
2027లో జరిగే జాతీయస్థాయి జన- కులగణనకు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం 2021లో జరగాల్సిన జనగణన ఈ నోటిఫికేషన్ ఆధారంగా 2027లో మొదలు కానున్నది.
తాజా గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం మార్చి ఒకటి 2027 అర్ధరాత్రి జన- కులగణన మొదలవుతుంది. మార్చి 1వ తేదీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, లడఖ్లలోని మంచు కురిసే ప్రాంతాలలో మాత్రం 2027 అక్టోబర్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి జనగణన ప్రక్రియ మొదలవుతుంది.
2021లో జరగాల్సిన జనగణనకు సంబంధించి 2019లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి కేంద్ర హోంశాఖ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అమలులో లేదు. సదరు నోటిఫికేషన్ను సవరించిన కేంద్ర ప్రభుత్వం “1948 జనగణన చట్టంలోని సెక్షన్ 3 ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి కేంద్ర హోంశాఖ 2019 మార్చి 26న ఎక్స్ట్రార్డినరీ గెజెట్ ఆఫ్ ఇండియా ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ అనుసరించి కేంద్ర ప్రభుత్వం 2027లో జనగణన చేపట్టాలని ఖరారు చేసింది” అని ప్రకటించింది.
ఈ నోటిఫికేషన్ను కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ అండ్ జనగణన కమిషనర్ జారీ చేశారు.
ఈ జనగణనలో భాగంగా కులగణన కూడా జరుగుతుంది. అయితే, కులగణన గురించి దేశవ్యాప్తంగా పలుప్రతిపక్ష పార్టీలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి.
జనగణన మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా నివాసాల వివరాలు, వాటి స్థితిగతులు, ఆయా నివాసాలలో ఉన్న కనీస వసతులు వంటి వివరాలను సేకరిస్తారు. రెండవ దశలో భాగంగా జనాభా వివరాలు, వారి సామాజిక- ఆర్థిక, సాంస్కృతిక సంబంధిత వివరాలను సేకరిస్తారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.