
సిఐటియు, ఎఐకెఎస్ అభినందనలు
సుదీర్ఘ సమ్మె ఫలితంగా శామ్సంగ్ కార్మికుల ఘన విజయం
తొలిసారి ఓ ఏం ఎన్ సి లో గుర్తింపు సంఘం దిశగా తొలి అడుగు
చెన్నై : తమిళనాడులోని శామ్సంగ్ కార్మికుల పోరాటం ఫలించింది. కార్మికుల పోరాటానికి ఆ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చి వారి సంఘానికి అధికారిక గుర్తింపు ఇచ్చింది. ఈ మేరకు ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను కార్మికులు సోమవారం అందుకున్నారు. సిఐటియు నేతృత్వంలో కొత్తగా ఏర్పాటు చేసుకున్న శామ్సంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ (ఎస్ఐడబ్ల్యుయు)కు గుర్తింపు ఇవ్వాలని కోరుతూ వెయ్యి మందికి పైగా కార్మికులు గతేడాది సెప్టెంబరు 7వ తేదీ నుండి 37 రోజుల పాటు సమ్మె చేశారు. అధిక వేతనాలు, ఇతర ప్రయోజనాలు చెల్లించాలని, మరింత మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని వారు కోరారు. కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన ఈ బహుళ జాతి సంస్థ యాజమాన్యం అనేక దుర్మార్గపు ఎత్తుగడలకు పాల్పడింది. యూనియన్ను గుర్తించాలన్న డిమాండ్ కాకుండా వేతనాలు పెంచుతామంటూ శామ్సంగ్ యాజమాన్యం ప్రయోగించిన సెటిల్మెంట్ను కూడా సమ్మె చేస్తున్న కార్మికులు తిరస్కరించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని కార్మికుల హక్కును పరిరక్షించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సిఐటియు లేఖ రాసింది.. మద్రాసు హైకోర్టు డిసెంబరులో జోక్యం చేసుకుని వారి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ట్రేడ్ యూనియన్ల రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. హైకోర్టు ఆరు మాసాలు గడువు విధిస్తే ఆ చివరి రోజున యూనియన్‌కు రిజిస్ట్రేషన్ అందజేశారు. దీంతో అక్టోబరు 16న కార్మికులు సమ్మెను విరమించి, విధులకు హాజరయ్యారు.
ప్రపంచ ద్రవ్య పెట్టుబడి ప్రత్యక్ష జోక్యంతో వివిధ దేశాల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ మదుపరులు రూపొందించిన వ్యవస్థే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కార్మిక సంఘాలు, గుర్తింపు సమస్యలు, కలెక్టీవ్ బార్గైనింగ్ వంటి సమస్యలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆయా దేశాలు ఏయే స్థానాల్లో నిలుస్తాయన్న విషయాన్ని నిర్ధారించే ప్రమాణాలు గా మారాయి. ఈ నేపథ్యంలో గత 30 ఏళ్లలో కార్మిక హక్కుల హననానికి ప్రభుత్వాలు పోటీపడటం ఆనవాయితీగా ఆనవాయితీగా మారింది. అందుకే కేంద్ర ప్రభుత్వం విభాగం ఇండియన్ లేబర్ బ్యూరో విడుదల చేసే వార్షిక గణాంకాల్లో గుర్తింపు పొందిన కార్మిక సంఘాల సంఖ్య, అటువంటి సంఘాలు ఉన్న పరిశ్రమల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావడం గమనించవచ్చు. ఈ నేపథ్యం లో శాంసంగ్ కార్మికుల యూనియన్ ఏర్పాటు, దాన్ని అంతిమంగా గుర్తించాల్సి రావడం దేశ కార్మిక వర్గానికి భారీ విజయం అని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలోనే యూరోపియన్ ట్రెడ్ యూనియన్ ఇనిషియేటిక్ రూపొందించిన నివేదిక ను కూడా ఇక్కడ ప్రస్తావించాలి. కార్మిక సంఘాలు స్వతంత్రంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా పని చేసే అవకాశం కల్పించడం కంపెనీ యాజమాన్యాల భాధ్యత అని ఈ నివేదిక గుర్తించింది. ఈమేరకు మధ్య యూరప్ దేశాల్లో మాజీ సోషలిస్టు దేశాల్లో కంపెనీ శాఖలు ప్రారంభిస్తున్న బహుళజాతి సంస్థలు కార్మిక సంఘాల గొంతు నొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలు గురించి ప్రత్యేక అధ్యయనంతో నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక లో పరిశ్రమ ఆరోగ్యంగా అర్థవంతంగా జాతి ప్రయోజాల కోసం పని చేయాలంటే ఆర్థికంగా శక్తివంతమైన కార్మిక సంఘాలు ఉనికి అనివార్యమని కూడా ఈ అధ్యయనం గుర్తించింది.
సిఐటియు, ఎఐకెఎస్ అభినందనలు
పోరాడి విజయం సాధించిన శామ్సంగ్ కార్మికులను సిఐటియు అభినందించింది. సిఐటియు తమిళనాడు రాష్ట్ర కమిటీ సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. శామ్సంగ్ ఇండియా కార్మికులను అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) కూడా అభినందించింది. సంఘటిత కార్మికులకు లభించిన ఘన విజయంగా అభివర్ణించింది. భవిష్యత్తులో అనేక పారిశ్రామిక రంగాల్లో జరిపే పోరాటాలకు ఇది స్ఫూర్తిదాయకంగా వుంటుందని పేర్కొంది. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన శామ్సంగ్ కార్మిక లోకానికి అభినందనలు తెలియజేస్తూ వారి భవిష్యత్ పోరాటాలకు తమ సంఘీభావం వుంటుందని ప్రకటించింది. ఈ మొత్తం పోరు బాటలో పూర్తి స్థాయిలో మద్దతునందించిన తమిళనాడు ఎఐకెఎస్ కమిటీని కూడా అభినందించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.