
కరెన్సీ కష్టాలను ఈక్విటీ మార్కెట్లు ప్రతిబింబించాయి. బెంచ్‌మార్క్ బిఎస్ఇ సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు ఒక్కొక్కటి 1.6% క్షీణించాయి.
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి మందగిస్తుందనే ఆందోళనల మధ్య బలమైన అమెరికా డాలర్, బలహీనమైన మూలధన ప్రవాహం కారణంగా డిసెంబర్ 6 సోమవారంనాడు రూపాయి విలువ గతంలో ఎన్నడూలేని కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 85.84కి పడిపోయి, డిసెంబర్ చివరిలో చేరుకున్న దాని మునుపటి రికార్డు కనిష్ట స్థాయి 85.8075ని స్వల్పంగా అధిగమించింది.
ట్రేడింగ్ సెషన్‌ను 85.8275 వద్ద ముగియటం ఈ రోజు 0.1% క్షీణతను సూచిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) జోక్యం చేసుకున్నప్పటికీ, నిరంతర డాలర్ డిమాండ్, రూపాయి చుట్టూ బేరిష్ సెంటిమెంట్ దానిని ఒత్తిడిలో ఉంచాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఇది మరిన్ని నష్టాలను నివారించడంలో సహాయపడింది.
“జనవరిలో డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఆర్బిఐ దానిని (యుఎస్డి/ఐఎన్ఆర్) 86 కంటే తక్కువ స్థాయిలో ఉంచటానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది” అని ఒక విదేశీ బ్యాంకుకు చెందిన ఒక ట్రేడర్ రాయిటర్స్ తో అన్నారు.
ప్రపంచ స్థాయిలోడాలర్ సూచిక 0.3% తగ్గి 108.5కి చేరుకోవటంతో అది రెండేళ్ల గరిష్ట స్థాయి నుండి వెనక్కి తగ్గినట్టయింది. అయితే, స్థానిక స్పాట్ మార్కెట్లో డాలర్ బలంగా ఉండటంతోను, నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్ (NDF) మార్కెట్ అత్యంత ప్రభావశీలంగా ఉండటంతోను డాలర్ సూచికలో స్వల్ప తగ్గుదల రూపాయికి పెద్దగా ఉపశమనం కలిగించలేదు.
వస్తువులు, కరెన్సీలు, సెక్యూరిటీలు వంటి ఆర్థిక సాధనాలు తక్షణ డెలివరీ కోసం వర్తకం చేయబడే స్థలమే స్పాట్ మార్కెట్. మరోవైపు, నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్ అనేది నగదు ప్రవాహాలను మార్పిడి చేయడానికి నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్, ప్రస్తుత స్పాట్ రేట్ల మధ్య రెండు-పార్టీ కరెన్సీ ఉత్పన్నాల ఒప్పందం.
“ట్రంప్ పదవీ స్వీకారానికి దగ్గరగా ఉండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ దూకుడు కారణంగా అమెరికా డాలర్ తో చేసుకునే సర్దుబాటు స్వల్పకాలికంగానే ఉంటుంది” అని ఐఎన్ జి బ్యాంక్ నవీకరింపబడిన ఒక పరిశోధనా పత్రంలో పేర్కొంది. రాబోయే వారాల్లో డాలర్ సూచిక 110 అవుతుందనే అవగాహనతో ఈ బ్యాంకు పనిచేస్తుంది.
కస్టోడియల్ క్లయింట్ల తరపున పనిచేస్తున్న విదేశీ బ్యాంకుల నుండి డాలర్ డిమాండ్ పెరగటం కారణంగా రూపాయి క్షీణత మరింత తీవ్రమైంది.
బెంచ్‌మార్క్ బిఎస్ ఇ సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50 సూచీలు ఒక్కొక్కటి 1.6% నష్టపోవటం ద్వారా కరెన్సీ కష్టాలకు ఈక్విటీ మార్కెట్లు అద్దం పట్టాయి. స్టాక్ డిపాజిటరీ డేటా ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు ఈ నెలలో ఇప్పటివరకు నికర ప్రాతిపదికన 1.1 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ స్టాక్‌లు, బాండ్లను అమ్మివేశారు.
అనువాదం : నెల్లూరు నరసింహారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.