
తమిళనాడు ముఖ్యమంత్రి ఇన్క్లూజివ్ విధానాల కొనసాగింపులో భాగంగా 2021లో ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో దేవాదాయశాఖ పరిధిలో ఉన్న దేవాలయాల్లో బ్రాహ్మణేతరులను కూడా పూజారులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు కొన్ని దేవాలయాల్లో బ్రాహ్మణేతరులు పూజారులుగా నియమించబడ్డారు. ఈ నేపథ్యంలో తంజావూరులోని కుమారవయలూర్ సుబ్రమణ్యస్వామి దేవాలయంలో జరుగుతున్న పరిణామాల మీద కథనం ఇది.
ఈ దేవాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2021 నుండి ఎస్ ప్రభు అనే బ్రాహ్మణేతర పూజారి పని చేస్తున్నారు. కానీ ఆయన్ను ఏనాడూ గర్భగుడిలోకి ప్రవేశించనీయలేదు. వారసత్వంగా వస్తున్న పూజారులే ఓ నిచ్చెన మెట్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని బ్రాహ్మణుల్లో కూడా వారివారి శాఖలు, గోత్రాలు, ప్రాశస్త్యాలను బట్టి వారికి పనులు అప్పగిస్తున్న వైనమే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రభు, మరో బ్రాహ్మణేతర పూజారులను ప్రధాన దేవాలయం గర్భగుడిలోకి ప్రవేశించనీయకుండా అడ్డుకుంటున్నారు. ప్రధాన గుడి చుట్టూ ఉండే ఉపదేవాలయాలకు పరిమితం చేస్తున్నారని ప్రభు ఆరోపిస్తున్నారు. మూడేళ్లు పని చేసిన తర్వాత కూడా మురుగన్ భగవానుడిని ముట్టుకునే భాగ్యం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి రాసిన ఓ ఫిర్యాదులో ప్రభు, జయపాల్ అనే ఇద్దరు బ్రాహ్మణేతర పూజారులు దేవాలయంలో మురుగన్ సాక్షిగా తాము అనుభవిస్తున్న వెలివేతనూ, అంటరానితనాన్ని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శవంతమైన పథకంలో భాగంగా మాకు పూజారి ఉద్యోగాలు దక్కినా కుంభాభిషేకం రోజున కూడా గర్భగుడిలోకి ప్రవేశించేందుకు నోచుకోలేదని ఆవేదన చెందుతున్నారు. ఆ వెలివేతతో మనోవేదనకు గురవుతున్నామని ఆ ఫిర్యాదులో తెలిపారు. అర్చకత్వం ప్రధానంగా వంశపారంపర్య బ్రాహ్మణులకే పరిమితం అయిన భారతదేశంలో 2021లో స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనది. ప్రార్థనా స్థలాల్లో కరుడుకట్టుకుపోయిన కుల కట్టుబాట్లను నిర్మూలించాలన్న ద్రవిడ ఉద్యమం నినాదంలో భాగంగా సామాజిక న్యాయ సూత్రాల ఆధారంగా స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సంబంధిత జీవోలు జారీ చేసింది. అయినా ఆ జీవోలను అమలు చేయటంలో గుళ్లపై పెత్తనం కలిగిన సాంప్రదాయక అర్చకుల నుండి పెద్దఎత్తున ప్రతిఘటన తలెత్తుతోంది.
అర్చక విద్యలో ఉత్తీర్ణులైన 32మంది ఉద్యోగాల కోసం 2022 నుండి ఎదురు చూస్తున్నారు. అదనంగా మరో 95 మంది శిక్షణ పొందుతున్నారు. దేశంలోనే ప్రసిద్ధి పొందిన తిరువన్నామలై, మధురై, శ్రీరంగం వంటి దేవాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయటం నేటికీ సవాళ్లమయంగా మారింది. తిరుచ్చి దేవాలయంలో నియమించబడిన బ్రాహ్మణేతర అర్చకులకు నేటికీ గర్భగుడిలోకి వెళ్లే అవకాశం దక్కలేదని తమిళనాడు అర్చక సంఘం అధ్యక్షులు రంగనాథన్ అంటున్నారు. పలు దేవాలయాల నుండి వస్తున్న వార్తల ప్రకారం సాంప్రదాయకంగా వృత్తిలో ఉన్న బ్రాహ్మణ అర్చకులు బ్రాహ్మణేతర అర్చకులను ముప్పుతిప్పలు పెడుతున్నారని, విధుల కేటాయింపు, గర్భగుడిలో చేసే పనులకు రోస్టర్ పద్ధతిలో విధుల పంపిణీలోనూ వివక్ష చూపుతున్నారని వెల్లడవుతోంది. బ్రాహ్మణేతర అర్చకులకు శాస్త్రాల్లో ప్రావీణ్యాన్ని సవాలు చేయటం కూడా కొన్ని చోట్ల కనిపిస్తోంది. ఉదాహరణకు తిండివనం పెరుమాళ్ దేవాలయంలో నియమించబడిన బ్రాహ్మణేతర అర్చకులు ప్రధానంగా ఆలయంలో పారిశుద్ధ్యం పనులకూ, పెద్ద పూజారుల ఇళ్లల్లో సహాయాలకూ పరిమితం చేయబడుతున్నారు. ఈ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేందుకు మరింత కట్టుదిట్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు అర్చక సంఘం కోరుతోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.