
జేబులో చెయ్యి పెట్టనక్కరలేదు.. గోడలు దూకాల్సిన పని అంతకన్నా లేదు.. తలుపులు బద్దలు కొట్టాల్సిన అవసరమే లేదు.. ఒక్క క్లిక్ తో లక్షలు హాంఫట్. ప్రస్తుత కాలంలో పెరిగిపోయిన సైబర్ నేరాల తీరిది. గుట్టుచప్పుడు కాకుండా, మనకే తెలియకుండా మన బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. దేశంలో సైబర్ నేరాలు అతి పెద్ద సమస్యగా మారాయి. సాధారణ నేరాల కంటే అత్యధికంగా నమోదవడమే కాకుండా కోట్ల రూపాయలు సొత్తు నేరగాళ్లు కాజేస్తున్నారు. మరి మన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉందో నేరగాళ్లకు ఎలా తెలుస్తోంది? అనే ప్రశ్న తలెత్తవచ్చు. దీనికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ కు సైబర్ క్రైం ఇంటిలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక విస్తుపోయే విషయాలను వెల్లడించింది.
బ్యాంకులలో పనిచేసే వారి నుంచే నేరగాళ్లకు ఖాతాదారుల ఖాతా వివరాలు అందుతున్నాయని, సైబర్ నేరగాళ్లు నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరవడానికీ కొందరు బ్యాంకు అధికారులు కూడా సహకరిస్తున్నారని నివేదికలో సైబర్ ఇంటిలిజెన్స్ టీం స్పష్టం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖను, ఆర్బీఐ అధికారులను సైబర్ ఇంటిలిజెన్స్ టీం అలర్ట్ చేసింది.
ఏటేటా పెరుగుతున్న సైబర్ నేరాలు
పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వివిధ రకాల పద్దతులను పాటించి నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. చదువులేని వారితో పాటు విద్యావంతులు, వ్యాపారస్తులు, సంపన్నులు కూడా వీరి వలలో పడి సొమ్ములను పోగొట్టుకుంటున్నారు. మోసాలు చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు.
అయితే, ప్రతీ ఏటా భారీగా నమోదవువుతున్న సైబర్ నేరాల కట్టడికి ప్రజలు అప్రమత్తంగా ఉండడమే మార్గమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ముందస్తు అప్రమత్తత, కనీస రక్షణ చర్యలు తీసుకుంటే చోరీలను నివారించే అవకాశముంది. సైబర్ నేరాల్లో మాత్రం కొందరు తేలిగ్గా నేరగాళ్ల బుట్టలో పడిపోతున్నారు.
పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ లాంటి ఉదంతాల్లో ప్రాథమికంగా తక్కువ మొత్తాల్లో లాభాలు చూపించి రూ. కోట్లల్లో కొట్టేస్తున్నారు. నేరం జరిగాక సకాలంలో బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసి డబ్బు ఇతర ఖాతాల్లోకి బదిలీ కాకుండా చూడడం, ఆ తర్వాత తగిన సాక్ష్యాధారాలు సేకరించి న్యాయ ప్రక్రియ పూర్తి చేసి బాధితులకు డబ్బు తిరిగి అప్పగించడం సుధీర్ఘ ప్రక్రియ. ఈ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అసలు నేరాలు జరగకుండా జాగ్రత్తపడేలా ప్రజల్లో అవగాహన కలిగేలా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే సైబర్ నేరగాళ్లు అనేక రీతులలో వల విసురుతూనే వున్నారు .పోలీసు, సీబీఐ. ఆదాయపు పన్ను శాఖ అధికారుల పేరుతో కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీటి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బాధితులు పెరుగుతున్నారే గాని క్రైంరేటు తగ్గడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో ప్రకారం గత ఏడాది 11 లక్షల పైగా సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. పోలీలుల దృష్టికి రాని కేసులు కూడా వేలు, లక్షల సంఖ్యలోనే వుంటున్నాయి.
తెలంగాణలో సైబర్ నేరాల సగటు పెరుగుదల 10-15 శాతం
గత మూడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే రాజధానిలో సగటున 9 నుంచి 10 వేల మధ్య ఇళ్లల్లో దొంగతనాలు, వాహన, సెల్‌ఫోన్ చోరీలు రికార్డు కాగా సైబర్ నేరాల సగటు పెరుగుదల 10-15 శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. బాధితులు పోగొట్టుకునే సొత్తు రూ. వందల కోట్లలో ఉంటోంది. ఒక్క 2023లోనే హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్లలో కలిపి సుమారు రూ.450 కోట్లు పోగొట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ తదితర కేసుల్లో కాజేసిన సొత్తు రికవరీ చేసేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. నిందితుల ప్రమేయం నేరుగా ఉండడం. సీసీ పుటేజీలు, వేలిముద్రలు, ఇతర సాంకేతిక ఆధారాలతో తేలిగ్గా చిక్కుతారు. అయితే సైబర్ నేరాలు ఎక్కడ నుంచి జరుగుతున్నాయో కూడా తెలువదు. సైబర్ నేరాల్లో రికవరీ రేటు మాత్రం సరాసరి 5 శాతం కూడా ఉండడం లేదు. నిందితులు కటకటాలు లెక్కించడమూ కష్టసాధ్యంగా మారుతోంది. ఉదాహరణకు హైదరాబాద్ కమిషనరేట్‌లో గతేడాది చోరీ కేసుల్లో మొత్తం రూ.38.38 కోట్లు సొత్తు కాజేయగా పోలీసులు రూ.28.45 కోట్లు రికవరీ చేశారు. అంటే రికవరీ రేటు 74.15 శాతం. అదే సైబర్ నేరాల్లో రికవరీ సమస్యగా మారుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు అంచనా ప్రకారం తెలంగాణలోనే ప్రజలు సైబర్ నేరాల బారినపడి రోజూ సగటున రూ.3 కోట్లకు పైనే పోగొట్టుకుంటున్నారు. వాస్తవానికి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టే సొమ్ము ఇంతకు 10 రెట్ల కంటే ఎక్కువగా ఉంటుందని కూడా పోలీసులు అంటున్నారు.ఒక్క హైదరాబాద్ లోనే రోజుకు రూ. కోటికి పైగా సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్తున్నాయి.
ఏపీలోనూ పెరిగిన సైబర్ నేరాలు
ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో సైబర్ నేరగాళ్లు రూ.940 కోట్లు కొల్లగొట్టినట్లు సైబర్ క్రైం పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. వెంటనే స్పందించిన కేసులలో పోలీసులు రూ.8.26 కోట్లే తిరిగి రాబట్టగలిగారు. అంటే రికవరీ కేవలం 0.87 శాతమే. మరో రూ.140.40 కోట్లు బ్యాంకుల్లో ఫ్రీజ్ చేయించారు. నేరగాళ్లు వేర్వేరు దేశాలు, వివిధ ప్రాంతాల్లో ఉంటూ మోసాలకు తెగబడుతుండటంతో వారిని పట్టుకోవటడం, సొమ్మును రికవరీ చేయటం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. సైబర్ నేరాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. 2014-18 మధ్య ఏపీలో 3,572 సైబర్ నేరాలు నమోదు కాగా, 2019-23 మధ్య 9,849 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. గడచిన సంవత్సరంలోనూ సైబర్ నేరాలు భారీగానే నమోదయ్యాయి.
కొత్త పద్దతులలో సైబర్ నేరాలు
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులను విశ్లేషించినప్పుడు అనేక రకాల నేరాలు వెలుగులోకి వచ్చాయి. అందులో కస్టమర్ సర్వీసు స్కామ్, వర్చువల్ అరెస్టు స్కామ్ ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అనేక మంది వర్చువల్ అరెస్టు స్కామ్ బారిన పడుతున్నారు. ఆధార్ కార్డును హ్యాక్ చేసి మోసాలకు పాల్పడేవారు ఇటీవల పెరిగారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా బాధితుడి బయో మెట్రిక్ సమాచారాన్ని హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.మరోవైపు సోషల్ మీడియాను ఉపయోగించి చేసే మోసాలు పెరిగాయి.
సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఉద్యోగుల సహకారం
కేంద్ర హోంశాఖను సైబర్ ఇంటిలిజెన్స్ అందించిన నివేదికకు బలం చేకూర్చే కేసులను ఇటీవల తెలంగాణ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు కొందరు బ్యాంకు ఉద్యోగులు దన్నుగా ఉంటున్నారు. ఖాతా వివరాలు అడిగో.. ఓటీపీ నంబరు అడిగో… లేదంటే డిజిటల్ అరెస్టు అయ్యారని భయపెట్టో అమాయక ప్రజలను మోసం చేసి.. వారి నుంచి కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లకు ఆ ఉద్యోగులే సహకరిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల కోసం మ్యూల్ ఖాతాలను సృష్టించి ఆ దొంగ డబ్బు దాచుకునేలా వేర్వేరు ఖాతాలకు బదిలీ చేయించుకునేలా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలు సహా గుజరాత్, కర్ణాటక, న్యూఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్‌లో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి 52 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. దీంతో బ్యాంకు ఉద్యోగుల సహకారం తేటతెల్లమైంది. ఈ సైబర్ నేరగాళ్లు తెలంగాణలో 74 సైబర్ నేరాలు సహా దేశవ్యాప్తంగా 576 నేరాలకు పాల్పడి రూ.88.32 కోట్లు కొల్లగొట్టారని పోలీసులు తేల్చారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 33 సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఈ కేసుల దర్యాప్తులో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వేర్వేరు బ్యాంకులకు చెందిన నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ నలుగురు నేపాల్, చైనాల్లోని ప్రధాన సైబర్ క్రిమినల్స్ ఖాతాలకు రూ.23కోట్లు తరలించినట్లు, దేశవ్యాప్తంగా 20 కేసుల్లో వీరి పాత్ర ఉన్నట్లు తేలింది. సైబర్ క్రిమినల్స్ వద్ద రూ.47.90 లక్షల నగదు, మరో రూ.40లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ కలిపి మొత్తం రూ. 87.90లక్షలను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నేరస్థుల ఖాతాల్లో రూ.2.87కోట్లు ఫ్రీజ్ చేశామన్నారు.
సైబర్ నేరగాళ్లకు ప్రత్యక్షంగాను పరోక్షంగానూ కొందరు బ్యాంకు ఉద్యోగులు సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలడంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో బ్యాంకర్లకు కొన్ని సూచనలు చేసింది. సైబర్ క్రైం కేసుల్లో బ్యాంకు సిబ్బంది పాత్ర ఏ మాత్రం ఉన్నా అరెస్టులు తప్పవని హెచ్చరించింది. పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసే వీలున్న కరెంటు ఖాతాల రూపంలోనే మ్యూల్ ఖాతాలు తెరుస్తున్నారు. ఏదైనా బ్యాంకులో కరెంట్ ఖాతా తెరవాలంటే జీఎస్టీఎన్ నంబర్, కంపెనీ అయితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నంబర్ తప్పని సరి. అయితే డబ్బులకు కక్కుర్తి పడి వీటన్నింటినీ బ్యాంకు ఉద్యోగులు మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సైబర్ ఫ్రాడ్స్‌లో బయటపడ్డ ఖాతాల్లో చాలావరకు బ్యాంక్ సిబ్బంది సహకారంతోనే ఫేక్ ఖాతాలు ఓపెన్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏదైనా ప్రజలు అప్రమత్తంగా ఉండటం, బ్యాంకులలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది, థర్డ్ పార్టీ సంస్థల విషయంలో బ్యాంకు ఉన్నతాధికారులు కన్నేసి వుంచడం ద్వారా నేరాలను అరికట్టవచ్చు. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకుల విషయంలోనూ ఆర్బీఐ కఠిన చర్యలు చేపట్టాల్సివుంది.
బాలకృష్ణ ఎం , సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.