
గుల్జార్ ఉర్దూ దళిత కవిత్వం
అనువాదం – గీతాంజలి
***
వెనక్కి ప్రవహించే నీళ్ళ నుంచి.,!{లౌట్ తే పానీ మే సే!}
బతుకు తెరువు కోసం రోజంతా… వెనక్కి ప్రవహించే కేరళ సముద్రపు నీళ్లలో
పడవ నడుపుతూ ఉంటానా.,
తీరం లోని మంద్రంగా ఊగే కొబ్బరి ఆకుల సందుల్లోంచి
సూర్యకాంతి వెచ్చగా నా చర్మపు
రంథ్రాల్లోకి జల్లెడ పట్టినట్టు ఇంకిపోతాయి.
ఉప్పు సముద్రం తన మీద నుంచి వీచే
చల్లని గాలి తెమ్మెరలని
తన కెరటాల వేళ్లతో నూనె పట్టిన నా జిడ్డు వెంట్రుకల్ని
ప్రేమగా దువ్వుతాయి.
ఇక రాత్రి ఆలశ్యంగా ఇంటికి చేరతానా
గుడిసె ముందరి పొయ్యిలోని పిడకల నిప్పు నుంచి
వచ్చే పొగని నా దేహంలోని
ప్రతి రంధ్రం ఎంతో ఇష్టంగా తనలోకి పీల్చుకుంటుంది.
నువ్వు కూడా ఇటు రా… ఒక్కసారి గాఢంగా
నా దేహ వాసనని శ్వాసించు.
చూస్తావప్పుడు., ఎలా జీవన పరిమళం
ఒక దళితుడి నగ్న దేహం నుంచి వెదజల్లబడుతున్నదో !
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.