
………… గాజా-1………….
మీకు తెలుసా.. నా కవితను నేను పోగొట్టుకున్నాను.
కనీసం దాని పేరు కూడా గుర్తుకు రావట్లేదు ! అకస్మాత్తుగా కవిత పారిపోయే ముందు,
ఆఖరిసారిగా ఈ కవితని ఎక్కడ చూసానో కూడా ఖచ్చితంగా తెలియట్లేదు.
తప్పి పోయిన కవిత ఆచూకీ వెతకడంలో పరమార్థం ఏంటో తెలీటమే లేదు !
అయినా వెతుకుతూనే ఉన్నాను.
కవిత ఎక్కడికి పోయి ఉండొచ్చు ?
పాత ముక్కిపోయిన ఖాతా పుస్తకం వెనకాల చూసి ఉంటానా ?
లేక నా తల వెనకాలా ?
ఎక్కడుందసలు ?
***
ఇక నా కవిత సంపాదకుడి దిగులు కళ్ళ చూపుల కిందంటారా.. దొరికే ప్రశ్నే లేదు.
కనీసం శుభ్రం చేసిన పాఠ్య పుస్తకం పేజీ లో కూడా ఉండే అవకాశం లేదు.
***
కవిత దొరకడం లేదు. కానీ ..నగరంలో మూడు నదులు కలిసే చోట ..తుపాకీ గొట్టం లాంటి మస్జిద్ శిఖరం నుంచి.. మువాజిన్ ఇచ్చే నమాజు పిలుపులాగా విషాదం నిండిన ఆక్రందనలను బలహీనమైన గొంతులతో విన్నాను.
లెక్కకు మించిన దేవుళ్ళు కొలువున్న నా గాజా నగరంలో ..
ఎక్కడో శిధిలాల్లో చిక్కుకుని నిస్సహాయంగా కన్నీళ్ళు కారుస్తున్న రెండు కళ్ళు.. రాతి చూపులతో దీనంగా చూడడాన్ని బహుశా నేను చూసే ఉంటాను.
***
నగరంలో ఎమ్.కే-84 కంటే ప్రాణాంతకమైన ద్వేషపు బాంబు పేలి చెలరేగినప్పటి ధూళి మబ్బులు.. సురక్షితమైన హృదయపు గదులలో సర్డుకుంటున్నప్పుడు .. అచ్చం
WCNSF (wounded child no surviving family -l)లాగా ఒక మూలన రింగులు రింగులుగా అలా..నా కవిత
గాయపడి అనాథలా కుప్పగా పడి ఉన్నప్పుడు..
నిజం..కవిత చావకుండా ఊపిరి బిగబట్టింది !
నా కవిత్వం కాళ్ళు అడ్డంగా నరక బడ్డాయి.
ఇంకా..నా కవిత ఖండ ఖండాలుగా నరకబడింది. అయినా కానీ రక్త శిక్తమైన గాయాలతో ముచ్చెమటలు పట్టిన నా కవిత్వ ముఖాన్ని చదివినప్పుడు ..
నేను నిజంగా సంతోష పడతాను.
ఎందుకంటే.. తప్పిపోయినప్పటికీ.. ఆ బీద తల్లి ఒకే ఒక్క వోదార్పు అయిన కవిత మరణించలేదు !
అవును…ఇది నిజం
నా కవిత బతికే ఉంది !
గాజా -2
……….
చదవడానికి కవిత్వాన్ని తవ్వుతూ పోవడం అంటే ..
కళ్ళు మూసుకుని ఒక శిల్పాన్ని ఏకాగ్రతగా చెక్కడం లాంటిది. చీకటి తెర మీద నీ కూతురు లేత వేళ్ళ స్పర్శ నీ వీపు మీద స్మృతి చిహ్నంగా నిలిచి పోవడం లాంటిది.
కోరికల ఐస్ క్రీమ్ లాంటిది.. బహుశా అనుభూతి చెందుతున్న విషాదం లాంటిది కూడా కావచ్చు.
*****
వీళ్ళ కోసం కవిత రాయడం అంటే పాఠకుల మనసు మీద అదాటున దాడి చేయడమే !
వీధుల్లోని బహిరంగ గోడల మీద వాళ్ళకి అయిష్టమైన గ్రాఫిటీ రాతల్లాంటిది ఆ కవిత్వం !
ఎందుకంటే ఆ గోడ గాజాలో జాతిహత్యా కాండని తక్షణమే ఆపమనే .. ఖండించమనే గర్జన లాంటి మాటల్ని మోస్తుంది మరి.. బహుశా శాసిస్తుంది!
***
ఇక అమెరికా వీపు మీద నేను రాసే ఈ కవితని అమాలేక్ (హీబ్రూ)అంటారు.
ఇది సరిగ్గా చేతి మధ్య వేలు మీదుగా.. ఉడికిన కూరగాయల నల్లని జ్యూస్ లో.. పూర్తిగా మునిగిపోయిన యూరోప్ మీద నుంచి వెళుతుంది.
ఇంకా..దాని చేతి మీద నిషేధించబడిన యూదులు అనే పదాల అవశేషాలు కూడా ఉంటాయి.
అవును..కవిత్వం రాసే వేళ్ళమీదన్న మాట !
**
చూడూ..తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావేమో ?..
పనికిరాని చెత్త కాగితం వెనక రాసిన కవిత్వం కాదు ఇది జాగ్రత్త!
ఏమనుకుంటున్నావు.. అదొక కరపత్రం !
ఈ కృంగి పోయిన గ్రహం మీద తనంతట తాను పడి వేలుగా.. లక్షలుగా వృధ్ధిచెందే చీడ పురుగు !
****
స్థిరంగా కూర్చుని, నాలుగు వైపులకీ తన వీపును తిప్పుతూ .. సముద్రం మీద,గాలిలొ,ఆకాశం మీద
చివరికి భూమి మీద .. అంతేనా..ఐదు పంచ భూతాల మీద తెలివిగా, నిజాయితీగా రాయబడ డాన్ని, అలాగే ఉండి పోవడాన్ని కవిత ఎప్పుడూ మరిచి పోతూ ఉంటుంది !
**
గుజరాత్, అహ్మదాబాద్ కి చెందిన హేమంత్ అశ్వినీ కుమార్
ద్విభాషా కవి,అనువాదకుడు,సంపాదకుడు ,సాంస్కృతిక విమర్శకుడు.
ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదం – గీతాంజలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.