
ప్రపంచ వ్యాప్తంగా కుంభమేళా గొప్పతనం, సాంస్కృతిక, చారిత్రక ఔన్నత్యం గురించి చర్చలు జరుగుతూ ఉంటే మరోవైపు కుంభమేళా హిందూత్వ శక్తుల పునరేకీకరణ, సంఘటితంగావటం, కొత్త కొత్త ఎజెండాలు రూపొందించటానికి సంబంధించిన కసరత్తులకు కూడా వేదికగా మారింది. దీనికి సంబంధించిన వార్తలు పెద్దగా ప్రచారంలో లేవు. వసంతపంచమి రోజున హిందూరాష్ట్ర నిర్మాణం దిశగా కొత్త రాజ్యాంగాన్ని కుంభమేళాలో ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వార్తను ది తెలుగు వైర్ పాఠకులకు అందించింది. దీనికి కొనసాగింపుగా ప్రముఖ న్యాయనిపుణులు నందితా హక్సర్ భారత రాజ్యాంగానికి హిందూ రాజ్యాంగానికి ఉన్న తేడాల గురించిన వ్యాఖ్యానాన్ని కూడా అందించాము. తాజా కథనంలో హిందూత్వ రాజ్యాంగాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు ఏర్పడిన ప్రత్యేక వేదిక, దాని కార్యాచరణ ప్రణాళికల గురించి తెలుసుకుందాం.
వసంత పంచమి రోజున జరిగిన సనాతన రాజ్యాంగ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన వక్తలు ఋషి రాజ్యాంగం రూపకల్పన తొలి సమావేశం 2001 ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరిగిందనీ, రెండోసారి 2007 అర్ధకుంభమేళాలో, మూడవసారి 2013 కుంభమేళాలో, నాలుగవసారి 2019 కుంభమేళాలో సమావేశాలను ఏర్పాటు చేశారనీ తెలిపారు. నాలుగు సమావేశాలలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఋషి రాజ్యాంగాన్ని రూపొందించారు. అంటే దాదాపు రెండున్నర దశాబ్దాలుగా చాపకింద నీరులాగా ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు సాగుతున్న ప్రయత్నాలను అటు ప్రభుత్వాలు, ఇటు పౌరసమాజం గుర్తించలేకపోయిందని అర్థమవతుంది.
ఈ ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని రూపొందించటానికి రెండున్నర దశాబ్దాలు గడువు తీసుకున్న శక్తులు, సంస్థలూ దీన్ని ఊరూరా ప్రచారం చేయటానికి మరో రెండు దశాబ్దాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజ్యాంగ పరిషత్ రచించిన రాజ్యాంగం హైందవ విలువలకు స్థానం కల్పించలేదు కనుక దీని స్థానంలో స్వంత రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని ఆరెస్సెస్ బహిరంగంగానే పిలుపునిచ్చిన సంగతి చారిత్రక సత్యం. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు ఈ దిశగా తీసుకున్న తొలిచర్య రాజ్యాంగ పనివిధానాన్ని సమీక్షించేందుకు జస్టిస్ వెంకటాచల్లయ్య నేతృత్వంలో ఓ కమిషన్‌ను నియమించారు. సదరు కమిషన్ అధ్యయనం పేరుతో జరిగిన చర్చల రూపంలో సంఘపరివారం తన రాజకీయ ఎజెండాను ముందుకు తెచ్చింది. ప్రస్తుతం కుంభమేళాలో ఆవిష్కరించబడిన సనాతన రాజ్యాంగం వాజ్‌పేయి కృషికి కొనసాగింపా లేక కొత్త ప్రయత్నమా అన్నది పరిశీలించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అందుబాటులో ఉన్న వార్తల మేరకు ఈ రాజ్యాంగ ప్రతిని ప్రదర్శించారే తప్ప సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా అచ్చేయలేదు.
భారతదేశాన్ని సనాతన దేశంగా మార్చే వైపుగా మహాకుంభమేళాలో సాధువులు తొలి అడుగు వేశారని ఉత్తరప్రదేశ్ నుండి వెలువడే అమర్ ఉజాలా పత్రిక ప్రచురించింది. ఈ పత్రిక వార్తా కథనం ప్రకారం వసుదైక కుటుంబకం ఆధారంగా రూపొందించిన ఈ రాజ్యాంగాన్ని ఋషి రాజ్యాంగం అని పిలుస్తారు. ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రధాన కేంద్రం ఋషికేష్‌లోని ఋషి దర్శన్ ప్రాంతంలో ఉంటుందన్నది వార్త. అయితే ఈ ప్రతిపాదిత ప్రత్యామ్నాయ రాజ్యాంగం కూడా వికేంద్రీకరణ సూత్రాన్ని పాటిస్తోంది కానీ ఇది మనందరికీ తెలిసిన వికేంద్రీకరణ సూత్రం కాదు. ఈ రాజ్యాంగ ఆవిష్కరణలో పాల్గొన్న వక్తలు వెల్లడించిన వివరాల ప్రకారం మరో నాలుగు తాత్కాలిక ప్రధాన కార్యాలయాలు కూడా ప్రారంభం కానున్నాయి. ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జైన్లు ఈ తాత్కాలిక కార్యాలయాలకు కేంద్రాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రతి మహాకుంభమేళాను ఇకపై ధార్మిక పార్లమెంట్‌గా పరిగణిస్తారు. తదనుగుణంగా కుంభమేళాలోనే సనాతన రాజ్యాంగాధిపతి దేశాన్ని ఉద్దేశించి సందేశమిస్తారు. ప్రస్తుతం ప్రతి విజయదశమి రోజునా ఆరెస్సెస్ చాలక్ తన శ్రేణులనుద్దేశించి ప్రసంగిస్తున్న తరహాలో అన్నమాట.
ప్రతి ఒక్క సనాతనికి బాధ్యతలు..
ఈ రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రజలను సనాతనులు, సనాతనేతరులు అని విభజించనున్నట్లు అర్థమవుతుంది. వైదిక సనాతన గ్రంథాలను, పురాణాలను ఆధారంగా చేసుకొని తూర్పు- పశ్చిమ, ఉత్తర- దక్షిణ ప్రాంతాలకు చెందిన 15మంది సాధు-సంతుల బృందం ప్రణాళికను రూపొందించింది. ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక సనాతనికి ఒక గ్రామాన్ని అప్పజెప్తారు. వారికి కేటాయించిన గ్రామాన్ని సనాతన గ్రామం చేయడానికి బాధ్యతలు ఇవ్వనున్నారు. ఆధునిక ప్రజాస్వామ్యంలో దీనిని పోలిన పథకం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన. ఈ ప్రయోగాన్ని మొదట మూడు వందల గ్రామాల్లో చేపడతారు. అందులో వచ్చిన అనుభవాలు, నేర్చుకున్న గుణపాఠాల నుండి తుది ప్రణాళికను రూపొందించి నాలుగు లక్షల గ్రామాలకు విస్తరిస్తారు. తొలిదశలో ఎంపిక చేసుకున్న మూడువందల గ్రామాలు ఒడిషా. పంజాబ్, పశ్చిమబెంగాల్‌లలో ఉన్నాయి. ఇందులో పశ్చిమబెంగాల్, పంజాబ్‌లో రానున్న ఒకటి రెండేళ్లల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
హిందూ దేశాన్ని ప్రకటించటమే సంకల్పం
దేశంలోని గ్రామాలను సనాతన గ్రామాలుగా ప్రకటించటం వెనక ఉన్న రాజకీయ లక్ష్యం ఈ లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర భారతదేశాన్ని సనాతన హిందూ దేశంగా రూపాంతరం చెందించటమే. రెండో దశలో నాలుగు లక్షల గ్రామాల వరకు ఈ సనాతన రాజ్యాంగాన్ని వ్యాపింపచేసిన తర్వాత మూడో దశలో మిగిలిన గ్రామాలకు విస్తరిస్తారు. అంతిమంగా దేశంలోని ఐదున్నర లక్షల గ్రామాలను సనాతన గ్రామాలుగా మార్చే ప్రణాళిక ఉంది. దీంతో పాటుగా వచ్చే 20 ఏళ్లల్లో భారతదేశం వైదిక సనాతన హిందూ దేశంగా ప్రకటించేలా సాధు- సంతులు మహాకుంభమేళాలో సంకల్పించారు. వలసపాలన నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందేందుకు లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర భారతాన్ని నిర్మించే ప్రక్రియలో తొలి స్వతంత్ర రాజ్యాంగాన్ని రూపొందించేందుకు దేశంలోని ప్రజలందరూ (హిందూమహాసభ, ఆరెస్సెస్‌లు మినహా) దాదాపు రెండువందల ఏళ్ల పాటు పోరాడారు. అదే తరహాలో ఆరెస్సెస్ ప్రారంభం అయిన రెండువందల ఏళ్లల్లో భారత దేశాన్ని వైదిక సనాతన హిందూ రాజ్యంగా ఆవిష్కృతం చేయాలని సంకల్పించినట్లు ఈ సమాచారం ద్వారా అర్థమవుతుంది.
2001లో కుంభమేళాతో ప్రారంభం..
శ్రీకాశీ సుమేర్పీఠం శంకరాచార్య స్వామి నరేంద్రానంద్ స్వామి 2001 నుంచి సనాతన రాజ్యాంగం కోసం పని చేస్తున్నారు. ‘ప్రతి గ్రామంలో ఒక్కొక్క ఋషి మోహరింపు ఉంటుంది. గ్రామ దేవతలను ఆధారంగా చేసుకొని వాడ, గ్రామ, మండలాలవారిగా పనులు జరుగుతాయి. గ్రామాలలో ఉండేవారు గ్రామ దేవతలను పూజించడం తమ రోజువారి విధిగా కొనసాగుతుంది. మతమార్పిడిని ఆపడానికి దీనిని అమలు అవసరం ఎంతైనా ఉంది.’ అని నరేంద్రానంద్ స్వామి తెలిపారు.
ఋషి నుంచి బ్రహ్మర్షి వరకు ప్రయాణం..
సనాతన రాజ్యాంగంలో ఋషి తొలి యూనిట్‌గా ఉంటారు. ఇందులో యమం, జపం, తపం, సంయమం, నియమం ఆధారంగా చేసుకొని యువకులను సమీకరిస్తారు. ఋషి తర్వాత రాజర్షి, మహర్షి, దేవర్షి ఇంకా బ్రహ్మర్షిలు పాలకులుగా ఉంటారు. ఉత్తమ పండితుడు, సన్యాసి, శాస్త్రాలలో జ్ఞానం ఉన్న వ్యక్తిని అన్నింటికన్నా ఉన్నతమైన బ్రహ్మర్షి పదవికి నియమించడం జరుగుతుంది. ఆ తరువాత మహాకుంభ మేళాలో బ్రహ్మర్షిని ప్రకటిస్తారు. సనాతన రాజ్యాంగంలో ప్రపంచశాంతి ప్రణాళికను కూడా ప్రతిపాదిస్తోందనీ, ఆ దిశగా అన్నింటికన్నా ముందు వ్యక్తి, ఇల్లు, వాడ, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ఖండం, భూమి ఆ తర్వాత చివరికి ప్రపంచాన్ని ఉంచారు.
17 ప్రచారాలు…
సనాతన రాజ్యాంగం ప్రకారం 17 విప్లవాల లక్ష్యంగా పని చేస్తుంది. మేధో విప్లవం, సాధనా విప్లవం, సంపర్క విప్లవం, సేవా విప్లవం, మత జాగురుకత, సంస్కార విప్లవం, గోవిప్లవం, యువవిప్లవం, వ్యవస్థ విప్లవం, మహిళా విప్లవం, సమతావిప్లవం, శిక్షా విప్లవం, ఆరోగ్య విప్లవం, వ్యసన విముక్తి, సాధికారత, హరితవిప్లవం ఇవి.
కుంభమేళాలో నియామకం..
బ్రహ్మర్షి నుంచి సేవా సైనిక్ వరకు ఎంపిక వేరే వేరే చోట్ల జరుగుతుంది. ఇందులో బ్రహ్మర్షిని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో ఎన్నుకుంటారు. మహర్షిని హరిద్వార్‌లో జరిగే అర్ధకుంభమేళాలో ఎన్నుకుంటారు. ఆ తర్వాత రాజార్షిని నాసిక్ మహాకుంభమేళాలో, ఋషి ఎన్నిక ఉజ్జైని మహాకుంభమేళాలో, ఆచార్య నియామకం ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో, ధర్మరక్షకుడి నియామకం హరిద్వార్ కుంభమేళాలో జరుగుతుంది. అయితే సేవావ్రతి నియామకం మాత్రం ప్రతీ సంవత్సరం ఋషి పంచమినాడు, సేవాసైనిక్ నియామకం ప్రతి మకర సంక్రాంతినాడు జరుగుతుంది. ప్రస్తుతం నిచ్చెనమెట్ల తరహాలో ఉన్న బ్యూరోక్రసీ స్థానంలో ఈ సనాతన రాజ్యాంగ యంత్రం బాధ్యతలు చేపడుతుంది.
సనాతన రాజ్యాంగం విజయవంతంగా అమలుకావడానికి మూడు భావనలను రూపకర్తలు ఏర్పాటు చేశారు. అందులో లక్ష్యం, మార్గం ఇంకా మార్గర్శనాన్ని ఉంచారు. సనాతన రాజ్యాంగ లక్ష్యం ప్రపంచంలో శాంతి నెలకొల్పడం, ఆవును కేంద్రంగా ఉంచి ప్రపంచశాంతి ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశ్యం జనజాగృతి ద్వారా సమాజంలో మహావిప్లవం తేవడం. దీని కోసం సుదర్శన చక్రాన్ని కేంద్రబిందువుగా మహావిప్లవం ప్రణాళికను ఏర్పాటు చేశారు.
ప్రపంచంలో మత కార్యకలాపాలను నియంత్రించడానికి వారి జీవితాన్ని సమర్పించారు. దీనికోసం ఋషితంత్ర వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యంలో మాదిరి ఋషితంత్ర వ్యవస్థలోనూ నేతలను ఎన్నుకుంటారు. ఋషి రాజ్యాంగంలో మూడు భావనలు, మూడు వందలకు పైగా సూత్రీకరణ వ్యాసాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇందులో మొత్తం కలుపుకొని 1056 మతవిభాగాలు ప్రస్తావించబడ్డాయి.
ఇవన్నీ వినటానికి వింతగానూ, ఎబ్బెట్టుగానూ ఉన్నా కళ్ల ముందు జరుగుతున్న కథనాన్ని చూడనిరాకరించటం వివేకవంతుల లక్షణం కాదు. వందేళ్ల క్రితం గాంధీని, నెహ్రూలను కించపరిచేవిధంగా మాట్లాడటం లోకరీతి అవుతుందని ఎవరూ ఊహించలేదు. రెండువందల ఏళ్ల క్రితం అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత వాస్తవ రూపం దాలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సంఘపరివారం ఎజెండాను ముందుకు నడపటంలో ఎంత సంయమనం, ఓపిక, పట్టుదలతో వ్యవహరిస్తారో తెలుసుకునేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. కాబట్టి అమర్ ఉజాల కథనాన్ని తేలిగ్గా కొట్టి పారేయటానికి వీల్లేదు.
(అమర్ ఉజాలా కథనం ఆధారంగా)
(అలోక్ కుమార్ త్రిపాఠి కథనం ఆధారంగా ది వైర్ తెలుగు అందిస్తున్న ప్రత్యేక కథనం)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.