
న్యూఢిల్లీ : బడ్జెట్-2025ను కేంద్రం ప్రవేశపెట్టబోతున్న తరుణంలో, ప్రజల పట్ల బాధ్యత కలిగిన కొంతమంది పౌరులు “కార్పొరేట్ దిగ్గజాలకే కాకుండా ప్రజలందరికీ సామాజిక భద్రత ఉండేలా భారత పన్నుల వ్యవస్థను ప్రభుత్వం హేతుబద్ధీకరించాలని” డిమాండ్ చేశారు.
పబ్లిక్ సెక్టార్, పబ్లిక్ సర్వీసెస్‌పై ఏర్పడిన పీపుల్స్ కమీషన్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో ప్రస్తుత పన్ను విధానం పరోక్ష పన్నులపై ఎక్కువగా ఆధారపడి ఉందని అన్నారు. అంతేకాకుండా పెద్ద వ్యాపారవేత్తలకు అనుకూలంగా, పక్కదారిపట్టించేదిగా అసమానతలతో కూడి, స్థూలంగా తిరోగమనం వైపు ఉందని తెలిపారు.
కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్‌తో సహా పలువురు ప్రముఖ విద్యావేత్తలు, న్యాయనిపుణులు, పరిపాలన అనుభవం కలిగిన అధికారులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ ప్రకటన పై సంతకం చేశారు. వీరిలో విద్యుత్, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి EAS శర్మ, సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్; సీనియర్ జర్నలిస్టు వి.శ్రీధర్, తదితరులు కూడా ఉన్నారు.
“పెట్టుబడికి అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహించే” ముసుగులో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు భారీగా పన్ను మినహాయింపులు, రాయితీలు ఇస్తున్నాయని, తద్వారా వీరిపట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తున్నాయని ఈ ప్రకటన పేర్కొంది.
గత పదేళ్లలో కార్పొరేట్ పన్నులు, జిడిపి వసూళ్లు కేవలం 2.3 రెట్లు మాత్రమే పెరిగాయని, 2017-18లో రూ. 4.28 లక్షల కోట్ల నుంచి రూ. 10.2 లక్షల కోట్లకు, రూ. 4.42 లక్షల కోట్ల నుండి రూ. 10.6 లక్ష కోట్లకు పెరగగా, ఆదాయపు పన్నులు మాత్రం 4.5 రెట్లు పెరిగాయన్నారు. రూ. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 2.5 లక్షల కోట్ల నుండి రూ 11.8 లక్షల కోట్లకు పెరగనున్నాయని తమ ప్రకటన లో తెలియజేశారు.
అంతేకాకుండా GST (వస్తువులు, సేవల పన్ను) రూపంలో పేదలతో సహా దేశంలోని ప్రతి వ్యక్తి చెల్లించే పరోక్ష పన్నులు 2017-18, 2023-24 సంవత్సరాల మధ్య రూ. 7.9 కోట్ల నుండి రూ. 20.18 కోట్లకు, అంటే 2.56% పెరిగాయని పేర్కొన్నారు.
“కాబట్టి మనం సామాన్యులపై ఎక్కువ పన్ను విధిస్తున్నాము. అత్యంత ధనవంతులను మరింత సంపన్నులను చేస్తున్నాము. ఈ పరిస్థితిని మార్చాలి.’’ అని కమిషన్ పేర్కొంది.
స్థూల పన్ను రాబడికి (GTR) పన్నుల వసూలు శాతంలో ఉన్న వ్యత్యాసాలను కూడా కమిషన్ ఎత్తిచూపింది. ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్ పన్నుల శాతాన్ని తగ్గించడానికి, ఆదాయపు పన్నులను పెంచడానికి ప్రయత్నించిందని తెల్పింది. .
ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 38(2), 39(సి) [డైరెక్టివ్ ప్రిన్సిపల్స్] ఉల్లంఘించటంతో పాటు తద్వారా ఆదాయ అసమానతలు, సంపద కేంద్రీకరణలో పెరుగుదలకు దారితీసిందని ప్రకటనలో పేర్కొన్నారు. “ఇటువంటి తీవ్రమైన సంపద కేంద్రీకరణ.. కొద్దిమంది సంపన్నుల చేతుల్లో ఉండటం వలన మార్కెట్లను వక్రీకరించడానికి, ధరలను తమకు అనుకూలంగా ఇష్టానుసారం మార్చుకోవడానికి అనుమతించింది. దీనివల్ల ప్రజల సొమ్ముకు ముప్పు ఏర్పడుతుంది.” అని కమిషన్ పేర్కొంది.
ఇతర ఆర్థిక సంస్కరణలతోపాటు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, వాటి ఆస్తులను మోనటైజేషన్ చేయాలని, లాభాలను ఆర్జిస్తున్న ప్రైవేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి బదులుగా “పారదర్శకంగా, నియమాలను అనుసరించి, స్థిరమైన వ్యాపార వాతావరణాన్ని” అందించాలని కమిషన్ సూచించింది.
సామాజిక భద్రతా చర్యలపై తన అభిప్రాయం చెపుతూ కమిషన్ ” ఇటీవలి కాలంలో ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యతలను విస్మరించి ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి, ఎస్సీ/ఎస్టీల సంక్షేమం మొదలైన వాటికి బడ్జెట్ కేటాయింపులను క్రమంగా తగ్గించింది” అని ఆందోళన వ్యక్తం చేసింది.
అన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్యలపై చర్చించి, రాబోయే బడ్జెట్లో తగిన నిబంధనలను పొందుపరిచేందుకు చర్యలు తీసుకునేలా పాలక రాజకీయ వర్గంపైన ఒత్తిడి తీసుకురావచ్చని కమిషన్ అభిప్రాయపడింది.
పెరుగుతున్న అసమానతలు, ఆదాయం, ఉపాధి అవకాశాలలో స్తబ్దత మొదలైన ఆందోళనల కారణంగా భారతీయ మధ్యతరగతి పనితీరుపై పడుతున్న ప్రభావం తదితర పరిస్థితుల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025, ఫిబ్రవరి 1 న పార్లమెంటు ముందు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఇతర అంశాలతో పాటు ఈ సంవత్సరం పెరుగుతున్న గృహ రుణాలు, నిరుద్యోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై అందరి దృష్టి ఉంటుంది. అదే సమయంలో దేశంలో పతనమవుతున్న వృద్ధిరేటును ఎలా పరిష్కరిస్తుంది అనే దానిపైన కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ది వైర్ స్టాఫ్
అనువాదం : పద్మశ్రీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.