
నూతన శతాబ్దిలో పావు భాగం ఎంతో త్వరగా గడచిపోయినట్లు అనిపిస్తోంది. ప్రపంచ వ్యాపితంగా 2024కు వీడ్కోలు, 2025కు స్వాగతం పలికారు. మొత్తం మీద చూసినపుడు యావత్ శ్రామిక జనావళి మొత్తంగా నిరాశ మధ్యనే కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఆశావాదిని చీకటి తరువాత వెలుగు నడిపిస్తుంది`నిరాశావాదికి వెలుగు తరువాత చీకటి దిగులు పుట్టిస్తుంది. కష్ట జీవులు ఆశావాదులు, అవసరమైతే పోరుకూ దిగుతారు. ఒక ఏడాది కాలంలో అన్ని జీవన రంగాలలో చోటు చేసుకున్న పరిణామాలను ఒక చోట సింహావలోకనం చేసుకోవటం సాధ్యం కాదు, చదివేవారిని ఇబ్బంది పెట్టటమే. అబ్బో ఇంత పెద్ద విశ్లేషణా తరువాత చదువుదాంలే అని పక్కన పెట్టేస్తారు. ఇక అంతే ! కృష్ణ బిలంలో కలసిపోతుంది. ఈ పూర్వరంగంలో 2024లో ముఖ్యమైన అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను విహంగ వీక్షణం చేద్దాం. 2024 ఎన్నికలనామ సంవత్సరంగా ముగిసింది. భారత్, అమెరికా వంటి పెద్ద దేశాలతో సహా 80 చోట్ల వందల కోట్ల మంది ఓట్లు వేశారు. నరేంద్రమోడీ మూడవ సారి అధికారానికి వచ్చినా ప్రపంచ పరిణామాలపై చూపే ప్రభావం దాదాపు ఏమీ లేదు. అదే ట్రంప్ గురించి యావత్ ప్రపంచం ఉలిక్కి పడిరది. ఏ పిచ్చి పని చేస్తాడో అని ఎదురుచూస్తోంది. ఎక్కువ చోట్ల అధికారపక్షాలను మట్టికరిపించటం ఒక ధోరణిగా కనిపించింది.ఆర్థికంగా జనజీవితాలు అతలాకుతలం కావటం, వాటిని పరిష్కరించటంలో పాలక పార్టీల వైఫల్యం దీనికి ప్రధాన కారణం.
అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. అనేక దేశాల్లో మాదిరి అక్కడ కూడా ఎన్నికల జోశ్యాలు తప్పాయి. అధికారాన్ని లాంఛన ప్రాయంగా స్వీకరించక ముందే ట్రంప్ తన యంత్రాంగాన్ని ఎంచుకున్నాడు.ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఒక సలహాదారు. అతగాడి దగ్గర నుంచి పచ్చిమితవాదుల వరకు ఎన్నికలలో తన కోసం పని చేసిన వారిని, తన అజెండాను నిర్ధాక్షిణ్యంగా సమర్ధించే, ముందుకు తీసుకుపోయేవారిని, తన కనుసన్నలలో తీర్పులను ఇచ్చే న్యాయమూర్తులను ఎంచుకున్నాడు. ఆయుధ పరిశ్రమల ప్రయోజనాల కోసం పనిచేసే ఫాక్స్‌న్యూస్ జర్నలిస్టు పీట్ హెగ్సేత్ను రక్షణశాఖ మంత్రిగా నియమించాడు. పాలస్తీనానా, వెస్ట్ బాంకా అదెక్కడుంది అంటూ గుడ్డిగా వ్యతిరేకించిన ‘‘తీవ్రవాది’’ అర్కాన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హక్బీని ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారిగా ఎంపిక చేశాడు.పాలస్తీనా నిర్వాసితులకు సాయం చేసే ఐరాస సహాయ సంస్థకు నిధులు ఇవ్వకూడదని వాదించే మహిళ ఎల్సీ స్టెఫానిక్‌ను ఐరాస రాయబారిగా ఎంచుకున్నాడు. అమెరికా ఎన్నికలు అక్కడి కార్మికవర్గాన్ని,యావత్ ప్రపంచాన్నే ముప్పు ముంగిటకు చేర్చాయంటే అతిశయోక్తి కాదు.
ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించిన తరువాత రష్యాలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో వ్లదిమిర్ పుతిన్ పెద్ద మెజారిటీతో ఎన్నికయ్యాడు. పుతిన్‌కు 88.48శాతం ఓట్లు రాగా ప్రతి పక్ష కమ్యూనిస్టు పార్టీ నేత నికోలాయ్ ఖార్టినోవ్కు 4.37శాతం వచ్చాయి. మరో ఇద్దరు అభ్యర్థులకు 3.9,3.27 శాతాల చొప్పున ఓట్లు వచ్చాయి. ముందుగానే పుతిన్ విజయం ఖరారు అయిందన్న విశ్లేషణలు, ఉక్రెయిన్‌పై సైనిక చర్యను అభ్యర్ధులెవరూ వ్యతిరేకించకపోవటంతో పెద్దగా ప్రపంచ దృష్టిని ఆకర్షించలేదు. బ్రిటన్ ఎన్నికలలో పద్నాలుగేండ్ల కన్సర్వేటివ్ పార్టీ పాలనకు తెరదించారు.భారతీయ సంతతి ప్రధానిగా మన మీడియా పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించిన రిషి సునాక్ నాయకత్వంలో ఆ పార్టీకి చరిత్రలో ఎన్నడూ తగలని ఎదురుదెబ్బ తగిలింది. అనేక రికార్డులు బద్దలయ్యాయి. లేబర్ పార్టీ అంతకు ముందు ఎన్నికల కంటే కేవలం 1.6శాతం ఓట్లే అదనంగా తెచ్చుకున్నప్పటికీ సీట్లు 202 నుంచి 411కు పెరిగాయి. కన్సర్వేటివ్ పార్టీ 19.9శాతం ఓట్లు కోల్పోయి 365 నుంచి 121 సీట్లకు పడిపోయింది. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిన తరువాత జరిగిన తొలి ఎన్నికలివి. గత ఎన్నికల్లో చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ కన్సర్వేటివ్ పార్టీ గెలిచింది. ఈ సారి ఘోరపరాజయాన్ని చూసింది.
ఫ్రాన్సు ఐదవ రిపబ్లిక్(1958 నుంచి) చరిత్రలో లేటు(73) వయస్సులో అధికారానికి రావటంలోనూ అత్యంత అల్పకాలం(99రోజులు) అధికారంలో ఉన్న ప్రధానిగా మైఖేల్ బార్నియర్ చరిత్ర కెక్కాడు. ప్రధాని కాగానే నూతన యుగానికి ఆరంభం అని చెప్పాడు, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు దేశం ఎక్కడికి పోతుందో తెలియదని హెచ్చరించి ఆప్రక్రియ ముగియగానే ఇంటి దారి పట్టాడు. అంతకు ముందు జరిగిన పార్లమెంటు మధ్యంతర ఎన్నికలలో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, హరితవాదులు ఇతరులతో కూడిన వామపక్ష న్యూపాపులర్ ఫ్రంట్‌కు పార్లమెంటులోని 577 స్థానాలకు గాను 180 వచ్చి పెద్ద పక్షంగా అవతరించింది. ఈ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా 39 సీట్లు తెచ్చుకున్న మితవాద రిపబ్లికన్ పార్టీ నేత మైఖేల్ బార్నియర్‌ను అధ్యక్షుడు మక్రాన్ ఆహ్వానించాడు. ఆ ప్రభుత్వం పతనమైన తరువాత మాజీ ప్రధాని ఫ్రాంకోయిస్ బైరౌ అనే ఒక చిన్న పార్టీ నేతను ఎంపిక చేశాడు. ఈ ఏడాది జూలై వరకు పార్లమెంటును రద్దు చేసే అవకాశం లేకపోవటంతో అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మక్రాన్ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో తెలియదు. బార్నియర్ ప్రభుత్వ పతనం నిజానికి మక్రాన్‌కు తగిలిన ఎదురుదెబ్బ, స్వయంకృతమే. రాజీనామాకు తిరస్కరించాడు. పార్లమెంటు ఆమోదంతో నిమిత్తం లేకుండా కార్మికులపై భారాలు మోపేందుకు వీలు కల్పించే నిర్ణయం తీసుకోవటంతో ప్రతిపక్షం అవిశ్వాసతీర్మానం పెట్టి బార్నియర్ సర్కార్‌ను గద్దె దించింది. జిడిపిలో 60శాతానికి మించి అప్పు ఉండకూడదన్న ఐరోపా సమాఖ్య మార్గదర్శకాలకు భిన్నంగా 112శాతం రుణంతో ఫ్రాన్సు ఉంది.మరిన్ని అప్పులు చేయకుండా లోటును తగ్గించే పేరుతో 60బిలియన్ యూరోల పన్ను విధింపుకు ప్రభుత్వం పూనుకుంది. సామాజిక భద్రత ముసుగులో పార్లమెంటులో చర్చ అవసరం లేని రాజ్యాంగ నిబంధనను ప్రయోగించింది. పచ్చిమితవాద నేషనల్ రాలీ పార్టీ నాయకురాలు మేరీ లీపెన్ బలపడటానికి మక్రాన్ పాలనా విధానాలే కారణం. అయితే వామపక్షాలు సంఘటితంగా అలాంటి ముప్పును తప్పించాయి. లీపెన్ మద్దతు ఉంటే బార్నియర్ సర్కార్ గట్టెక్కి ఉండేది. తన ప్రయోజనాలను ముఖ్యంగా చూసుకున్న లీపెన్ అవిశ్వాసానికి మద్దతుగా నిర్ణయం తీసుకోవటంతో మితవాదుల మధ్య విబేధాలు వెల్లడయ్యాయి.
పార్లమెంటు ఎన్నికలలో జపాన్ పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్‌డిపి)కి చావు దెబ్బ తగిలింది.పార్లమెంటులోని దిగువ సభలో ఉన్న 465 స్థానాలకు గాను గత ఎన్నికలలో 34.66శాతం ఓట్లు, 259 సీట్లు తెచ్చుకున్న ఎల్‌డిపి ఈ సారి 26.73శాతం ఓట్లు, 191 సీట్లతో సరిపెట్టుకుంది. మిత్రపక్షం కొమిటో పార్టీ పొందిన 24తో కలిపి 215 మాత్రమే తెచ్చుకుంది. సాధారణ మెజారిటీ 233 స్థానాలను ఏ పార్టీ కూడా గెలుచుకోలేకపోయింది. సంకీర్ణ మైనారిటీ ప్రభుత్వం ఏర్పడిరది. ప్రధాని షిగెరు షిబాకు కత్తిమీద సామే. ఎల్‌డిపి జపాన్‌లో అవినీతికి పెట్టింది పేరు అయినప్పటికీ అక్కడి ఓటర్లు దానికి దశాబ్దాల పాటు పట్టంకడుతూనే ఉన్నారు. జనంలో అనుమానం, ఆగ్రహం తమను దెబ్బతీశాయని ప్రధాని షిబా చెప్పాడు. 1955 నుంచి వరుసగా గెలుస్తున్న ఎల్‌డిపి 2009లో ఒకసారి ఓడిపోయింది. కమ్యూనిస్టు పార్టీ గెలిచిన ఎనిమిదింటిలో ఒకటి మాత్రమే నియోజకవర్గాల జాబితా నుంచి ఉంది. ఏడు దామాషా ఓట్ల జాబితా సీట్ల నుంచి పొందింది. పార్టీ గతంకంటే రెండు సీట్లను, 7.25 నుంచి 6.16శాతానికి ఓట్లను కోల్పోయింది. సింగిల్ సీటు నియోజకవర్గాలలో కమ్యూనిస్టులు 213 చోట్ల పోటీ చేశారు. ఒకినావా నియోజకవర్గంలో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాన్ని ఎత్తివేయాలని కోరుతున్న శక్తులన్నీ అక్కడ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి అకామైన్‌ను బలపరచగా పాలక పార్టీపై విజయం సాధించాడు.
మన పొరుగునే ఉన్న పాకిస్థాన్ పార్లమెంటరీ ఎన్నికలలో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు.గత ఎన్నికల్లో మొత్తం 342 స్థానాలకు గాను 149 తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ తెహరిక్ ఇ ఇన్సాఫ్(పిటిఐ) పార్టీకి తాజా ఎన్నికల్లో గుర్తింపు రద్దు కావటంతో ఈసారి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఆ పార్టీ బలపరిచిన వారు 93 మంది, ముస్లిం లీగ్ పార్టీకి 98, పీపుల్స్ పార్టీకి 68, ముతాహిదా క్వామీకి 21 వచ్చాయి.ముస్లిం లీగ్ నేత సెహబాజ్కు నామినేటెడ్ సీట్లతో కలిపి 111 స్థానాలు మాత్రమే ఉన్నప్పటికీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. బలపరీక్షలో మొత్తం 336కు గాను 201 ఓట్లు తెచ్చుకున్నాడు. పట్టపగలు దోపిడీ మాదిరి అక్రమాలకు పాల్పడి అధికారానికి వచ్చినట్లు పిటిఐ నేత ఇమ్రాన్ ఖాన్ వర్ణించాడు. మరో పొరుగుదేశమైన బంగ్లాదేశ్ ఎన్నికలలో అవామీలీగ్ పార్టీ 74.63శాతం ఓట్లు 224 సీట్లతో ఘనవిజయం సాధించింది. పార్టీ నేత షేక్ హసీనా ప్రధాని అయ్యారు. అయితే ఏడాది కూడా గడవక ముందే అక్కడ జరిగిన నాటకీయ పరిణామాల్లో ఆమెపై జనం తిరుగుబాటు, దానికి మిలిటరీ మద్దతు కారణంగా దేశం విడిచి మన దేశంలో తలదాచుకున్నారు. జనం ఆమె నివాసం మీద దాడి చేసి తరిమివేశారు. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ నేతగా గద్దె నెక్కాడు.హసీనాను తమకు అప్పగించాలని అక్కడి ప్రభుత్వం డిమాండ్ చేసింది.
శ్రీలంకలో అరుణోదయం !
శ్రీలంకలో అనూహ్యంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు వచ్చి అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన వామపక్ష అభ్యర్థి అనుర కుమార దిశనాయకేను ప్రపంచ వామపక్ష శక్తులన్నీ అభినందించాయి. కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులపని అయిపోయింది, వారు కోలుకునే అవకాశం లేదంటూ నిరాశలో ఉన్న వారిని ఒక్కసారిగా శ్రీలంకలో అరుణోదయం మేల్కొలిపింది.అందరికీ అవకాశం ఇచ్చిన జనం తగిన సమయం వచ్చినపుడు వామపక్ష శక్తులకు మాత్రం ఎందుకు ఇవ్వరు ! అనుభవం నేర్పిన పాఠాలతో అవకాశమిస్తారని లాటిన్ అమెరికాలో వెల్లడైంది. దక్షిణాఫ్రికా అధికార కూటమిలో కమ్యూనిస్టులు, నేపాల్‌లో తిరుగులేని శక్తిగా వామపక్షాల ఉన్నాయి. ఇప్పుడు లంకవంతు. కమ్యూనిస్టుల పని అయిపోయిందని పడకకుర్చీ కబుర్లు చెప్పేవారికి కచ్చితంగా ఆశ్చర్యం , కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఆందోళన కలిగించింది. జనతా విముక్తి పెరుమన(సంఘటన). దానితో పాటు మరో 27 వామపక్ష పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు కలసి నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిపి) పేరుతో ఒక కూటమిగా పోటీ చేశాయి.2019 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్‌పిపి అభ్యర్థిగా పోటీచేసిన దిశన్నాయకే కేవలం 3.16శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 225 స్థానాలకు మూడంటే మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. తాజా ఎన్నికల్లో కూడా ఎన్‌పిపి ఘనవిజయం సాధించింది. 159 సీట్లు, 61.56శాతం ఓట్లు పొందింది.
దక్షిణాఫ్రికాలో ఎఎన్‌సికి ఎదురుదెబ్బ !
జాత్యహంకార వ్యవస్థను కూల్చివేసిన రెండు దశాబ్దాల తరువాత ఆ పోరాటానికి నాయకత్వం వహించిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఎఎన్‌సి) 2024 ఎన్నికల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లు కూడా తగ్గాయి. నాలుగు వందల స్థానాలున్న పార్లమెంటులో 230 నుంచి 159కి పడిపోయి పెద్ద పక్షంగా అవతరించింది. దాంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిరది. ఎఎన్‌సి నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ఏర్పాటు చేసిన మాజీ అధ్యక్షుడు తాబో ఎంబెకీ 58 సీట్లతో మూడవ పెద్ద పక్షనేతగా ముందుకు వచ్చాడు.
ఉరుగ్వేలో మరోసారి వామపక్ష జయకేతనం !
లాటిన్ అమెరికాలోని ఉరుగ్వే అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో అక్కడి వామపక్ష కూటమి ‘‘విశాల వేదిక ’’ (బ్రాడ్ ఫ్రంట్) మరోసారి విజయం సాధించింది.గతంలో 2005 నుంచి 2020వరకు అధికారంలో ఉన్న ఈ కూటమి అభ్యర్ధిగా చరిత్ర అధ్యాపకుడిగా, మేయర్‌గా పనిచేసిన యమందు ఆర్సి(57) 52.08శాతం ఓట్లతో గెలిచారు. తొలి రౌండులో 46.12శాతం తెచ్చుకున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో దిగువ సభ ఛాంబర్లో 99 స్థానాలకు గాను ఆర్సి నాయకత్వంలోని కూటమికి 48, ఎగువ సభ సెనెట్‌లోని 30 సీట్లకు గాను 16 వచ్చాయి. రద్దయిన సభలో ఉన్న సీట్లతో పోల్చితే దిగువ సభలో 42 నుంచి 48కి, ఎగువ సభలో 13 నుంచి 16కు పెరిగాయి.నూతన ప్రభుత్వం 2025 మార్చి ఒకటవ తేదీన కొలువుతీరనుంది.ిఉపాధ్య పదవికి కరోలినా కోసె ఎన్నికయ్యారు. ఎలక్ట్రికల్ ఇంజనీరైన ఆమె విద్యార్థిగా ఉన్నపుడు యువ కమ్యూనిస్టు లీగ్‌లో పనిచేశారు. గతంలో ఆమె మంత్రిగా పనిచేశారు. పార్లమెంటు దిగువ సభలో ఫ్రంట్‌కు వచ్చిన 48 సీట్లలో కమ్యూనిస్టు పార్టీకి ఐదు, సెనెట్‌లోని 16 సీట్లలో రెండు వచ్చాయి.చిన్న దేశమైనప్పటికీ ఉరుగ్వే ప్రపంచానికి పెద్ద సందేశమిచ్చిందనే చెప్పవచ్చు. గత పాతిక సంవత్సరాలలో ఏ రాజకీయ పక్షం కూడా పది లక్షల ఓట్ల మార్కును దాటలేదు. తొలిసారిగా వామపక్షం ఆ ఘనతను సాధించింది. లాటిన్ అమెరికాలో అధికారానికి వచ్చిన చోట్ల వామపక్షాలు అధ్యక్ష పదవులు పొందినప్పటికీ పార్లమెంటులో మెజారిటీ లేని కారణంగా అనేక ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఉరుగ్వేలో ఎగువ సభలో మెజారిటీ ఉంది. దిగువ సభలో 99కి గాను 48 ఉన్నాయి. మొత్తం లాటిన్ అమెరికా వామపక్షాలు ఎదుర్కొంటున్న సమస్యలనే ఉరుగ్వేలోని విశాల వేదిక కూడా ఎదుర్కొంటున్నది. గతంలో మూడు సార్లు అధికారానికి వచ్చినప్పటికీ అమల్లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను కొనసాగిస్తూనే కార్మికులు, ఇతర తరగతులకు కొన్ని ఉపశమన, సంక్షేమ చర్యలను అమలు జరిపింది. దాంతో సహజంగానే అసంతృప్తి తలెత్తి గత ఎన్నికల్లో మితవాదులను గెలిపించారు. గత పాలకుల వైఫల్యం తిరిగి వామపక్షాలకు అవకాశమిచ్చింది. లాటిన్ అమెరికాలో ఉన్నంతలో ఉరుగ్వే మెరుగైన స్థితిలో ఉన్నవాటిలో ఒకటి. అయితే పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్నందున దానికి ఉండే జబ్బులకు కార్మికవర్గం గురవుతున్నది.
మెక్సికో ఎన్నికలలో వామపక్ష వాది క్లాడియా షెయిన్బమ్ భారీ మెజారిటీతో దేశ 66వ అధ్యక్షరాలిగా ఎన్నికయ్యారు. అక్కడ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. అంతకు ముందు ఆమె మెక్సికో సిటీ పాలకురాలిగా పని చేశారు. త్రిముఖ పోటీలో క్లాడియాకు 61శాతం ఓట్లు రాగా ప్రత్యర్థులకు 28, 10.5శాతాల చొప్పు వచ్చాయి. క్లాడియా తండ్రి మెక్సికో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా పనిచేశారు.వాణిజ్య పోరుకు దిగుతానని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దేశాలలో మెక్సికో కూడా ఒకటి. వెనెజులా అధ్యక్ష ఎన్నికలలో ఛావెజ్ వారసుడిగా రంగంలోకి వచ్చిన నికొలస్ మదురో మూడో సారి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాడు.యునైటెడ్ సోషలిస్టు పార్టీ నేతగా ఉన్న మదురోకు 51.95శాతం ఓట్లు వచ్చాయి. తొలి నుంచీ వెనెజులా సోషలిస్టులను వ్యతిరేకిస్తున్న అమెరికా, దాని అనుకూల మీడియా ఈ ఎన్నికల్లో కూడా వ్యతిరేకంగా పని చేయటమే కాదు, ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్మండో గోన్సాలెజ్ అసలైన విజేత అంటూ ఫలితాలను కూడా ప్రకటించాయి.మదురో ఎన్నికను తాము గుర్తించటం లేదని అమెరికా చెప్పింది.
వాణిజ్య పోరు కొనసాగింపుకే ట్రంప్ మొగ్గు !
తాను అధికారానికి వచ్చిన తొలి రోజే చైనా,మెక్సికో,కెనడాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పది, ఇరవై అయిదు శాతాల చొప్పున పన్ను విధిస్తానని రెండవసారి ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. తాము కూడా చేయాల్సింది చేస్తామని ఈ దేశాలు ట్రంప్‌కు స్పష్టం చేశాయి. ఇతర దేశాలను లొంగదీసుకొని సాధ్యమైనంత మేరకు తాము లబ్దిపొందాలన్నది ట్రంప్ ఎత్తుగడ. ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నపుడు చైనా మీద ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో విధించిన పన్నులు వినియోగదారుల మీద పెద్దగా ప్రభావం చూపలేదు గానీ, ఈ సారి అలా ఉండదని అంటున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై విధించే పన్నుతో కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపవచ్చని, స్వదేశంలో ఉత్పత్తి పెంచటం ద్వారా ఉద్యోగ రక్షణ, కొత్త ఉపాధి కల్పించవచ్చని గతంలో ట్రంప్ అండ్ కో చెప్పిన కబుర్లకు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవు. మెక్సికో, కెనడా అధినేతలతో ట్రంప్ ఫోన్ సంభాషణలు చేయటం బెదిరింపు`బుజ్జగింపు వ్యవహారం తప్ప మరొకటి కాదు. వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదు, తమ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే అనుభవిస్తారంటూ చైనా హెచ్చరించింది.
డ్రాగన్‌ను కవ్విస్తున్న అమెరికా !
చైనా మిలిటరీ గురించి అతిశయోక్తులతో నివేదికలను రూపొందించిన అమెరికా ఆ సాకుతో తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు మరిన్ని ఆయుధాలను అందించేందుకు పూనుకుంది. ఈ ప్రాంతంలో మరో యుద్ధానికి చూస్తున్నది. స్వంత చట్టం మేరకు తైవాన్‌లో ఇంథనం నింపుకొనే పేరుతో యుద్ధ విమానాల రాకపోకలకు రంగం సిద్దం చేస్తున్నది. పక్కనే జపాన్, దక్షిణ కొరియాలో దాని సైనిక స్థావరాలు ఉండగా తైవాన్‌కు రావాలని చూడటం చైనా సహనాన్ని పరీక్షించటం తప్ప మరొకటి కాదు. ప్రపంచంలో చైనా ఒకే ఒక్కటి ఉంది. తైవాన్ దానిలో భాగం. ఒకే చైనా అన్న అవగాహనను అంగీకరించిన అమెరికా ఆమేరకు తమతో కలసి గతంలో విడుదల చేసిన మూడు ప్రకటనలకు కట్టుబడి ఉండాలని చైనా డిమాండ్ చేసింది. కమ్యూనిస్టుల నాయకత్వంలో 1949లో ఏర్పడిన జన చైనా పాలనలో తైవాన్ ఎన్నడూ లేదని కొందరు తప్పుదారి పట్టించే వాదనలు చేస్తున్నారు. 1945లోనే చైనా భద్రతా మండలి శాశ్వత సభ్యదేశంగా ఉంది. కమ్యూనిస్టుల తిరుగుబాటు సమయంలో తైవాన్‌లో తిష్టవేసిన చైనా కొమింటాంగ్ నియంత చాంగ్‌కై షేక్ ప్రభుత్వానికే 1970దశకం వరకు ఐరాసలో గుర్తింపు కొనసాగించారు. తరువాత కమ్యూనిస్టు చైనాను అసలైన ప్రతినిధిగా పరిగణించి తైవాన్ కూడా దానిలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించింది. అప్పటివరకు ప్రధాన భూభాగంతో సంబంధాలు లేవు గనుక పరస్పరం విశ్వాసం కల్పించి విలీన ప్రక్రియ జరపాలని నిర్ణయించారు. అయితే ఇన్ని దశాబ్దాలు గడచినా అలాంటి పరిస్థితి ఇంకా రాలేదంటూనే, మరోవైపు స్వతంత్ర తైవాన్ కోరుకొనే శక్తులను అమెరికా ఎగదోస్తున్నది. బ్రిటీష్, పోర్చుగీసు కౌలు గడువు తీరిన తరువాత చైనాలో అంతర్భాగాలుగా మారిన హాంకాంగ్, మకావు దీవుల్లో మాదిరి తైవాన్‌లో కూడా 2049వరకు ఒకే దేశం రెండు వ్యవస్థలు ఉనికిలో ఉంటాయని చైనా చెబుతున్నది.శృతిమించి వేర్పాటుకు ప్రయత్నిస్తే అవసరమైతే బలప్రయోగం చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.
దక్షిణ కొరియాలో సైనిక పాలనకు కుట్ర !
అత్యవసరపరిస్థితి పేరుతో సైనిక పాలనకు తెరతీసి అనివార్య పరిస్థితుల్లో ఎత్తివేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశం విడిచి పోకుండా అక్కడి అవినీతి నిరోధకశాఖ ప్రధాన కార్యాలయం ఆంక్షలు విధించింది. ప్రస్తుతం అభిశంసన ప్రక్రియ నడుస్తోంది. మిలిటరీ దన్ను చూసుకొని తనను ప్రశ్నించటానికి వీల్లేదంటూ దబాయిస్తున్నాడు.. 1987 తరువాత తొలిసారిగా దక్షిణ కొరియాలో మిలిటరీ పాలన రుద్దేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కేవలం ఆరుగంటల వ్యవధిలోనే అత్యవసర పరిస్థితి ప్రకటన, మిలిటరీకి అధికారాలు అప్పగింత, పార్లమెంటు వ్యతిరేక తీర్మానం, ఉపసంహరణ నాటకీయంగా జరిగాయి. దక్షిణ కొరియాలో మిలిటరీ నియంత పాలన అధికారికంగా అంతమైనప్పటికీ పాలనలో మిలిటరీ ప్రమేయం కొనసాగుతూనే ఉంది.1961లో జరిగిన తొలి మిలిటరీ తిరుగుబాటు తరువాత 1987నుంచి పౌరపాలన ఉన్నప్పటికీ పౌర భద్రతా వ్యవహారాలన్నీ మిలిటరీ మాజీ నేతలే ఎక్కువగా చూస్తున్నారు. ఇంతవరకు రక్షణ మంత్రిగా ఒక్కరంటే ఒక్కరు కూడా మిలిటరీయేతరులు లేరు. అనేక ముఖ్య బాధ్యతల్లో ఉద్యోగవిరమణ చేసిన మిలిటరీ అధికారులే ఉంటున్నారు. కార్మిక వ్యతిరేకమైన చర్యలను యూన్ ప్రతిపాదించాడు. ప్రస్తుతం వారానికి 52గంటలకు బదులు 120 గంటలు పని చేయాలని, ఏడు రోజులూ 17 గంటల చొప్పున విధి నిర్వహించాలని పిలుపునిచ్చాడు. మార్చినెలలో కార్మిక శాఖ 69 గంటల పని వారాన్ని ప్రతిపాదించగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సైనిక పాలన విధించిన వెంటనే సైనిక జనరల్ ఆన్ సూ అన్ని రాజకీయ కార్యకలాపాలు, కార్మికుల సమ్మెలను నిషేధించాడు, పత్రికల మీద సెన్సార్షిప్ ప్రకటించాడు, ఎవరినైనా వారంటు లేకుండా అరెస్టు చేసే అధికారమిచ్చాడు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు కార్మిక సంఘాలను బూచిగా చూపి నిందిస్తే జనం హర్షిస్తారని భావించిన యూన్ ఇతర చర్యలతో అదే ప్రజల్లో పలుకుబడి కోల్పోయాడు. 2022లో జరిగిన ఎన్నికల్లో కేవలం 0.73శాతం ఓట్ల మెజారిటీతో మాత్రమే యూన్ ఎన్నికయ్యాడు. 2024లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులోని 300 స్థానాలకు గాను యూన్ నాయకత్వంలోని పీపుల్స్ పవర్ పార్టీ 108 స్థానాలను మాత్రమే తెచ్చుకోగా ప్రతిపక్షాలకు 192 వచ్చాయి. అందువలన తన అజెండాకు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం లేకపోవటంతో దాన్ని పక్కన పెట్టేందుకు కుంటి సాకులతో అత్యవసర పరిస్థితి లేదా మిలిటరీ పాలన రుద్దేందుకు ప్రయత్నించాడు.
మధ్య ప్రాచ్యంలో నివురుగప్పిన నిప్పు ! సిరియాలో అసద్ ప్రభుత్వ పతనం !!
మధ్య ప్రాచ్యంలోని ఎర్ర సముద్రంలో అమెరికా నౌకాదళ యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. పొరపాటున దాన్ని తమ దళాలే కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించగా, తామే కూల్చివేసినట్లు హౌతీ సాయుధ దళం ప్రకటించింది. మరోవైపు హౌతీలు ప్రయోగించిన క్షిపణులను తమ రాడార్లు పసిగట్టలేకపోయాయని, ఫలితంగా కొద్ది మంది తమ పౌరులు గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఎమెన్‌పై వైమానిక దాడులు జరిపాయి. సిరియాలో బాత్ పార్టీ నేత అసద్ సర్కార్ కూలిపోయిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. మధ్యధరా సముద్రం నుంచి సూయజ్ కాలువ ద్వారా ఎర్ర సముద్రం ఏడెన్ సంధి దగ్గర అరేబియా సముద్రం కలుస్తాయి. నౌకా రవాణాకు కీలకమైన ఈ ప్రాంతాన్ని అనుకొని ఎమెన్ రాజధాని సనాతో సహా కీలకమైన ప్రాంతాలు హౌతీల చేతుల్లో ఉన్నాయి.2023 అక్టోబరు ఏడున గాజాలో మారణకాండ ప్రారంభమైన నాటి నుంచి హౌతీలు దాడులను ముమ్మరం చేయటంతో అమెరికా తీవ్ర వత్తిడికి లోనైే తమ స్వంత విమానాన్ని కూడా గుర్తించలేని ఆత్రత కారణంగా స్వయంగా కూల్చివేసినట్లు నిపుణులు చెబుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టే చర్యలతో రానున్న రోజుల్లో చైనా`ఇరాన్`రష్యా మరింత దగ్గరవుతాయని చెప్పవచ్చు.
గాజాలో సాగుతున్న ఇజ్రాయెల్ మారణకాండ, దానికి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న అపరమానవాతావాద పశ్చిమ దేశాలు ఎన్ని ప్రాణాలు బలిగొంటాయో, ఎంత రక్తం తాగుతాయో చెప్పలేము.2023 అక్టోబరు ఏడవ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి నాలుగవ తేదీ వరకు 46,650 మంది ప్రాణాలు తీశారు. వారిలో 80శాతం పిల్లలు, మహిళలు, వృద్దులే.ఒక్క 2024లో 23,842 మంది మరణించారు. ఇరాన్`ఇజ్రాయెల్`హిజబుల్లా దాడులు ప్రతిదాడులు జరిగాయి. ఇజ్రాయెల్ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ మిలిటరీ స్థావరాలతో పాటు దాని చమురు, అణుకేంద్రాలపై దాడులకు దిగుతామన్నది. దాడులు జరిపితే అది పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీయవచ్చని జో బైడెన్ వద్దని వారించినట్లు నెతన్యాహు సరే అన్నట్లు చెబుతున్నారు. ఇది కూడా నమ్మశక్యం కాదు.ఇరాన్ నాతంజ్ అణుకేంద్రంపై దాడికి బైడెన్ అంగీకరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ వెనక్కు తగ్గినట్లు వాషింగ్టన్ పోస్టు రాసింది. ఇదంతా చూస్తుంటే జనాన్ని గందరగోళపరిచేందుకు ఆడుతున్న ఒక నాటకంగా కనిపిస్తోంది.
అధ్యక్షుడు అసాద్ పదవి నుంచి తప్పుకొని రష్యాలో ఆశ్రయం పొందటం, టర్కీ మద్దతు ఉన్న హయత్ తహ్రరిర్ అల్ షామ్(హెచ్‌టిఎస్) సాయుధ బృందం అధికారాన్ని చేపట్టటంతో అంతర్యుద్ధంలో ఉన్న సిరియాలో మరో అధ్యాయం మొదలైంది.ఇప్పటికే చింపిన విస్తరిలా తలా ఒక ప్రాంతాన్ని అదుపులో ఉన్న శక్తుల పాత్ర ఏమిటో స్పష్టంగాక ముందే ఇజ్రాయెల్ మరోసారి దాడులకు తెగబడిరది. అక్కడ అసలేం జరుగుతోందో వివరాలు బయటి ప్రపంచానికి తెలియటం లేదు. కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. సిరియాతో సరిహద్దులు కలిగి ఉన్న టర్కీ, ఆర్మీనియా, ఇరాన్, ఇరాక్, సిరియాలలో కర్దులు అనే తెగ నివసించే ప్రాంతాలతో కలిపి మధ్యలో కర్దిస్తాన్ ఏర్పాటు చేయాలన్నది అమెరికా దీర్ఘకాలిక ఎత్తుగడ. సిరియాలో తన పథకాన్ని అమలుచేసేందుకు కర్దులతో పాటు ఐఎస్, ఆల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలను అమెరికా ప్రోత్సహిస్తున్నది.అసద్ ప్రభుత్వ పతనం పశ్చిమాసియాలో అమెరికా వ్యతిరేకులైన ఇరాన్, రష్యాకు ఎదురుదెబ్బ. కొత్తగా టర్కీ రంగంలోకి వచ్చినందున అమెరికా ఆటలు సాగుతాయా అన్నది ప్రశ్న
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సైనిక చర్య !
2022లో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య కొనసాగుతున్నది.ఒప్పంద గడువు ముగియటంతో తూర్పు ఐరోపా దేశాలకు సరఫరా అవుతున్న రష్యా సహజవాయువును తమ భూభాగంలోని పైప్‌లైన్ నుంచి జనవరి ఒకటి నుంచి నిలిపివేస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఒప్పంద పునరుద్దరణ సంప్రదింపులకు ససేమిరా అంది.ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మకమైనదిగా వర్ణించింది.ఈ చర్య ద్వారా రష్యాను ఆర్థికంగా దెబ్బతీసి పోరు నిలిపివేసేందుకు వత్తిడికి పూనుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తమ రెండు దేశాల మద్య సాగుతున్న పోరుకు త్వరలో ముగింపు పలకనున్నట్లు రష్యా అధినేత పుతిన్, ఉక్రెయిన్ నేత జెలెనెస్కీ 2024 సంవత్సర ముగింపులో ప్రకటించారు తప్ప ఎలా అన్నది చెప్పలేదు.తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్ పోరు ముగిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు.మరోవైపు పదవి నుంచి దిగిపోతున్న తరుణంలో జో బైడెన్ ఉక్రెయిన్‌కు ఆరుబిలియన్ డాలర్ల గ్రాంట్ అందచేయనున్నట్లు ప్రకటించాడు. పశ్చిమ దేశాల మీడియా ఎన్నిక కట్టుకథలు చెప్పినప్పటికీ ప్రారంభదినాలతో పోలిస్తే రష్యా ఆధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాలు పెరిగాయి.2023లో స్వాధీనం చేసుకున్న విస్తీర్ణంతో పోల్చితే 2024లో (ఏడు రెట్లు) అదనంగా నాలుగువేల చదరపు కిలోమీటర్లలో చొచ్చుకుపోయింది. ప్రారంభంలో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వకుండా వేగాన్ని తగ్గించి మెల్లమెల్లగా ముందుకు పోతున్నది. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నది. గతేడాది ఎదురుదాడులకు దిగిన ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యాలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడే తిష్టవేసింది.నూతన సంవత్సరంలో పరిస్థితి నాటకీయంగా మారిపోతుందని పుతిన్ వార్షిక విలేకర్ల సమావేశంలో చెప్పాడు. మూడేండ్ల పోరులో పది లక్షల మంది మరణించటం లేదా గాయపడినట్లు, ఉక్రెయిన్ ఓటమి బాటలో ఉన్నట్లు బిబిసి పేర్కొన్నది. ప్రమాణ స్వీకారం చేసిన 24గంటల్లోనే యుద్దాన్ని ముగిస్తానని ట్రంప్ చేసిన ప్రకటన మీద సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే పైకి ఏం మాట్లాడినప్పటికీ విశ్వసనీయత లేని ట్రంప్ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. ట్రంప్ పైకి ఏమి చెప్పినప్పటికీ నాటో రంగం నుంచి అమెరికా తగ్గి ఐరోపాను స్వతంత్రంగా పనిచేయనివ్వటం కలలో మాట. పశ్చిమ దేశాలను ఎదుర్కొనేందుకు రష్యా`చైనా మరింత సన్నిహితం అవుతున్నాయి. ఈ పూర్వరంగంలో అదిరించి బెదిరించి ఐరోపాను తమ పరిధిలో ఉంచుకుంటుంది తప్ప వదలి వేసే అవకాశమే లేదు.
మరింత పటిష్టంగా బీజింగ్` ఆఫ్రికా బంధం !
చైనా`ఆఫ్రికా సహకార వేదిక సమావేశాలు బీజింగ్‌లో జరిగాయి. వర్తమాన భూభౌతిక రాజకీయాల్లో ఈ వేదిక 8వ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది.ఆఫ్రికాలోని 54కు గాను 53దేశాల నుంచి ప్రభుత్వాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు.తైవాన్ను చైనాగా గుర్తించిన ఒక చిన్నదేశం నుంచి రాలేదు. నేటి ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా దేశాలు ఒకనాడు చీకటి ఖండగా పిలిచిన ఆఫ్రికాను తమ ఉత్పత్తులకు మార్కెట్‌గా, తమ పరిశ్రమలు, గనులు,భూముల్లో పని చేసేందుకు బానిసలుగా పట్టుకువచ్చేందుకు అనువైన ప్రాంతంగా మాత్రమే చూసినట్లు చరిత్ర చెబుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 1525 నుంచి 1866 వరకు నూతన ప్రపంచంగా వర్ణితమైన ప్రాంతదేశాలకు 125లక్షల మంది ఆఫ్రికన్లను బానిసలుగా తరలిస్తే ఆయాదేశాలకు చేరిన వారు 107లక్షలు మాత్రమే, పద్దెనిమిది లక్షల మంది ప్రయాణాల్లో మరణించారు. చరిత్రలో మరికొన్ని చోట్ల బానిసల గురించి ప్రస్తావన, ఉనికి ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున తోటి మానవులను పశువుల కంటే హీనంగా చూసిన దారుణం మరొకటి లేదు. వర్తమానంలో బానిసలుగా చేసుకొనే అవకాశం లేదు గనుక పశ్చిమదేశాలు ఇప్పటికీ ఆఫ్రికాను మార్కెట్‌గానే చూస్తున్నాయి.అందుకే అక్కడ అభివృద్ది లేదు.ఈ శతాబ్ది ప్రారంభంలో చైనా చొరవతో సహకార వేదిక ఉనికిలోకి వచ్చిన తరువాత తమనెక్కడ ఆఫ్రికన్లు పూర్తిగా విస్మరిస్తారో అన్న భయంతో పశ్చిమదేశాలు కొంత మేరకు తమ మూటలు విప్పుతున్నాయి.అయితే చైనాతో వాణిజ్య లావాదేవీలు, పెట్టుబడుల పెరుగుదల చూసిన తరువాత వాటికి ‘‘ రాజకీయ’’ భయం పట్టుకుంది.చైనాను అడ్డుకొనేందుకు సామ,దాన,బేధ,దండోపాయాలను ప్రయోగిస్తున్నాయి.ఈ వేదిక సాధనంగా ప్రపంచంలోని పేద దేశాలకు చెందిన 280కోట్ల మంది జీవితాలను నవీకరించవచ్చని సమావేశాలను ప్రారంభించిన చైనా అధినేత షీ జింపింగ్ చెప్పారు.చైనా`ఆఫ్రికా రెండూ సామ్రాజ్యవాదుల దురాక్రమణ,వలస వాదానికి వ్యతిరేకంగా పోరాడినవే అని గుర్తు చేశారు. అనేక దేశాల్లో ఎన్నికలు స్థానికంగా ప్రభావితం చేసినప్పటికీ అంతర్జాతీయంగా చర్చలో ఉన్నవి, ప్రాముఖ్యత కలిగినవి వాటిని మాత్రమే ఇక్కడ రేఖా మాత్రంగా పరిశీలించటమైంది
ఎం కోటేశ్వరరావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.