
ఆక్స్‌ఫాం 2024 నివేదికలో కీలక విషయాలు
– వర్ధమాన దేశాల నుండి సంపన్న దేశాలకు సంపద తరలింపు
– గంటకు మూడు కోట్ల డాలర్లు
ప్రపంచంలో ఆర్థిక అసమానతలను అధ్యయనం చేస్తున్న ఆక్స్‌ఫాం 1990 నుండీ వార్షిక నివేదికలు విడుదల చేస్తోంది. 2024కు గాను విడుదల చేసిన నివేదికలో ఆర్థిక అంతరాలు అదుపుతప్పి ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని హెచ్చరించింది.
తాజా వార్షిక నివేదిక ప్రకారం 2023 కంటే 2024లో శతకోటీశ్వరుల సంపద మూడురెట్లు పెరిగిందని, నిరుపేదల పరిస్థితి మాత్రం 1990 నాటితో పోలిస్తే పెద్దమారిందేమీ లేదని నిర్ధారించింది. రానున్న దశాబ్దకాలంలో మరో ఐదుగురు లక్ష కోట్ల సంపద శిఖరంపై కూర్చోనున్నారని నివేదిక అంచనా వేసింది.
తాజా నివేదికలో శతకోటీశ్వరులు ఎలా శతకోటీశ్వరులు అవుతున్నారన్న విషయాన్ని లోతుగా అధ్యయనం చేసినట్లు ఆక్స్‌ఫాం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో శతకోటీశ్వరుల సంపదలో 60 శాతం కేవలం వారసత్వం ద్వారానో, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాల కారణంగానో, మార్కెట్‌పై గుత్తాధిపత్యం ద్వారానో వస్తుందే తప్ప వాళ్లేమీ కష్టించి సంపాదించినది కాదు. చరిత్రలో ఎన్నడూ చూడనంత అసమానతలతో కూడిన ప్రపంచం నేటికీ వలసపాలన నాటి దృశ్యాన్నే ప్రతిబింబిస్తోందని నివేదిక వ్యాఖ్యానించింది. వలసపాలన సంపన్నుల సంపద కూడబెట్టడానికి తోడ్పడ్డ తీరుకు సుదీర్ఘ చరిత్ర ఉందని నేటికీ దక్షిణార్ధగోళంలోని ఆర్థికంగా పేద దేశాల నుండి ఉత్తరార్ధగోళంలోని సంపన్న దేశాల్లో ఉంటున్న 1 శాతం జనాభాకు సంపద తరలిపోతూనే ఉందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అమలు జరుగుతున్న ప్రపంచీకరణ వలన వర్ధమాన దేశాల నుండి సంపన్న దేశాలకు గంటకు మూడు కోట్ల డాలర్ల విలువైన సంపద తరలిపోతోందని ఆక్స్‌ఫాం తెలిపింది. ఈ ధోరణిని నిలువరించి వెనక్కు మళ్లించకపోతే వర్ధమాన దేశాలు అతి త్వరలోనే పేదదేశాలుగా దిగజారి పోయే ప్రమాదం ఉందని కూడా ఆక్స్‌ఫాం హెచ్చరించింది.
రెండంచెల ప్రపంచం
ఆధునిక ప్రపంచంలో కేవలం వారసత్వం ద్వారా శతకోటీశ్వరులవుతున్న నయా కులీన వర్గం ఏర్పడుతున్న పరిణామాన్ని ఆక్స్‌ఫాం గుర్తించింది. ఇటువంటి నయా కులీన వర్గం ప్రపంచ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి కలిగి ఉన్నదని ఆక్స్‌ఫాం అంచనా వేసింది. పపంచ కుబేరుల వద్ద పోగుపడుతున్న సంపద 2024 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరిందని, వారానికి నలుగురు కొత్తగా శతకోటీశ్వరులు అవుతున్నారని నివేదిక తెలిపింది. మరోవైపున కార్మికవర్గం రోజు గడవటానికే కష్టపడుతోందని ఆక్స్‌ఫాం అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలు కోవిడ్ అనంతర పరిస్థితులు, యుద్ధం వంటి బహుముఖ సంక్షోభాల భారానికి నలిగిపోతున్నారని, పేదరికం తీవ్రత, అసమానతలు మరింతగా పెరుగుతున్నాయని గుర్తు చేసింది.
రానున్న వందేళ్లకు కూడా తగ్గనంత పేదరికం
ఈ మధ్యనే విడుదలైన ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేట్లు ఇప్పుడున్నంత రీతిలో కొనసాగి, ఆర్థిక అంతరాలు పెరగకపోతే ప్రస్తుతం ఉన్న పేదరికం పూర్తిగా నిర్మూలించటానికి వందేళ్లకుపైగా పడుతుంది. ప్రపంచ జనాభాలో కేవలం 8 శాతం మాత్రమే తక్కువ ఆదాయ అంతరాలున్న దేశాల్లో నివశిస్తునారని ఆక్స్‌ఫాం గుర్తించింది. ఆక్ఫ్ఫాం, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ పేదరికం తీవ్రత పెరిగిపోతోందని గుర్తించారు.
వలసవాదమే వర్ధమాన దేశాల పేదరికానికి పునాది
శ్రమతో సంబంధం లేకుండా సంపన్నులు తయారవడానికి కారణం ఆయా దేశాల్లోని పూర్వపు తరాలు వలసపానలో సాగించిన దోపిడీయేనని గుర్తు చేశారు. ప్రపంచ జనాభాలో కేవలం 20 శాతమే సంపన్న దేశాల్లో నివశిస్తున్నా శతకోటీశ్వరుల్లో 80 శాతం ఆ దేశాల్లోనే ఉన్నారని ఆక్స్‌ఫాం నివేదిక గుర్తుచేసింది. వలసవాదం వర్ధమాన దేశాల కార్మికవర్గపు దోపిడీని పతాక స్థాయికి తీసుకెళ్లిందని, జాత్యహంకారం, తెల్లజాతి గొప్పదనం వంటి విధానాల కారణంగా వందల కోట్ల జనాభా అణిచివేతకు, అవమానాలకూ గురైందని ఆక్స్‌ఫాం నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలను వలసవాద ఆర్ధిక దోపిడీ నుండి విముక్తి చేయటంతో పాటు నయా కులీనవర్గపు కబంధ హస్తాల నుండి విముక్తి చేయాలని పిలుపునిచ్చింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.