
రావిశాస్త్రి గారు తన ‘మూడు కథల బంగారం’ నవలలో దేశభక్తి అనేది స్వార్థరాజకీయ నాయకులకు ఆయుధంగా ఎలా మారుతుందో చెబుతూ “దొంగలంజా కొడుకుల ఆఖరి యుక్తే దేశభక్తి ” అంటారు. ఇందులో బూతుమాట పక్కన పెట్టినా దేశ భక్తి అనేది రాజకీయ యుక్తి మాత్రమేననేది ప్రస్తుత దేశపరిస్థితులు చూస్తే తేటతెల్లమవుతుంది.
పహల్గామ్ ఉగ్రదాడి బీజేపీకి కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు దొరికింది. ప్రతిసారీ ఎన్నికలప్పుడు చేసే మాదిరిగా సరిహద్దుల్లో సైనికుల రక్తాన్ని కష్టపడి పారించాల్సిన పని లేకుండా ఇప్పుడు కాగల కార్యం ఉగ్ర గంధర్వులే పూర్తి చేసేస్తే దేశంలోని మతోన్మాదపార్టీ శక్తుల ఆనందానికి అవధులుంటాయా? !!!
ఇప్పుడు వారు ఆ సంబరాల్లోనే ఉన్నారు. ఈ దుర్ఘటని వాళ్ళ కుళ్ళు రాజకీయాలకు నూటికి వెయ్యి శాతం విజయవంతంగా వాడుకుంటారు.
అసమర్థ ప్రభుత్వం
ఈ సంఘటనకు భద్రతా లోపమే ప్రధాన కారణమైనప్పటికీ దేశభక్తి ముసుగులో ఆ లోపం సునాయాసంగా దాక్కోగలిగింది. సెక్యూరిటీ వైఫల్యమే కాదు, ఇన్ని రోజులైనా ఉగ్రవాదులను పట్టుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం దేశభక్తి దుప్పట్లో దర్జాగా దూరిపోయింది.
దేశభక్తి… ఓటు రాజకీయం
తప్పు చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులే కావచ్చు, కానీ యుద్ధం మాత్రం ప్రదానంగా ఇండియాలోని ముస్లింల మీదే ఉండాలి. శిక్ష భారతదేశ ముస్లింలకే వేయాలి . పాక్ ముస్లింలను నిందిస్తే, (నిజానికి అక్కడి సామాన్య ప్రజలకు ఈ దాడులతో ఏ సంబంధం లేదు , పాక్ ఉగ్రవాదులు, రాజకీయ నాయకులకే సంబంధం) ఇక్కడి హిందువులు ఇక్కడి ముస్లింలను సొంత మనుషులుగా చూస్తూ, అక్కడి ముస్లింల మీద మాత్రమే రెచ్చిపోతే , ఇక్కడి నాయకులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. దాని వల్ల ఓట్లు రాలవు.
కాబట్టి ఈ దేశ ముస్లింలకు ఈ దాడులతో ఏ సంబంధం లేకపోయినా ఆ మత చిచ్చు ఈ దేశ పౌరుల మధ్య పెడితేనే తిరుగులేని విధంగా వర్కౌట్ అవుతుంది. అదే ఓటు రాజకీయం .
ఈ దేశభక్తి ఓటు రాజకీయం మన మతనాయకులకు తెలిసినంత బాగా బహుశా ఏదేశ నాయకులకూ తెలియకపోవచ్చు. అందుకే బీజేపీ పాకిస్థాన్ మీద యుద్ధం అంటుంటే వాళ్ళ అనుచరులు (మతోన్మాదులు) మాత్రం భారతీయ ముస్లింల మీద యుద్ధాన్ని ప్రారంభించేశారు.
అన్యాయంగా దాడులు
దాని ఫలితమే దేశంలో అనేక చోట్ల ముస్లింల మీద దాడులు. “ఇఫ్ ది ఎనిమీ లీవ్స్ ది డోర్ ఓపెన్ యూ మస్ట్ రష్ ఇన్” అంటారు. పాక్ ఉగ్రవాదులు చేసింది అదే. నిర్లక్ష్యంతో , చేతగాని తనంతో కాశ్మీర్ తలుపు తెరిచిన మోడీ ప్రభుత్వానిది తప్పు కాదు కానీ శత్రుదేశంలో ప్రధాన మతంగా ఉన్న మతంలో పుట్టడమే ఇక్కడి ముస్లింల తప్పయిపోయింది ?!! ఇదేం న్యాయం?!!!
ఉన్మాదానికి లాజిక్కులుండవు. అందులోనూ బీజేపీ సారథ్యంలోని ఉన్మాదం డబుల్ డోస్ మతోన్మాదం , దేశభక్తి ఉన్మాదం. దానికి తిరుగుండదు. మన దేశంలో ముస్లింల మీద జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఈ ప్రపంచమంతా చూస్తోందన్న కనీసపు సిగ్గుతో అయినా మోడీ ప్రభుత్వం ఈ దాడులను ఖండించకపోగా ఎంతో కాలంగా రగిల్చిన మంటల్లో ఆజ్యం పోస్తూ చోద్యం చూస్తోంది.
హింసల.. బెదిరింపుల పరంపర
పహల్గామ్ దాడి తర్వాత ద్వేషంతో మన దేశంలో ముస్లింల మీద జరిగిన హింసాకాండలు వివిధ ప్రాంతాల్లో కనీసం 20 దాకా ఉంటాయి.
- ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో క్షత్రియ గోరక్షక దళ సభ్యులు స్థానిక ముస్లింల మీద దాడి చేసి ఏకంగా ఒక ముస్లిం యువకుడి చావుకి కారణమయ్యారు.
- ఒక ముస్లిం ఉద్యోగి పహల్గామ్ దుర్ఘటనపై చర్చించేందుకు నిరాకరించడంతో, అతని చేత గాయత్రీ మంత్రాన్ని బలవంతంగా చెప్పించాలని చూసి.. అతను పఠించకపోవడంతో తోటి హిందూ ఉద్యోగులు అతనిపై దాడిచేసి గాయపరిచిన సంఘటన కర్నాటకలో చోటుచేసుకుంది.
- చండీగఢ్ లో స్ధానికులు అక్కడి యూనివర్శిటీలో చదువుతున్న కాశ్మీర్ విద్యార్థినుల అద్దె ఇళ్ళ మీద దాడి చేసి వాళ్ళను టెర్రరిస్టులంటూ తీవ్రంగా వేధించారు. కొందరు కాశ్మీర్ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్ళకు వెళ్లి తమ కళ్ల ముందే హింసిస్తున్నా సెక్యూరిటీ సిబ్బంది ఆడ్డుకోకుండా చూస్తూ ఉండిపోయారు.
- ఆ రాష్ట్రంలోనే మరో ఘటన జరిగింది. ఒక క్యాబ్ డైవర్ కాశ్మీర్ మహిళలపై దాడిచేసి గాయపరిచాడు.
- హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రాలో కూడా మతోన్మాదులకు కాశ్మీర్ విద్యార్థులు టార్గెట్ అయ్యారు. అల్లరి మూక హాస్టళ్ళకు వెళ్ళి విద్యార్థుల వస్తువులు ధ్వంసం చేసింది.
- హర్యానాలోని అంబాల ప్రాంతంలో హిందూ సంస్థల బాధ్యులు స్థానిక ముస్లింల దుకాణాల మీదా, తోపుడు బండ్లపై చిన్న చిన్నవ్యాపారాలు చేసుకునే వారిమీదా దాడి చేసి వాటిని ధ్వంసం చేసి వారిని గాయపరిచి తీవ్రంగా దూషించారు.
- హర్యానాలోనే చోటు చేసుకున్న మరో దాడిలో పహల్గామ్ దుర్ఘటనకు ప్రతీకారంగా ఇద్దరు అమాయక ముస్లిం చిరు వ్యాపారులు తీవ్రంగా గాయపడి మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.
- కోల్కతాలోలోని కస్తూరి దాస్ మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక హిందూ డాక్టర్ కేవలం ముస్లిం అన్న ఒకే ఒక్క కారణంతో ఓ మహిళా రోగికి చికిత్స చేయడానికి నిరాకరించాడు.
- పహల్గామ్ ప్రతీకార చర్యగా ఉత్తరప్రదేశ్ లోని హత్రస్‌లో ఒక దేవాలయం కోసం పనిచేస్తున్న ఇద్దరు ముస్లిం కళాకారులను తొలగించారు.
- పహల్గామ్ హింసకు ప్రతీకారంగా, కాశ్మీర్‌పై పాలస్తీనాలో ఇజ్రాయెల్ చర్యలను పునరావృతం చేయాలని మధ్యప్రదేశ్ కి చెందిన ఒక హిందుత్వ నాయకుడు తన ద్వేషపూరిత ప్రసంగంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.
- పహల్గామ్ హింస గురించి సంఘ్ పరివార్ పై అనుమానాలు వ్యక్తపరిచినందుకు కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు చెందిన ఒక రాజకీయ నాయకుడిపై కేసు నమోదయ్యింది.
- అస్సాంలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. పహల్గామ్ దాడిని ప్రభుత్వ కుట్రగా అభివర్ణించినందుకు ముస్లిం ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు.
- పశ్చిమ బెంగాల్ లోని బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయంలో “కుక్కలు & ముస్లింలు అనుమతించబడరు’’ అని ప్రకటించిన పోస్టర్ పెట్టారు.
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాశ్మీరీ ముస్లింలు వెంటనే ఉత్తరాఖండ్‌ను విడిచిపెట్టాలనీ, లేదంటే తమ చేతిలో తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందనీ ఆ రాష్ట్ర హిందూ రక్షా దళ్ హెచ్చరించింది.
- హిందుత్వ సంస్థలు చేస్తున్న హింస, బెదిరింపులు, దూషణలకు భయపడిపోయి ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ BFIT కళాశాల, డూన్ PG కళాశాలల్లో కనీసం 20 మంది కాశ్మీరీ విద్యార్థులు నగరం విడిచి పారిపోయారు.
- హిందుత్వ సంస్థల దాడులకు సంబంధించి భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ, కాశ్మీరీ విద్యార్థులు, ఉద్యోగులు తమ వసతి గృహాలను ఖాళీ చేయమని కోరుతూ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగలో ఏకంగా ప్రకటన జారీ చేశారు. కొందరు నగరం విడిచి వెళ్లిపోయారు.
- ఉత్తరప్రదేశ్ లోనే మహారాజ్ గంజ్ లో కాశ్మీర్ విద్యార్థులపై సాటి విద్యార్థులే దాడి చేసి గాయపరిచారు.
- పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ రాజస్థాన్ జైపూర్ లో బీజేపీ చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు మసీదులోకి ప్రవేశించి మరీ ముస్లింలను వేధించారు.
ఇవి కొన్ని మాత్రమే. హిందూ సంస్థలు, బీజేపీ నాయకుల ద్వేష పూరిత ప్రసంగాల ప్రభావంతో సామాన్యులు ముస్లింలపై చూపించే ద్వేషం, దాడులు, బెదిరింపులు, దూషణలు వెలుగు చూడని హింసాత్మక సంఘటనలు ఇంకెన్నో!!!
పాక్ ఉగ్రవాదుల లక్ష్యం
పాక్ ఉగ్రవాదులు మతాన్ని అడిగిమరీ హిందువులను చంపారంటే అది హిందువుల మీద ద్వేషం కాదు. భారతదేశం మీద ద్వేషం. వారికి హిందువులను చంపడమే లక్ష్యం అయితే మొదట పాకిస్థాన్ లో ఉన్న హిందువులను చంపుతారు . దాని కోసం కుట్రలు కుతంత్రాలతో మన దేశంలోకి జొరబడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో మత విద్వేషాలతో అలజడి సృష్టించి మన వేలితో మన కన్నునే పొడుచుకుని మన దేశాన్ని మనమే నాశనం చేసుకునేలా చేయడమే పాక్ ఉగ్రవాదుల లక్ష్యం.
గతంలో ఈ దేశం మీద అనేక ఉగ్ర దాడులు జరిగాయి. పాక్ సంబంధిత టెర్రరిస్ట్ లే పలుమార్లు దాడి చేశారు. అప్పుడు వాళ్ళు భారతీయుల మీద దాడి చేసేవారు. భారతీయుల్ని చంపేవారు. చనిపోయిన భారతీయులకు దేశమంతా ముక్తకంఠంతో సంఘీభావం తెలిపేది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఒకే తాటి మీద నిలబడి టెర్రరిస్ట్ దాడిని తీవ్ర స్వరంతో ఖండించేది. పాక్ దురాగతాలను భారత్ కలిసి కట్టుగా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లి ఐకమత్యంలోని బలంతో మన పట్ల సానుభూతినీ, పాక్ పట్ల ఏవగింపునూ కలిగించేది.
టెర్రరిస్టుల పని సులువయింది
బీజేపీ వచ్చాక ఉగ్రవాదుల దాడుల్లో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పుడు టెర్రరిస్టులు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అది మన పాలకులే సమర్థవంతంగా చేస్తున్నారు కాబట్టి ఆ మంటల్లో వాళ్ళు కాస్త నెయ్యి పోస్తే చాలు.. భారత్ కావాల్సినంత రగులుకుంటుంది. బీజేపీ ఎజెండా అమాయకులైన ఈ దేశ ప్రజలకు అర్థం కాకపోయినా పాక్ టెర్రరిస్టులకు మహా బాగా అర్థమైంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా హిందూ అని అడిగి మరీ చంపారు. అనుకున్నది సాధించారు.
విద్వేషాలుంటేనే వీళ్ల మనుగడ
పాక్ టెర్రరిస్ట్ లు పహల్గామ్ లో హిందువులను మాత్రమే చంపారు, ముస్లింలను చంపలేదంటే అది ముస్లింల మీద ప్రేమతో కాదు. హిందువులను మాత్రమే చంపితే మన హిందువులు మన ముస్లింల మీద దాడి చేస్తారనీ, చేయాలనే. ఈ విషయం బీజేపీకీ, హిందూ సంస్థలకూ తెలుసు. అయినా వాళ్ళు ప్రజలకు చెప్పరు. ఎందుకంటే ఈ దేశంలో హిందూ ముస్లిమ్స్ కొట్టుకుంటూ ఉంటేనే ఈ మతవాద, మనువాద పార్టీకి మనుగడ ఉంటుంది తప్ప రెండు మతాలూ ఐక్యమై దేశం ప్రశాంతంగా ఉంటే బీజేపీ నామరూపాలు లేకుండా పోతుంది.
భారత దేశం సర్వ నాశనం కావాలనేది పాక్ టెర్రరిస్టుల ఆకాంక్ష. భారతదేశం మత ఘర్షణల్లో కొట్టుకు చావాలన్నది బీజేపీ అవసరం. ఇద్దరి ఆశయం ఒక్కటే. అమాయకత్వంతో, అజ్ఞానంతో వీళ్ళ వలలో చిక్కుకున్న ఈ దేశ ప్రజలు మాత్రం (ముఖ్యంగా ఉత్తర భారతీయులు ) వాళ్ళ ఆశయాన్ని చక్కగా నెరవేరుస్తూ తమ గోతులు తామే తవ్వుకుంటున్నారు. అదే దారుణ విషాదం!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.