
ఆరు నెలల క్రితం అదానీ కేసుకు సంబంధించిన సమన్లను అందజేయాలని భారత న్యాయ మంత్రిత్వ శాఖను అధికారికంగా హేగ్ కన్వెన్షన్ తరఫున అభ్యర్థించారు. అయినప్పటికీ గౌతమ్, సాగర్ అదానీలకు భారత ప్రభుత్వం ఇంకా సమన్లు అందజేయలేదని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ న్యూయార్క్ కోర్టుకు తెలిపింది.
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీకి సమన్లు అందజేసే ప్రక్రియను భారత ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ) జూన్ 27న న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టుకు తెలియజేసింది. అయితే, అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం దాదాపు ఆరు నెలల క్రితం భారతదేశంతో ఈ విషయంలో సంప్రదింపులు జరిగాయి.
జూన్ 27న రాసిన లేఖలో, ఈ సంవత్సరం తన మూడవ స్థితి నివేదికను ఎస్ఈసీ కోర్టుకు సమర్పించింది. నవీకరించబడిన నివేదికలను ఫిబ్రవరి, ఏప్రిల్ ప్రారంభంలో కూడా కమిషన్ సమర్పించింది. భారతదేశంలోని అదానీ సోదరులకు సమన్లు, ఫిర్యాదు లేఖలను అందించడానికి హేగ్ కన్వెన్షన్ ఆర్టికల్ 5(ఏ) కింద భారత న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి సహాయం కోరినట్లు ఎస్ఈసీ తెలిపింది.
అయితే, భారత అధికారులు ఈ పత్రాలను అదానీ కుటుంబానికి అందజేశారా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు.
న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా కోర్టులో దాఖలు చేసిన ఎస్ఈసీ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం, “ఏప్రిల్ స్టేటస్ రిపోర్ట్ నుంచి, ఎస్ఈసీ భారత న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించిన భారత న్యాయ అధికారులతో ప్రతివాదులకు(గౌతమ్ అదానీ, సాగర్ అదానీ) సమన్లు, ఫిర్యాదు లేఖలను అందించే ప్రయత్నాలకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది. కానీ ఎస్ఈసీకి తెలిసినంత వరకు, ఈ పని ఇంకా పూర్తి కాలేదు.”
ఏప్రిల్‌లో సమర్పించిన మునుపటి నివేదికలో, కమిషన్ అభ్యర్థన అందినట్లు భారత న్యాయ మంత్రిత్వ శాఖ ధృవీకరించిందని, దానిని సంబంధిత న్యాయ అధికారులకు పంపినట్లు ఎస్ఈసీ పేర్కొంది.
ఈ చట్టపరమైన ప్రక్రియ గత సంవత్సరం నవంబర్‌లో ప్రారంభించబడిన క్రిమినల్, సివిల్ కేసులతో ముడిపడి ఉంది.
2020- 2024 మధ్య సౌర విద్యుత్ ప్రాజెక్టులకు కాంట్రాక్టులను పొందేందుకు గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈఓ వనీత్ జైన్, భారత పునరుత్పాదక ఇంధన సంస్థ అజూర్ పవర్‌కు సంబంధించిన ఇద్దరు మాజీ అధికారులు, కెనడియన్ పెన్షన్ ఫండ్ కైస్సే డీ డీపోట్ ఎట్ ప్లేస్మెంట్ డూ క్యూబెక్ (సీడీపీక్యూ) ముగ్గురు మాజీ అధికారులు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ల డాలర్లకు పైగా లంచం చెల్లించారని యూఎస్ న్యాయ శాఖ ఆరోపించింది.
అదే సమయంలో, గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసును దాఖలు చేసింది. అందులో వాళ్లు యూఎస్ చట్టాలకు సంబంధించిన అనేక నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది.
క్రిమినల్, సివిల్ కేసుల పత్రాలు బహిర్గతం చేయబడిన రెండు రోజుల తర్వాత, నవంబర్ 22న న్యూయార్క్ ఫెడరల్ కోర్టు ఎస్ఈసీ కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు సమన్లు జారీ చేసింది. అయితే, ఆ సమన్లు ఇంకా అందలేదు.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.