
భారతదేశంలో పోలీసుల అఘాయిత్యాలు, కస్టడీ హత్యలు, ఎన్కౌంటర్లు వంటి ఘటనలు నిత్యకృత్యమైయ్యాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని తరచూ వార్తలలో చూస్తున్నాము, చదువుతున్నాము. ఇటువంటి సందర్భంలో “పోలీసింగ్ అండ్ వాయిలెన్స్ ఇన్ ఇండియా” అనే పుస్తకం ముద్రితం అయ్యింది. ఇది సకాలంలో వచ్చిన బహుళ వివరణాత్మక గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఈ పుస్తకానికి డీనా హీత్, జినీ లోకనీతా కలిసి సంపాదకీయులుగా ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎలా అణచివేతకు మారు పేరుగా మారిందో, ప్రజల రక్షణకోసం కాకుండా శాసనానికి మార్గం కల్పించేందుకు ఎలా తయారైందో అనే విషయాలను ఈ గ్రంథం చారిత్రకంగా, న్యాయపరంగా, రాజకీయ దృష్టి కోణంలో విశ్లేషిస్తుంది.
బ్రిటిష్ పాలనలో ఇండియన్ పోలీస్ యాక్ట్‌ను 1861లో ఏర్పాటు చేశారు. దాన్నే ఇప్పటికీ మార్చకుండా కొనసాగిస్తున్నారు. ఇటువంటి అంశాలను ప్రస్తావిస్తూ, భారతదేశంలో పోలీసు వ్యవస్థలోని వలస పునాదుల ప్రభావాన్ని పుస్తకం నొక్కి చెపుతుంది. ప్రజాస్వామ్య దేశంగా మారిన భారత్‌లోనూ పోలీసులు ప్రజల రక్షకులుగా కాకుండా, ప్రజలపై నిఘా పెట్టి, వారిని నియంత్రించే శక్తిగా పనిచేస్తున్నారు. ఈ చట్టం ఆధారంగా ఏర్పడిన వ్యవస్థలో, పోలీసులకు శిక్షణా విధానం, నిర్బంధం, శారీరక హింస సహజంగా మారాయని పుస్తకం ద్వారా తెలుస్తుంది.
2019లో నేషనల్ క్యాంపెయిన్ అగెయినస్ట్ టార్చర్ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఆ సంవత్సరం దేశవ్యాప్తంగా 1,731 కస్టడీ మరణాలు చోటుచేసుకున్నాయి. అంటే ప్రతి రోజూ ఐదు మందికి పైగా నిందితులు పోలీసుల కస్టడీలో చనిపోతున్నారు. 2020లో జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మరణాలలో 80 శాతానికి పైగా శారీరక హింసకు గురైనవే ఉన్నాయి. అయినప్పటికీ బాధ్యులపై గట్టిగా చర్యలు తీసుకునే సందర్భాలు అరుదేనని చెప్పాలి.
చాలా సందర్భాల్లో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, చట్టాన్ని ఉల్లంఘించినందుకు పురస్కారాలు అందుకున్నారు. అంతేకాక వారికి చట్టపరంగా, డిపార్ట్మెంట్ పరంగా శిక్షలు కూడా లేవు. పైగా అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ఈ మధ్య అన్ని భాషల్లో విడుదల అవుతున్న సినిమాల్లో చట్టాన్ని ధిక్కారించిన పోలీస్ హీరోలకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ప్రజలు కూడా పోలీసులు చట్టాలు, కోర్టులు అంటూ కాలయాపన కంటే సత్వర న్యాయం కావాలని కోరుకొనేలా సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమా హీరోలు కూడా స్మగ్లర్ల వేషాలతో ప్రజలు మన్నన పొందుతున్నారు.
అయితే ఈ పుస్తకంలో కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి ఘర్షణాత్మక ప్రాంతాల నుంచే కాకుండా ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో కూడా పోలీసుల హింస ఎలా సర్వసాధారణమైందో వివరణాత్మకంగా ఉంది. పేదలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు పోలీసుల ఆగ్రహానికి ముఖ్యమైన లక్ష్యంగా మారుతున్న వాస్తవాన్ని పుస్తకంలో పరిశీలనాత్మకంగా రచయితలు తెలుపుతారు. ఇది వ్యక్తిగత విద్వేషం వల్ల కాదు, కానీ వ్యవస్థాపిత రీతిలో క్రిమినలైజ్ చేయబడిన సమాజ నిర్మాణమే ఇందుకు కారణమని రచయితలు విశ్లేషణాత్మకంగా తెలిపారు.
అసలు, పోలీసుల హింసను చట్టాలు ఏ విధంగా సమర్థిస్తున్నాయన్నది ఒక కీలక అంశం. ఉదాహరణకు యుఏపీఏ(అన్ లా ఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్), పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ వంటి చట్టాలు ప్రజల రక్షణకే కాదు, దమనకాండకి మార్గం కల్పించడానికే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని రచయితలు వివరించారు. అంతేకాకుండా బాధితుల అనుభవాలు దీనిని నిరూపిస్తాయి. 2006కు సంబంధించిన ముంబయి రైలు బాంబు కేసులో అర్థంలేని ఆరోపణలతో అరెస్ట్ చేయబడిన అబ్దుల్ వహీద్ షేక్ తన అనుభవాలను ఈ పుస్తకంలో పంచుకున్నారు. పోలీసులు చేసిన హింస, న్యాయవ్యవస్థ నిర్లక్ష్యం గురించి ఆయన చెప్పిన విషయం వినడం తట్టుకోలేనిది.
ఈ సంకలన గ్రంథం పోలీసు సంస్కరణలను కేవలం పరిపాలనా సమస్యగా చూడదు. ఇది రాజకీయ వ్యవస్థలోని లోపాలను ఎదుర్కొంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ భారత దేశం అధికారాన్ని భద్రపరచుకునే పేరుతో పోలీసు వ్యవస్థను నియంత్రణ సాధనంగా ఉపయోగిస్తోంది. 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకాశ్ సింగ్ తీర్పు ప్రకారం పోలీసుల పనులను విభజించడం, స్వతంత్ర పోలీస్ పర్యవేక్షణ మండళ్లు ఏర్పాటుచేయాలని ఆదేశించినప్పటికీ, చాలా రాష్ట్రాలు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయి.
ఇంకా పోలీసుల వృత్తి పరమైన సమస్యలను కూడా ఈ గ్రంథం ఉటంకిస్తుంది. 2019లో పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరో వెల్లడించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 24 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 75 శాతం పోలీసులు రోజుకు 12 గంటలకు పైగా పని చేస్తున్నారు. అలాంటి స్థితిలో శిక్షణా లోపాలు, ఒత్తిడి, రాజకీయ వత్తిళ్లు, కుటుంబ సమస్యలు, సెలవులు దొరక్కపోవడంతో చికాకు, అసహనం, మానసిక ఒత్తిళ్ళు ఈ వ్యవస్థను మరింత భయానకంగా మారుస్తున్నాయి. పోలీసులలో రాక్షసత్వం పెరగటానికి పని పరిస్థితులు కూడా కారణమే.
ఇప్పుడు సమాధానం శిక్షణలతోనో సాంకేతిక పరికరాలతోనో సాధ్యపడదని రచయితలు అంటారు. ఇది ప్రజల హక్కులను గౌరవించేలా, బాధ్యత కలిగిన ప్రజాస్వామ్య పోలీసు వ్యవస్థగా మారాలంటే, వలస హింసా సంస్కృతిని పూర్తిగా తొలగించాల్సిందే.
స్వతంత్ర పర్యవేక్షణ, హింసపై గట్టి శిక్షలు, సామాజిక న్యాయంపై దృష్టి ఉండే విధంగా పోలీస్ వ్యవస్థను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది.”పోలీసింగ్ అండ్ వాయిలెన్స్ ఇన్ ఇండియా” పుస్తకం ఒక విద్యావంతమైన అధ్యయనంగా మాత్రమే కాకుండా, భారతదేశపు ప్రభుత్వ యంత్రాంగానికి తమ ముఖాన్ని చూపించే అద్దంలా పనిచేస్తుంది. ప్రజాస్వామ్యం అనే మాటను గౌరవించాలంటే ‘శాంతి కాపాడటానికి హింస అవసరం’ అనే సూత్రాన్ని వ్యతిరేకిస్తూ సత్యం, న్యాయం, సమానత్వం అనే విలువలను సమర్థించాల్సిన అవసరం ఉందని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
9849328496
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.