
1930లోనే కేవలం రెండు వందల రూపాయల విలువ చేసే పరికరాలతో ‘రామన్ ఎఫెక్ట్’ను కనుగొని ఆసియా ఖండంలోనే ఫిజిక్స్ విభాగంలో తొలి నోబెల్‌ను భారతదేశానికి చెందిన రత్నం సీవీ రామన్ అందుకున్నారు. అంతేకాకుండా భారతీయ మేధా శక్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. అవార్డు తీసుకునే సందర్భంలో భావోద్వేగానికి గురైన రామన్ తన దేశానికి స్వాతంత్య్రం లేదని తన జాతీయ జెండా ఎగరటం లేదని బాధపడుతూ తనలోని దేశభక్తితో కొన్ని శతాబ్దాలకు స్ఫూర్తి సందేశాన్ని ఇచ్చారు.
1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను భారత రత్న సీవీ రామన్ కనుగొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 1987 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించి, దేశవ్యాప్తంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ‘Empowering Indian youth for global leadership in science and innovation for VIKSIT Bharat’ అనే థీమ్‌తో సైన్స్ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.
సాంకేతిక అభివృద్ధి కోసం కృషి..
పేదలు, సమాజంలోని అట్టడుగు వర్గాల సమస్యలపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలని మహాత్మా గాంధీ ఆశించారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా రామన్ తన యావత్ జీవితాన్ని దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి కోసమే త్యాగం చేశారు.
‘రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకొంటున్నావా?’ అని నవ్వులాటగా ఒకరు అడిగినప్పుడు, ఎందుకు కాకూడదు అనుకోని పట్టుదలతో కూడిన తన పరిశోధనా సామర్థ్యంతో 1924లో రాయల్ సొసైటీ సభ్యుడయ్యారు. ప్రతిక్షణం ప్రకృతి అందాలలో శాస్త్రీయ దృక్పథాన్ని వెతికే రామన్ అన్వేషణలో ‘ఆకాశం, సముద్రపు నీరు ఎందుకు నీలంగా ఉన్నాయి?’ అన్న ప్రశ్నకు జవాబే కాంతి పరిక్షేపణంకు సంబంధించిన రామన్ ఎఫెక్ట్. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింప చేసినప్పుడు అది దాని స్వభావాన్ని మార్చుకుంటుంది.
బలమైన ఆయుధంగా రామన్ ఎఫెక్ట్..
లేజర్ కిరణాల రంగప్రవేశంతో శాస్త్రవేత్తలకు రామన్ ఎఫెక్ట్ ఒక బలమైన ఆయుధమైంది. స్ప్రెక్టోస్కోపి అనే విభాగం గొప్పశాస్త్రంగా అధ్యయనం చేయబడుతుంది. నేటికీ రామన్ ఎఫెక్ట్ అనువర్తనాలు ఎన్నో నూతన శాస్త్రీయ ఆవిష్కరణలకు జీవం పోస్తూ, ఆధునిక విజ్ఞానంలో కిరణాలై దూసుకుపోతున్నాయి.
1943లో రామన్ సొంతంగా బెంగళూరులో స్థాపించిన ‘రామన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్’ నేడు భారతదేశ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖగోళశాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం, ఆప్టిక్స్, థియరిటికల్ ఫిజిక్స్, రసాయన శాస్త్రం, ఫిజిక్స్ ఇన్ బయాలజీ వంటి ఎన్నో విభాగాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. మ్యూజిక్ లవర్‌గా ఉన్న రామన్ పరిశోధనలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాళ్ళే. మన దేశ శాస్త్రీయతతో కూడిన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ‘నా మతం సైన్స్. నేను దాన్నే ఆరాధిస్తాను’ అన్న రామన్‌ను 1954లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో ఘనంగా సన్మానించింది.
మరో రామన్ ఎఫెక్ట్..!
78 సంవత్సరాల స్వాతంత్య్ర భారత్‌లో మనదేశ పౌరసత్వం నుంచి ఫిజిక్స్‌లో మరో రామన్ ఎఫెక్ట్ రాలేదు. మళ్ళీ మనం నోబెల్ గెలవలేదు. గ్రామాలకు సరైన శాస్త్రీయత, సాంకేతికత అందడం లేదు. మూఢ నమ్మకాల జాడ ఇంకా మనదేశం నుంచి బయటపడలేదు. అరకొర వసతులతో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు పెద్దగా బడ్జెట్ ఇవ్వనప్పటికీ, మన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కఠోర శ్రమతో కూడిన తమ అంకిత భావంతో చంద్రయాన్, మంగళయాన్ వంటి విజయాలతో ప్రపంచానికి మనమేంటో నిరూపించారు.
అయితే, శాస్త్రవేత్తలకు, మేధావులకు భారతదేశంలో సరైన గౌరవం, పరిశోధనా వసతులు లభించక అగ్రదేశాలకు వలస వెళ్తున్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో సైతం విజ్ఞాన శాస్త్ర బోధనలు మార్కుల మాయాజాలంలో బంధీ అయ్యాయి. సంపాదనే ధ్యేయంగా కొందరు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల నిర్వాహకులు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చుతున్నారు. యువత కూడా ‘తొందరగా సెటిల్’ కావాలనే ప్రపంచ పోకడలలో భాగమై సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయినా ఇప్పటికీ ఎంతో మంది విద్యాసంస్థల నిర్వాహకులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు తమ తరగతి గదుల్లో సీవీ రామన్, అబ్దుల్ కలాం వంటి మహానుభావుల ఆశయాలకనుగుణంగా పనిచేస్తున్నారు. ఆశావాద దృక్పథంతో అభివృద్ధి భారతం కోసం జీవిస్తున్నారు.
అభివృద్ధిలో కీలకం సైన్స్ అండ్ టెక్నాలజీ
విజ్ఞాన శాస్త్రాలను బోధించే అధ్యాపకులు వారి బాధ్యతలను విశాలమైన దృక్పథంతో చూడగలగాలి. కేవలం శాస్త్రంలోని సిద్ధాంతాలను, ప్రయోగాలను, ప్రక్రియలను బోధించడమే కాకుండా విద్యార్థులను సామాజిక బాధ్యతలను నెరవేర్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా తయారు చేయాలి. సైన్స్, సాంకేతికత, సమాజాల మధ్య గల అవినాభావ సంబంధాల గురించి సంక్లిష్టంగా విద్యార్థులు ఆలోచించగలగాలి. విశాల ఆలోచనా విధానం, జాతీయ సమగ్రత, పర్యావరణ స్పృహ, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలి. అంతేకాకుండా శాస్త్ర- సాంకేతిక రంగాల్లో మరిన్ని పరిశోధనలను ప్రోత్సహిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు, మానవీయ విలువలను కూడా విద్యార్థుల్లో పెంపొందించే విద్యావిధానం ప్రస్తుతం చాలా అవసరం.
‘ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. అందుకే విజ్ఞానం అత్యుత్తమమైన సృజనాత్మక కళారూపం. ఈ విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశ్రమ, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్రాన్ని మధించి వేస్తాయి’ అని సీవీ రామన్ అన్నారు. ఆయన స్ఫూర్తితో మరో అభినవ ‘రామన్ ఎఫెక్ట్‌కు’ ప్రపంచం ఆశ్చర్యపోవాలని ఆశిస్తూ పేదరికం, అసమానతలు లేని భారత నిర్మాణంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి కీలకమన్న మహానుభావుల మాటలను గుర్తు చేస్తూ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు..