
ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత వారికి ఏ హక్కులు ఉంటాయో తెలుసుకోవాలని దేశంలోని ప్రతి పౌరుడికి ఉంటుంది. ఎందుకంటే అనుకోకుండా ఎవరికైనా సమస్య ఎదురైనప్పుడు దానిని పరిష్కరించుకోవడానికి లేదా ఇతరుల సమస్యను పరిష్కారించడానికి, ఏ ఏ హక్కులు ఏ ఉద్దేశంతో ఉన్నాయో తెలుసుకోవాలంటే చట్టాల మీద అవగాహన చాలా అవసరం. ఇటువంటి విషయాల మీద అవగాహన ఏర్పరుచుకోవడం భారతదేశ ప్రతి పౌరుడి బాధ్యతలో భాగం కూడా.
2024 జులై 1 నుంచి కొత్త చట్టం భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్) అమలులోకి వచ్చింది. బీఎన్ఎస్ఎస్, భారత రాజ్యాంగం ఆధారంగా ఈ హక్కుల గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే, నిందితుడు లేదా అరెస్ట్ అయిన వ్యక్తి రక్షణ కోసం చట్టంలో భాగంగా ఈ హక్కులు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి.
అరెస్ట్ తర్వాత ఉండే హక్కులు ఏంటంటే!
అరెస్ట్ కారణం తెలుసుకునే హక్కు:
భారత రాజ్యాంగం ఆర్టికల్ 22(1), బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 50 ప్రకారం అరెస్ట్ చేసిన వెంటనే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో అరెస్ట్ అయిన వ్యక్తికి స్పష్టంగా చెప్పాలి. ఆ వ్యక్తిపై ఆరోపణలు ఏంటో, ఏ నేరం కింద అరెస్ట్ చేశారో తనకు వివరించాలి.
24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరు:
బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 57 ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు అతనిని సమీపంలోని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి(ప్రయాణ సమయం మినహాయించి). ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2)లో కూడా ఉంది. దీన్ని ఉల్లంఘిస్తే అరెస్ట్ చట్టవిరుద్ధం అవుతుంది.
లాయర్‌తో మాట్లాడే హక్కు:
ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి తను నమ్మే న్యాయవాదిని సంప్రదించే, అతని సలహా తీసుకునే హక్కు ఉంది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 41డీ కూడా దీన్ని బలపరుస్తుంది. దర్యాప్తు సమయంలో న్యాయవాది అక్కడే ఉండేటటువంటి అవకాశం కూడా కల్పించాలి.
కుటుంబం లేదా స్నేహితులకు సమాచారం ఇచ్చే హక్కు:
బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 50(2) ప్రకారం అరెస్ట్ గురించి అరెస్ట్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు లేదా ఆ వ్యక్తి నామినేట్ చేసిన వ్యక్తికి పోలీసులు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ సమాచారం వెంటనే లేదా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలి.
మౌనంగా ఉండే హక్కు:
భారత రాజ్యాంగం ఆర్టికల్ 20(3) ప్రకారం ఎవరి మీద కూడా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయలేరు. అంటే, పోలీసు దర్యాప్తులో ఇష్టం లేకపోతే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండవచ్చు.
బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కు:
ఎవరిపైనా ఆరోపణలు బెయిలబుల్ నేరానికి సంబంధించినవైతే, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 478 ప్రకారం బెయిల్ తీసుకునే హక్కు ఉంటుంది. నాన్ బెయిలబుల్ నేరం అయితే సెక్షన్ 479 ప్రకారం కోర్టులో బెయిల్ కోసం అర్జీ పెట్టుకోవచ్చు.
మానవీయంగా చూసుకోవడం:
అరెస్ట్ తర్వాత పోలీస్ కస్టడీలో అరెస్ట్ అయిన వ్యక్తికి ఆహారం, నీళ్లు, వైద్య సహాయం వంటి ప్రాథమిక అవసరాలు అందించాలి. నిందితుడితో అవమానకరంగా లేదా హింసాత్మకంగా వ్యవహరించకూడదు.
ఆరోగ్య పరీక్ష హక్కు:
సెక్షన్ 479 సెక్షన్ 54 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తిని వైద్య పరీక్షకు పంపాలి. ముఖ్యంగా గాయాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే. మహిళలైతే, మహిళా వైద్యురాలు లేదా ఆమె సమక్షంలో పరీక్ష జరగాలి.
అరెస్ట్ వివరాలు రాతపూర్వకంగా తెలుసుకునే హక్కు:
బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 50(1) ప్రకారం అరెస్ట్ కారణాలను పోలీసులు రాతపూర్వకంగా అరెస్ట్ అయిన వ్యక్తికి ఇవ్వాలి. అదనంగా అరెస్ట్ మెమో తయారు చేయాలి. దాంట్లో అరెస్ట్ సమయం, తేదీ, స్థలం వంటి వివరాలు ఉంటాయి. దీన్ని సాక్షి సంతకంతో ధ్రువీకరించాలి.
అక్రమ అరెస్ట్‌పై ఫిర్యాదు చేసే హక్కు:
ఒకవేళ అరెస్ట్ చట్టవిరుద్ధంగా జరిగితే, అంటే ఆధారాలు లేకుండా సమయ పరిమితులు పాటించకపోతే, ఆర్టికల్ 32 లేదా 226 ఆధారంగా కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
గమనించాల్సిందేంటంటే..
మహిళలకు అదనపు రక్షణ: బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 43(2) ప్రకారం మహిళలను అరెస్ట్ చేసేటప్పుడు మహిళా పోలీసు ఉండాలి. ఇంకా రాత్రి సమయంలో మహిళలను అరెస్ట్ చేయడంపై పరిమితులు ఉన్నాయి(పైన వివరించినట్లు).
పిల్లలకు ప్రత్యేక హక్కులు: 18 ఏళ్ల లోపు వారిని అరెస్ట్ చేస్తే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం ప్రత్యేక ప్రక్రియను అనుసరిస్తారు.
అరెస్ట్ తర్వాత అరెస్ట్ అయిన వారి హక్కులు రాజ్యాంగం, బీఎన్ఎస్ఎస్ ద్వారా రక్షించబడతాయి. పోలీసులు ఈ హక్కులను ఉల్లంఘిస్తే, న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
శ్రీనివాస్ రావు
అడ్వకేట్
8885040094
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.