
– పర్భణి నుంచి ముంబాయికు లాంగ్ మార్చ్
– వందల సంఖ్యలో పాదయాత్ర
– న్యాయం చేయాలని బాధితుల డిమాండ్
ముంబాయి: పోలీసుల చేత హింసించబడ్డ బాధిత పర్భణి ప్రాంత దళిత కుటుంబాలు, వారితో పాటుగా వివిధ కులరహిత సామాజిక సంఘాలు నెలకు పైగా పర్భణిలో బైఠాయించి తమ డిమాండ్‌ను నెరవేర్చాలని నిరసన తెలిపారు. పర్భణిలో దళితులను విచక్షణారహితంగా చితకబాదిన పోలీసులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిరసనకారులు పోలీసుల మీద పలు ఆరోపణలు కూడా చేశారు. బాధితులను చితకబాదడమే కాకుండా వారి వద్ద నుంచి పోలీసులు వస్తువులను దోచుకున్నారని అన్నారు. ఇదంతా ‘కాంబింగ్ యాక్షన్’ పేరుతో డిసెంబర్ 11న నిరసన తెలిపిన నిరసనకారులు తమ డిమాండ్‌ను వినిపించారు.
బాధితులు, కులరహిత సామాజిక సంఘాల శ్రేణులు
పర్భణిలో నిరసన తెలిపి నెల గడిచింది అయినా కానీ ఇంకా వారి డిమాండ్స్ నెరవేరలేదు. దీంతో నిరసనకారులు పర్భణి నుంచి ముంబాయి వరకు లాంగ్ మార్చ్ మొదలు పెట్టారు. 600 కిలోమీటర్ల దూరాన్ని ఒక నెలలో నిరసనకారులు పూర్తి చేయనున్నారు.
దౌర్జన్యానికి మేమే సాక్షులం
‘‘పోలీసుల నీచమైన దౌరజ్యన్యానికి మేము సాక్షులం, ఒక నెల గడిచినా పోలీసులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. మా డిమాండ్స్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టేవరకు మేము మార్చ్ చేస్తాము’’ అని 80 సంవత్సరాల వయసు గల శిరిషాబాయి సావంత్ అన్నారు. ఆమెతో పాటు మరింతమంది మహిళలు పర్భణి నుంచి ముంబాయి వైపు జనవరి 17వ తేదీన నడకను మొదలుపెట్టారు.
సావంత్లానే, మరికొంతమంది యువకులు, వృద్ధులైన అంబేద్కర్ వాదులు కూడా ఈ లాంగ్ మార్చ్‌లో చేరారు. పోలీసుల దౌర్జన్యానికి గురైన బాధితులు మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే పోలీసుల దాడిలో బాధితులలో కొందరికి తీవ్రగాయాలు అయ్యాయి.
అసలు విషయం..
డిసెంబర్ 10న ఓ కులానికి చెందిన హిందూ వ్యక్తి పర్భణి నగరంలో భారతరాజ్యంగ ప్రతిని అవమానించాడు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ పలు అంబేద్కరిస్టులు నగరవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. కొన్ని చోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు నిరసనకారులపై అసాధారణ రీతిలో చర్యకు దిగారు. పర్భణిలోని స్లమ్ ఏరియాలలో నివసించే దళితుల ఇళ్లలోకి ప్రవేశించి దొరికినవారిని దొరికినట్టుగా విచక్షణారహితంగా చితకబాదారు. ఆడవారితో సహా దాదాపు 50 మంది యువకులను అదుపులోకి తీసుకొని, కస్టడీలో కొట్టారు. కస్టడీయల్ హింసలో లా విద్యార్థి సోమనాథ్ సూర్యవంశి అనే యువకుడు చనిపోయాడు. తీవ్రమైన కనపడని గాయాలతో సూర్యవంశి చనిపోయినట్టుగా పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో తేలింది. ఈ సాక్ష్యమున్నాకానీ పోలీసులపై ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సూర్యవంశి మృతికి, బాధ్యులైన పోలీసు అధికారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని నిరసనలు మొదలైయ్యాయి. ఎప్పుడైతే నిరసనకారుల డిమాండ్ వినిపించిందో అప్పుడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చలికాల సమావేశాలలో అసెంబ్లీ వేదికగా డిసెంబర్ 20న స్పందించారు. పోస్ట్‌మార్టన్ రిపోర్ట్‌ను పక్కన పెడుతూ.. సూర్యవంశి కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడని మహారాష్ట్ర సీఎం తెలిపారు. పోలీసులది తప్పేలేదన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు విరుద్ధంగా ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు ఇన్స్పెక్టర్ అశోక్ జోగ్దాడ్ను సస్పెండ్ చేశారు. రిటైర్డ్ జడ్జ్‌తో జుడిషియల్ విచారణకోసం ఆదేశించామని ఫడ్నవీస్ ప్రకటించారు.
నిరాశకు గురైన బాధితులు..
రాష్ట్ర ప్రభుత్వం ఈ హింసాత్మక ఘటనపై దృష్టి సారించిన తీరు, తర్వాత జరిగే విచారణల తీరు వల్ల బాధితులు నిరాశకు గురైయ్యారు. నెలకు పైగా పర్భణిలో జరుగుతున్న నిరసనకారుల ఆందోళనలో మృతుడు సూర్యవంశి తమ్ముడు అవినాశ్ తన తల్లితో పాటుగా పాల్గొన్నారు. అంతేకాకుండ లాంగ్ మార్చ్‌లో కూడా పాలుపంచుకున్నారు. ‘‘మా అన్న మరణం వృధాగా పోదు’’ అని అవినాశ్ ద వైర్‌తో చెప్పారు.
భూమిలేని సూర్యవంశి కుటుంబీకులు పూనేలోని చకన్ ప్రాంతంలో పనిచేసుకొని బ్రతుకుతుంటారు. అతని తమ్ముడు కూడా చదివుకున్నవాడే అయితే కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారుల మీద చట్టపరమైన చర్యలను తీసుకోవాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా మృతుడి సోదరుడు అవినాశ్‌కు జాబ్ ఇప్పించాల్సిందిగా కోరారు.
సామాజిక కార్యకర్తలకు సమన్లు..
లాంగ్ మార్చ్ మొదలైన కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రితో ముంబాయిలో భేటీ అవ్వాలని తమకు సమన్లు వచ్చాయని కొందరు సామాజిక కార్యకర్తలు అన్నారు. ఈ సమావేశానికి హాజరుకావడానికి తాను నిరాకరించినట్టుగా దళిత్ పాంథర్ నేత రాహుల్ ప్రధాన్ చెప్పారు. ‘‘ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వాళ్లు వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయారు. ఒకవేళ ప్రజలకు సీఎం ఏదైనా మంచి చేయాలని అనుకుంటే, తన పోలీసు వ్యవస్థ విఫలమైనట్టుగా పరిగణించాలి, అంతేకాకుండా ఆయన ఇక్కడికి వచ్చి బాధితులను కలిసి, వారితో మాట్లాడి సర్దిచెప్పాలి’’ అని ప్రధాన్ చెప్పారు.
ఏదిఏమైనప్పటికీ, ప్రధాన్ ఫడ్నవీస్‌తో సమావేశానికి హాజరుకాలేదు. కానీ కొందరు మరఠ్వాడాకు చెందిన అంబేద్కరిస్టులు ఈ నెల ప్రారంభంలో సీఎంతో సమావేశమై చర్చించారు. కొన్ని మౌఖిక హామీలతో పాటు సూర్యవంశి తమ్ముడుకి ఉద్యోగ కల్పన లాంటి విషయాలు తమ సమావేశంలో చర్చకు రాలేదని సీఎం సమావేశానికి హాజరైన వారు ద వైర్‌కు తెలిపారు. ‘‘క్రూరంగా ప్రవర్తించిన పోలీసుల మీద చర్య తీసుకునే దాని గురించి ఏదైతే మేము ప్రాథమికంగా అడిగామో సమావేశంలో ఒక్క మాట కూడా దానిపై మాట్లాడలేదు.’’ అని సీఎం మీటింగ్‌కు హాజరైన ఓ కులరహిత సంఘసంస్కర్త నేత అన్నారు.
రాజకీయాలకు అతీతంగా ఉద్యమం..
‘‘ఇది ప్రజా ఉద్యమం. ఒకవేళ రాజకీయ పార్టీలు ఉద్యమంలో పలుపంచుకోవాలంటే పాలుపంచుకోవచ్చు. కానీ రాజకీయ ఎజెండాలను మాత్రం దీనికి దూరంగా పెట్టాలి’’ అని నిరసనకారుడు సుధీర్ సాల్వే తెలిపారు. సుధీర్ సాల్వే యువ అంబేద్కర్‌వాది, అంతేకాకుండా లా విద్యార్థి.. అతను లాంగ్ మార్చ్‌ను నడిపించే వారిలో ఓ కీలక వ్యక్తి కూడా..
భారతదేశవ్యాప్తంగా కేవలం దళితులు, ఆదివాసులకు వ్యతిరేకంగా దౌర్జన్యాలు, పోలీసుల హింస షరామాములుగా కొనసాగుతుంది. పోలీసులు ఎలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారో, నిందితులు ఎలా ప్రభుత్వాల చేత రక్షించబడుతున్నారో సామాజిక కార్యకర్తలు, లాయర్లు ఎప్పటి నుంచో నొక్కి చెప్తున్నారు. భారతదేశంలో జరిగిన నేరాలు, జైలు గణంకాలకు సంబంధించిన సమాచారాన్ని జాతీయ నేర గణంకాల సంస్థ (ఎన్సీఆర్బీ), నోడల్ ఏజెన్సీ సంగ్రహించింది. మహారాష్ట్ర రాష్ట్రంలో దళితులు, ఆదివాసులపైన ఓ పరంపరలా జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను ఈ డాటా వేలెత్తి చూపుతుంది. ఏదిఏమైనప్పటికీ డాటా ప్రకారం వీరిపై పెరుగుతున్న హింస తక్కువ భయాందోళనకు గురిచేస్తుంది(10% కంటే తక్కువ). ఘటనల సందర్భంలో ఘటనలు జరిగిన తర్వాత విచారణనను పోలీసులు తిరస్కరించడమే పెరుగుతున్న ఈ హింసకు, దౌర్జన్యానికి ప్రధాన కారణమని పలువురు పరిశోధకులు అన్నారు.
– సుకన్య శాంత
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.