
పాయల్ కపాడియా కొత్త సినిమా ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ (వెలుగు అని మనం ఊహించుకున్నదంతా)పై రామరాజన్ పరిగణన
భారతదేశపు ముంబయి నగరంలో నివసించే ఇద్దరు మళయాళి వలస నర్సుల కథనంగా చాలా వరకు ఉండే పాయల్ కపాడియా చిత్రం ‘వెలుగు అని మనం ఊహించుకున్నదంతా’. ఈ సినిమా 2024లో విడుదలయింది. తమిళం, గుజరాతీ, బెంగాలీ మాట్లాడే వలస ప్రజల గొంతుకను కూడా దీనిలో అల్లుతుంది. బహుబహుషలు మాట్లాడే సమూహాన్ని ఐక్య పరచగలిగే ఒక మిశ్రమ భాషను ఈ చిత్రం సూచిస్తుంది. చిత్ర నాయకురాలు ప్రభ అంటే మళయాళంలో వెలుగు అని అర్ధం మిగిలిన వారందరికీ ఒక ఆశాదీపం. ఈ పదానికి సంస్కృత మూలాలున్నాయి. అనేక సినిమా సమాజాల వరకైనా ఆలోచించదగినదిగా అర్ధమవుతుంది. కానీ కపాడియా ఈ పదాన్ని కటు చేదు వ్యంగంగా కూడా ఉపయోగిస్తుంది. ప్రభ నిర్ణయం తీసుకోలేనితనంతోనూ వ్యాకులత్వంతోనూ సతమతం అవుతుంటుంది. నిజానికి ఈ చిత్రం ముంబయి బహుభాషత్వానికి ఉత్సవం చేయటం లేదు. ఈ బహు భాషత్వపు ఉత్సవాలు తరుచుగా కప్పిపుచ్చే వాటికి ఇది వ్యాఖ్యానం. అది క్రూరంగా గొంతులు కోసే ఈ సమాజపు సామాజిక గతిశీలత వాస్తవం కంటే కూడా భ్రమేనని చూపడం.
భారతదేశపు గ్రామీణ ప్రాంతాల నుండి వలస వచ్చే ఆశావహులు ముంబయి చేరాక ఎదుర్కొనే ఘర్షణ, నీచత్వంతో వారి భ్రమలు తొలిగిపోవడం అనే కథాకథనం కొత్తదేమికాదు. 1955లో విడుదలైన రాజ్‌కపూర్ సినిమా ‘శ్రీ 420’ అంత పాతది. అప్పటి నుండి ఆల్బర్ట్ పింటోకో గుస్సా క్యూ ఆయా(1980) (ఆల్బర్ట్ పింటోకి కోపం ఎందుకొచ్చింది) 1988లోని సలాం బాంబే, 1998లో సత్యవంటి సినిమాలు ముంబయి వాసులు చిక్కుకున్న అవినీతి, దరిద్రం, మతోన్మాదం వంటి సుడిగుండాల గురించి అన్వేషించాయి.
బాలీవుడ్‌కు కేంద్రంగా ఉన్న ముంబైలో అత్యధిక భాగం ముంబై జీవితాన్ని రంగుల కలగా చూపించే సినిమాలే ఎక్కువ. కానీ వాస్తవ జీవితాన్ని పరిచయం చేసే ఇటువంటి సమాంతర సినిమాలు కూడా గణనీయంగానే ఉన్నాయి. ఈ ద్వంద్వత్వం వల్ల ఈ నగరం కొందరికి స్వప్నాలు సాకారం చేసుకునే ప్రదేశమైతే మరికొందరి కలలు కల్లలుగా మారుతున్న దృశ్యానికి ప్రేక్షకురాలిగా మిగులుతుంది. కపాడియాకు సంబంధించినంత వరకు అవి రెండూనూ. పాయల్ కపాడియా సినిమాలో కథా నాయకి ఓ వైపున తమను నిమ్న దృష్టితో చూసే నగరపు చూపులను తట్టుకుంటూనే గ్రామీణ ప్రాంతంలో దొరకని స్వేఛ్చను కూడా అనుభవిస్తుంది. ముంబయి నగరాన్ని మనోహరంగా చూపే ఈ వైరుధ్యమే ‘వెలుగు అని మనం ఊహించుకున్నదంతా’ చిత్రం నేపథ్యం. స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008) అంత సెన్సేషనలిజం లేకుండానే ముంబై మనోహరత్వం గురించి వర్ణిస్తుంది ఈ సినిమా.
ముంబయిలోని ఒక ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు నర్సులు ఒక వంటామె మొత్తం ముగ్గురు స్త్రీల చుట్టూ ఈ చిత్రం నడుస్తుంది. ఇద్దరు నర్సుల్లో పెద్దదయిన ప్రభ (కాని కస్తూరి)కు జర్మనీలో పనిచేసే వ్యక్తితో పెళ్లయ్యింది. కాని చాలకాలంగా అతని నుండి ఏ సమాచారం లేదు. ఆమె తనకంటే చిన్నదయిన సహద్యోగి ‘అను’తో కల్సి ఉంటుంది. ఆమె హిందువు. ఒక ముస్లిం యువకుడితో సంబంధం పెట్టుకుంటుంది. ఆమె సహోద్యగులంతా ఈ సంబంధంపట్ల సుముఖతతోనే ఉంటారు. ఈ ఇద్దరూ మళయాళీలు. మోతాదులో చూసుకున్నప్పుడు ఏ రాష్ట్రంకంటే ఎక్కువగా కేరళ నుండి విదేశాలకు వలసలు పోతుంటారు. ఈ రాష్ట్రంలో 57% నర్సులు అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా మధ్య ప్రాచ్యంలో పనిచేస్తున్నారు. ఆసుపత్రి వంటామె పార్వతి (చయ్యా కదం) విధవరాలు. ప్రస్తుతం ఆమె ఉంటున్న భవంతి స్థానంలో విలాసవంతమైన అపార్టుమెంట్లు నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతో ఆమె ఆ ఇంటి నుండి ఏ క్షణంలోనైనా గెంటివేతకు గురికావచ్చు. తలోదారిన ముంబయి చేరిన ఆ ముగ్గురు మహిళలూ నగరానికి ప్రవాసులే. పార్వతి మరాఠీ అయిన మిగిలిన ఇద్దరి లాగే సొంతవాళ్లకు పరాయిదైన మనిషి. ముంబయి శ్రామికవర్గంలో కలవడం అంటే నిలువనీడ, సొంత గూడు లేకపోవడమే అర్హత అంటుంది కపాడియా.
అయితే, కపాడియా కథనం ఎక్కువగా ఆసుపత్రిలోనే సాగుతుంది. అక్కడ పనిచేసే వాళ్లు ప్రధానంగా నర్సుల చుట్టూ తిరుగుతుంది. ఈ ఆసుపత్రిలో మళయాళీ నర్సులంతా కలిసి తమదయిన ఒక ప్రత్యేక ఉప సంస్కృతిని నిర్మించుకుంటారు. వాళ్లలో వాళ్లు మళయాళీలో మాట్లాడుకుంటారు.(ఈ విషయం ముందే పేర్లు పడేటపుడు చెబితే బాగుండేది) కొత్త మళయాళం సినిమా చూసేందుకు ప్రణాళిక చేసుకోవడం. అను ‘డేటింగ్’ చేయటం వారి సంకుచిత లైంగిక నియమావళికి విరుద్ధం కనుక దానిపై వాళ్లకు మాత్రమే అర్ధమయ్యే సైగలతో ముచ్చట్లు పెట్టుకుంటారు. షియాజ్ మతం వేరుకావడం మరింత పుకార్లకు తావిస్తుంది. నిరంతరం క్రియాశీలకంగా ఉండే నగర జీవనం భిన్న స్పందనలకు దారితీస్తుంది. కొంతమంది గడపదాటాల్సిన అవసరం కూడా లేని స్థితిలో సంతృప్తికరమైన జీవితాన్ని గడిపితే మరికొంతమందికి ఇల్లు దాటకపోవటం జీవనపోరాటంలో ఓ అవరోధంగా మారుతుంది.
కపాడియా చేసే ముంబయి చిత్రణ ఇప్పటికీ ముద్ర వేసుకున్న భావనలకు సంబంధించిన అనుభవాల కూర్పుగాదు. ఉదాహరణకు భారతీయస్త్రీలు తమనుతాము కనుగొనడం గురించిన చిత్రం కాదిది. ఈ సినిమాలో ప్రత్యేకంగా అనువాదం లేదు. కానీ ముంబయిలో జమకూడిన వివిధ పాత్రధారులు మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రం అనువాదాలు కనిపిస్తాయి. వేర్వేరు మాండలికాల మధ్య జరిగే సంభాషణలో హిందీ అనుబంధ భాషగా ఉంటుంది. అయితే అది పరిపూర్ణమైన భాష గా కాదు. అవసరార్ధం వినియోగించే భాషగానే ఉంటుంది. ఈ అనుభవాలు, పార్వతిని నిర్వాసితురాలు చేయదల్చిన రియల్ ఎస్టేటు రారాజుల కుట్రలూ కుతంత్రాలు కలిసి ముంబయి జీవితపు సుసంపన్నమయిన అల్లికను ఈ సినిమాలో చూడవచ్చు. కాకపోతే బాలీవుడ్ స్ఫూర్తితో జరిగే వేడుకల్లో ఇలాంటి సినిమాలకు పెద్దగా చోటు దక్కదు. ఈ సూక్ష్మ వివరాలు సమూహాల మధ్యన ఉండే భిన్నత్వాలు ముంబై వాటిని అవగతం చేసుకున్న తీరు భారతీయ సామాజిక రాజకీయ నేపథ్యంలో పరిచయంగల ప్రేక్షకులకు స్పష్టంగా తేలిగ్గా తెలిసిపోతుంది. అయితే ఈ వైవిధ్యం, సంక్లిష్టత పాశ్చాత్య వీక్షకులకు ఎక్కువ సందర్భాల్లో తరుచుగా అందుబాటులో ఉండవు.
1991 ఉదారవాద ఆర్ధిక విధానాలను ప్రారంభించిన నాటి నుండి అసమానతల స్థాయి పెరగటం దేశం గమనించింది. 1992 నుండి చూస్తే ఇప్పుడు అతి సంపన్నులైన 1 శాతం దగ్గర గల సంపద అత్యధికంగా ఉంది. (దీనిలో వలస ప్రభుత్వ పాలనా సమయం కూడా ఉంది) కపాడియా మొదటి చిత్రం ‘ఏమీ తెలియని ఒక రాత్రి’ (2021) పాక్షికంగా కల్పిత డాక్యుమెంటరీ. దానిలో భారతదేశపు ఉదారవాద విధానాలు తరువాత మతోన్మాద భారతీయ జనతాపార్టీ విజయం దాకా చర్చిస్తుంది. భారత ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థకు(ఎఫ్టీఐఐ) పాలనాధికారిగా ఒక బీజేపీ కార్యకర్తను నియమించడం వల్ల తగిలిన ఎదురు దెబ్బ గురించి నేరుగా ఈ చిత్రం చర్చిస్తుంది. అంతే ప్రాధాన్యతతో ప్రభుత్వ విద్య నుండి వైదొలగడం గురించి కూడా చర్చిస్తుంది. ప్రతిభగల విద్యార్థులకు అందించే రాయితీల ఉపసంహరణ వంటి చర్యలతో మొత్తం గా ప్రభుత్వం విద్యారంగంలో బాధ్యతలనుండి తప్పుకుంటున్న తీరును, దాని పర్యవసానాలను చిత్రీకరిస్తుంది. దేశంలో శతకోటిశ్వరుల సంఖ్య వేగంగా పెరుగుతున్న కాలంలో పన్ను మినహాయింపులు కార్పోరేటు ఖజానాలు నింపుతున్నప్పుడు మీడియా ఎఫ్టీఐఐ విద్యార్థులను పన్నుల నిధిపై జలగల్లాంటి వారని అభివర్ణించడాన్ని ఈ డాక్యుమెంటరీ విమర్శించింది. ఈ రకమైన పరిస్థితులను ‘వెలుగని మనం ఊహించుకున్నదంతా’ చిత్రం కూడా ప్రతిబింబిస్తోంది.
ఈ పరిస్థితులన్నీ తాజా చిత్రం కూడా తడుముతుంది. మనం ఊహించేదంతా వెలుగే అన్న ఈ సినిమాలోని ముంబయి నేపథ్యం అభివృద్ధికి చూపించే అవకాశాలు పరిమితమే. యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖాళీ చేయించేందుకు వీలుగా కుదుర్చుకునే ఒప్పందాల ఆధారంగా చిన్నపాటి అద్దె ఇల్లు సంపాదించటమే మహద్భాగ్యంగా భావించే పరిస్థితి అత్యధికులది. అదృష్టంగా భావిస్తారు. భూకబ్జాదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు పెద్దగా ఏమీ చొరవ చూపటం లేదన్న వాస్తవాన్ని ఈ చిత్రం వ్యక్తీకరిస్తుంది. అడపాదడపా నిరసనలు, నినాదాలతో పెద్దగా సమస్యలేమీ పరిష్కారం కాకుండానే ఉద్యమాలు నీరుకారుతున్న విషయాన్ని కూడా చిత్రం వ్యక్తీకరిస్తుంది. దీంతో పార్వతి ప్రభా కలసి ఒక ఆడంబరమైన కొత్త అపార్టుమెంటు ప్రకటన బోర్డుపైకి ఒకరాయి విసిరి తమ నిరసన ప్రకటించాల్సిన దుస్థితికి చేరుతారు. రాయి విసిరిన తమ సాహసానికి తామె కిచకిచ నవ్వుకుని తొందరగా అక్కడి నుంచి పారిపోతారు. చివరికి దశాబ్దాలపాటు ముంబయిలో నివసించిన పార్వతి బలవంతంగా తన ఊరికి వెళ్లక తప్పని స్థితి ఏర్పడుతుంది. యువత ముంబయికి తరలుతారు. వృద్ధులు ఇక ఎంతమాత్రం ఉపయోగపడనివారు ఓడిపోయి తిరిగి వెళ్లిపోతారు.
ఆర్ట్ హౌజ్ ఫిల్మ్ ఆధ్వర్యంలో ఇటువంటి సమస్యలపై ఇటీవల నిర్మించిన అనేక చిత్రాలు- సంధ్యా సూరి చిత్రం ‘సంతోష్’ 2024, శౌనక్ సేన్ డాక్యుమెంటరీ ఆల్ దట్ బ్రీత్స్(2022) (ఊపిరి పీల్చడంతో) పీఎస్ వినోద్ రాజ్ నిర్మించిన పెబల్స్ (2021) (గులకరాళ్లు) వంటివి ఉన్నాయి. వీటిలో అనేక చిత్రాలు (పాశ్చాత్య వీక్షకులకు అస్పష్టంగా ఉండే) స్వతంత్య్ర భారతీయ కంపెనీలతో కల్సి విదేశీ సహనిర్మాతలు తీసినవే.
పత్రికా స్వేచ్ఛ, కళాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు వేసిన దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. సామాజిక సమస్యలపై చర్చిస్తే తరచుగా దేశ వ్యతిరేక ముద్రపడుతుంది. ఫ్రెంచి లేదా బ్రిటన్ నిర్మాణ కంపెనీలతో కలవడం వలన ఈ సెన్సార్షిప్ నుండి తప్పించుకునేందుకు ఉపయోగపడే మార్గం ఎక్కువసార్లు లభిస్తుంది. అయితే దీనికి భారతీయతను తగ్గిస్తున్నామనే భావనతో మూల్యం చెల్లించవలసి ఉంటుంది.
సంచలనాత్మక కోవకు చెందిన ఆర్ఆర్ఆర్(2022), బాహుబలి (2015) కల్కి 2898 ఏడీ (2024), కేజీఎఫ్‌లాంటి సినిమాలు ఆర్ధిక అస్థిరతను ప్రేరేపిస్తాయి. ఒక మగధీరుడు ఒంటి చేత్తో అనంత సమస్యలను పరిష్కరించటం ఆ క్రమంలో తానే అనివార్యమైన శక్తివంతుడిగా చూపించుకునే ప్రయత్నం జరుగుతుంది. భారతదేశపు మతోన్మాదపక్షం నుండి అత్యున్నత పదవిలో ఉన్న నాయకుడు అతని పరిపాలన దైవ నిర్ణయమని ప్రకటించడం బహుశా కాకతాళీయం కాదెమో. అది చివరికి తను ఒక నిష్కళంకమైన గర్భధారణ(అయోనిజుడు) ఫలితం అనే దాకా వెళ్లింది.
‘వెలుగని మనం ఊహించుకున్నదంతా’ చిత్రంపై వస్తున్న విమర్శలు, విశ్లేషణలూ ఈ చిత్రం ఇతివృత్తానికి నేపథ్యంగా ఉన్న ముంబయి గురించిన వర్ణనల పట్ల తగినంత దృష్టి సారించటం లేదు. పాత్రల మధ్యగల లోతయిన సంబంధాలను, నగరపు ప్రస్తుత రాజకీయ ఆర్ధికస్థితి అది దేశంలో ఒక భాగమన్న వాస్తవాలను ఉపేక్షించాయి. ‘కేన్స్’లో దాని విజయం తర్వాత వచ్చిన సమీక్షలు ‘సంగీతాత్మకం’ స్వప్నంలాంటింది. ఒక ఒంటరి ప్రేమాయణం చివరికి ఆధునికం అని పిలిచాయి. ముంబయి నగరం అనే ఒక సందర్భం నుండి ఈ ప్రశంసలు చిత్రాన్ని దూరం చేస్తాయి. న్యూయార్క్ టైమ్స్ దీన్ని ‘పారి మార్ధికంగా పరిచితమైందని’ పేర్కొందని దాని అర్ధం ఏమిటో రాసిన వాళ్లకే తెలియాలి. మళయాళి నర్సులు ఎవరయితే నిజానికి భారతదేశంలో ప్రతి పట్టణపు ఆసుపత్రుల్లో ఉన్నారో వారి జీవిత వృత్తాంతాలను చూపించిన ఒక చిత్రానికి ఇటువంటి ఉత్సుకత గల అదృష్టం దాపురించింది.
ఇప్పటి దాకా జరిగిన విమర్శ ఈ చిత్రాన్ని దాని సుసంపన్న నేపథ్యం నుండి లాగేశాయి. ప్రపంచ సినిమా గుర్తించేలా చేసే దాన్ని అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో పోటీ పడేలా చేశాయి. ది గార్డియన్ పత్రికలో సమీక్ష రాసిన పీటర్ బ్రాడ్షా చిత్రంలో వర్ణించిన మత విభేదాలు రియల్ ఎస్టేటుదారుల చొరబాట్ల గురించి వర్ణిస్తాడు. కానీ ఈ పాపులు భావోద్వేగాలపరంగా అభద్రత కలిగి ఉన్నాయనకుండా ఉండలేక పోయాడు. అంటే చివరికీ అన్నీ దాని హేతుబద్ధమయిన ఆర్ధికపరమైన ఆందోళనకు కేంద్రంగా ఉన్న నగరానికి దూరంగా వాటిని పరిష్కరించుకోవచ్చన్నమాట. బీబీసీకే సమీక్ష రాసిన నికోలస్ బర్బర్ ఈ సినిమా నగరంలో వంటరిగా జీవించే ఎవరినయినా సమ్మోహనపరిచే భావనాత్మకత విశ్వజనీనత కలిగి ఉందని భావించాడు. మధ్యలో ఎక్కడో అతను నేటి ముంబయి మహిళల జీవితాల్ని నిర్దిష్ట వివరాలతో చూపించిందని జనాంతికంగా రాశాడు. ఇండియా ఫ్రెంచి కలయికతో నిర్మించిన ఈ చిత్రం అమెరికా లేదా యూరపులోని భారత సుఖాంత నాటకాన్ని తలపిస్తుందని కూడా పాఠకులకు గుర్తు చేస్తాడు. ఈ సినిమాను ఒక నగరం దృష్టి నుండి (ప్రత్యేకంగా ముంబయి నగరం అని కాకుండా) చూడటం ఈ భిన్నమైన ప్రతిస్పందనల లక్షణంగా కన్పిస్తుంది. ద న్యూయార్క్ టైమ్స్‌లో మనోహ్లా దర్గిస్ సమీక్ష ‘నగరానికి సహజంగా ఉండే బలహీనతల, ఆకర్షణల వెలుగు నీడల్లో వెర్రిగా ముసురుకునే, కాకిగోలతో హింసించే వాటి విముక్తి కావించేరీతిలో మనసులను మెలిపెట్టేలా చూపిస్తున్న ఈ నగరాలు వ్యాకుల లక్షణాలతో ఉందనే వైపుకు మన దృష్టిని మారల్చుతాడు.
మైకోలాంజిలో ఆంటోనియో వంటి దర్శకులు తన కేరీర్ మధ్య కాలంలోనూ, మలి దశలోనూ తీసిన సినిమాలు చిత్ర నేపథ్యంలో వ్యక్తీకరింంచే అంశాలకంటే తక్షణ అనుభవాలను నొక్కివక్కాణించే శైలితో ఉంటాయి. ఈ సినిమాలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయని భావించి మనం మోసపోయే అవకాశాలు లేకపోలేదు. కానీ ‘వెలుగని మనం ఊహించుకునేదంతా’ సినిమాను ఇటలీ నయావాస్తవికవాదం మనసులో ఉంచుకుని చూడటం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వంశానుక్రమం సంక్లిష్టమైందేమీకాదు. కపాడియా మాతృ విద్యాసంస్థ ఎఫ్టీఐఐతో కలిసి పోయిన చిత్ర నిర్మాణ శైలి చాలాకాలం నుండి డాక్యుమెంటరీ వాస్తవికవాదానికి పర్యాయపదంగా ఉంది. తర్వాతి కాలంలో ఎఫ్టిఐఐలో బోధించిన తొలితరం దర్శకులు సత్యజిత్‌రే, రిత్విక్ఘటక్ల ప్రభావం ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఆ తర్వాతతరం చిత్ర దర్శకులు అదూర్ గోపాలకృష్ణన్, మనికీల్, సయీద్ అఖ్తర్ మీర్జా వంటి వారి ప్రభావం కపాడియా చిత్రంలో నాయికలు రోజువారీ సంఘర్షణలు, వారు ఎదుర్కునే చిత్ర సమస్యల్ని కూడా అధిగమించలేని తనం, వారిని అణిచివేసే పేదరికం వంటివాటిపై ఆమె వక్కాణింపులో కనబడుతుంది.
‘వెలుగని మనం ఊహించుకునేదంతా’ చిత్రం మానసిక స్థితిపైనా వాతావరణంపైనా దృష్టి కేంద్రికరించినట్టు ఈ రెండిరటి మధ్య సంబంధాలు తనదైన శైలిలో తనదైన వేగంతో కదులుతూనే ఉంటాయి. ఒక ఘటన నుండి మరో దానికి సినిమా దూకుతుంది. కానీ ఘటనల కథనం నెమ్మదిగా జరుగుతుంది. స్లోమోషన్లో అను, షియాజ్లతో కెమెరా కాళ్లీడ్సుకుంటూ పోతుంది. దాంతో ఎత్తు నుండి తీసి పాట్స్‌లో ఈ యువజంటపై పెద్దగా ఆసక్తిలేదన్న అభిప్రాయాన్ని ప్రేక్షకులకు కలిగిస్తుంది. ప్రభ ప్రత్యేకించి ఎటూకాకుండా చూపుసారించేటపుడు కెమెరా ఆమెపై జాగు చేస్తూ తారాడుతుంది. (ప్రభా నిస్సహాయ వేదనకు రూపం ఇవ్వడంలో కస్తూరి నిష్ణాతమైన నటన చూపింది.) డా మనోజ్(అజీస్ నెదుమన్గాడ్) కొంత వరకూ అను నెమ్మదిగా ఇంద్రియానుభూతి కలిగించే కవిత్వం రాయటం నగరంలో పూర్తిగా కొరవడిన ఒక సామూహిక భావన కోసం తపించడంపై కూడా కెమెరా ఫోకస్ పెడుతుంది.
ఈ సినిమా లైంగిక వాంఛను కవితాత్మక భాషలో వ్యక్తపరచడం కాకతాళీయం కాదు. నగరపు రోజువారీ సంభాషణల భాష ఈ అవసరం తెలియజేయడానికి సరిపడదనిపిస్తుంది. థియోడర్ అదోర్నో ఎత్తి చూపినట్టు ఒక ఉమ్మడితనాన్ని అసాధ్యం చేసిన సమాజానికి వ్యతిరేకంగా మాత్రమే తన్నుతాను మరిచిపోయే కవిత్వంలో మునిగిపోవడం జరుగుతుంది. నగరపు నడకను తిరస్కరించమని ఈ చిత్రం వీక్షకుల్ని కోరుతుంది. నగరం నగరవాసులకు క్లిష్ట ఎంపికలతో ఈ పాత్రలు ఎలా సంధి సంప్రదింపులు జరుపుతాయో చూపుతుంది. చివరికి ఈ పాత్రలు నగరం నుండి దూరం కావడం అంటే ఒక భిన్నమైన గ్రామీణ తాత్కాలికతలను కోరుకోమని సూచించినట్లు కాదు. నగరం గమనం నెమ్మదించాల్సిన అవసరాన్ని తెలియచెప్పటమే.
ఈ చిత్రం నాకు మీరానాయర్ చిత్రం సలాం బాంబేను గుర్తుచేసింది. ముంబయి అనాకర్షణ అంతట్నీ జంకులేకుండా చర్చించిన చిత్రం అది. అది కపాడియా చిత్రమంత కఠినంగా లేదా నయా వాస్తవికత సౌందర్య దృష్టితో చూడకపోయినా అది కూడా ఈ తానులో గుడ్డే. అను, ప్రభల సొంత రాష్ట్రం కేరళలో నర్సు వృత్తి అంటే యూరోపు, అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలకు చట్టబద్ధంగా వలస వెళ్లే అవకాశం కల్పించే వృత్తి. అయితే అత్యధికులు భారతదేశపు ఇతర రాష్ట్రాల్లో తక్కువ వేతనాలకు పనిచేసే వారుగా మిగిలిపోతారు. అదృష్టం తలుపు తడుతుందని ఆశగా ఎదురు చూస్తూ స్తబ్దుగా జీవితాన్ని గడిపేస్తుంటారు. సల్మాన్ రషీది (ముంబయి గురించిన మన కాలపు గొప్ప వృత్తాంతకారుడనవచ్చు) ఇది వలస పరిస్థితి సారాంశం అంటాడు. నిరంతరం మసకబారిపోతున్న గ్రామీణ చిత్రానికి దూరమవుతున్న శాశ్వత వలస స్థితికి చేరిన జీవితాల కథ ఇది. ఇథియోపియన్ సంగీతకారిణి ఇమోహయి ట్సెగ్యుమర్యం స్వరపరిచిన పాట ‘నిలువనీడలేని సంచారి’ నేపథ్యగానంతోనే అను, షియాజ్‌ల కలిసే సన్నివేశాలన్నీ నడవడం సమంజసం. ప్రారంభంలోనే ఈ గీతానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆందోళనలు కలయికలు నాయర్ చిత్రంకంటే కపాడియా చిత్రాన్ని భిన్నంగా చూపుతాయి. నాయర్ పాత్రలు మురికి వాడల నుండి వచ్చాయి. తరచుగా చట్టవ్యతిరేక పనులు చేసి వారు బతికే జీవితాలు వారివి.
ఈ చిత్రంపై కురిసిన ప్రశంసలన్నీ ఎలా ఉన్నా ఏ మాత్రం మంత్రముగ్ధులను చేయని వాస్తవిక పాత్రలు, వారి జీవితాల్ని శాసించే కష్టాలను చిత్రీకరించటంలో కపాడియా వెనకంజ వేయలేదు. తొలిసారి స్క్రీన్ మీదకు అను వచ్చే సమయానికి ఆసుపత్రికి వచ్చిన అనేకమంది రోగుల భారంతో కుంగి నీరసంగా ఉన్న అను ప్రత్యేకించి మూడోసారి గర్భంధరించి ఇక గర్భం రాకుండా సాయం చేయమని కోరిన ఒక నిరుపేద యువతి వైవాహిక లైంగిక అత్యాచారాన్ని ఇప్పటికీ గుర్తించని దేశంలో ఆమెకున్న లైంగిక స్వేచ్ఛకుండే పరిమితులు జ్ఞాపకం రాగానే ఆ యువతి పరిస్థితి చూసి కదిలిపోతుంది. చుట్టుపక్కల ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారించుకుని ఆ యువతికి కుటుంబ నియంత్రణ మాత్రల సీసా ఉచితంగా ఇస్తుంది. నగరంలో ఆర్ధిక సంకటం అంచుల్లోకి నెట్టబడినవారు వారి అస్థిర జీవితాలు నిలబెట్టుకునేందుకు వారికి లభించే రోజులవారి కారుణ్యానికి సంబంధించిన భావంపై దర్శకురాలు వెలుగు ప్రసరిస్తుంది.
చిత్రంలోని ఈ రకమైన దృశ్యాలు ఒక సాధారణ అభద్రతకు ప్రాతినిధ్యాన్ని, పాత్రల రోజువారీ జీవితపు తక్షణావసరాల స్వభావాన్ని ఎరుక పరుస్తాయి. ఈ రకమైన దయాపూరిత వార్తలపై రోగులు ఆధారపడేలా చేస్తుంది ఆరాధ్యవ్యవస్థ. పార్వతిలాంటి వాళ్లుండే ఇళ్లున్న భూమిపై రియల్ ఎస్టేటు కంపెనీల కన్నుపడితే చట్టం గురించి వారి అవగాహనరాహిత్యాన్ని ఆసరా చేసుకుంటే వాళ్లు వారి హక్కుల్ని కోల్పోతారు. పార్కింగ్ స్థలంలో వారు కలుస్తున్నపుడు వారి ఏకాంతానికి భంగం కలిగించకుండా ఉండటానిక అను షియాజ్లు భద్రతా సిబ్బందికి లంచాలు ఇస్తారు. ఈ రకమైన దృశ్యాల్ని ఉపేక్షించడం వల్లనే ఈ సినిమా ‘పారిమార్ధికంగా పరిచితంగా’ పరవశింపచేస్తుంది.
నగరాన్ని వదిలి వెళ్లినంత మాత్రాన పరిష్కారంకాని ముంబయి జీవిత వైరుధ్యాల్ని జంకు లేకుండా చర్చించడం ఈ చిత్రం ప్రధానబలం. దానిలో అనేక పరిమితులున్నాగాని నగరం ఒక స్వేచ్ఛను ప్రసాదించే ప్రదేశం. ఈ నిర్దిష్టమైన అనుభవాలలో ఆర్ధిక సంకటాలు, ప్రభుత్వ ఉదాసీనతను చూడగలగటం తప్పకుండా సాధ్యమే దీని వలన ‘వెలుగని మనం ఊహించుకునేదంతా’ ఒక పరస్పరం ఇచ్చిపుచ్చుకునే మానవత్వ సంబంధంలోకి, ఒక ఆధునిక నగర అనుభవాలకు కుదిస్తుంది. ఇది అటువంటి ఉమ్మడి మానవత్వాన్ని వెలికితీసేందుకు సానుకూలంగాలేని పాశ్చాత్య సినిమాతో పోలికలేని చిత్రం ఇది.
ఈ సినిమా పట్ల భారతీయ ప్రతిస్పందన కూడా అంతే కలవరం కలిగిస్తుంది. పత్రికలు సాధారణ ప్రజలు సినిమాను ఆమోదించారు వేడుక చేసుకున్నారు. దాని విడుదల ఇటువంటి అనేక స్వతంత్ర సిన్మాలకంటే ఎక్కువ ప్రచారం పొందింది. అయితే భారత చలన చిత్ర సమాఖ్య అకాడమీ అవార్డులలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి వేరే సినిమా ‘లా పతా లేడీస్’ (2023) ఎంపిక చేయటంతో ఈ సినిమాను కాస్తంత మసకబార్చటానికి ప్రయత్నం చేసింది. ఈ సినిమాను రెండు పెద్ద స్టూడియోలు కలిసి తీశాయి. ఒక స్టూడియో యజమాని బాలీవుడ్ నటుడయితే మరో స్టూడియోకు ప్రస్తుత దేశ రాజకీయ పాలకులకు దగ్గరి వ్యక్తి, శతకోటీశ్వరుడయిన పరిశ్రమాధిపతి యజమాని.
ఈ తిరస్కారం గురించిన నిబంధనలు వింటే విషయమేమిటన్నది తేటతెల్లమవుతుంది. భారత చలన చిత్ర సమాఖ్య ఎఫ్ఎఫ్ఐ అధ్యక్షుని వాదన ప్రకారం ‘ఎంపిక కోసం నిర్ణయం చేసిన జ్యూరీ ఈ సినిమా చూసినంతసేపు భారతదేశంలో జరగుతున్న ఒక యూరోపు సినిమా చూసినట్టు అన్పించింది. తప్ప భారతదేశంలో జరిగిన భారతీయ సిన్మాలాగ అన్పించలేదు’ అన్నారట. ఈ సినిమాలో భారతీయత లేదని ఆయన జోడించాడు. ‘భారత స్త్రీలు లొంగుబాటు, ఆధిపత్యాల సమ్మేళనాల’ని ఆయన చెప్పటం వెనక ఉన్న మర్మం ఏమిటో అంతుబట్టదు. పాశ్చాత్య విమర్శకులు, 13 మంది మగాళ్లతో కూడిన జ్యూరీ ‘వెలుగుని మనం ఊహించేదంతా’ అనేది నిజంగా ఒక భారతీయ సాంస్కృతిక కళాఖండం అనే విషయాన్ని అనుమానాస్పదం చేశారు.
సిన్మా సంగీత కూర్పులో యూరోపు వారసత్వం చూడ్డంలో తప్పు లేదు. కానీ ఆ సంగీత కూర్పు పాశ్చాత్యానుసరణ కోరికతో గాని, నగరపు పేదరికంలో నుండి సౌందర్యం వెలికితీయటం కోసంగాని పుట్టలేదు. ఈ సినిమా పారిమార్దికత కోరుకోవడం లేదు. కానీ సుదీర్ఘకాలంలో ‘వెలుగని మనం ఊహించుకునేదంతా’ దానికి ఆపాదించిన విమర్శనాత్మక పదబంధాల్ని అధిగమించి అది ఒక స్థానికంగాను అంతేస్థాయిలో(అంతకు మించి కాదు) ప్రపంచ సినిమా పరిస్థితుల సాంప్రదాయల నుంచీ పరిణామం పొందినదిగానూ ఆమోదం పొందుతుందని మాత్రం ఆశించగలం.
– రామరాజన్
అనువాదం: దేవి
సమీక్షకులు న్యూబెర్రీ కాలేజీలో సాహిత్య విభాగంలో ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.