
పంతొమ్మిదవ శతాబ్దం చివరికాలం నుంచి యూరప్ దేశాల్లో అమలవుతున్న సామాజిక సంక్షేమ పథకాలు అన్నీ ప్రధానంగా కార్మికులు- యజమాన్యాల జీతభత్యాల నుంచి ఇస్తున్న ఆర్థిక తోడ్పాటు మూలంగానే అమలవుతున్నాయి. వయసు మీద పడ్డాకో, అనారోగ్యం పాడైనప్పుడో, ప్రసూతి సమయంలోనో, నిరుద్యోగిగా ఉన్నప్పుడో వారికి ఆదాయం గడించే మార్గాలు ఉండనందున వారి వారి జీవన ప్రమాణాలు నిలబెట్టడానికి ఈ సంక్షేమ పథకాలు ఆసరా ఇస్తున్నాయి.
కోవిడ్ 19 ఉత్పాతం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, యూరప్, మధ్య ఆసియా, ఆఫ్రికా ఖండాలలో నెలకొన్న యుద్ధాల మూలంగా జీవన వ్యయాలు అపరిమితంగా పెరిగిపోయాయి. దాంతో సామాజిక సంక్షేమ పథకాల కొనసాగింపు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. దీని పర్యవసనంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు, పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను సంభాళించడానికి ప్రభుత్వాలు సార్వజనీన సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజలందరికీ ఊరట కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అయితే, గతంలో కంటే సార్వజనీన సంక్షేమ పథకాల అమలు అవసరం ప్రస్తుతం మరింతగా పెరిగింది. ఇటువంటి కాలంలో ఉన్న సామాజిక సంక్షేమ పథకాలకే ఎసరుపెట్టే ధోరణులు పెరుగుతా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఉత్పాదక పెట్టుబడిదారీ విధానం నుంచి ద్రవ్యపెట్టుబడిదారీ విధానం వైపు మరలడం, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంలో వేగవంతమైన అభివృద్ధి, యాంత్రీకరణ పెరగడం, కృత్రిమమేధలతో పాటు భౌగోళిక మార్పులు ఇవన్నీ కలిసి సామాజిక సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చే మార్గాలు, ఈ పథకాల అందచేతకు విధించిన షరతులు, అర్హుల నిర్ధారణవంటి అంశాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి సార్వజనీన సంక్షేమ పథకాలను దీర్ఘకాలం పాటు అమలు అయ్యేలా చూడడానికి సృజనాత్మక పరిష్కారాలు కనుగొనాలి.
ఉత్పత్తి చెయ్యడానికి, సంపద సృష్టించడానికి చారిత్రకంగా కార్మికవర్గం అవసరం ఎంతైనా ఉంది. కానీ, ఇవాళ పేరొందిన కంపెనీలన్నీ మానవశ్రమ మీద కంటే సాంకేతిక పరిజ్ఞానం, ద్రవ్యపెట్టుబడి మీద ఎక్కువగా ఆధారపడి తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి. ఉత్పాదకత పెరుగుదలతో సమానంగా జీతభత్యాలు పెరగకపోగా ప్రతిష్టంభన నెలకొంది. సామాజిక సంక్షేమ పథకాలకు అందాల్సిన నిధులు కార్మికుల జీతభత్యాల మీద ఆధారపడి ఉన్న కారణంగా లేబర్- ఇంటెన్సివ్ కంపెనీల మీద ఈ ఆర్థికభారం ఎక్కువగా పడుతుంది. తక్కువ మంది కార్మికులతో నడిచే కంపెనీలు ఎక్కువ లాభాలు గడిస్తున్నాయి.
దానికి తోడు జనాభాలో వయసు మళ్లిన వారు పెరగడం, జననాల రేటు తగ్గిపోవడం జరుగుతుంది. ఇటువంటి భౌగోళిక కారణాల రీత్యా కూడా ఆయా దేశాల్లోని కార్మికులు, యాజమాన్యాలు సంక్షేమ పథకాలకు మరింత ఎక్కువగా తోడ్పాటు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో నూతన ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఇదే సందర్భంలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ తదితర అసంఘటిత రంగాలకు పనులు బెత్తాయించిన కంపెనీలకు ఆ కార్మికుల పట్ల బాధ్యతవహించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయా కంపెనీలకు సామాజిక సంక్షేమ పథకాలకు పెద్దగా నిధులు సమకూర్చాల్సిన అవసరం లేకుండా పోతుంది.
సామాజిక సంక్షేమ పథకాల అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను అనుసరించి కార్మికులు సామాజిక సంక్షేమ పథకాల మొత్తం వ్యయంలో సగానికి మించి చెల్లించకూడదు. మిగిలిన మొత్తం యాజమాన్యాలు భరించాలి. అయితే, బలాబలాల పొందికలో వచ్చిన మార్పుల మూలంగా లాభాలు గడించడం కార్మిక శ్రమ మీద కాకుండా పెట్టుడి మీద ఆధారపడడం ఎక్కువ అయ్యింది. దీంతో పైన పేర్కొన్న ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది.
ఈ సవాళ్లను సానుకూలంగా పరిష్కరించాలంటే ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలు గడించే లాభాల మీద అదనపు పన్నులు విధించడాల ద్వారా సంక్షేమ పథకాలకు అదనపు నిధులు రాబట్టాలి. ప్రపంచవ్యాప్తంగా కనీస కార్పోరేట్ పన్నులు విధించడం, పన్నురేట్లను సర్వసాధారణీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఇదొక్కటే సరిపోదు. ఆరోగ్య సంరక్షణ, మాతా- శిశు సంరక్షణ, విద్యా శానిటేషన్ తదితర రంగాలకు ప్రభుత్వాలు చేసే కేటాయింపులు దీర్ఘకాలిక లక్ష్యాలకు లోబడి ఉండాలి, పెరగాలి.
సంక్షోభ కాలంలో మధ్య తరగతి జనాభా జీవన ప్రమాణాలు దిగజారిపోకుండా నిలవరించాలంటే పన్నుల విధింపుతో ఫ్లాట్రేట్ విధానం ప్రవేశపెట్టాలి. పన్ను చెల్లింపుదార్లకు లబ్ధి చేకూర్చాలి. ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో సగటు డిమాండ్ పడిపోకుండా నిలబెట్టడానికి చేపట్టే సమగ్ర ఆర్థిక విధానంలో భాగంగానే ఏ ప్రభుత్వమైనా దీన్ని అనుసరించాలి. పేదరికం తగ్గింపు ఎంత ప్రాధాన్యమో, సామాజిక సంక్షేమ పథకాల అమలు కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుందని ప్రభుత్వాలు గ్రహించాలి.
సార్వజనీన సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి కార్పోరేట్ పన్నులను వెచ్చించడంతో పాటు ఈ పథకాలకు కార్మికులు, యాజమాన్యాలు చెల్లించే దామాషా రేట్లను కూడా సవరించాలి. యాజమాన్యాలు చెల్లించాల్సిన వాటా కేవలం కార్మికులకు చెల్లించే జీతభత్యాల మీద మాత్రమే కాకుండా ఆయా కంపెనీల పెట్టుబడి సామార్థ్యం కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆయా కంపెనీల అమ్మకాలు, పెట్టుబడులు ఆర్జించిన లాభాలు వంటి అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. పెట్టుబడులు అంటే కార్మికశక్తిని తొలగించడానికి ప్రవేశ పెట్టిన యాంత్రీకరణ, కృత్రిమమేధల ఆధారంగా కంపెనీకి ఒనకూడిన లాభాలను పరిగణలోకి తీసుకోవాల్సిన పెట్టుబడులు అని అర్థం.
ఈ రకంగా పెట్టుబడి ప్రేరక కంపెనీల మీద అదనపుపన్నులు విధించడంతో సామాజిక సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు సమకూరడంతో పాటు ఉపాధిరహిత పరిశ్రమల వ్యాప్తిని నిలువరిస్తుంది. అలాగే కార్మిక వర్గం మీద ఆర్థిక భారాలనూ తగ్గిస్తుంది. అసంఘటిత రంగంలోను, స్వయం ఉపాధి మీద ఆధారపడి ఉన్న కార్మికవర్గానికి సామాజిక సంక్షేమ పథకాల లబ్ధిని అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు, పెట్టుబడి ప్రేరక కంపెనీలకు కార్మికశక్తి ప్రేరక కంపెనీలకు మధ్య నెలకొని ఉన్న అసమ పోటీని సరిచేసేదానికి ఉపకరిస్తుంది.
సామాజిక సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు సమకూర్చడానికి పెట్టుబడుల మీద పన్నులు విధించడం కొత్తకాదు, మొదటిసారి కూడా కాదు. పోర్చుగల్‌లో కాంట్రాక్టర్లు తాము సేవలు అందుకునే కార్మికుల సంక్షేమం కోసం తమ వంతు వాటా చెల్లిస్తుంటారు. ఇండియా, ఇండోనేషియా దేశాలలో నిర్మాణరంగ కార్మికులకు పని ప్రదేశంలో జరిగే ప్రమాదాలకు, దుర్మరణాలకు పరిహారం చెల్లించే వ్యవస్థ అందుబాటులో ఉంది. అలాగే అనేక దేశాలలో ‘గిగ్’ కార్మికుల సంక్షేమం కోసం ‘ఫ్లాట్‌ఫాం’ కంపెనీలు చేసే ప్రతి లావాదేవి మీద కానీ, టర్నోవర్ మీద కాని పన్నులు విధించే విధానం అమలులో ఉంది. బ్రెజిల్లో నిరుద్యోగ భృతి నిధికి ఆ దేశంలో ఉన్న కంపెనీలు వాటివాటి ఆదాయాలకు అనుగుణంగా నిర్దేశిత వాటాను చెల్లిస్తున్నాయి.
ఆర్థి కార్యకలాపాలు, పని స్వభావాల్లో వచ్చే మార్పులకు గాను సామాజిక రక్షణ కల్పించడం అనేది సుదీర్ఘకాలంగా అమలులో ఉన్నదే. శ్రామిక మార్కెట్లలో ప్రస్తుతం వస్తున్న మార్పులకు అనుగుణంగా సామాజిక సంక్షేమ పథకాలకు నిధులు ఎలా సమమకూర్చుకోవాలి అనేది ఇవాళ ప్రతి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశం. పునఃపంపిణీ, రిస్కు పంచుకోవడం కోసం పెట్టుబడి, శ్రమశక్తి ఉమ్మడిగా భాగస్వామ్యం వహించడం, సంఫీుభావాన్ని ప్రదర్శించడమే సామాజిక సంక్షేమ పథకాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. రాబోయే కాలంలో కూడా ఇదే సూత్రం కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫ్లోరియన్ జువార్జెన్స్ గ్రాంట్, లూకా పెల్లెరానో
అనువాదం: కె సత్యరంజన్
ప్రాజెక్ట్ సిండికేట్ తో ది వైర్ తెలుగు కు ప్రత్యేక ఏర్పాటు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.