
న్యూఢిల్లీ: ఈ మధ్య దేశ రాజకీయాలు భవిష్యత్తు లో జరగబోయే ప్రమాదాలను ఊహించుకుని వివాదాలతో అట్టుడుకుతున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాల సరిహద్దులను మార్చడమనేది కొత్త జనాభా లెక్కల తర్వాత రాబోయే కొన్ని సంవత్సరాలలో జరిగే అవకాశం ఉంది. ఇది రాజకీయ అధికార అసమతుల్యతను ఏర్పరుస్తుందని దక్షిణ భారతం వాదిస్తోంది. అంతేకాకుండా ఈ చర్య దక్షిణాదికి అన్యాయం చేసి చట్టసభల్లో ఉత్తరాది ప్రభావాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్‌సభలో సీట్లు సాధారణంగా జనాభా ప్రాతిపాదికన విభజించబడతాయి. ఎక్కువ మంది అంటే సాధారణంగా ఎక్కువ సీట్లు. లోక్‌సభలో మెజారిటీ సీట్లను ఎవరు నియంత్రిస్తారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. కాబట్టి ఎక్కువ జనాభా ఉండటం ప్రధాన ప్రయోజనం.
కానీ అదుపులేని జనాభా పెరుగుదల శ్రేయస్సును, సామాజిక పురోగతిని దెబ్బతీస్తుంది. కాబట్టి 1976లో భారతదేశం డీలిమిటేషన్(నియోజకవర్గ సరిహద్దులను మార్చడం)ను ఆపింది. దీంతో రాజకీయ ప్రభావాన్ని వదులుకోకుండా నెమ్మదిగా జనాభా పెరుగుదలను కోరుకోవచ్చని రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. మొదట్లో 2001 వరకు నియోజకవర్గాల సరిహద్దులు, సంఖ్య వంటి విషయాల్లో మార్పులు లేకుండా కొనసాగాలని నిర్ణయించారు. కానీ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని పొడిగించారు. అంటే ప్రస్తుత సరిహద్దులు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి.
తర్వాత దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు సంతానోత్పత్తి రేటును రీ ప్రొడక్టివ్ స్థాయిలకు లేదా అంతకంటే తక్కువకు తగ్గించాయి. ఇంకా అక్షరాస్యత రేట్లు, ఆరోగ్య సంరక్షణ, మాతా శిశు మరణాలు, లింగ సమానత్వంతో సహా మానవ అభివృద్ధి సూచికలలో గణనీయమైన పురోగతిని సాధించాయి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలలో ఇటువంటి అంశాలతో పాటు కుల వివక్ష, నిరుద్యోగం, ఆర్థిక వృద్ధి పరంగా అధ్వాన్నమైన పరిస్థితి నెలకొంది. కానీ ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా మాత్రం పెరుగుతూనే ఉంది.
“ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ” అనే బాగా స్థిరపడిన సూత్రం ప్రకారం పార్లమెంటులోని ప్రతి సభ్యుడు దాదాపు ఒకే సంఖ్యలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి. ఒక ఎంపీ కేవలం 1.8 మిలియన్ల కేరళీయులకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరొక ఎంపీ ఉత్తరప్రదేశ్‌లో 2.7 మిలియన్ల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుండటం అప్రజాస్వామికమని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
“జనాభా ఆధారంగా మాత్రమే ప్రాతినిధ్యం వహించడం వల్ల ఉత్తరాది రాష్ట్రాల జనాభా పెరుగుదలకు సమర్థవంతంగా ప్రతిఫలం లభిస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలు తమ జనాభాను స్థిరీకరించాయి. అభివృద్ధిలో ముందున్నాయి. ఇటువంటి మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం శిక్షిస్తుంది” అని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే, దక్షిణాది రాష్ట్రాలు ఇదే కారణంతో కేంద్ర పన్ను ఆదాయంలో తమ వాటా తగ్గడాన్ని గమనిస్తున్నాయి.
సజాతీయ సమాజంలో ప్రాతినిధ్యం నిర్ణయించడానికి జనాభా సరిపోతుంది. కానీ చాలా వైవిధ్యమైన సమాజంలో అది సరిపోదు. అందుకే యునైటెడ్ స్టేట్స్ జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి రెండు సెనేట్ సీట్లను కేటాయిస్తుంది. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ “అధోకరణ ప్రాతినిధ్యం( డిగ్రెసివ్ ప్రపొర్షనాలిటీ)” అనే సూత్రం కింద చిన్న సభ్య దేశాలకు యూరోపియన్ పార్లమెంట్లో వారి జనాభా వాటా కంటే ఎక్కువ సీట్లను కేటాయించింది. భారతదేశంలో కూడా, ఈశాన్యంలోని చిన్న రాష్ట్రాలైన గోవా, అండమాన్, డయు ఇంకా లక్షద్వీప్ వంటి ప్రాంతాలలో పెద్ద రాష్ట్రాల కంటే తలసరి ఎంపీలు ఎక్కువగా ఉన్నారు.
భారతదేశం భాషలు, మతాలు, జనాభా ప్రొఫైల్‌లు ఇంకా అభివృద్ధి స్థాయిలలో విస్తారమైన వైవిధ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా భారతదేశ “క్వాసీ-ఫెడరల్” వ్యవస్థలో రాష్ట్రాలు కొంత మొత్తంలో అధికారాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, సమాన ప్రాతినిధ్యం ముఖ్యమైనదే అయినప్పటికీ రాష్ట్ర స్వయంప్రతిపత్తి ఇంకా సాంస్కృతిక వైవిధ్యాన్ని కూడా గౌరవించాలి. దీని అర్థం ఒక సమూహం(ఉత్తరాది నుండి హిందీ మాట్లాడేవారు)ఇతరుల అవసరాలు, ప్రాధాన్యతలు, అనుభవాలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడంలో ఆధిపత్యం చెలాయించలేరని నిర్ధారించుకోవడం.
కొత్త సరిహద్దుల విభజనలో దక్షిణాది వారు ఒక్క సీటు కూడా కోల్పోరని హోంమంత్రి అమిత్ షా హామీ ఇస్తున్నారు. కానీ దీని అర్థం బిజెపికి మద్దతు కేంద్రీకృతమై ఉన్న ఎక్కువ జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ప్రభుత్వం మరిన్ని సీట్లను సృష్టిస్తుంది. లోక్‌సభను 543 సభ్యుల నుండి 753కు విస్తరించవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. మరికొందరు కొత్త పార్లమెంటు భవనంలో 888 లోక్‌సభ ఎంపీలకు స్థలం ఉందని అశుభంగా పేర్కొన్నారు. ఇది జరిగితే, దక్షిణాది రాష్ట్రాల సాపేక్ష రాజకీయ ప్రభావం తగ్గుతుంది. భారతదేశం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలపై చర్చకు కీలకమైన వేదిక బలహీనపడుతుంది. పార్లమెంటరీ చర్చల ప్రమాణాలు క్షీణిస్తున్న తీరు చూసి ఇప్పటికే కొందరు నిరాశ చెందుతున్నారు. గణనీయంగా విస్తరించిన లోక్‌సభ చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ లాంటిదిగా మారుతుంది. అర్థవంతమైన చర్చకు ఇది చాలా పెద్ద సంస్థ, ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించడానికి విధిగా వదిలివేయబడింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలో దక్షిణ భారత రాష్ట్రాలు ప్రస్తుత ఏర్పాటును మరో 25 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేయడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశాయి. కానీ ఈ ఏర్పాటు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పలచన చేస్తుంది. ఎందుకంటే, ప్రతి పౌరుడికి ప్రాతినిధ్యం సమానంగా ఉండదు. సమస్య ఏంటంటే జనాభా గణన ఆధారంగా మాత్రమే సూత్రాన్ని మార్చడం భారత ప్రజాస్వామ్యానికి అంతే నష్టం. ఇది జాతీయ సామరస్యాన్ని, ఐక్యతను దెబ్బతీస్తుంది.
దక్షిణాది ప్రజలు రాజకీయంగా హక్కులను కోల్పోయినట్లు భావిస్తే, వారు అధికారాన్ని వికేంద్రీకరించడానికి ఇంకా రాష్ట్రాలకు మరింత స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి రాజ్యాంగ ఏర్పాట్లను డిమాండ్ చేయడం ప్రారంభించవచ్చు. ఈ పిలుపులను వినకపోతే, పాటించకపోతే, దక్షిణాదిలోని కొంతమంది విభజన కోసం ఒత్తిడి చేయడం కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది.
భారతదేశం ఐక్యంగా ఉత్తమంగా పనిచేస్తున్నందున ఇది ప్రతిపాదనలు ఎవ్వరికీ ఉపయోగపడేవి కావు. ఉత్తర, దక్షిణ ప్రాంతాలు ఒకదానికొకటి అవసరం. యువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు, అందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా మరింత పారిశ్రామికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలకు కార్మికులను అందించగలవు.
ప్రస్తుత వివాదం భారత రాష్ట్రాల పరస్పర ఉపయోగకరమైన పరిష్కారాన్ని కనుగొనడం ద్వారా భారత ఐక్యతను పునరుద్ఘాటించడానికి, మరింత గాఢ మైన ఐక్యతగా మార్చడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. సమతుల్యత, సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉత్తర- దక్షిణ ఉద్రిక్తతలను తగ్గించడం లక్ష్యం కావాలి. ఈ లక్ష్యం కోసం భారతదేశానికి రెండు వైపులా మరింత సంభాషణ, గొప్ప రాజనీతిజ్ఞత అవసరం.
శశి థరూర్
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.