
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎట్లా జరుగుతాయో తెలియదు. న్యాయవ్యవస్థను బతకనిస్తారో లేదో తెలియదు. సక్రమంగా సాగే పార్లమెంటరీ చర్చలు జరుగుతాయనే నమ్మకాలు పోతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గురించి పార్లమెంట్ లో గానీ అంతకుముందు రాజ్యాంగం రచిస్తున్న సందర్భంలో కూడా ఇటువంటి పరిస్థితులు రాలేదు. అంబేడ్కర్ గురించి విమర్శించే హక్కు లేదని ఎవరూ అనలేరు.
‘‘ఆర్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా?’’
వి ది పీపుల్ ఆఫ్ ఇండియా … అనే మాట ఆంగ్లంలో తెలుగులో కూడా ఒక గొప్ప మంత్రం వలె నిలబడుతున్నది. అంటే మేము మనకోసం రూపొందించిన .. అని అంటారు. మొత్తం రాజ్యాంగ నిర్ణాయక సభ కలిసి రూపొందించినవి అని అనుకోవడం సరైనదా? ఆ 1950 కు ముందు ఉన్న భారత దేశ ప్రజలంతా కలిసి, వారి ప్రతినిధిగా ఈ సభ రూపొందించింది కదా. అంటే ఆయన 1950 తరువాత తరాల వారికి ఇది వర్తించదా అని మరో ప్రశ్న. ఒకసారి సభ జరిగిన తరువాత ఎన్నికల ద్వారా ఈ భారత దేశం ఓటర్ల ద్వారా రాజ్యాంగ సంవిధానం సవరించిన ప్రతిసారీ ఇదే ప్రతీక అని గమనించాలి. వందసార్లు కనీసం కొత్త రాజ్యాంగం సవరించారు. చిన్నదో పెద్దదో, మంచిదో కాదో, అది వేరే విషయం. ఓ సారి సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసిన రాజ్యాంగసవరణలు ఉన్నాయి. చాలా బాగున్నాయని అనుకున్న ధర్మాసనం లు కూడా ఉన్నాయి. రాజ్యాంగ స్ఫూర్తితో అంబేడ్కర్ దృక్పథం వలననే రాజ్యాంగ రచనలో ఏకాభ్రిపాయం సాధ్యమైంది. లేకపోతే రాజ్యాంగమే వచ్చేది కాదు. ‘‘ఎందుకంటే భిన్నమైనటువంటి విలువలు కానీ రాజ్యాంగం స్వీకరించిన (adopt) రోజే ఈ రాజ్యాంగం మనదికాదని అనేవారు. అయినా రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ స్వయాన వాళ్ళు తిరస్కరించారు. “We reject the Constitution” ‘‘వి రిజెక్ట్ ది కాన్స్టిట్యూషన్’’ అన్నారు, ఇప్పటికీ వాళ్ళు రాజ్యాంగం వద్దనే మాటతో కట్టుబడి ఉన్నారు’’ అని ప్రముఖ పొలిటికల్ సైంటిస్ట్, రాజకీయ వేత్తలు ప్రజాస్వామ్య వాది జి హరగోపాల్ వివరించారు. ఇటీవల ‘‘భారత రాజ్యాంగ పీఠిక’’ పుస్తకం ఆవిష్కరించిన సందర్భంలో హరగోపాల్ గారు రాజ్యాంగ రచనలో అందరితో మాట్లాడుకునే లక్షణాలు కొనసాగాయి అని చెప్పారు.
జై బాపు, జై భీం, జై సంవిధాన అభియాన్
భారత రాజ్యాంగం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జై బాపు, జై భీం, జై సంవిధాన అభియాన్ అనే నినాదం ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. పదేళ్లు భారత దేశాన్ని పరిపాలించిన మన్ మోహన్ సింగ్ 26 డిసెంబర్ నాడు మరణించారు. రెండు సంవత్సరాల దాకా ‘‘జై బాపు, జై భీం, జై సంవిధాన అభియాన్ అనే నినాదం’’ దేశమంతా వినిపించాలని నిర్ణయించారు.
విచిత్రమైమంటే ఆ రోజుల్లో పార్లమెంట్ సమావేశాల్లో అంబేడ్కర్ గురించి అసందర్భంగా విమర్శించడం బాధాకరమైంది. పార్లమెంట్ హేళనకు గురికావడం ఆశ్చర్యకరం. ‘‘ఈ రోజుల్లో ఒక ఫాషన్ అయిపోయింది. అంబేడ్కర్ అంబేడ్కర్ అంబేడ్కర్ అంబేడ్కర్ అంబేడ్కర్ అంబేడ్కర్… ఇన్ని సార్లు భగవంతుడితో అంబేడ్కర్ అని భజన చేస్తే ఏడేడు జన్మల కాలంలో స్వర్గం దొరికే అవకాశం ఉండేది…’’ అని ఎన్నికల సభలో కాదు, బిగ్ డెబేట్ అని టివి మాటల్లో అరుచుకోవడం కాదు. సర్వసత్తాగణతంత్రంలోని పార్లమెంట్ లో జరిగింది. అందుకని ఆశ్చర్యం. ఇది న్యాయం కాదని కొందరు, నేరం అని మరికొందరు పెద్దలు, లేదు లేదు వెంటనే ఎస్ ఐ ఆర్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయండి అని పార్లమెంట్ సభ్యులు అడుగుతున్నారు. పార్టీల ప్రస్తావన అవసరం లేదు. ఇటూ ఇటూ అంటే పార్లమెంట్ ప్రభుత్వ పక్షాలు, ప్రతిపక్షాలు కేసులు పెట్టుకోవాలని అంటున్నారు. కనుక ఇది ఆశ్చర్యం.
ఇన్ని కోట్లు ఖర్చుచేసే చర్చ ఇదా?
కొన్ని వందల గంటల సమయాన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేసి పార్లమెంట్ సమావేశాలలో చేస్తున్న చర్చలు ఇవేనా? అసలు చర్చలు ఎందుకు జరుగుతున్నదయి. దానికి నేపథ్యం ఏమిటి, దాని వల్ల ఎవరికి లాభం అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అంబేడ్కర్ గొప్పతనాన్ని తక్కువచేయడం మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రమైన విమర్శలు చేసారు. ప్రెస్ మీటింగ్ చాలా అరుదుగా జరుగుతాయని మనకు అర్థమైంది. అయినా ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ‘‘అంబేడ్కర్ కు వ్యతిరేకంగా ఏమీ అనడం లేదు. నా మాటలు వక్రీకరించారు’’ అని హోం మంత్రి చెప్పుకోవలసిన దశవచ్చింది.
పౌర శక్తి
ఇటీవల 2024 ఎన్నికలలో రాజ్యాంగం పేరుతో రాజకీయ నాయకులు అటూ ఇటూ బురదలు చల్లుకుంటున్నారు. రాజ్యాంగాన్ని రక్షించడం లేదని, కాపాడడం లేదని అంటూ విమర్శించుకుంటున్నారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఎన్నికల సమావేశాల్లో మాట్లాడుకున్నారు. 400 ఎంపీ స్థానాలలో గెలుచుకుని బిజెపి తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తామని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కాని ఆలోచించే ఓటర్లు పౌరశక్తి ఎంత గట్టిదో ఎంత గొప్పదో చాటి చెప్పారు. టిడిపి, జెడియు ఎంపీలు లేకపోతే బిజెపి అధికారానికి పరిమితులు వివరించింది. ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసే అవకాశం లేదని అధికార గుర్రాలకు కళ్లెం బిగించి, తలకెక్కిన కళ్లను దించింది మన ఓటర్లు. ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని రుజువు చేసారు. చంద్రబాబునాయుడు, నితీశ్ కుమార్ నేతలు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వాన్ని నడపడానికి బలంఅదించారు. కేంద్రాలకు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తామన్న దూకుడులను కాసేపు ఆపగలిగిన శక్తి సంపాదించింది.
రాజకీయ నైపథ్యం ఈ విధంగా ఉన్నప్పడికీ రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేడ్కర్ ను హేళన చేయడం న్యాయం కాదు. అయినా వివరణలు ఖండనలు చెప్పుకుంటూ అంబేడ్కర్ ను అవమానం చేయడం మా ఉద్దేశం కాదు అని దుస్థితికి అధికార పార్టీ జారిపోవడం ప్రస్తుతం కొంచెం నయమే అనిపిస్తుంది. కాని భారత రాజ్యాంగాన్నిపూర్తిగా మార్చుకునే ఎజెండా ను వదులుకోవడం లేదు. సమాచార హక్కు తో సహా అనేకానేక ప్రాథమిక హక్కులకు బలహీనం చేస్తున్నారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు వల్లనే మౌలిక స్వరూపాన్ని చిందరవందర చేసి ప్రయత్నాలు తెచ్చిపెట్టారు. అందులో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతినే ప్రమాదం ఇంకా కొనసాగుతున్నదే ఉంది. పార్లమెంట్ లో గత నెల అంబేడ్కర్ ప్రతిష్టకు కూడా దెబ్బతినే ప్రయత్నాలు ఉన్నాయని కనపడుతూనే ఉంది.
రాజ్యాంగాన్ని కూలంకషంగా మార్చుకోవడానికి సుదీర్ఘ ప్రణాళిక ఉండనే ఉంది, ఈ లోగా అంబేడ్కర్ ను హేళన చేసే కార్యక్రమాల వెనుక జనాల దృష్టి మరలించే వ్యూహాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు నమ్ముతున్నారు. డి ఎం కే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇదే వ్యూహం అని కుండబద్దలు చేస్తున్నారు కూడా. ఇవన్నీ నాటకాలు అని దారుణంగా విమర్శించారు.
ఏది ఏమైనా మన రాజ్యాంగాన్ని, దాని మౌలిక స్వరూపాన్ని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడికీ, ఒక్కొక్క ఓటరుకూ ఉంది.
మాడభూషి శ్రీధర్, (న్యాయ శాస్త్ర ఆచార్యులు, హైదరాబాద్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.