భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే కాదు, భాషల సమాఖ్య కూడా అనే అవగాహనతో ‘‘ద వైర్ తెలుగు’’ ప్రారంభమైంది. అన్ని భాషలలోని పాఠకులకు అత్యంత ఖచ్చితమైన సమకాలీన వార్తలను పొందే హక్కు ఉంది అని ది వైర్ బృందం విశ్వసిస్తోంది.
హైదరాబాద్: ‘‘ది వైర్’’ను తెలుగు పాఠకులకు చేర్చటానికి ఉద్దేశింపబడిన కొత్త వెబ్సైట్ ది వైర్ తెలుగు(www.thewiretelugu.in) జనవరి 6న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించబడింది.
ది వైర్ తెలుగు సంపాదకీయ బృందంలో కొండూరి వీరయ్య, నెల్లూరు నరసింహారావు, ఐ.వి. రమణరావు, కాపు శ్రీనివాస్, కోయ చంద్ర మోహన్ ఉన్నారు.
ఉత్సాహభరితమైన, వైవిధ్యమైన వార్త సంస్థలకు తెలుగు రాష్ట్రాలు కేంద్రాలు. వార్తా సంస్థలు ఏర్పాటు, నిర్వహణ, విస్తరణ పరంగా ఎల్లప్పుడూ వినూత్నతకు కేంద్రంగా ఉంటాయి. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే కాదు, భాషల సమాఖ్య కూడా అనే ఆలోచనతో ‘‘వైర్ తెలుగు’’ మొదలైంది. అన్ని భాషలలోని పాఠకులకు అత్యంత ఖచ్చితమైన సమకాలీన వార్తలను పొందే హక్కు ఉంది అన్నది ది వైర్ వ్యవస్థాపక బృందం అవగాహన.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సంజయ బారు మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాలలో 100 మందికి పైగా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని – ఇటువంటిది గతంలో ఎన్నడూ జరగలేదని, 1970లలో అమలు జరిగిన అత్యవసర పరిస్థితి కాలంలో కూడా ఇలా జరగలేదని ఆయన నొక్కి చెప్పారు. వార్తలు అందించటంలో, ఏది వార్త ఏది కాదు అని నిర్ధారించడం లో ప్రధాన స్రవంతి మీడియా ఆధిపత్యాన్ని సవాలు చేయడం, ఎక్కువ మంది ప్రజలను చేరుకోవడం స్వతంత్ర జర్నలిస్టుల బాధ్యత అని బారు అన్నారు.
‘‘ది వైర్’’ వ్యవస్థాపక సంపాదకులలో ఒకరైన సిద్ధార్థ్ వరదరాజన్, ‘‘ది వైర్ తెలుగు’’ వెబ్సైట్ ‘‘ద వైర్’’ 10వ వార్షికోత్సవంలో సముచితమైన బహుమతి అని అన్నారు.
పెట్టుబడిదారుడి పాత్రను తగ్గించి, తన మనుగడకు పాఠకుల మీద, వారి మద్దతుపైన ఆధారపడటమే ‘‘ద వైర్ మోడల్’’ అని వరదరాజన్ అన్నారు. ప్రజాస్వామ్య దేశ స్ఫూర్తికి అనుగుణంగా, భారతదేశంలో మనం ప్రతిరోజూ ప్రభుత్వాన్ని జవాబుదారీతనం కోసం డిమాండ్ చేయాలి అని ఆయన అన్నారు.
‘‘ది వైర్’’ మరో వ్యవస్థాపక సంపాదకుడు ఎం.కె. వేణు మాట్లాడుతూ, స్వతంత్ర మీడియా అవసరం చాలా ఉందని అన్నారు. ‘‘ది వైర్’’ పై అనేక పరువు నష్టం కేసులు ఉన్నప్పటికీ, అది సత్యానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
‘‘ది వైర్’’ ఎడిటర్ సీమా చిస్తి మాట్లాడుతూ, మీడియా నేడు నేరం, సినిమా, క్రికెట్, జ్యోతిషశాస్త్ర వార్తలకు కుదింపబడిందని అన్నారు. శక్తివంతమైన రాజ్యం తనకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి చిన్న అభిప్రాయ ప్రకటననూ అణిచివేయడానికి సిద్ధంగా ఉందని ఆమె విచారం వ్యక్తం చేశారు. వార్తలు ప్రజా శ్రేయస్సు కోసమే ఉండాలని సీమా చిస్తీ పట్టుబట్టారు.
ప్రముఖ ప్రజా మేధావి పరకాల ప్రభాకర్ మౌలిక రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్న మీడియా సంస్థలు కనుమరుగవుతున్న కాలంలో ది వైర్ లాంటి స్వతంత్ర నిష్పాక్షిక వార్తా సంస్థలు మరెన్నో పుట్టుకు రావల్సిన అవసరం ఉందన్నారు. సమకాలీన వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వం దాచేస్తున్న వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆ దిశగా ది వైర్ చేస్తున్న కృషి మైలురాయి అన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ఘంటా చక్రపాణి ఇద్దరూ స్వతంత్ర మీడియా రంగంలో ‘‘ది వైర్’’ చేసిన కృషిని అభినందించారు. వర్తమాన భారతంలో ది వైర్ ప్రారంభం ఓ అర్థవంతమైన సామాజిక జోక్యం గా చూడాలన్నారు.
తెలంగాణ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్ ‘‘ది వైర్ తెలుగు’’కు తన పూర్తి సహకారాన్నిఅందిస్తానని అన్నారు.
‘‘ది వైర్ తెలుగు’’ బృందంతో పాటు, అనేక మంది అనుభవజ్ఞులైన ఎడిటర్లు, జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.