వలస భారతంలో నాజీ సంస్థలు నిర్వహించిన ప్రచార సరళి గురించి లోతైన పరిశోధన సాగించిన ఈ పుస్తకం అనేక కొత్త కోణాలను మనముందుంచుతుంది. వైజయంతి రాయ్ పరిశోధన గ్రంథం భారతదేశం, వలసవాద వ్యతిరేకతలపై నాజీ అధ్యయం : ధర్డ్ రీచ్‌లో విజ్ఞానప్రదాతలు, ప్రచార వ్యూహకర్తలు హిట్లర్ పరిపాలనలో భారతదేశం పై సాగించిన అధ్యయనాల గురించిన సమాచారాన్ని తొలిసారి వెలుగులోకి తెస్తోంది.
ఈ పుస్తకంలో ఇంతకన్నా లోతైన విషయాలున్నాయి. ఇప్పటి వరకూ మనం కనివినీ ఎరుగని కొత్త కొత్త అంశాలపై ఈ పరిశోధన దృష్టి సారించింది. జర్మన్ రీసెర్చ్ ఫౌండేషన్, గోథె యూనివర్శిటీల సంయుక్త సహకారంతో మూడేళ్ల పాటు ‘నాజీ జర్మనీలో భారతదేశం గురించిన అధ్యయనాలు’ అనే అంశంపై సాగిన పరిశోధన ఫలితమే ఈ రచన. 2018-2021 మధ్యకాలంలో సాగిన పరిశోధనలో వెలుగు చూసిన అంశాలను మరింత విస్తృతపరుస్తూ పరిశోధకుడు ఈ పుస్తకం రాశారు. నాజీ హయాంలో ప్రాచీన భారతదేశం గురించి ఎక్కువగా అధ్యయనాలు జరిగితే ఈ పుస్తకం ఆధునిక భారతదేశం గురించి నాజీలు సాగించిన అధ్యయనాలను కూడా పరిశీలిస్తుంది. విశ్లేషిస్తుంది.
నికొలస్ గోడ్రిక్`క్లార్క్ అనే పరిశోధకుడు 1998లోనే హిట్లర్ పూజారి : సావిత్రీ దేవి, హిందూ ఆర్యన్ అనే భ్రాంతి, నియో నాజీయిజం అనే పేరుతో సావిత్రీదేవి ముఖర్జీ జీవిత చరిత్రపై పరిశోధనాత్మక గ్రంథాన్ని వెలువరించారు. 1902లో పుట్టిన సావిత్రీదేవి ముఖర్జీ 1982లో చనిపోయారు. స్వస్తికా ఛత్రఛాయల్లో : భారతదేశంలో అతివాద జాతీయవాదం, ఇటలీ ఫాసిజం, నాజీయిజంల మధ్య సంబంధాలు అన్న పేరుతో మార్జియా కసోలరి మరో పరిశోథనా పత్రాన్ని వెలువరించారు. ఈ పరిశోథనా పత్రం ప్రధానంగా మరాఠా ప్రాంతంలో ప్రారంభమైన మితవాద హిందూ నాయకులకు, ఫాసిజం మధ్య ఉన్న సంబంధాలతో పాటు బెంగాల్ కేంద్రంగా పని చేస్తున్న జాతీయవాదులకూ ఫాసిస్టులకూ మధ్య ఉన్న సంబంధాలపై దృష్టిసారించింది. ఈ పరిశోథనా పత్రం 2020లో వెలువడిరది. 2021లో వెలువడిన మరో పుస్తకం హిట్లర్ – భారతదేశం : భారతదేశం గురించి హిట్లర్‌కు ఉన్న వ్యతిరేకత, ద్వేషం గురించి ఇప్పటి వరకూ చెప్పని కథ పేరుతో వైభవ్ పురందరే భారతదేశం, చరిత్ర, సంస్కృతి, నాగరికత, బ్రిటిష్ వలస వ్యతిరేక పోరాటం గురించి హిట్లర్ అభిప్రాయాన్ని విశ్లేషిస్తారు. కానీ పైన ప్రస్తావించిన మూడు పరిశోధనల కంటే వైజయంతి రాయ్ పరిశోధన భిన్నమైనది.
నాజీ జర్మనీలో భారతదేశం గురించి సాగిన, సాగించిన పరిశోధనలు, వాటి ఆధారంగా భారతదేశంలో నాజీలు సాగించిన ప్రచారం, అమలు చేసిన ప్రచార వ్యూహాల గురించి లోతుగా చర్చించిన తొలి గ్రంథంగా దీన్ని చెప్పుకోవచ్చు.
భగవద్గీత నాజీల చేతుల్లో సాధనం ఎలా అయ్యింది
224 పేజీల ఈ పుస్తకం భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటును ప్రేరేపించేందుకు నాలుగు నాజీ భావాలు కలిగిన సంస్థలు ఎలా పని చేశాయో రచయిత పరిశీలిస్తారు. మొత్తం పుస్తకంలో ఉపోధ్గాతం, ముగింపు కాక నాలుగు అధ్యాయాలుంటాయి. ఒక్కో అధ్యాయంలో ఒక్కో సంస్థ గురించిన లోతైన పరిశోధన, పరిశీలన ఉంటాయి.
కొంతమంది జాతీయవాదులు, పరిశోధకులు, రచయితలు, వలసవాద వ్యతిరేక మేధావులు జర్మనీ సృష్టించిన సాహిత్యాన్ని నాజీ జర్మనీ లక్ష్యాల కోసం ఎలా భారత స్వాతంత్య్రోద్యమంలోకి చొప్పించారో వైజయంతి రాయ్ ఈ గ్రంధంలో పరిశీలిస్తారు.
వైజయంతి రాయ్ అధ్యయనం చేసిన నాలుగు సంస్థల్లో ఒకటి ఇండియ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జర్మన్ అకాడెమీ మొదటిది. గోథె ఇనిస్టిట్యూట్‌కు ఇది పూర్వపు రూపం. ఇదే సంస్థ భారతదేశంలో మాక్స్ ముల్లర్ భవన్‌గా గుర్తింపు పొందింది. 1941లో జర్మన్ విదేశాంగ శాఖ భారత దేశం గురించి ఏర్పాటు చేసిన విభాగం రెండోది. 1936లో ఏర్పడిన అకాడెమీ ఫర్ స్టడీ ఆఫ్ ఫారిన్ కంట్రీస్ (విదేశాల గురించి అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ), బెర్లిన్ విశ్వవిద్యాలయం, డ్వయి (విదేశీ అధ్యయనాల సంస్థ)లో ఇందుకోసం ఏర్పాటు చేసిన రెండు విభాగాలు ఈ పుస్తకంలో పరిశీలించబడిన మూడో సంస్థలు. ఇండియన్ లిజియన్ పేరుతో ప్రారంభమైన సంస్థ నాల్గోది. దీన్నే టైగర్ లిజియన్ అని కూడా పిలుస్తారు. ఈ సంస్థను జర్మన్ సాయుధ బలగాలు సుభాష్ చంద్రబోస్‌తో కలిసి ప్రారంభించాయి.
భారతదేశంలోనూ, జర్మనీలోనూ, ఇంగ్లాండ్‌లోనూ ఉన్న పురావస్తు భాండాగారంలో నిక్షిప్తమై ఉన్న లేఖలు, పత్రాలను, ప్రభుత్వ సమచార వనరులు ఆధారంగా సాగిన ఈ పరిశోధనలో 19వ శతాబ్దంలో భారతదేశానికి చెందిన ఘనమైన గతాన్ని స్వంతం చేసుకుని స్థానికులైన భారతీయులను ఈ వారసత్వానికి దూరం చేసిన ఆర్యుల గురించి జర్మనీ పరిశోధకులు సాగించిన పరిశోధనలు, వచ్చిన నిర్ధారణలు, ఆధునిక భారతదేశం గురించి వ్యూహత్మకంగా వెలువరించిన జ్ఞానాన్ని (పరిశోధనలను) నాజీ జర్మనీ ఎలా స్వీకరించింది, పరిగణించిందన్న అంశంపై లోతైన చర్చ సాగుతుంది.
అప్పటి ప్రభుత్వ నిఘావర్గాల సమాచారం, వాటికున్న ఆధారాల్లో వాస్తవాస్తవాల గురించిన సందేహాలు ఉంటాయని అవగాహన చేసుకున్న రచయిత ఆయా ప్రభుత్వ వర్గాల సమాచారాన్ని, ప్రాధమిక వనరుల ద్వారా సేకరించిన సమాచారంతో పోల్చి చూసి నిస్సందేహంగా వ్యక్తం చేయగల నిర్థారణలనే పాఠకులు ముందుంచుతారు. రాజకీయ పరిభాషలో ‘జ్ఞాన సృష్టికర్తలు’ వివిధ సందర్భాల్లో సాగించిన రచనా వ్యాసంగం ఈ రచనకు ప్రాధమిక ముడిసరుకు.
నాజీ సైన్యం తన మారణహోమాన్ని సమర్థించుకునేందుకు వీలుగా భగవద్గీతను ఎలా దుర్వినియోగం చేసిందీ రచయిత లోతుగా వివరిస్తారు.
ఈ లక్ష్యం కోసం నాజీ ప్రచార వ్యూహకర్తల్లో ఒకరైన జాకోబ్ విల్హెల్మ్ హోవర్ ‘‘ యుద్ధము, కర్మల్లో ఇండో ఆర్యన్ మెటా ఫిజిక్స్ : నూతన దృక్కోణంలో భగవద్గీత’’ పేరుతో ఓ ప్రచార కరపత్రాన్ని సిద్ధం చేస్తారు. కురుక్షేత్రంలో ఇరువైపులా మొహరించిన గురువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహతులు, బంధువులను చూసిన అర్జునుడు యుద్ధం చేయటానికి (అంతమంది ప్రాణాలు తీయటానికి) సందేహిస్తుంటే అర్జునుడికి చేసిన కర్తవ్యోపదేశమే భగవద్గీత అన్నది భారతీయులందరికీ తెలిసిన విషయమే. ఫలితాన్ని ఆశించకుండా పని చేయి అన్నది భగవద్గీత సారాంశంగా చెప్పబుతుంది. కానీ ఇదే భగవద్గీతను నాజీ రాజ్యస్థాపన దిశగా పదునైన సాధనంగా వాడుకున్న హిట్లర్, సహచర నాయకత్వం ‘రాజ్యం ప్రయోజనాలను గౌరవించటమే యోధుడి కర్తవ్యపారాయణం’ అంటూ రెండో ప్రపంచ యుద్ధంలోనూ, యూదుల మారణహోమంలోనూ అమాయకులైన జర్మన్లను కదనరంగంలోకి దించటానికి చరిత్ర చూడని మారణహోమం సృష్టికర్తలుగా మార్చటానికి ఈ భగవద్గీతనే సాధనంగా వాడుకున్న తీరు పాఠకులను ఆశ్చర్యపర్చక మానదు. నాజి సైనికులు యుద్ద స్పూర్తి నాటి నార్డిక్ ఆర్యన్ల (మన అవగాహన కోసం పాండవుల యుద్ధ వ్యూహం, నాజీల యుద్ధ వ్యూహం ఒక్కటేనని అని జాకోబ్ చెప్తున్నారని అర్థం చేసుకోవచ్చు) యుద్ధ స్పూర్తి ఒక్కటేననీ నాజీ నేతలు ఊదరగొట్టారు. యూదుల మారణహోం వ్యూహకర్తల్లో ఒకరైన హెన్రిక్ హిమ్లర్ కూడా నాజీ నరహంతకులు యూదులను దునుమాడేటప్పుడు మీనమేషాలు లెక్కించకుండా ఉండేందుకు, పాపభీతికి లోనుకాకుండా ఉండేందుకు భగవద్గీతను పదే పదే ఉటంకించటం కాక శ్లోకాలను వల్లెవేసేవాడట.
హైందవ మతం పునరుద్ధరణ లక్ష్యంగా ప్రారంభమైన ఆర్యసమాజం, గౌడీయ సాంప్రదాయం, హిందూ మహాసభలు కాలక్రమంలో నాజీలతో నెరిపిన సంబంధ బాంధవ్యాల గురించి కూడా రచయిత కొత్త విషయాలు పాఠకుల ముందుకు తెస్తారు.
స్వామి భక్త హృదయకు జర్మనీకి చెందిన ఎర్నెస్ట్ జార్జి ష్కుల్జ్ శిష్యుడు. భక్తహృదయ స్వామి అసలు పేరు నరేంద్రనాథ్ ముఖర్జీ, కాలక్రమంలో నదానంత బ్రహ్మచారిగా మారి గౌడీ సాంప్రదాయాన్ని తెరమీదకు తెచ్చారు. జార్జి ష్కుల్జ్కూడా 1935లో భారతదేశానికి వచ్చి గురువు బాటలోనే గౌడీయ సాంప్రదాయాన్ని వ్యాప్తి చేయటానికి పని చేస్తారు. గౌడీయ సాంప్రదాయనికి చెందిన దేవాలయాలు, మఠాలు అన్నింటినీ షుల్జ్ నాజీ తరహా భావాలున్న వారందరికీ కేంద్రాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల నుండే భారతదేశంలో నాజీ సాంప్రదాయాన్ని, సిద్ధాంతాన్ని నమ్మేవారికీ, నాజీ జర్మనీకి మధ్య సంబంధ బాంధవ్యాలు నెలకొల్పటానికి కృషి చేస్తారు. వలస ప్రభుత్వం నిఘా నీడపడకుండా ఉండేందుకు ఈ గుళ్లూ, ఆశ్రమాలు, మఠాలు బాగా ఉపయోగపడ్డాయి. ఈ సంస్థలు ధార్మిక ప్రచారం ముసుగులో విద్యావంతులైన భారతీయులకు నాజీయిజం నూరిపోస్తున్నట్టు వలసపాలకులు అనుమానించారు.
ఈ గ్రంథంలో వైజయంతి ప్రస్తావించిన బ్రిటిష్ గూఢచారి విభాగం నివేదికల ప్రకారం నాజీ ప్రభుత్వం ప్రధానంగా ఆర్యసమాజ్ ద్వారానే భారతదేశంలోని మితవాద శక్తులను చేరుకోవడానికి ప్రయత్నం చేసింది. నిరంకుశత్వం, అధిక సంఖ్యాకవాదం, ఆర్యుల ఆధిపత్యం, కల్తీలేని ఆనువంశిక జాతి వంటి సిద్ధాంతాల విషయంలో నాజీలకు, ఆర్య సమాజికులకు మధ్య అనేక కోణాల్లో ఏకీభావం, మరిన్ని కోణాల్లో సారూప్యత ఉన్నాయి.
ఆర్య సమాజం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ (మాక్స్ ముల్లర్ భవన్) నాజీల మధ్య ఏర్పడిన ఈ భావసారూప్య సంబంధాలు అనతి కాలంలోనే బావోద్వేగంతో ముడిపడిన సంబంధాలుగా మారటంలో 1934 నాటికి ఈ కోణాల్లో భారతీయ సమాజాన్ని అధ్యయనం చేయటానికీ, అర్థం చేసుకోవడానికి అనువైన పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనం (స్కాలర్షిప్) ఇవ్వాలని నిర్ణయం అయ్యింది. ఈ స్కాలర్షిప్ అందుకున్న తొలి ప్రొఫెసర్ సతన్కేతు విద్యాలంకార్. ఈయన ఆర్యసమాజ్ ప్రారంభించిన విశ్వ విద్యాలయంలో చరిత్ర విభాగంలో ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్కు అయ్యే ఖర్చు భరించటానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్‌తో పాటు అలియాంజ్ కంపెనీ కూడా ముందుకొచ్చింది. ఈ కంపెనీ స్టట్గార్డ్ కేంద్రంగా పరిశ్రమలను నడుపుతోంది. బ్రిటిష్ గూఢచారి విభాగం నివేదికల మేరకు ఈ స్కాలర్షిప్ గ్రహీతలను ఎంపిక చేసేటప్పుడు ఆర్య సమాజికుల్లో కూడా ఆర్య జాతి ఔన్యత్య సిద్ధాంతంపై విశ్వాసం ఉన్నవాళ్లకే ప్రధమ ప్రాధాన్యత ఉండేది. ఆర్యసమాజికులు ఈ కాలంలో పదేపదే హిట్లర్ గుణగణాలు కీర్తించటం, నేషనల్ సోషలిజం పేరుతో చలామణి అవుతున్న నాజీయిజాన్ని ఆకాశానికెత్తడం జరిగినట్లు కూడా బ్రిటిష్ నిఘా వర్గాలు నమోదు చేశాయి. నాజీలు భారతదేశంలో కల్తీలేని అగ్రకులాధిపత్య సిద్ధాంతమే హిందూయిజంగా విశ్వసించే శక్తులతో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నది. తర్వాతి కాలంలో ఈ దేశవాళీ నాజీ శక్తులు జర్మన్ నాజీయిజం నుండి ముస్సోలిని ఫాసిజం నుండి ప్రేరణ పొందిన సంగతి చరిత్రలో నమోదైన అంశమే.
జర్మనీ కేంద్రంగా భారతీయ పరిశోధనలు సాగిస్తున్న వారిలో ఒక తరగతి ముస్లిం వ్యతిరేకతను బాగా తలకెక్కించుకున్నది. ఈ ధోరణిని లుడ్విగ్ ఆల్సడార్ఫ్ అణువణువునా నమ్మారు. హిందూ మహాసభ కూడా యూరోపియన్ మిత వాద సిద్ధాంతంలో కొన్ని కోణాలను స్వీకరించినందునే అల్సడార్ఫ్కు హిందూమహాసభ పట్ల మక్కువ ఏర్పడినట్లు వైజయంతి అభిప్రాయపడ్డారు. వేద కాలానికి చెందిన ఆర్యన్లే వర్తమాన హిందూమతానికి ఆద్యులన్న భావనతో పాటు ముస్లిం వ్యతిరేకతను కూడా హిందూత్వ వాదులు స్వీకరించటానికి మొఖమాటపడలేదు. హిందువుల్లాగా తాము ఆర్య సంతతి అని ముస్లింలు చెప్పుకోలేరు కాబట్టే ఎప్పటికీ ముస్లింలు భారతీయులు కాలేరన్న వాదన మనం చూస్తూనే ఉన్నాము.
నాజీ గూఢచారులు, బ్రిటిష్ గూఢచారులకు లక్ష్యం
భారతదేశం 1930ల నాటికి ఓ వైపున నాజీ నిఘా వర్గాలకు మరో వైపున బ్రిటిష్ నిఘా వర్గాలకు కేంద్రంగా మారింది. వర్తమాన బారతదేశంలో హిట్లర్ వంటి వారికి విస్తృత ప్రజాదరణ ఏర్పడటానికి దారి తీసిన పరిస్థితులు, పరిణామాలను ఈ పుస్తకం లోతుగా చర్చించింది. ఈ పుస్తకంలో మరో పాత్ర కూడా కనిపిస్తుంది. అతను హెర్మన్ బేథన్. ఇతను ఎవాంజెలికల్ లూథరన్ మిషన్‌కు సంబంధించిన వాడు. లీప్జింగ్లో చాలాకాలం పని చేశారు. దక్షణి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ లూథరన్ మిషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1902`1909 మధ్యకాలంలో తమిళనాడులో నివసించిన బేథెన్ గ్రాంధిక తమిళంతో పాటు వ్యవహారిక తమిళం కూడా అనర్గళంగా మాట్లాడగలడు. 1934లో నాజి ఉపాధ్యాయ విభాగంలో సభ్యుడిగా చేరిన రెండేళ్లకే అంటే 1936 నాటికే హిట్లర్‌ను మహాత్ముడిగా కీర్తిస్తూ హిట్లర్ అంటే ఎవరు? బలమే విజయం శీర్షికతో ఓ కరపత్రం తమిళంలో ప్రచురిస్తారు. అప్పటికే తమిళంలో మార్స్ ఏంగెల్స్ లేనిన్ రచనలు, వారి జీవిత చరిత్రలు విస్తృతంగా అందుబాటులోకి రావటంతో పాటు బోల్షివిక్ స్పూర్తితో ఏర్పడిన కమ్యూనిస్టు బృందాలు ప్రజల్లో పని చేయటం కూడా పుంజుకున్నది. ఈ ధోరణిని అడ్డుకోవడానికి జర్మన్ సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో మేథెన్ ఈ కరపత్రాన్ని ప్రచారంలో పెడతారు. అయితే అనతికాలంలోనే ఈ కరపత్రంలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకున్న బ్రిటిష్ పాలకులు నిషేధిస్తారు.
ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జర్మన్ సొసైటీ ద్వారా ఈ విద్యా కేంద్రం కూడా నాజీ ప్రచార వ్యూహంలో సాధనం అయ్యిందని రచయిత వివరిస్తారు. ఈ జర్మన్ సొసైటీ ఓ వైపు హిట్లర్ గుణగణాలు కీర్తిస్తూనే భారతీయ ముస్లింలు స్వతంత్ర దేశంగా ఏర్పడాలని రెచ్చగొట్టుడు సాహిత్యాన్ని వెలువరించింది. ముస్లిం ఛాందసులు ఆశించిన విధంగా పాకిస్తాన్ వంటి దేశం ఏర్పడాలని కోరుకుని దానికి కావల్సిన ప్రచార వ్యూహాన్ని రూపొందించింది ఈ సొసైటీయే అని వింటే ఆశ్చర్యపోతాము. ఈ సొసైటీ రూపొందించిన ప్రచార సామాగ్రి ఏకంగా హిట్లర్‌ను మొహ్మద్ ప్రవక్తఓ పోల్చే స్తాయికి చేరింది.
ప్రత్యేకించి ముగ్గురు మేధావులు కూడవూరు అనంతరామ భట్ట (1908లో జన్మించారు), తారాచంద్ రాయ్ (1890-1952), దేవేంద్రనాథ్ బెనర్జీ (1880-1954)లు వ్యక్తిగత స్థాయిలో నాజీ మేధో బృందంతో సమన్వయం చేసుకున్న తీరు, ప్రతిఫలంగా వారు పొందిన ప్రయోజనాలు గురించి కేస్ స్టడీలాగా వివరించారు. ఈ ముగ్గిరితో పాటు హెర్మన్ బైథాన్ వంటి వారు రూపొందించి భారతదేశంలో వివిధ భాషల్లో ప్రాచుర్యంలో పెట్టిన సాహిత్యం, దాని ఫలితాలు, ప్రభావాలు, పర్యవసానాల గురించి దేశీయంగా ఎటువంటి సమాచారమూ లేకపోవటం పట్ల వైజయంతి రాయ్ ఆవేదన తెలిపారు. ఇటువంటి సమాచార లోపం కారణంగానే నాజీ మేధో బృందాల ప్రచారం భారతదేశంపైనా, భారత జాతీయోద్యమంపైనా వివిధ సామాజిక దొంతరలపైనా ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం కోల్పోయామని నిర్ధారిస్తారు రచయిత.
ఇండియన్ లిజియన్స్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థలో దేశం నుండి దాదాపు మూడున్నర వేలకుపైగా యువత సైనుకులుగా చేరారు. ఆఫ్రికాలో రొమ్మెల్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. వీరందరికీ అవగాహన కల్పించటానికీ, చైతన్యపర్చటానికీ బ్రదర్హుడ్ (సహోదరత్వం) అనే పత్రిను కూడా నడిపారు. కానీ ఇప్పటి పరిశోధకులకు ఆ పత్రిక నకళ్లు అందుబాటులో లేవు. ఈ విధంగా శిక్షణకు వచ్చిన యువతకు నాజీ ప్రాపంచిక దృక్ఫధాన్ని పరిచయం చేయటం, ఆ దృక్ఫథంతో ప్రచారం చేయటమే ఈ పత్రిక ఏర్పాటు వెనక ఉద్దేశ్యం. ఈ పత్రిక ఎలా పని చేసింది, ఎంతమంది సైనికులు ప్రభావితం అయి జర్మన్ నాజీ సైన్యంలో చేరారు అన్న వివరాలు అందుబాటులో లేవు.
ఈ సమాచార లోపాలు ఉన్నప్పటికీ వైజయంతి తన పరిశోధన లక్ష్యాన్ని సాధించిందనే చెప్పాలి. నాజీ ప్రభుత్వం మేధావులను సైద్ధాంతికంగానూ, రాజకీయంగానూ ప్రభావితం చేసేందుకు అనుసరించిన వ్యూహాలు, విశ్వవిద్యాలయాలు , నాజీ సంస్థలు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఏర్పాటు చేసిన మేధో కేంద్రాల మధ్య సమన్వయం విధి విధానాలు వివరిస్తూ ఆయా మేధావులు నాజీ పార్టీ లక్ష్యాలు ప్రచారం చేయటంలో పోషించిన పాత్రను వెలుగులోకి తీసుకురావడంలో సఫలమయ్యారు. ఆయా సందర్భాల్లో రాజీపడ్డ వారు కూడా ఎలా పొందారో, లొంగిపోయిన వారు తర్వాతి కాలంలో పశ్చిమ జర్మనీలో ఎటువంటిపాత్ర పోషించారో కూడా రచయిత ప్రస్తావిస్తారు.
ఈ కోణంలో చూసినప్పుడు నాజీ శక్తుల ప్రభావం, భారతీయ మేధో బృందాల స్పందన, భారతీయ సామాజిక జీవనంపై ఈ నాజీ మేధో బృందాల ప్రభావం గురించి లోతైన అవగాహన కోసం తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకం ఇది.
నవరస్ జె ఆఫ్రీది (చరిత్ర విభాగం లో ప్రొఫెసర్, ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం, కోల్‌కతా)
అనువాదం : కొండూరి వీరయ్య
(The Nazi Study of India & Indian Anti Colonialism : Knowledge Providers and Propagandists in the Third Reich పేరుతో ఉన్న 224 పేజీల పుస్తకాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ 2024 లో ప్రచురించింది.)