.
నీతి అయోగ్ సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్యాప్తు బృందంతోనూ, పోటీల నిర్వాహకులతోనూ నిరంతరం సంప్రదింపులలో ఉన్నారు.
కేవలం వినోదం కోసమే..
ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిన తర్వాత ది సన్ పత్రికతో మిల్లామ్యాగీ మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొనడానికి వెళ్లిన తనకు వ్యభిచారం చేస్తున్నానానే సందేహం వచ్చిందని, పోటీల నిర్వాహకులు వినోదం కోసం తమను పావులుగా ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం కలిగిందని తెలియజేశారు. పోటీలో పాల్గొనడానికి వచ్చిన యువతులందరినీ సంపన్నులైన పురుషుల ముందు పెరేడ్లాగా తిప్పిన తర్వాత తాను పోటీలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్టు ఆమె పేర్కొన్నారు.
ఈ పోటీలో అనుసరించిన పద్ధతులు కాలంచెల్లినవని పోటీ చేయటానికి వచ్చిన 109 మంది అభ్యుర్థులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని ప్రకటించారు. పోటీదారులు రోజంతా మేకప్ వేసుకొని బాల్గౌన్స్ ధరించి ఉండాలన్న నిర్వాహకుల నిర్ణయం అభ్యంతరకరమని, పోటీ కోసం కాలం చెల్లిన విధివిధానాలపై ఆధారపడ్డారని విమర్శించారు. ఈ పోటీల నిర్వాహణ కోసం ఖర్చుపెట్టడానికి సిద్ధపడ్డ సంపన్నుల పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించాలన్న నిర్ణయం తాను పోటీలో పాల్గొనకూడదని నిర్ణయించుకోవడానికి తక్షణ ప్రేరణ అని మ్యాగీ చెప్పారు.
అంతేకాకుండా “మేమంతా పురప్రముఖుల ముందు కోతుల్లా గెంతాల్సి వచ్చింది, కనీసం నిలబడేందుకు కూడా మాకు అవకాశం లేదు” అని తెలియజేశారు. తమ వ్యవహారశైలి వీక్షకులకు నిరాశ కలిగించిందని ఓ సీనియర్ అధికారి మందలించిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేశారు. “నేను ఏ లక్ష్యం కోసం పోటీలో పాల్గొనడం కోసం సిద్ధపడ్డానో వివరించేందుకు ప్రయత్నించినప్పటికీ పూర్తిగా పురుషులతో నిండిన సభ నా అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదు. పైగా అభ్యంతరకరంగా మాట్లాడడం నాకు అసౌకర్యం కలిగించింది. నేను ఒక కొత్త భవిష్యత్తును ఊహించి, కొత్త భవిష్యత్తు కోసం యువతను ఉత్సాహపరచడానికి పోటీకి సిద్ధపడ్డాను. పది లక్షల సంవత్సరాలలో ఏనాడు మహిళలకు నేడున్న పరిస్థితి ఎదురై ఉండదు” అని మ్యాగీ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఒకరోజు సాయంత్రం నిర్వహణాధికారి మందలించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ “నా ముఖంపై చప్పట్లు చరుస్తూ నా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. ఈ వ్యవహారం ఏదో పిల్లలను అజమాయిషీ చేస్తున్నట్టుగానే ఉంది తప్పా ఎదిగిన యువతతో వ్యవహరించినట్టు లేదు” అన్నారు.
“ఇది చిన్న విషయమే కానీ మా గురించి వాళ్లు ఏమనుకుంటున్నారో ఎటువంటి గౌరవం ఇస్తున్నారో తెలుసుకునేందుకు ఉపయోగపడింది” అని మ్యాగీ చెప్పినట్లు ది సన్ పత్రిక ప్రస్థావించింది.
హైదరాబాద్ రాజవంశమైన నిజాం కుటుంబీకుల అధికారిక నివాసం చౌమహల్లా ప్యాలెస్‌లో మే 13న పోటీదారులందరికి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో మిస్వేల్స్ మరికొందరు పోటీదారులతో మ్యాగీ విందుకు హాజరైయ్యారు.
పోటీలు ప్రారంభించడానికి మూడు రోజుల ముందే మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ నగరానికి వచ్చారు. తర్వాత వచ్చిన పోటీదారులందరిని రాష్ట్రంలోని వివిధ పర్యాటక కేంద్రాలకు తీసుకువెళ్లారు. తద్వారా తెలంగాణ ఖ్యాతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నది.
మే 16న వ్యక్తిగత, నైతిక కారణాలతో తాను పోటీనుంచి విరమించుకుంటున్నట్టు మిల్లామ్యాగీ తెలంగాణ ప్రభుత్వానికి, నిర్వాహకులకు తెలియజేశారు. ఈ విషయం విన్నవెంటనే నిర్వాహకులు ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచిన చార్లెట్ గ్రాండ్‌ను ఇంగ్లాండ్ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రపంచ అందాల తారలో పోటీలో పాల్గొనడం ద్వారా తాను హృదయసంబంధిత, శ్వాస సమస్యల తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకున్నానని, ఈ ప్రయత్నాలకు ప్రిన్స్ ఆఫ్ వేల్ సంపూర్ణ సహాయసహకారాలు అందించారని ఆమె పేర్కొన్నారు. పోటీలో భాగంగా ఓ ప్రదర్శనలో హృద్రోగులకు అందించాల్సిన శ్వాససంబంధిత సహకారం గురించి కూడా ప్రదర్శించారు.
పూర్తి నిరాధారం..
ది సన్ పత్రికకు మిల్లామ్యాగీ ఇచ్చిన ఇంటర్వ్యూపై స్పందిస్తూ మిస్ వరల్డ్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక అధికారి జ్యూలియా మార్లే “మ్యాగీ ఆరోపణలు నిరాధారమైనవి, అసంబద్ధమైనవి” అని స్పష్టం చేశారు. మిస్ వరల్డ్ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో గతంలోనే తన తల్లి ఆరోగ్యం అవసరాలరీత్యా తాను పోటీ నుంచి విరమించుకోదలుచుకున్నట్టు, తిరిగి లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేసిన విషయాన్ని గుర్తుచేశారు. తాను కూడా ఒక తల్లిని, ఒక నానమ్మను అయినందున మిల్లామ్యాగీ ఇబ్బందిని సానుభూతితో అర్ధం చేసుకోని తక్షణమే ఆమె ఇంగ్లాండ్ ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు సంస్థ సీఈఓ వెల్లడించారు.
మిల్లా భారతదేశంలో గడిపినన్ని రోజులకు సంబంధించిన వీడియోలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ విడుదల చేసింది. ఇందులో ఆమె ఈ పర్యటనలో తనకు కలిగిన ఆనందానికి, తృప్తికి భారతదేశానికి కృతజ్ఞత కూడా వ్యక్తం చేశారు.
“ఈ పోటీల పట్ల నిర్వాహణ తదితర ఏర్పాట్ల పట్ల ఆమె వ్యక్తీకరించిన అభిప్రాయాలను, ప్రస్తుతం మీడియా ద్వారా వెల్లడిస్తున్న విషయాలకు మధ్య పొంతన కుదరడం లేదు. మిస్ వరల్డ్ పోటీలు సత్యం, హుందాతనం, అందానికి ఒక అర్థం అనే మౌలిక విలువలకు కట్టుబడి ఉంటాయి” అని మిస్ వరల్డ్ సంస్థ ప్రకటించింది.
సంస్థ విడుదల చేసిన ఒక వీడియోలో మ్యాగీ “ఈ పోటీలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞురాలినై ఉంటాను. విమానం దిగినప్పటి నుంచి ఏ అవసరానికి నోరు తెరిచి అడగాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. ఏమైనా కావాలని పదేపదే నిర్వాహకులు అడిగేవారు. చాలా సహృదయంతో వ్యవహరించారు. అతిథ్యం అద్భుతం. బిర్యానీ, కూరలు అమోగంగా ఉన్నాయి. ఇక్కడకు వచ్చిన తర్వాత విరామం లేకుండా తింటూనే ఉన్నాము. అవసరానికి మించి తినకుండా చూసికోవాల్సిన బాధ్యత మీదే. ఇప్పటి వరకు వారం రోజులే గడిపాము. ఇంకా మూడు వారాలు గడపాల్సి ఉంది” అంటూ మ్యాగీ మాట్లాడిన మాటలు వినిపిస్తాయి.
ఇదిలా ఉండగా దర్యాప్తు అధికారులు పోటీదారులు బస చేసిన హోటల్లకు, తిరిగిన ప్రాంతాలకు వెళ్లి లోతైన విచారణ చేశారు. విచారణలో భాగంగా మిల్లామ్యాగీ లేవనెత్తిన టేబుల్ సంఘటన గురిచి కూడా విచారణ చేశారు. ఇందులో భాగంగా మిస్వేల్స్ను జ్యూలియా మోర్లీని, పర్యాటక శాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఇతర ప్రభుత్వ అధికారులను విచారించారు.
మిల్లా ఆరోపణలు నిరాధారమని జయేష్ రంజన్ మీడియాకు తెలిపారు. “ఆమె కేవలం వారం రోజులే ఉన్నారు. మిగిలిన భాగస్వాములలో ఎవరూ ఏ రకమైన అసౌర్యాన్ని వ్యక్తం చేయలేదు. చౌమహల్లా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో మిల్లా మ్యాగీతో పాటు అదే టేబుల్ వద్ద మిస్ వేల్స్, రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆయన భార్య, కోడలు, వారి మిత్రురాలు కూడా ఉన్నారు. ఆరోజు రాత్రి నుంచి సీసీటీవీ ఫూటేజ్ పరిశీలించాము. అందులో స్పష్టంగా మిల్లామ్యాగీ ఒక టేబుల్ వద్ద ఒక పురుషుడు నలుగురు మహిళలతో కలిసి కూర్చునట్టు కనిపిస్తుంది. ఆ వ్యక్తీ సీనియర్ ఐఏఎస్ అధికారి, మిగిలినవారు ఆయన వెంట వచ్చినవారు. ప్రభుత్వ అధికారిగా ఆయన వ్యవహారశైలిని ఎంతోమంది మెచ్చుకున్నారు. అటువంటి తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక మహిళతో అసభ్యంగా వ్యవహరించారిని ఆరోపించడం అర్ధరహితం”
స్కాట్‌ల్యాండ్, ఉత్తర ఐర్ల్యాండ్ దేశాలతో సహా వివిధ దేశాల నుంచి పోటీలో పాల్గొనడానికి వచ్చిన వారిలో పదిమందితో పైగా తాను స్వయంగా మాట్లాడానని, మ్యాగీకి ఎదురైన అనుభవాలు ఎవరికి ఎదురుకాలేదని జయేష్ రంజన్ వివరించారు.
మ్యాగీ ఆరోపణలను తిరస్కరిస్తూ, తాము వెళ్లిన చోటల్లా ఎక్కువమంది గుమికూడడం ఒక్కటే అసౌకర్యంగా ఉందని, అయినా ఎవరూ తమతో అసభ్యంగా ప్రవర్తించలేదని మిస్వేల్స్ తెలిపారు.
పోటీదారులను పురప్రముఖులకు పరిచయం చేయడానికి వీలుగా నిర్వాహకులు మూడు సాంస్కృతిక విందులు ఏర్పాటు చేశారు. ఒకటి చౌమహల్లా ప్యాలెస్‌లో మరోటి రామోజీ ఫిలిం సిటీ, మూడవది సెక్రెటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ మూడు కార్యక్రమాలకు ఆహ్వానించిన అతిథుల జాబితాను జయేష్ రంజన్ స్వయంగా తయారు చేశారు. ఇందులో మొదటి విందులో మాత్రమే మిల్లామ్యాగీ పాల్గొన్నారు. లండన్‌లో ఉన్న మిల్లామ్యాగీతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించామని మిస్ వరల్డ్ నిర్వాహకులు వెల్లడించారు.
నిష్పాక్షికమైన దర్యాప్తు జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయడంతో వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నది. ఆడబిడ్డల గౌరవించే నేలపై మ్యాగీకి ఎదురైన చేదు అనుభవాలు ఒక ఆడపిల్ల తండ్రిగా తనను కలిచివేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున మిల్లామ్యాగీకి ఆయన క్షమాపణలు తెలిపారు.
మిస్‌వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చిన వారు ప్రపంచ సాంస్కృతిక వారసత్వంలో భాగంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శించిన సందర్భంలో స్థానిక యువతి ఈ అందాల తారలో ఒకరి పాదలను గుడ్డతో తుడవడం గురించి కూడా బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
దేవాలయంలో ప్రవేశించే ముందు పోటీదారులందరూ దేవాలయం గట్టున కూర్చోని పెద్ద వెండి పాత్రలో కాళ్లు కడుకున్నారు. వారిలో ఒకరు ఇబ్బంది పడుతుంటే స్థానిక యువతి సహాయం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా లోకాన్ని అగౌరవపరిచే సంఘటనగా బీఆర్ఎస్ అభివర్ణించింది. ఇప్పటి వరకు మిస్‌వరల్డ్ పోటీలలో క్రీడలు సామర్ధ్యం ముఖాముఖి పోటీ వంటి విషయాలలో భాగస్వాముల సామర్ధ్యాలను అంచనా వేసే పోటీ భాగం పూర్తయింది. సోమవారం జ్యూరీ ముందు హాజరైన పోటీదారులు సంఘసేవా కార్యకలాపాలకు సంబంధించిన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. 2024 మిస్ ఇండియా నందిని గుప్తా కూడా పోటీలో ఉన్నారు.
అనువాదం: వీరయ్య కొండూరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.