
నేల టికెట్ కి ఎక్కువ, బెంచ్ టికెట్ కి తక్కువ.
రంగులు మార్చడంలో పీకే ఊసరవెల్లికి ఎక్కువ, ఆక్టోపస్(మిమిక్), కట్టర్ ఫిష్‌కు కూడా ఎక్కువేనని చెప్పాలి.
రంగు మార్చడానికి ఊసరవెల్లికి ఒక్క సెకండ్ టైం పడితే, మిమిక్ ఆక్టోపస్‌కు రంగు మార్చడానికి 200 మిల్లీ సెకండ్లు సరిపోతుంది. అంటే 1/5 సెకండ్స్, వివరంగా చెపితే రెప్పపాటు కంటే చాలా వేగంగా సెకన్‌కు 5 సార్లు మిమిక్ ఆక్టోపస్ రంగులు మార్చగలదు. అయినా ఈ పీకేతో పోటీకి నిలబడగలదా అంటే నిలబడలేదనే చెప్పాలి.
విషాన్ని ఇంజెక్ట్ చేయడంలో తేలు, పాములకు ఎక్కువ,(వాటిని ఎప్పుడో మించిపోయాడు) ఆస్ట్రేలియన్ బాక్స్ జెల్లీ ఫిష్, డార్ట్ కప్పలకు కూడా ఎక్కువే. ఇవి చిమ్మే విషం వల్ల సైనైడ్ కంటే వెయ్యి రేట్లు వేగంగా పని చేసి క్షణాల్లో ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అయితే ఏం? ఇప్పుడు దాన్ని మించిన విషాన్ని చిమ్మగల శక్తి తనకుందని మొన్నటి ప్రసంగంతో పీకే రుజువు చేసుకున్నాడుగా.
అతి ఆషాడభూతి..
పీకేకు ఉన్న, పీకేకు మాత్రమే సొంతమైన ఆషాడభూతికే పంగనామం పెట్టగల ఈ ‘అతి’ అతిగొప్ప సూపర్ ఫాస్ట్ లైటినింగ్ స్పీడ్ కలర్ చేంజింగ్ టాలెంట్‌ని, అర్థం చేసుకోలేక కొందరు పొరబడుతూ పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. లెఫ్ట్ నుంచి రైట్కి రూపాంతరం చెందాడనీ, నిన్నటి మాటలకూ నేటి మాటలకూ పొంతన లేదు కాబట్టి సిద్ధాంతాన్ని మార్చేశాడనీ, చేగువేరా, భగత్ సింగ్‌లు ఏమైపోయారనీ కొందరు అంటున్నారు. ‘పీకేని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి, మతిమరపు, కమెడియన్, జోకర్, బానిస, అజ్ఞాని’ అంటూ మరికొందరు తీర్మానించేస్తున్నారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
ఏ వ్యక్తైనా తను నమ్మిన సిద్ధాంతం నుంచి పక్కకు జరుగుతూ పూర్తి వ్యతిరేక భావజాలంలోకి వెళ్లాలంటే దానికి రెండే కారణాలుంటాయి. మొదటిది తను ఇంతకాలం నమ్మింది తప్పు అని చెప్పగలిగే బలమైన కారణమైనా ఉండాలి. లేదా రెండవది తనకు ఆ సిద్ధాంతం మీద నమ్మకం, గౌరవం లేకపోయినా సరే సొంత ప్రయోజనాల కోసం దాన్ని నెత్తికెత్తుకున్నట్టు నటించడమైనా చేసుండాలి.
మొదటిదానికి ఎలాంటి డొంకతిరుగుళ్లు అవసరం లేదు. గతంలో నమ్మిన భావాలు ప్రస్తుతం ఎందుకు తప్పుగా అనిపిస్తున్నాయో కారణాలు చెప్పి, వాటితో ఇతరులు కన్విన్స్ అయినా అవ్వకపోయినా ధైర్యంగా తప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎంచుకుంది రెండో బాట కాబట్టే ఈ రోజు ఇంతటి నీచమైన దిగజారుడు రాజకీయాలు అవలీలగా చేసేస్తున్నాడు.
చేగువేరా సినిమా ఫ్లాప్..
పీకేకి చేగువేరా జీవితం గురించి కానీ, కమ్యూనిజం గురించి గానీ ఏమీ తెలీదు. అయినా సరే ఆ భావజాలంలో ఉన్న నిజాయితీ, న్యాయం, హక్కుల కోసం పోరాటం, కసి, ఆవేశంలాంటి ఎన్నో మంచి విషయాలు సామాన్యులను ఆకర్షిస్తాయని మాత్రం బాగా తెలుసు. అందుకే ఆ దిశగా పావులు కదిపి కెమెరా, స్టార్ట్, యాక్షన్ అంటూ ఓవర్ యాక్షన్‌ని ఓవర్‌గా చేసేశాడు.
సినీ రంగంలో ఏమాత్రం కష్టపడకుండా అన్న అండతో అప్పనంగా అందలమెక్కిన పీకే రాజకీయాల్లో అధికారాన్ని కూడా అంతే అప్పనంగా అందుకోవచ్చని ఆశపడ్డాడు. కానీ అతనికి తెలియని విషయమేంటంటే, కమ్యూనిజం అనేది ఒక నిజమైన సిద్ధాంతం.
రకరకాల పూతలతో మసిపూసి మారేడు కాయ చేసి ఒక అబద్ధాన్ని ఒప్పించినంత తెలిగ్గా నిజాన్ని ఒప్పించలేము. నిజాన్ని కమ్యూనిజాన్ని ప్రజల చేత ఒప్పించాలంటే దానికి ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధి, ఓర్పు, నిజాయితీ అన్నిటికంటే ముఖ్యం ఆ సిద్ధాంతం మీద గౌరవం, ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే సహనంతో దాన్ని భుజానికెత్తుకుని ముందుకు నడిపించగలరే తప్ప నటనతో లొంగదీసుకోవాలనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. అందుకే పీకే నటించిన చేగువేరా సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
సనాతని, సూపర్ డూపర్ హిట్..
సినిమాలు సమాజ శ్రేయస్సు కోసం కాకుండా కేవలం వ్యాపారంగా చూస్తూ లాభాల కోసం తీసే ఈ రోజుల్లో ఫ్లాప్ అయిన సినిమా కథతోనే మరో సినిమా తీసే మూర్ఖపు నటులు ఉంటారా ఎవరైనా? అందుకే రాజకీయాలకు, సినిమాకు తేడా తెలియని తెలివైన నటుడు మన పీకే ఈసారి చాలా తెలివిగా బీజేపీ డైరెక్షన్లో ‘సనాతని’ అనే సరి కొత్త సినిమా తీశాడు. అది సూపర్ డూపర్ హిట్. మరి డైరెక్షన్ చేసింది ఎవరనుకున్నారు! ‘ముత్యాలముగ్గు’లో రావుగోపాలరావుని మించిన ఆస్కార్ నటుడు మోడీ అయినప్పుడు హిట్ కాక చస్తుందా..!
హిందుత్వ అనేది ఒక పెద్ద అబద్ధపు సిద్ధాంతం. దాన్ని బీజేపీ పార్టీలో ఎవ్వరూ నమ్మరు. అసలు వాళ్ళు రాముడినే నమ్మరు. నమ్మాల్సిన ఆచరించాల్సిన అవసరమే వాళ్లకు లేదు. నటనతో ప్రజలని నమ్మిస్తే చాలు. ‘నిజం చెప్పులో కాలు పెట్టేలోపే అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది’ ప్రజల్ని ఒప్పించి మరీ.
గొప్పనటుల పార్టీ శిక్షణలో..
ఒక అబద్ధానికి వంద అబద్ధాలు చొప్పించి వీర లెవల్లో నటించి మత విద్వేషాలు రగిలించి, ఆ చితి మంటల్లో తిరుగులేని ప్రయోజనాలు పొందే అవకాశమున్న గొప్ప పార్టీ బీజేపీ. ఇందులో అందరూ గొప్ప గొప్ప నటులే. వీరి శిక్షణలో మన నటుడు మరింత రాటుదేలాడు. నటనకు ఏమాత్రం ఆస్కారం లేని చేగువేరా సిద్ధాంతంలోనే ఊగి ఊగి నటించిన పీకే ఇక ‘ఈట్ డ్రామా, డ్రింక్ డ్రామా, స్లీప్ డ్రామా’ పార్టీ అయిన బీజేపీ డ్రామా కంపెనీలో ఉన్నప్పుడు మరి ఆ నటన ఏ స్థాయిలో ఉండాలి.
పీకే ఒక సిద్ధాంతం నుంచి మరో సిద్ధాంతంలోకి రూపాంతరం చెందలేదు. కేవలం డ్రామాలో ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి మారాడు అంతే! భవిష్యత్‌లో కూడా పీకే ఇలా నటిస్తూనే ఉండొచ్చు. రాజకీయ డ్రామాలో ఇంకా బోలెడు పాత్రలు చేయొచ్చు. రేపు పొద్దున్న ఈ ‘సనాతని’ సినిమా కథకు మించిన కథ దొరికితే కప్పలా అటు దూకి మరో కొత్త సినిమాలో నటనకు తెర తీయొచ్చు. అలాంటప్పుడు ఇక సొంత సిద్ధాంతమెందుకు టైం వేస్ట్.
స్వలాభం కోసం ఏమైనా చేస్తాడు. మొన్న జుట్టు ఎగరేస్తూ తన నోటితో బూతులు తిట్టిన వాళ్లనే ఈ రోజు ఆకాశానికెత్తుతూ వాటేసుకుంటాడు. నిన్న మెచ్చుకున్న ద్రవిడవాదాన్ని నేడు జాతీయం చేసేస్తాడు. అంతేకాకుండా అబద్ధాలతో రాజకీయానికి తల్లిదండ్రులను వాడుకోగలడు. ఏరు దాటాక తెప్ప తగలేసి నీ కర్మ అనగలడు. సినిమా అనేది అన్న పెట్టిన భిక్ష, నియోజకవర్గం వర్మ పెట్టిన భిక్ష, గెలుపు మోడీ పెట్టిన భిక్ష, డిప్యూటీ సీఎం పదవి చంద్రబాబు పెట్టిన భిక్ష. కొత్త బిచ్చగాడు పొద్దెరగడని బాధ్యతారాహిత్యంగా అధికారాన్ని అహంకారంతో అనుభవించనూ గలడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సామార్థ్యం కల అసమర్ధుడు. ఇలాంటి స్వార్థపరుడిని సింపుల్‌గా మెంటల్ అనేయడం కరెక్టేనా?
కమెడియన్, రాజకీయ జోకర్లు వినోదాన్ని పంచుతారేగానీ వారి వల్ల ఎవరికీ ఏ హానీ ఉండదు. కేవలం తన స్వార్థం కోసం కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టి ప్రజల జీవితాలని నాశనం చేసే పీకే లాంటి వాళ్ళు కమెడియన్లు కాదు కాల సర్పాలు.
బీజేపీ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి,(ఈ మాట ఆత్మ గౌరవం ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది.) పీకే బీజేపీ కాళ్ళ దగ్గర సాగిల పడినా అంతకంత లాభపడ్డాడు. కాబట్టి బానిస అనలేము. నిజమైన కట్టు బానిసలు మాత్రం ఇంత జరిగినా ఇప్పటికీ అతన్ని గుడ్డిగా అభిమానించే జెండా కూలీలే అవుతారు. అజ్ఞానపుటంధకారంలో మగ్గిపోతున్న జన సైనికులు, వీర వనితలు అనే విచిత్ర స్వీయ బిరుదులు తగిలించుకున్న కూలీలు మాత్రం జీత భత్యాలు లేని కామెడీ జూనియర్ ఆర్టిస్టులుగా నటిస్తూనే ఉండాలి.
బానిస పీడకు విముక్తి మార్గం ఒక్కటే..
బీజేపీ అండ్ కో తయారు చేసే ఇలాంటి బానిసలకు ఈ బానిసత్వం నుంచి విముక్తి లభించాలంటే ఒక్కటే మార్గం. అదేంటంటే, గతంలో కేరళలో బీజేపీ ఒక స్థానం గెలుచుకుందనీ, దానికి మీ స్పందన ఏంటని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ‘‘అవును, ఆ స్థానంలో విద్యావిధానాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరముంది’’ అన్నారు. ఇప్పుడు దేశానికి కావలసింది ఆ జ్ఞానమే. అజ్ఞానం కాదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.