
నిజం..లోపలినుంచి బయటిదాకా నా హృదయం ఉడికి పోతున్నది !
ఎప్పటిలాగే గుంపు దాన్ని అణిచి వేసిందనుకోండి!
ఎక్కడెక్కడి జ్వాలల్ని ఆర్పుకుంటూ వెళ్ళను చెప్పండి?
……
చూడండి శవాలు ఎలా గంగలో తేలుతూ ఉన్నాయో ?
శవాల్ని అనాథల్లా వదిలేసే అలవాటు చేసుకోమని
నా మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉంటాను.
కానీ ఈ నిలకడ లేని మనసు ఊరుకోదు కదా!
ఎంతకని ఈ అల్లకల్లోలపు కెరటాలను వేడుకోవాలి చెప్పు?
అవి పాదాల కింది ఇసుకను ఈడ్చుకుని పోతూనే ఉంటాయి.
అలాంటప్పుడు ..తడబడకుండా స్థాణువులా స్థిరంగా నిలబడ్డం నేర్చుకోమని నేను పాదాలకి చెప్పాను !
………
చూడూ..వాళ్ళ ప్రకారం నువ్వు బ్రహ్మ దేవుడి పాదాల నుంచి పుట్టావు మరి !
వామనుడి పాదాలు నిన్ను ఏడు పాతాళ లోకాల లోతుల్లోకి నిలువునా భూమిలో పాతరవేశాయి!
………
నీ శక్తినంతా ఇముడ్చుకుని లే..నిలబడు ఇప్పుడు!
దండన భయాన్ని విసిరి పడెయ్యి..లే !
పాదాలే తిరుగుబాటు చేస్తే ఇక దండన ఏ పాటి చెప్పు?
తిరగబడే పాదాలు నిన్ను తీసుకెళ్లిన చోటికల్లా..దండన కూడా వెన్నాడుతూ ఉంటుందన్న పాఠం నేర్చుకో !
అయినా సరే.
….
పద..వామనుడిని మరుగుదొడ్డిలో పాతాల్సి ఉంది !
గుర్తు పెట్టుకో..మన పాదాల నుంచే ఇక ఆ ఈశ్వరుడు పుట్టాలి !
మన శిరస్సు నుంచి సమస్త మానవాళిని విముక్తి చేసే రాజ్యాంగం స్థాపించ బడాలి !
అందుకే..లే ..నిలబడు ! పాదాలను ముందుకే నడిపించు!
….
శరణ్ కుమార్ లింబాలే
మూలం -మరాఠీ
హిందీ -రీనా త్యాగి
తెలుగు గీతాంజలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.