
‘‘సగటు మనిషి ఓట్ల విత్తనాలు/ మొలకెత్తని బంజరు భూములు’’ అని ప్రజల ఆశలను, ఆకాంక్షలను పట్టించుకోని చట్టసభలను, రాజకీయాలను, రాజకీయ నాయకుల తీరుపై వ్యంగ్యంగా కామెంట్ చేస్తాడు అక్షర క్షిపణి యోధుడు అలిశెట్టి ప్రభాకర్.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కూడా గత ప్రభుత్వ హయాంలో ఓట్లు మొలకెత్తలేదు. ఏడాది గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా ఇంకా మొలకలు రాలేదు. బర్ల నుండి పాలు పిండినట్లుగా ప్రజల నుండి పన్నులరూపంలో పిండిన నిధులు కాలువలుగా పాలకుల ఖజానాకు చేరుతూనే ఉన్నాయి. ఆ కాలువలు పారించుకున్నాగాని ప్రజల మళ్ళకు మాత్రం నీరు చేరుతనే లేదు. గతంలో పన్నుల కుప్ప బడ్జెట్ కాలువను కాళేశ్వరంలోకే పారించిండు కేసీఆర్. ఈ ప్రభుత్వం కూడా మూసిలోకి, ఫోర్త్ సిటీలోకి పారించాలని అనుకొంటున్న ఈ స్థితిలో రాష్ట్ర రాజకీయం ఇంట్రెస్టింగ్ సిట్యువేషన్ లో ఉంది. రానున్న నాలుగేళ్లలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఉంటుందో, ప్రతిపక్ష స్ధానంలో ఎవరు elangana కొనసాగుతారు అనే ఆసక్తికరమైన ప్రశ్న ఉదయిస్తుంది.
బి ఆర్ ఎస్ నియంతృత్వ పాలన ముగిసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పైన నెలన్నర గడిచింది. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పాలన మొదలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియని స్థితి నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి పీఠం మీద నిలదొక్కుకున్నాడు. పార్టీ మీద కూడా పట్టు బానే సంపాదించాడు. కాంగ్రెస్ గ్రూపులు కూడా గుంభనంగానే మామూలుగానే ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు కూడా ముఖ్యమంత్రి దిశా నిర్దేశంలోనే సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రతి పక్షాలను బాగానే చీల్చి చెండాడుతున్నట్లే కనిపిస్తుంది. కాకపోతే బిజెపి పై కొంచెం తక్కువే అనే చర్చ ఉంది. కేసీఆర్ పై, కేటీఆర్ పై మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఫాం హౌస్ నుంచి రమ్మని కేసిఆర్ ను కవ్విస్తున్నాడు కూడా.
ఇదే సంధర్భంలో రాష్ట్రంలో ‘ ఏడాది పాలన కొంచెం మోదం – కొంచెం కేదం ‘ అన్నట్లే ఉంది. ఆరు గ్యారెంటీలు అధికారంలోకి రాగానే అమలు చేస్తాననే వాగ్ధానంతో బి ఆర్ ఎస్ పై హస్తం పైచేయి సాధించింది. కేసీఆర్ కుటుంబ పాలన, దొరతనపు ఆహాంకారపు నియంతృత్వ దోరణినీ ప్రజలు ఈసడించుకున్నారు. అందుకే తెలంగాణను ప్రజలు కాంగ్రెస్ కు అప్పగించారు. అయితే ఆరు గ్యారంటీలలో మహాలక్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500లకే వంటగ్యాస్ సిలిండర్ హామీ మాత్రమే సంపూర్ణంగా అమలు అవుతుంది. ప్రతీ నెల రూ.2500లు ఇచ్చి మహిళలను మహాలక్ష్మీలను కావాలన్న ఆశ కోరిక అమలు కాలేదు.
అందరికీ రెండు లక్షల రుణమాఫీ అన్నప్పటికీ లక్ష పైగా రుణాలు ఉన్న రైతులకే మాత్రమే మాఫీ జరిగింది. కొద్ది చోట్ల లక్షన్నర రుణమాఫి కూడా అయ్యిందీ. కానీ రెండు లక్షల రుణాలున్న రైతుకు మాత్రం మాఫీ ఆశ అడియాసే అయ్యింది. డేట్స్ ఫిక్సింగ్ తో కాలయాపన జరుగుతున్నట్లు రైతాంగం భావిస్తుంది. మరో వైపు అవసరమైన రుణాలు లభించక రుణభారంతో తెలంగాణాలో రైతుల ఆత్మహత్యలు 409కి చేరాయనీ ప్రతిపక్షం లెక్కలతో సహా చెబుతున్నది. ఈ ఆత్మహత్యలను పరిశీలించి ఆపేయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేయిస్తానని 13నెలలు పూర్తయినా చేయలేదు. రైతు భరోసా జూన్ లో పడలేదు. కౌలు రైతుకు 12వేలు అగో ఇగో అంటుంటే జనవరి దాటుకుంటూ సర్పంచ్ ఎలక్షన్ ముంగిట్లో ఇస్తారని చర్చ సాగుతోంది. 15 వేలు ఇస్తానన్న మాట తప్పిండని సిఎం రేవంత్ పై మాట రానే వచ్చింది. ప్రతి క్వింటాలుకు వరికి 500ల బోనస్ హామీ అమలులో అధికారులు కొర్రీలు పెడుతుందటంతో ఎండినంక ఇయ్యాలనే మాటతో ఇంకేంటి ప్రభుత్వం ఇచ్చేది అని రైతులు భావిస్తున్నారు. రేవంత్ మాట ఉత్తి మాటే అని బోనస్ బోగస్ అని గ్రామాల్లో రైతులు అంటున్నారు.
గృహజ్యోతి కింద పేదింటికి 200యూనిట్ల వరకు ఉచిత కరెంటు హామీ దళిత, బహుజన ఇళ్ళల్లో కరెంటు భారం కొంత తీరింది. యువ వికాసం కింద విద్యార్థులకు 5లక్షల భరోసా కార్డ్ ఇవ్వనే లేదు. ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అనే హామీకి బునాది రాయి కూడా వేయలేదు. అయినా వీటితో విద్యా వ్యవస్థకు యూజ్ ఏమీలేదు. ఇప్పుడున్న స్కూల్స్ ను అభివృద్ది చేయకుండా వాటిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళకుండా ఒకటో రెండో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న బళ్ళు పెట్టినంత మాత్రాన విద్యార్థులకు ఒరిగేది ఏమీ లేదు. ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు భారం తగ్గేది లేదు. కామన్ స్కూల్ సిస్టమే కష్ట జీవి బిడ్డకు ఉపయోగం. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి.
గ్రూప్ 1,2 ఇతర పోస్టులు 55వేలు భర్తీకి ప్రకటన ఇచ్చింది. అయితే గత ప్రభుత్వం ప్రకటించినవి ఖాకీలు కూడా ఇందులో ఉన్నాయి. పెద్దోళ్ళకు చేయూత, ఆడబిడ్డలకు తులం బంగారం ఇంకా అడుగుపడలేదు. అందుకే ఆడబిడ్డలకు 80వేలు భాకి ఈ ప్రభుత్వం ఉందని విమర్శ చేస్తున్నారు. అభయ హస్తం అమలుపై నిలదీస్తున్నారు. ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఉన్న సంవత్సరమే కదా అయ్యిందీ అనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది.
మూసీ ప్రాజెక్ట్ శుద్దీ పేరుతో ప్రపంచబ్యాంకు నిధులు తెచ్చి కార్పోరేట్ లకు వ్యాపార బిల్డింగ్స్ కట్టబెట్టే పని చేస్తూ పేదలను గతిలేక వేసుకున్న గూడులను బుడోజర్లతో కూల్చడంతో పెద్ద వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు బి ఆర్ ఎస్, బిజెపి ఈ అంశం పై రంగంలోకి దూకాయి. వామపక్షాలు కూడా కదనం రంగంలోకి వచ్చాయి. మొదట BRS ఎత్తుకున్నది చివర బిజెపి పట్టుకున్నది. మధ్యలో వామపక్షాలు వచ్చి పోయాయి.
అంతే కాక పోయిన ప్రతిష్టకు హైడ్రా అవకాశం ఇచ్చింది. మొదట ధనవంతుల మీద పడటంతో ప్రభుత్వానికే అనుకూలత ఉన్నది. క్రమంగా పేదల మధ్యతరగతి వద్దకు ఒచ్చేసరికి ప్రతిపక్షాలకు కాంగ్రెస్సే ఛాన్స్ ఇచ్చినట్లు అయ్యింది. ఫార్ములా రేసింగ్ పై రేవంత్ రెడ్డి కేసులు పెట్టి ఈ డి, ఏసీబీలను ఉసిగొలిపితే.. అంతే బలంగా కేటీఆర్ కూడా తాల్ తుప్ప కేసు అన్నట్లు రీ కౌంటర్ ఇవ్వడం రాజకీయ సమతూకంలో ఆ కేస్ ఉంది. అప్పర్ హాండ్ ఎవరిదో అవినీతి పూర్తి స్థాయిలో బయట పడితేనే కానీ తెలియదు.
మాటల తూటాలు, విన్నూత్న పోరాట రూపాలకు పెట్టింది పేరైన కేసీఆర్ కు అదును, పదును తగ్గాయి. దాంతో కేటీఆర్, హరీష్ రావులు నాయకత్వ భారాన్ని మోస్తున్నారు. కానీ వారికి అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంటు ఎన్నికలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఓట్ల షేర్ లో మూడవ స్థానంకి దిగజారారు. కేంద్ర ఎన్నికలు కాబట్టి అందులో BRS తో రాష్ట్రానికి ఏమి ఉపయోగం లేదని ప్రజలు తీర్మానించుకుని ఓట్లు వేయలేదు అనుకుంటా. అంతకంటే ముఖ్యం వారి పాలన తప్పులతో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అఫెన్స్ లో కొట్లాడని స్థితికి నెట్టివేయబడ్డారు. నియంతృత్వ దోరణి, ఉద్యోగాల కల్పనలో ఫెయిల్యూర్ లాంటివి దెబ్బ తీసినా, ఉచిత విద్యుత్, చెరువులు, మంచి నీరు, పథకాలు BRSకు గౌరవ ప్రదమైన ప్రతిపక్ష హోదానే ఇచ్చారు. గౌరవమైన ఓటింగ్ ను కూడా ఇచ్చారు. అయితే ఓటమినుంచి పాఠాలు నేర్చుకున్నట్లు ఎంపీ ఎన్నికల్లో వ్యవహరించలేదు కాబట్టే జనం వారిని తిరస్కరించారు.
ఆ స్థితిలో కాంగ్రెస్ అమలు చేయను వాగ్దానాలు BRS కు ఆయుధాలు అవుతున్నాయనేది వాస్తవం. ఒక్కొక్కరుగా పడిపోతున్న తెరాస ఎంఎల్ఏల వికెట్లు ఇప్పుడు పడటం ఆగాయి. ఇదీ ఆ పార్టీకి పెద్ద మోరల్ బూస్టింగ్ అనే చెప్పాలి. లగచర్ల, రుణమాఫిపై పోరాటం, రైతు ధర్నాల ప్లాన్ వారిని రాష్ట్ర క్రియాశీల రాజకీయ మైదానంలో ఆటలో నిలబడే పరిస్థితి కల్పించాయి. మెల్లిగా ఆట రసవత్తరంగా మారనుంది. పోరాటంలో నిలబడుతారో కూలుతారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే బిజెపి పట్ల వారి వైఖరి కూడా, వారితో ఫైట్ చేసే దమ్ము మీద కూడా ఆధారపడి ఉంటుంది.
రాష్ట్రం ఏర్పడి 11 ఏండ్లు అయినా విభజన హామీలు అమలును బిజెపి గాలి కొదిలింది. కృష్ణా గోదావరి జలాల వాటా పంచాయతీ అట్లనే ఉన్నది. శీలాబేడి కమిషన్ సూచనలను కేంద్రం పట్టించుకోనేలేదు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తాన్న 4వేల మెగావాట్ల కరెంట్ కానరాలేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పట్టాలెక్కలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి బంధాలు తెంపలేదు. ఆ ప్రాంత నిరుద్యోగులకు కొలువుల కొయ్య అందకుండా బడ్జెట్ లో బిజెపి కొర్రీలు పెడుతూనే ఉంది. రాష్ట్రానికి 195కు పెంచాలన్న ఐపీఎస్ పోస్టులకోసం పట్టుపట్టకపోయినా, హైదారాబాద్ నుండీ నాగపూర్ కు, వరంగల్ కు పారిశ్రామిక కారిడార్ పని కదలక పోయినా, కరీం నగర్ ఐఐటికి, ఐఐఎంకు, ట్రైబల్ యూనివర్సిటీకి పర్మనెంట్ బిల్డింగులకు కేంద్రం ఫండ్ ఇవ్వకుండా పక్కకు పెట్టినా రాష్ట్ర బిజెపి నాయకత్వం అడగక పోయినా తెలంగాణలో బిజెపి 8ఎంపీ సీట్లు కొట్టింది. రీజనల్ రింగ్ రోడ్డు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించక పోయినా కేంద్రాన్ని గట్టిగా నిలేయ్యని గత, ప్రస్తుత చేతకాని తనమో లేదా రాష్ట్ర ప్రభుత్వాలను బిజేపి ఏ మొహమాటం లేకుండా విమర్శల ఫలితమో గానీ తెలంగాణ పొలిటికల్ స్పేస్ ను బిజెపి ప్రణాళిక ప్రకారమే ఎదుగుతున్నట్లు ఉంది.
ఒక దశలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి ఎదిగిందా అన్నట్లు వాతావరణం బండి సంజయ్ ఆ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఏర్పడింది. బిఆర్ ఎస్ తప్పిదాలు వారికి ఆ అవకాశం వచ్చింది. తర్వాత కర్ణాటక పరిణామాల అనంతరం తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది. రేవంత్ రెడ్డి చాతుర్యం కూడా తోడై, అధిష్టానం గ్రూపులను సమన్వయం చేయడంతో కాంగ్రెస్ లో రేస్ లో ముందుకొచ్చి అధికార పగ్గాలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు బిజెపికి రాక కొంత డీలపడింది. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఆ పార్టీకి మళ్ళీ జోష్ నింపింది. అయినా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ నాయకుల తీరు, పార్టీపై పట్టు ఆర్ ఎస్ ఎస్ బేస్ నాయకులది ఉండాలా, నాన్ ఆర్ ఎస్ ఎస్ నాయకులకు అండాలా అనే అంతర్గత విబేధాలతో కొంచెం ముందుకు కొంచెం వెనక్కి అన్నట్లు బిజేపి నడక సాగుతుంది. అయినా ప్రజల మధ్య సందు దొరికితే మత విద్వేషం రెచ్చగొట్టి మతంతో, కులంతో యువతను ఆకర్షించి రాష్ట్రంలో ఎదగాలని సీరియస్ ప్రయత్నమే చేస్తుంది. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలపై కేంద్రీకరించింది. బండి సంజయ్ తో కాపుల్లో పట్టు సాధించింది. ఈటెలతో ముదిరాజ్ లలో విస్తరించే ప్రయత్నం చేస్తుంది. గౌడ కమ్యూనిటీలో, ఇంకా ఇతర కులాల్లో ఇప్పటికే పేరున్న బీసీ నాయకులపై దృష్టి పెట్టింది. ఆదివాసీ గిరిజన తెగల్లో ఇప్పటికే జొరబడ్డది. ఆదివాసీ సీట్లు కూడా గెలిచింది. బీసీల్లో పట్టుకు ప్రయత్నిస్తూ, మంద కృష్ణతో మాదిగల్లో ఆగర్భ విరోధత్వాన్ని కొంత పోగొట్టుకొని సానుకూలత సాధిస్తుంది. ఫైనల్ గా ప్రజల్లో పట్టున్న ధనబలం ఉన్న అగ్రకుల రెడ్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల్లో టికెట్స్ రాక పోవడంతో బీజేపీ వైపు చూడడంతో ఉత్తర తెలంగాణలో అధిక సీట్లు గెలుచుకునే దశకు చేరింది.
అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దక్షిణ తెలంగాణలో బిజెపికి పట్టు దొరకడం లేదనే చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్, బి ఆర్ ఎస్ వివిధ వర్గాల్లో బలంగా ఉండటంతో సాధ్యం కావడం లేదు. మతపాచిక కూడా పూర్తి స్థాయిలో పారడం లేదు. అందుకు ప్రధాన కారణం ఇప్పటి దాకా కమ్యూనిస్టులు బలంగా ఉండటమే. మత కొట్లాటలు బిజెపి పెడుతది అనే భావన సాధారణ ప్రజల్లో అవగాహన వల్లే వారికి స్కోప్ ఇంకా లేదు. భవిష్యత్ లో చెప్పలేం. అది కమ్యూనిస్టుల పాత్రతో ముడిపడి ఉంటది. కమ్యూనిస్టులు పెరిగితే బిజెపికి ఎదుగుదల కొంచెం కష్టం. కమ్యూనిస్టులు తగ్గితే బిజెపి పెరిగే చాన్స్ ఉంది. అందుకే వామపక్ష భావజాలంపై దాడి చేస్తూ బిజెపి సాంస్కృతికంగా చేస్తుంది. రజాకార్ సినీమాతో సాయుధ పోరాట వారసత్వాన్ని చెరిపివేయాలని చూస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు కమ్యూనిస్టు లపై చేస్తూనే ఉంది.
కొన్ని ప్రత్యక్ష పోరాటాలు ప్రజలవి సంబంధించివై చేసే యత్నం చేస్తుంది. ఇంకా అనేక పాచికలు రెడీ చేయడంలో వారు బిజీగానే ఉన్నారు. బీ ఆర్ ఎస్ పై రాజకీయ పోరాటం లేకపోవడం కూడా బిజెపికి పెద్దగా కలిసొచ్చింది అనే చెప్పాలి. అయినా దక్షిణం ఎర్ర సూరీడు వారికి ఇంకా అడ్డే ఉన్నాడు. లెఫ్ట్ యాక్షన్ ఏర్ర సూరీడునీ మరింత వెలిగిస్తుందా? చూడాలి. వెలుగు తగ్గితే సూరీడు కూడా కాషాయ రంగులోకి మారుతాడు. కాలం డిసైడ్ చేస్తుంది.
ఇంకో ముఖ్య విషయం కమ్యూనిస్టుల కార్యాచరణ. వారి విధానం వారి పార్టీ భవిష్యత్తు ను డిసైడ్ చేస్తది. కేంద్ర బిజెపితో ఫైట్ పేరుతో అధికార పార్టీతో సఖ్యతగా ఉంటారా? కత్తులు నూరుతారా? అనేది రాజకీయాల్లో ముఖ్య భాగమే.
ఇప్పటికీ బలం బలగం రీత్యా కాంగ్రెస్ బలమైన స్థితిలోనే ఉంది. రెడ్డి దళిత వర్గాలు వారికి పెట్టని కోట. కొంత శాతం బీసీల సపోర్టు వారిని అధికారంలోకి తెచ్చింది. BRS కు బలమైన స్వంత వర్గం వెలమలు కానీ వారి శాతం తెలంగాణలో తక్కువ. అధిక శాతం బీసీలు వారికి మద్దతుగా నిలవడం వల్ల ఇంత దాకా నిలిచారు. బీసీలు వీరికి ఎంత అండగా నిలుస్తారు అనే దాని మీదే వారి ఫ్యూచర్ ఉంటది. ఏమైనా పని బాగా చేసి కాంగ్రెస్ చరిష్మా నిలబెట్టుకునే దానిపై, ఫైట్ లో చివరి వరకూ నిలిచిన ప్రతి పక్ష ధమ్ముపై తెలంగాణ రాజకీయం ఉంటుంది. ప్రజల ఆశలను కాంగ్రెస్ మొలకేత్తిస్తుందా? ఏ పక్షం నిలబడుతుంది? ఇప్పటికైతే జంక్షన్ లోనే రాష్ట్ర రాజకీయం ఉంది.
✍️ఏ. విజయ్ కుమార్
రచయిత,
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.