
2015 సర్వే ప్రకారం, 76.99 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారు ప్రస్తుతం OBC కోటా కింద ఉన్న కేటగిరీ 2Bలో 4 శాతం రిజర్వేషన్ను పొందుతున్నారు.
బెంగళూరు: కర్ణాటకలోని రెండు ఆధిపత్య మైనారిటీ వర్గాలపై ఆసక్తికరమైన అంతర్దృష్టులను కలిగిన సామాజిక, విద్యా సర్వే లేదా కులగణన ప్రకారం, ముస్లింలలో 99 ఉప కులాలు ఉండగా, క్రైస్తవులలో తమను తాము ‘బ్రాహ్మణ’, ‘వొక్కలిగ’గా గుర్తించుకునే వారు కూడా ఉన్నారు.
2015 సర్వే ప్రకారం, 76.99 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారు ప్రస్తుతం OBC కోటా కింద ఉన్న కేటగిరీ 2Bలో 4 శాతం రిజర్వేషన్ను పొందుతున్నారు.
కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ కేటగిరీ 2బీకి రిజర్వేషన్లను 8 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది.
సర్వేలో మొత్తం 59 లక్షల మంది ముస్లింలు తమను తాము కేవలం ‘ముస్లింలు’గానే గుర్తించుకున్నారు. మిగిలిన వారు వేర్వేరు పేర్లను ఉపయోగించి తమను తాము లెక్కించుకోవడానికి ఎంచుకున్నారు.
అత్తారి, బాగ్బాన్, చప్పర్బంద్, దర్జీ, ధోబీ, ఇరానీ, జోహారీ, కలైగర్, మొఘల్, పట్టేగర్, ఫూల్ మాలి, రంగ్రేజ్, సిపాయి, తకంకర్ ఇంకా తేలీ అనేవి గణన సమయంలో ముస్లింలు చెప్పిన పేర్లలో ఉన్నాయి.
ఉప సమూహాలలో షేక్ ముస్లింలు 5.5 లక్షల జనాభాతో అతిపెద్దవారు, తరువాత సున్నీ ముస్లింలు 3.49 లక్షలుగా ఉన్నారు.
శివాజీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ ముస్లింలలో 99 ఉప కులాలు ఉండటం ఆశ్చర్యం కలిగించదని అన్నారు.
“వీరు మతం మారిన వ్యక్తులు. కానీ వారి వృత్తులను నిలుపుకున్నారు.” అని ఆయన డీహెచ్కి చెప్పారు. “ఉదాహరణకు, నేత కార్మికులుగా ఉన్న అన్సారీలు ఉన్నారు”.
సర్వేలోని జనాభా గణాంకాల గురించి ముస్లిం సమాజం ఆందోళన చెందడం లేదని రిజ్వాన్ తెలిపారు. “మమ్మల్ని గౌరవంగా చూసుకోవడం, మనం సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం” అని ముస్లిం రిజర్వేషన్లను 8 శాతానికి పెంచాలనే సిఫార్సును స్వాగతిస్తూ ఆయన చెప్పారు.
‘ముస్లిం’ సమాజం కేటగిరీ-2B కింద ఉంది. పింజారా, నదాఫ్ వంటి దాని ఉప కులాలు కేటగిరీ-1 కిందకు వస్తాయి. ఇంకా ఫూల్ మాలి కేటగిరీ-2A కింద ఉన్నాయి, ఈ వర్గాలకు వరుసగా 4 శాతం ఇంకా 15 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.
క్రైస్తవులు
2015 సర్వే ప్రకారం, 9.47 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. వారు 57 ఉప కులాలుగా విభజించబడ్డారు. ప్రస్తుతం క్రైస్తవులు లింగాయత్లతో పాటు 5 శాతం రిజర్వేషన్లతో కేటగిరీ-3B కిందకు వస్తున్నారు. ఈ వర్గానికి కమిషన్ 8 శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేసింది.
7.71 లక్షల మందిని ‘క్రైస్తవులు’గా లెక్కించగా, మిగిలిన వారు వివిధ నామకరణాలను ఉపయోగించారు.
నమూనా చెప్పుకుంటే మాదిగ క్రైస్తవుడు, బిల్లవ క్రైస్తవుడు, బ్రాహ్మణ క్రైస్తవుడు, ఈడిగ క్రైస్తవుడు, జంగమ క్రైస్తవుడు, కమ్మ క్రైస్తవుడు, కురుబ క్రైస్తవుడు, వొక్కలిగ క్రైస్తవుడు ఇంకా వాల్మీకి క్రైస్తవుడు.
బిజెపి మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి అనిల్ థామస్ సంఖ్యలను, పేర్లను వివాదం చేశారు.
“2011 జనాభా లెక్కల ప్రకారం 11.44 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ సంఖ్య సహజంగానే పెరిగి ఉండాలి. మూడు లక్షల తగ్గుదల ఎలా ఉంటుంది?” అని థామస్ సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో 35 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారని ఆయన సొంత అంచనా.
“క్రైస్తవ మతంలో కులాలు లేవు. ఒక వ్యక్తి కులం ద్వారా, ఆ మతం ద్వారా గుర్తించబడినప్పుడు, అతను ఆ కులానికి చెందినవాడవుతాడు” అని థామస్ అన్నారు. క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్ కులాలు ఇప్పటికే కేటగిరీ-1 కింద ఉన్నాయని బిజెపి నాయకుడు ఎత్తి చూపారు. “రెండు పడవలపై ప్రయాణించే ఈ ఇతరులు ఎవరు?” అని ఆయన ప్రశ్నించారు.
భరత్ జోషి, డెక్కన్ హెరాల్డ్ సౌజన్యంతో
అనువాదం : అంజనేయరాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.