
– అక్రమ వలసదారులతో వెళ్తున్న అమెరికా సైనిక విమానం
– అనుమతిని నిరాకరించిన కొలంబియా దేశం
– ప్రతిగా వీసాలు రద్దు, సుంకాల విధింపుకు దిగిన అమెరికా
‘ఈ చర్యలు ఆరంభం మాత్రమే’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో రాశారు. కొలంబియాను శిక్షించటానికి వీసాల రద్దు, సుంకాల విధింపుతో సహా ఇతర ప్రతీకార చర్యలను ఆదేశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీంతో అమెరికాలోకి వచ్చే అన్ని కొలంబియన్ వస్తువులపై 25% సుంకాలు విధించడం జరుగుతుంది. ఇది ఒక వారంలో 50% వరకు పెరిగే అవకాశం ఉంది. కొలంబియన్ ప్రభుత్వ అధికారులపై ప్రయాణ నిషేధం, వారి వీసాల రద్దు, అత్యవసర ట్రెజరీ, బ్యాంకింగ్, ఆర్థిక ఆంక్షలు వంటివి ఈ చర్యలలో భాగంగా ఉన్నాయి.
అక్రమ వలసదారులను తరలిస్తున్న అమెరికా సైనిక విమానాలను దిగటానికి కొలంబియా అనుమతిని నిరాకరించటంతో ట్రంప్ ఈ చర్యలకు ఉపక్రమించారు. ‘‘ఈ చర్యలు ప్రారంభం మాత్రమే’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో రాశారు. ‘‘వారు బలవంతంగా అమెరికాలోకి పంపిన నేరస్థులను తిరిగి తీసుకునే విషయంలో కొలంబియా ప్రభుత్వం తన చట్టపరమైన బాధ్యతలను ఉల్లంఘించడానికి మేము అనుమతించము’’ అని ట్రంప్ ప్రకటించారు.
వలసదారులను ‘గౌరవంగా’ చూసుకోవాలి: కొలంబియా అధ్యక్షుడు
ట్రంప్ స్పందన తర్వాత కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మాట్లాడారు. ప్రజలను ‘‘గౌరవంగా’’ చూసే విధివిధానాలను ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు అమెరికా నుండి బహిష్కరించబడిన వలసదారులను తీసుకువెళ్లే విమానాలను అంగీకరించబోమని అన్నారు. ‘‘ఒక వలసదారుడు నేరస్థుడు కాదు. సాటి మానవుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని అతనికి ఇవ్వాలి’’ అని పెట్రో చెప్పారు. ‘‘అందుకే నేను కొలంబియన్ వలసదారులను తీసుకువస్తున్న అమెరికా సైనిక విమానాలను తిప్పి పంపాను’’.
‘‘పౌర విమానాలలో వచ్చే కొలంబియన్లను తన దేశం ‘నేరస్థులుగా భావించకుండా’ స్వీకరిస్తుంది’’ అని పెట్రో తెలిపారు. అంతేకాకుండా కొలంబియన్ జాతియులు మానవీయంగా తిరిగి రావడానికి వీలుగా అధ్యక్ష విమానాన్ని పంపడానికి కొలంబియా ప్రతిపాదించింది. ఎక్స్‌లో ట్రంప్‌ను ధిక్కరిస్తూ, ‘‘మీ దిగ్బంధనం నన్ను భయపెట్టదు’’ అని పెట్రో పోస్ట్ చేశారు. దక్షిణ అమెరికా దేశానికి సంబంధించి వాణిజ్య ఆంక్షలను విధిస్తానని ట్రంప్ చేసిన ప్రకటనల తర్వాత అమెరికా వస్తువులపై 50% సుంకాలను విధించటం జరుగుతుందని పెట్రో హెచ్చరించారు. పెట్రో హెచ్చరిక తర్వాత, అమెరికా వస్తువులపై 25% సుంకాలతో ముందుకు వెళ్తామని కొలంబియా ప్రభుత్వం స్పష్టం చేసిండు.
వీసాల జారీ నిలిపివేతకు అమెరికా నిర్ణయం
కొలంబియన్ జాతీయులను అమెరికా సైనిక విమానాలలో తరలించటాన్ని పెట్రో నిరాకరించిన తరువాత కొలంబియా పౌరులకు వీసాల జారీని వెంటనే నిలిపివేయాలని బగోటాలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని అమెరికా కార్యదర్శి రూబియో ఆదేశించారు. ‘‘అక్రమ వలసదారులను కొలంబియాకు చేరవేస్తున్న విమానాలకు అనుమతిని నిరాకరించటానికి కారణమైన వ్యక్తులు, వారి కుటుంబాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలను విధిస్తుంది’’ అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది ‘‘అత్యంత ప్రాధాన్యతగల ‘అమెరికా ఫస్ట్’ ఎజెండాను అమలు చేయడంలో భాగం’’ అని ఆ ప్రకటన తెలిపింది. కొలంబియా తన పౌరులు అమెరికా నుంచి తిరిగి రావడాన్ని అంగీకరించే బాధ్యతను నెరవేర్చే వరకు ఈ చర్యలు అమలులో ఉంటాయని కూడా ఆ ప్రకటన పేర్కొంది.
అమెరికా ఫస్ట్ ఎజెండాకు అడుగులు
‘‘అమెరికాలో చట్టవిరుద్ధంగా వున్న తమ పౌరులను అంగీకరించడంలో విఫలమైన వారిపై ఆంక్షలు విధించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది’’ అని రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ అన్నారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్ తాను చెప్పినట్లుగానే అమెరికాను మొదటి స్థానంలో ఉంచుతున్నారు. కాంగ్రెస్ ఆయన ఎజెండాను బలోపేతం చేసే విధానాలను అమలు చేస్తుంది’’ అని జాన్సన్ ఎక్స్‌లో రాశారు.
ట్రంప్‌పై డెమొక్రాటిక్ పార్టీ నేత విమర్శలు
మరోవైపు, కొలంబియాపై ప్రతీకార సుంకాలను విధించాలనే ట్రంప్ చర్యను డెమొక్రాటిక్ పార్టీకి చెందిన న్యూయార్క్ కాంగ్రెస్ మహిళ అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ విమర్శించారు. ‘‘ ట్రంప్ శ్రామిక వర్గ అమెరికన్లను ద్రవ్యోల్బణంతో మరింతగా దిగజార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది మంచిది కాదు. కొలంబియా కాఫీని ఎగుమతి చేసే ప్రధాన దేశం. అంటే ట్రంప్ సుంకాల కారణంగా కొంతమంది అమెరికన్లకు అల్పాహారం కొంచెం ఖరీదైనది కావచ్చు’’ అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
గ్వాటెమాల, హోండురాస్లలో దిగుతున్న అమెరికా విమానాలు
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ట్రంప్ ప్రచార వాగ్ధానాలలో ఒకటి. అమెరికా నుండి బహిష్కరించబడిన వలసదారులను తీసుకువెళుతున్న రెండు వైమానిక దళ సీ-17 కార్గో విమానాలు జనవరి 24వ తేదీన శుక్రవారం నాడు తెల్లవారుజామున గ్వాటెమాలాలో దిగాయి. అదే రోజు, మొత్తం 193 మంది బహిష్కృత అక్రమ వలసదారులతో కూడిన రెండు విమానాలు హోండురాస్లో దిగాయి.
‘‘విట్నెస్ ఎట్ ది బోర్డర్’’ అనే న్యాయవాదుల గ్రూపు గణాంకాల ప్రకారం 2020 నుండి 2024 మధ్యకాలంలో అమెరికా నుండి అక్రమ వలసదారులను చేరవేసే 475 విమానాలను కొలంబియా అంగీకరించింది. ఇలా అంగీకరించిన దేశాలలో గ్వాటెమాల, హోండురాస్, మెక్సికో, ఎల్ సాల్వడార్ల తరువాత కొలంబియా ఐదవదిగా ఉంది. 2024లో అక్రమ వలసదారులతో కూడిన 124 విమానాలను కొలంబియా అనుమతించింది.
‘అత్యవసర’ సీఈఎల్‌ఏసీ సమావేశాన్ని పిలిచిన హోండురాస్
అక్రమ వలసదారులను అమెరికా నుంచి బహిష్కరిస్తున్న నేపథ్యంలో, హోండురాన్ అధ్యక్షురాలు జియోమారా కాస్ట్రో వచ్చే వారంలో లాటిన్ అమెరికన్, కరేబియన్ రాష్ట్రాల సంఘం (సీఈఎల్‌ఏసీ) ‘‘అత్యవసర’’ సమావేశానికి పిలుపునిచ్చింది. హోండురాన్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం పెట్రో అధ్యక్షుడు ఇప్పటికే టెగుసిగల్పాలో జరగనున్న సమావేశంలో తాను వ్యక్తిగతంగా పాల్గంటున్నానని తెలిపారు. రూబియో మధ్య అమెరికా దేశాలను సందర్శించే అవకాశం ఉన్నందున ఈ సమావేశం జరుగుతుంది. ఈ పర్యటన రూబియోకి అమెరికా అగ్ర దౌత్యవేత్తగా మొదటి విదేశీ పర్యటన అవుతుంది.
DW సౌజన్యంతో ప్రచురితం
అనువాదం: నెల్లూరు నరసింహారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.