
ఆధునికతరం 6G వెంట కాంతివేగంతో పరుగుపెడుతుంది.ఎనిమిది దశాబ్దాల చేరువలో స్వాతంత్ర్య భారతం వికసిత భారత్ అంటూ ఆశావాదంతో అడుగులు వేస్తోంది.ఓ ప్రక్క అంతరిక్ష ప్రయోగాల్లో మంగళయాన్,చంద్రయాన్ తో పాటు నేటి స్పేస్ డాకింగ్ విజయంతో మనం ప్రపంచయవనికపై మన సత్తా చాటుతున్నాం.బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం.కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం మన జనాభా స్థాయిలో లేదన్నది మనం గమనించాల్సిన విషయం.ముఖ్యంగా మన పరిశోధనలు, ఆవిష్కరణలు అంతర్జాతీయ స్థాయిని ప్రభావితం చేయటం లేదనేది మనం విశ్లేషించుకోవాల్సిన సందర్భం.శతాబ్దం పైగా చరిత్ర వున్న నోబెల్ బహుమతుల విషయంలో అసలు మన ప్రయాణం ఏమిటనేది నేడు చర్చించి,కారణాలను అన్వేషించాల్సిన సందర్భం.
ఎన్నో శతాబ్దాల క్రిందటే ప్రపంచ విజ్ఞానానికి గణితం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం, రసాయన శాస్త్రాల్లో మన శాస్త్రవేత్తలు చేసిన కృషి నేటి ఆధునిక సైన్స్ కు పునాదిగా నిలిచింది.ఆర్యభట్ట, బ్రహ్మగుప్త,మహావీర,వరాహమీర, భాస్కర,పతంజలి,చరక,సుసృత, భరద్వాజ తదితరుల వంటి విఖ్యాత శాస్త్రవేత్తల మేధస్సు ప్రపంచపు పరిజ్ఞానాన్ని ప్రభావితం చేసింది.
మనకు స్వాతంత్ర్యం రాకముందే బ్రిటీష్ వారి క్రింద బానిసత్వపు పాలన కాలంలోనే ఆసియా ఖండంలోనే సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్, భౌతికశాస్త్రంలో సి.వి రామన్ వంటి మహానుభావులు తొలి నోబెల్ సాధించి భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియజెప్పారు.నేడు జనాభా లోనే అగ్రస్థానంలో వుంటూ,ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ను సైతం ప్రభావితం చేస్తూ, శతాబ్దాల నాగరికతను కలిగివున్న భారతదేశం నుంచి కేవలం మన పౌరసత్వంతో ఫిజిక్స్ లో, సాహిత్యంలో 78 వసంతాల స్వాతంత్ర్య భారత్ నుంచి మనం నోబెల్ బహుమతి గెలవలేకపోయామంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన బిలియన్ డాలర్ల క్వశ్చన్.ప్రతిభకు అత్యుత్తమ కొలమానం నోబెల్ బహుమతి కానప్పటికీ, నోబెల్ కమిటీలపై ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు వున్నప్పటికీ నోబెల్ బహుమతుల విలువను ప్రపంచం “విశ్వ విజేత స్థాయి”గానే చూస్తుందనడం మనం కాదనలేని సత్యం.
“Where the mind is without fear and the held is high;
Where knowledge is free;
Where the world has not been broken up into fragments by narrow domestic walls;
………my father,let my country awake” వంటి సుప్రసిద్ధ గేయంతో గీతాంజలి వంటి అసాధారణ, అసామాన్యమైన రచనతో 1913 లోనే నోబెల్ సాహిత్య బహుమతి గెలిచారు మన విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్.మన జనగణమన గీతంతో పాటు బంగ్లాదేశ్ దేశపు జాతీయ గీతాన్ని ఠాగూర్ రచించారు.శాంతినికేతన్ స్థాపనతో నేటి ఆధునిక భారతీయ విద్యా విధానంలో కూడా వారి ఆలోచనలు మనకు మార్గదర్శనం చేస్తున్నాయి.ఆల్బర్ట్ ఐన్ స్టీన్, మహాత్మా గాంధీజీ వంటి విఖ్యాత ప్రముఖులతో సైతం ఎన్నో ఆధ్యాత్మిక, తాత్విక, పర్యావరణ,శాస్త్రీయ విశ్లేషణలను పంచుకున్నారు.వివేకానంద వారి రచనల నుంచి ఠాగూర్ ప్రేరణ పొందారు.
“నా మతం సైన్స్.నేను దాన్నే ఆరాధిస్తాను.నిత్య సాధకులైన వారే నా వారసులు”అంటూ కేవలం ₹200 పరికరాల సాయంతో రామన్ ఎఫెక్ట్ ను కనుగొని 1930 లో మనకు ఫిజిక్స్ విభాగంలో నోబెల్ అందించారు.నోబెల్ బహుమతి తీసుకునే సందర్భంగా మన దేశపు జెండా లేనందుకు కన్నీటి పర్యంతమవుతూ, నిజాయితీతో కూడిన భావోద్వేగాల తన దేశభక్తిని ప్రదర్శించి నిజమైన భారత రత్నంగా భవిష్యత్తు తరాలకు ఆదర్శమయ్యారు.1943 లో తానే సొంతంగా బెంగళూరు లో రామన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ స్థాపించి మన దేశంలోనే విక్రమ్ సారాభాయ్, హోమీ జహంగీర్ బాబా, అబ్దుల్ కలాం వంటి మహామహులకు దిక్సూచిగా నిలిచారు.నేటి ఆధునిక ప్రపంచం సైతం ఇంకా “రామన్ ఎఫెక్ట్ కు ఎఫెక్ట్ అవుతూనే వుంటూ ఎన్నో ప్రకృతి రహస్యాలను చేధిస్తుంది.
సి.వి రామన్ బంధువు అయిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ విఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త.భారతీయ-అమెరికన్ గా నక్షత్రాల పరిణామంపై పరిశోధనలు చేసి చంద్రశేఖర్ లిమిట్ తో ఖ్యాతి గడించారు.బ్లాక్ హోల్స్ పై వీరి పరిశోధనల విషయాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.వీరి కృషికి గుర్తింపుగా 1983 లో విలియం ఎ.ఫౌలర్ తో కలిసి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.వీరిలాగే మదర్ థెరిస్సా,హరగోవింద్ ఖొరానా, అమర్త్యసేన్,వెంకట్రామన్ రామకృష్ణన్ వంటి వారు మన దేశ మూలాలు కలిగిన నోబెల్ విజేతలు. 2014 లో మలాలా యూసఫ్ జాయ్ తో కలిసి ప్రఖ్యాత భారతీయ బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థి మన దేశ పౌరసత్వంతో నోబెల్ శాంతి బహుమతి గెలిచారు.గాంధీజీ నుంచి ప్రేరణ పొందిన వీరు “బచ్ పన్ బచావో ఆందోళన్” వంటి ఎన్నో కార్యక్రమాలతో బాలకార్మిక వ్యవస్థ పై,విద్యా వ్యవస్థపై ఎన్నో ఉద్యమాలు చేశారు.లక్షల మంది పిల్లల జీవితాలను మార్చారు.కొన్ని సందర్భాల్లో ఎన్నో విమర్శలు, భౌతిక దాడులు ఎదుర్కోన్నప్పటికీ “నువ్వు కాకపోతే ఇంకెవరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ? అంటూ సమాజంలో మార్పు రావాలని అలుపెరగని ప్రయాణం చేస్తున్నారు.
గాంధీజీ, అరబిందో,మేఘనాథ్ సాహా,హోమీ జహంగీర్ బాబా,సత్యేంద్రనాథ్ బోస్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మన దేశ ప్రముఖులు ఎన్నో సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయినప్పటికీ ఎన్నో ఆనాటి రాజకీయ, సామాజిక కారణాల చేత అవార్డుకు ఎంపిక కాలేదు.విశేషం ఏమంటే సత్యేంద్రనాథ్ బోస్ వంటి వారి కనుగొన్న దైవ కణం విషయాలపై పరిశోధనలు చేసిన వారు నోబెల్ గెలిచారు.గాంధీజీని ఆదర్శంగా తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా అహింసా మార్గంలో పోరాటం చేసిన ఎంతోమంది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు.ఒబామా, మార్టిన్ లూథర్ కింగ్, దలైలామా, ఆంగ్ సాన్ సూకీ వంటి నోబెల్ విజేతలకు గాంధీజీనే రియల్ హీరో.చరిత్రను పరిశీలిస్తే 1948 లో గాంధీజీ హత్యకు గురికాకుంటే ఆ సంవత్సరం గాంధీజీ కి నోబెల్ దక్కేదేమో! గాంధీజీ నోబెల్ వివాదంపై 2006 లో నోబెల్ కమిటీ “మన 106 సంవత్సరాల చరిత్రలో అతి పెద్ద లోపం”అంటూ స్పందించింది.
స్వాతంత్ర్య భారతంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన పరిశోధనలు, ఫలితాలు ప్రపంచ స్థాయిలో లేకపోవడమే నోబెల్ లో నేటి మన ప్రదర్శనకు ప్రధాన కారణం.మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాలి.విశ్వవిద్యాలయాల్లోని ఉన్నత విద్యలో, పరిశోధనల్లో రాజకీయ జోక్యం వుండకూడదు.బడ్జెట్ పెంచాలి.యువతరాన్ని పరిశోధనల వైపు ప్రోత్సహించాలి.ఫెలో షిప్స్ అమౌంట్ పెంచాలి.నేటితరపు చదువులు మార్కులు,ఉద్యోగం,సంపాదన చుట్టే తిరుగుతున్నాయి.ఆ దృక్పథాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు మార్చుకొని, శాస్త్రవేత్తలకు సరైన గుర్తింపు మనదేశంలో ఇవ్వాలి.విదేశాలకు వెళ్ళే శాస్త్రవేత్తల వలసలను ఆపాలి.ఉన్నత విద్యా వంతులు రాజకీయాల్లోకి వచ్చి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి నూతన చట్టాలతో కృషి చేయాలి.పాఠశాల స్థాయి విద్య నుంచే గొప్ప గొప్ప శాస్త్రవేత్తల జీవితాల గురించి,సమాజం నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి,గెలుపోటములకు సంబంధం లేని వారి ప్రయత్నాల పరంపర గురించి విద్యార్థులకు స్ఫూర్తివంతమైన విధానాలతో తెలియజెప్పాలి.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్రగామిగా వుండాల్సిన అవసరం కనిపిస్తోందని,యువత పెద్ద పెద్ద కలలుగనమని యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన అబ్దుల్ కలాం జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి.మన తరగతి గదుల్లో శ్రీనివాస రామానుజన్ వంటి అసాధారణ భారతరత్నాలు ఉదయించాలి.త్వరలోనే రవీంద్రనాథ్ ఠాగూర్, సివిరామన్ వంటి మహానుభావుల స్ఫూర్తితో మళ్ళీ మనదేశం ప్రపంచానికి నోబెల్ వెలుగులతో అనంత విశ్వం దాకా అన్వేషణ కొనసాగాలని ఆశిద్దాం.జగదీశ్ చంద్రబోస్,సలీం అలీ ,సి.యన్.ఆర్ రావు,కల్పనా చావ్లా,బిమ్లా బూటి వంటి మన శాస్త్ర వేత్తలను నేటి తరాలకు గొప్ప హీరోలుగా పరిచయం చేస్తూ గౌరవిద్దాం.నవతరం విన్నూత్న ఆవిష్కరణలతో విదేశీ గడ్డలపై మన జాతీయ పతాకాన్ని ఎగిరేలా మన ప్రయాణం,మన ప్రయత్నం కొనసాగిద్దాం.
ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.