
ఇటీవల కాలంలో మార్కెట్ కేంద్రిత పద్ధతులు, కేంద్రీకృత అధికార నియంత్రణ విధివిధానాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ విద్యలో స్పష్టంగా గుర్తించదగినవిగా మారాయి. ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు రంగ ఆలోచనలను, పద్ధతులను అవలంబించే అంతర్గత ప్రైవేటీకరణ ఫలితం ఇదని చెప్పవచ్చు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు లక్ష్యాల మధ్య గీతలు చెరిగిపోతున్నాయి. ప్రభుత్వ కళాశాలల పాత్ర, వాటి పనితీరు పూర్తిగా మారిపోయింది. 2018- 2024 మధ్య తెలంగాణ డిగ్రీ విద్యలో జరిగిన మార్పులు దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలిచాయి. ఈ కాలంలో నియోలిబరల్ విధానాలు తారాస్థాయికి చేరాయి. కేంద్రీకృత అధికార నియంత్రణ, అంతర్గత ప్రైవేటీకరణ, ఆడిట్ కల్చర్, బ్రాండింగ్ పెరిగాయి. అధ్యాపకుల బదిలీలు, ప్రాంతీయ భాషల్లో కోర్సుల మూసివేత, ప్రైవేటు సంస్థలకు నిధుల ధారాదత్తం, ఈ కాలంలో జరిగిన ప్రధాన విషయాలుగా చెప్పుకోవచ్చు. ఇవి జాతీయ విద్యా విధానం- 2020 స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి.
సమానత్వం, విద్య అందుబాటుకు, బహుభాషా విద్యకు జాతీయ విద్యావిధానం- 2020 ప్రాధాన్యతనిస్తుంది. ప్రాంతీయ భాషలు, తల్లిభాషలలో విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యాన్ని జాతీయ విద్యావిధానం- 2020 స్పష్టంగా చెబుతోంది. అయినప్పటికీ, ప్రాంతీయ భాషా కోర్సులను మూసివేయడం ఈ లక్ష్యానికి విరుద్ధంగా ఉంది.
వర్గ భేదాలను తగ్గించటం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించటం ద్వారా సమానత్వం, సమగ్రత కలిగిన విద్యను జాతీయ విద్యావిధానం- 2020 ప్రకటించింది. బోధన సిబ్బందిని బదిలీ చేయడం, ప్రైవేట్ మెంటరింగ్ సంస్థల ప్రభావం వల్ల, ప్రభుత్వ విద్యా వ్యవస్థ మార్కెట్ ఆధారిత విధానాల వైపు మళ్లుతోంది. ఇది విద్య అందుబాటును తగ్గిస్తోంది. అంతేకాకుండా ఇది ప్రభుత్వ సంస్థలను బలపర్చాలన్న జాతీయ విద్యావిధాన ఉద్దేశానికి విరుద్ధం.
అంతర్గత ప్రైవేటీకరణ అంటే ఏంటి?
విద్యలో బాహ్య, అంతర్గత ప్రైవేటీకరణ అని రెండు రకాలుగా ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు ప్రభుత్వ విద్యలో నేరుగా పాలుపంచుకోవడాన్ని బాహ్య ప్రైవేటీకరణ అంటారు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు(పీపీపీ), ఔట్ సోర్సింగ్ సేవలు మొదలైనవి దీనికి ఉదాహరణగా నిలుస్తాయి. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ సమస్యలకు పరిష్కారంగా చూపబడుతుంది. అంతర్గత ప్రైవేటీకరణ అంటే ఇది ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు రంగ పద్ధతులను అనుసరించడం, పనితీరు కొలతలు, పోటీ, బ్రాండింగ్, వ్యయాన్ని తగ్గించే వ్యూహాలను అవలంబించడం. ఇది విద్యను కేవలం వస్తువుగా చూస్తుంది. తెలంగాణలోని డిగ్రీ విద్యలో ప్రస్తుత ధోరణులు ఈ అంతర్గత ప్రైవేటీకరణను అనుసరిస్తూ కళాశాలలను ర్యాంకింగ్‌లు, బ్రాండింగ్‌పై ఆధారపడే సంస్ధలుగా మార్చింది.
అంతర్గత ప్రైవేటీకరణ పనిచేసిన రీతి..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకడమిక్ ఎక్సలెన్స్(ఐఏఎఫ్) అనే సంస్థ ఎన్ఏఏసీ, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కోసం అధ్యాపకులకు ఆన్లైన్ శిక్షణను అధిక ఫీజులతో నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సంస్థ చాలా వరకు ప్రభుత్వ రంగంలోని ఉన్నతాధికారులను, ఉన్నత విద్యా సంస్థల ఫ్యాకల్టీని రిసోర్స్ పర్సన్స్‌గా వాడుకుంటుంది. ఇలాంటి శిక్షణలను ఎన్ఏఏసీ, యూజీసీ కూడా అధ్యాపకులకు ఉచితంగా నిర్వహిస్తూనే ఉంటుంది. ఈ ఉచిత శిక్షణలను ప్రభుత్వ రంగంలోనే ఇంకా విస్తృతం చేయవచ్చు. కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకడమిక్ ఎక్సలెన్స్‌తో తెలంగాణ కళాశాల విద్యా విభాగం కలిసి ఈ కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించింది. అధిక ఫీజులతో నిర్వహించబడిన ఈ శిక్షణా కార్యక్రమాల్లో ఎక్కువ మొత్తంలో పాల్గొనాలని అధ్యాపకులను కోరింది. దీంతో పెద్ద మొత్తంలో కాలేజీల నిధులు ప్రైవేట్ పరమయ్యాయి. నిర్ణీత కాల వ్యవధుల్లో కాలేజీ కమిషనరేట్ పరిధిలో, అకౌంటెంట్ జనరల్ అధికారుల పరిధిలో కాలేజీలలో ఆడిట్లు జరుగుతూనే ఉంటాయి.
ఈ మధ్య కాలంలో ఒక్కో విద్యార్థికి రూ 8 చొప్పున చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థల చేత ఆడిట్లను చేపడుతున్నారు. ప్రతి కాలేజీలో వర్చువల్ తరగతి గది ఏర్పాటులో పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగమైనట్లు ఆరోపణలున్నాయి. తగిన విశ్వసనీయత లేని సంస్థలు కూడా డబ్బు చెల్లింపుతో ఐఎస్ఓ సర్టిఫికెట్లను విద్యాసంస్థలకు ప్రదానం చేస్తున్నాయి. దీన్ని అరికట్టడానికి బదులు ఉన్నతాధికారులు ఈ సర్టిఫికెట్లను కొనాలని ప్రోత్సహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ కాలేజీల డబ్బు వృధాగా ఈ సంస్థలకు ధారాదత్తం అవుతుంది. కాలేజీల బ్యాంక్ ఖాతాలు ప్రైవేటు బ్యాంకులకు మార్చబడ్డాయి. కాలేజీల అభివృద్ధికి వినియోగించవలసిన, వాటి అంతర్గత నిధులు మళ్లించబడ్డాయి.
ఎక్కువ ధరలతో కేంద్రీకృత కొనుగోళ్లు: కాలేజీ విద్య కమిషనరేట్ ఆఫీస్ ద్వారా కొనుగోళ్లు కేంద్రీకృతం చేయడం జరిగింది. ఇది ఖర్చులు తగ్గించేందుకు అని చెప్పబడింది. కానీ నాణ్యత లేని సామాగ్రిని రెట్టింపు ధరతో కొనుగోళ్లు చేశారు. స్థానికంగా సరసమైన ధరలకు లభించే సామగ్రిని కూడా కేంద్రీకృత కొనుగోళ్ళ ద్వారా అధిక ధరలకు కొనవలసి వచ్చింది.
అధ్యాపకుల బదిలీలు: అధ్యాపకుల వర్క్‌లోడ్‌ను యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కాకుండా ఇష్టానుసారం లెక్కించి, చాలా మంది అధ్యాపకులను సర్ ప్లస్‌గా ప్రకటించి భారీగా బదిలీలు చేశారు. వీటికి శాస్త్రీయమైన ప్రాతిపదిక, మార్గదర్శకాలు లేకుండా ఒక్కో సబ్జెక్టులో ఎనరోల్ అయిన విద్యార్థుల సంఖ్యను బట్టి అధ్యాపకుల సంఖ్యను నిర్ణయించారు. ఒక సబ్జెక్టులో 150 విద్యార్థుల ఎనరోల్‌మెంట్ ఉంటేనే ఆ సబ్జెక్టులో రెండవ అధ్యాపక పోస్ట్‌ను మంజూరు చేశారు. మరొక సబ్జెక్టులో ఎనభై మంది విద్యార్థులు చేరితే రెండవ అధ్యాపక పోస్ట్‌ను లెక్కించారు. తెలుగు, ఇంగ్లీషు మీడియం విద్యార్ధులను కలిపి క్లాసులు నిర్వహణను చేపట్టారు.
సర్ ప్లస్ పేరు మీద భారీగా అధ్యాపకుల బదిలీలు జరగడంతో చాలా కాలేజీలలో ప్రతి సబ్జెక్ట్‌లో సింగిల్ ఫ్యాకల్టీ మాత్రమే ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టుల్లో లాబరేటరీలు మూతపడ్డాయి. అహేతుకమైన వర్క్‌లోడ్ గణనతో అధ్యాపకులను మూడు రోజులు ఒక కాలేజీలో, మరొక మూడు రోజులు వేరొక కాలేజీలో పనిచేయించారు. దీంతో బోధన నాణ్యత తగ్గింది. కోర్సుల రీఆర్గనైజేషన్ పేరు మీద కోర్సబ్జెక్టుల స్థానంలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టును ప్రవేశపెట్టారు. దీని వల్ల కోర్ సబ్జెక్టుల్లో టీచర్ వేకెన్సీలు కుదించబడ్డాయి. కోర్సుల మార్పుల కారణంగా అధ్యాపకుల సంఖ్య తగ్గించబడింది. కీలక సబ్జెక్టుల్లో కొరత ఏర్పడింది.
ప్రిన్సిపాల్ ఖాళీలు: చాలా కళాశాలల్లో పూర్తి స్థాయి ప్రిన్సిపాల్లు లేరు. ఆసక్తి లేని టీచర్లను కూడా బలవంతంగా ఇంచార్జ్ ప్రిన్సిపల్స్‌గా వ్యవహరించాలని ఒత్తిడి తెచ్చారు. నిరాకరించిన టీచర్లపై క్రమశిక్షణా చర్యలను చేపట్టారు. ఆసక్తితో స్వచ్ఛందంగా నిర్వహించవలసిన ఎన్సీసీ ఆఫీసర్ విధులను తప్పనిసరిగా నిర్వహించాలని అధ్యాపకులపై ఒత్తిడి తెచ్చారు. నిరాకరించిన అధ్యాపకులపై క్రమశిక్షణా చర్యలను చేపట్టారు. ఈ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా జరిగిన టీచర్ల బదిలీలు, సస్పెన్షన్లు తగిన విధి విధానాలను అనుసరించకుండానే పెద్ద సంఖ్యలో జరిగాయి.
తెలుగు మీడియం కోర్సుల మూసివేత: తెలుగు మీడియం కోర్సులు మూసివేయడం అనేది ఎన్ఈపీ- 2020లోని బహుభాషా విద్యకు విరుద్ధం. గ్రామీణ, బడుగు బలహీన విద్యార్థులకు ఇది ఇబ్బంది కలిగించింది.
అకడమిక్ సెల్ నిర్వహణా లోపం: అకడమిక్ విషయాలలో కీలక నిర్ణయాల కోసం, అమలవుతున్న అకడమిక్ విధానాల సమీక్ష కోసం సేవలను పొందడానికి సీనియర్ అధ్యాపకుల చేత అకడమిక్ సెల్ నిర్వహించబడాలి. కానీ ఇప్పుడు అది కేవలం డేటా సేకరణ కోసం, వివిధ కార్యక్రమాల షెడ్యూలింగ్, శిక్షణా కార్యక్రమాలకు అధ్యాపకుల ఎంపిక లాంటి బోధనేతర ఉద్యోగులు చేయవలసిన పనుల కోసం ఉపయోగించబడుతుంది. దీనికోసం ఈ సెల్లో అకడమిక్ ఆఫీసర్లుగా పనిచేయడానికి కొత్తగా సర్వీస్‌లో చేరిన టీచర్లను కూడా ఎంచుకుంటున్నారు. దీని వల్ల వారు, బోధన నుంచి దూరమై, బోధనేతర పనులకు అలవాటు పడుతున్నారు. బోధన నైపుణ్యాలను అలవర్చుకోవడానికి కీలకమైన సర్వీస్ ప్రారంభ దశలో బోధనేతర పనుల్లో నిమగ్నమవుతున్న టీచర్లు, ఆ తర్వాతి కాలంలో వారు బోధన పనిని సక్రమంగా చేయలేని స్థితికి నెట్టబడుతున్నారు.
ప్రదర్శన సంస్కృతి..
విద్యా విలువ లేని, అంతగా ప్రాముఖ్యత కాని క్యాలెండర్, డైరీ విడుదల కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం విశేషమైన ప్రచారం చేస్తున్నారు. కాలేజీలలో విద్యార్ధుల నమోదు సంఖ్య పెంచడానికి కాలేజీలో జరిగే విద్యా కార్యక్రమాల నాణ్యతే ప్రధానం అన్న విషయం మరిచి ప్రచార పటాటోపంతో జరిపే ప్రవేశ డ్రైవ్ ప్రధానమని భావించే మార్కెటింగ్ సూత్రాలకు లొంగిపోతున్నారు. ఈ కార్యక్రమాల్లో పై నుంచి కిందికి అన్ని స్థాయిల అధికారులు, అధ్యాపకులు పాల్గొంటూ విద్యా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారు. చాలా క్రమశిక్షణతో నిర్వహించవలసిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు, ప్రదర్శన సంస్కృతికి ఇతర కోకరిక్యులర్ కార్యక్రమాలు లోనవుతున్నాయి. అంతేకాకుండా కాగితాలకే పరిమితం అవుతున్నాయి.
జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి సెమినార్ల నిర్వహణ కూడా స్ఫూర్తి రహితంగా ఉంటున్నది. ప్రారంభ, ముగింపు సమావేశాల ప్రచారం తప్ప విలువైన చర్చలకు తావు లేకుండా పోతుంది. పబ్లికేషన్లు, ఉత్తమ టీచర్ అవార్డుల గురించి చెప్ప వలసిన పనిలేదు. డబ్బు చెల్లింపుతో, సత్వరం పబ్లికేషన్లను, అవార్డులను ప్రదానం చేసే సంస్థలు దేశంలో కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. ఇటువంటి సంస్థల భాగస్వామ్యాన్ని నిరుత్సాహ పరచవలసిన అధికారులు, ప్రిన్సిపాళ్లు వీటిని ప్రోత్సహిస్తునారు.
ఆడిట్ సంస్కృతి పెరుగుదల..
విద్యా సంస్థలు తమ పనితీరు మానిటరింగ్ కోసం కొలతలు, అంచనాలు, జవాబుదారీతన విధానాలను అవలంబిస్తున్నాయి. ప్రదర్శన సూచికలు, పరీక్షలు, ర్యాంకింగ్‌లు, ఫలితాల ఆధారంగా నిధుల కేటాయింపుపై వీటి ప్రధాన దృష్టి ఉంది. బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ మరిలిన్ స్ట్రాథర్న్ ఈ సంస్కృతిని 2000లో తన గ్రంథం ఆడిట్ కల్చర్: ఆంథ్రోపాలజికల్ స్టడీస్ ఇన్ ఎకౌంటబిలిటీ, ఎథిక్స్ అండ్ ది అకాడమీలో పేర్కొన్నారు. ఆమె ఆడిట్ విధానాలు, విద్య, పరిశోధన వంటి సామాజిక రంగాల్లో విస్తరించడాన్ని గమనించారు.
ఈ విధానం కారణంగా విద్యా సంస్థలు వ్యాపార సంస్థల మాదిరిగానే నిధుల కోసం పోటీపడుతుండటమే కాకుండా, విద్యార్థుల అకడమిక్ స్కోర్లు, పరిశోధన ప్రచురణలను ప్రమాణంగా భావిస్తూ టీచర్ల పనితీరును కొలుస్తాయి. దీనివల్ల విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సామాజిక బాధ్యత వంటి అసలైన విద్యా విలువలు రెండవ స్థానానికి నెట్టబడుతున్నాయి.
విద్యార్థులను “కస్టమర్లు”గా పరిగణించడం, విద్యను మార్పు ప్రక్రియగా కాకుండా సేవగా చూడడం, అక్రిడిటేషన్ కోసం డేటా సేకరణ, నివేదికల తయారీ, డాక్యుమెంటేషన్ పనులు బోధన సమయాన్ని తగ్గించాయి. విద్యను వాణిజ్య మార్కెట్లో భాగంగా చూడటంతో సామాజిక, సాంస్కృతిక అంశాలు పక్క దారి పట్టాయి.
విద్యా సంస్థలు అనుసరించే మౌలిక కొలతలు ఆడిట్ ఆధారంగా మారిపోవడం. టీచర్లు, పరిశోధకులు స్వతంత్రంగా పని చేయలేని పరిస్థితులు విద్యా ప్రక్రియను దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు డేటా పాయింట్లుగా మారారు. ఈ పోటీతత్త్వం కారణంగా విద్యార్థులలో ఒత్తిడి పెరుగుతోంది. ఇది అసలైన విద్యా లక్ష్యాలను తగ్గిస్తున్నది.
ఆడిట్ సంస్కృతి నియోలిబరల్ పాలన, ప్రపంచ వాణిజ్య ఆధారిత సంస్కరణల ఫలితంగా పెరుగుతోంది. మరిలిన్ స్ట్రాథర్న్, మైకల్ పవర్ వంటి అధ్యయనకారులు విద్యా వ్యవస్థ కేవలం ఆదేశాల అమలుకే పరిమితం అవుతోందని హెచ్చరించారు. విద్యా రంగంలో అధికార నియంత్రణ పెరుగుతోంది. ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలహీనపడుతున్నాయి. ఉపాధ్యాయ స్వేచ్ఛ, ప్రభుత్వ విద్య అనేక సమస్యలకు గురవుతున్నాయి.
తెలంగాణలో డిగ్రీ విద్య గత కొన్నేళ్లలో మౌలిక మార్పులను ఎదుర్కొన్నది. మార్కెట్ కేంద్రీత విధానాలు, కేంద్రీకృత అధికార నియంత్రణ, అంతర్గత ప్రైవేటీకరణ వల్ల విద్యా వ్యవస్థ మూల ప్రామాణికతను కోల్పోయింది. వీటితో విద్య, మార్పు ప్రక్రియగా కాకుండా సేవలుగా మారి, విద్యార్థులు కస్టమర్లుగా మారిపోయారు. ఈ విధానాల ప్రభావాన్ని తగ్గించడానికి సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడం అవసరం. విద్యను నిజమైన లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దే విధంగా, అధ్యాపకుల హక్కులను పరిరక్షించే విధంగా విధానాలను పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. విద్యాసంస్ధలలో నిజమైన నేర్చుకునే వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు సంస్కరణలు అనివార్యంగా మారాయి.
ఈ సమస్యలకు సమగ్ర పరిష్కారాలు కనుగొనాలంటే, పాలకుల, విద్యావేత్తల, అధ్యాపకుల భాగస్వామ్యం తప్పనిసరి. మార్కెట్ విలువలకంటే విద్య విలువలకే ప్రాధాన్యత నిచ్చే విధంగా మార్పులు తీసుకురావడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.
(వ్యాస రచయిత హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా సేవలు అందిస్తున్నారు. సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక సభ్యులుగా కూడా ఉన్నారు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.