
మారుతున్న కాలానికి అనుగుణంగా మన చుట్టూ మార్పులు జరుగుతుంటాయి. ప్రపంచాన్ని కొత్తదనం తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. పాతదనం రేఖామాత్రంగా తన అస్థిత్వాన్ని కోల్పోయి, కాలగర్భంలో కలిసి చరిత్రగా మిగిలిపోతుంది. సాంకేతికతతో కొత్తపుంతలు తొక్కుతున్న ప్రపంచంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూడా ఆధునీకరణ చెందుతోంది. త్వరలో కొత్తహంగులతో ప్రయాణికులకు కనబడనుంది. అంతేకాకుండా అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు సేవలు అందించనుంది. దీని కోసం కేంద్ర రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా రూ.720 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భారతదేశంలోని వివిధ ప్రధాన నగరాలకు అనుసంధానమై ఉంది. ఈ జంక్షన్‌కు చాలా రైళ్లు వస్తూపోతూ ఉంటాయి. దీంతో స్టేషన్ ఎప్పుడూ ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంటుంది. స్టేషన్ నుంచి దాదాపు లక్షల్లో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. ఎప్పుడూ రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శరవేగంగా ఆధునికతను సంతరించకుంటుంది. 151 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ప్రపంచస్థాయి స్టేషన్ హంగులను పులుముకోబోతుంది.
అధునాతన సౌకర్యాలు..
అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల దృష్టా వారి సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు పునర్నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్కై కాన్కోర్స్, ట్రావెటెర్స్, లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ వంటి పలు సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలో ఈ సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులో రానున్నాయి. అంతేకాకుండా ప్రయాణికులు తమ వాహనాలను నిలపడం కోసం అనేక దశల ‘అండర్ గ్రౌండ్ పార్కింగ్ ప్లేస్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది దాదాపుగా పూర్తి అయ్యే దశకు చేరుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
రైల్వేస్టేషన్ పరిధిలో దుకాణాలు, షాపింగ్ మాల్స్, కెఫేలాంటివి కూడా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది పునర్నిర్మించబడ్డ కొత్త రైల్వేస్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. దీంతో మరో కొత్త మైలురాయిని హైదరాబాద్ తన చరిత్రలో వేసుకోనుంది. అయితే, ఈ క్రమంలో కొందరు సామాజిక కార్యకర్తలు చారిత్రక నేపథ్యం ఉన్నటుంటి నిర్మాణాన్ని కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రత్యేకత..
భారతదేశం మధ్య భాగంలో ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఓ చారిత్రక నగరం. కులీకుతుబ్‌షా కలలు కన్న నగరంలోని ఏదో ఒక ప్రాంతానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు కూడా ప్రత్యేకత ఉంది. చారిత్రక నిర్మాణం కావడమే ఈ రైల్వేస్టేషన్‌కు ఓ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. తెలంగాణ చారిత్రక వారసత్వవానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిదర్శనంగా నిలుస్తుంది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్ జంక్షన్ ఉంది. ఇది భారతీయ రైల్వే విభాగాలలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి కిందికి వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ భవనానికి, మ సికింద్రాబాద్- వాడి మొదటి రైల్వే లైన్‌కు అయిదవ నిజాం ఆఫ్జల్ ఉద్ దౌలా కాలంలో ప్రణాళిక రూపొందించారు. కానీ, ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1870లో సికింద్రాబాద్ స్టేషన్‌ను నిర్మించారు. కోటలా ఉండే ఈ భవన శైలి అసఫ్ జాహీల నిర్మాణాన్ని పోలి ఉంటుంది. 1916లో కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభమైయ్యే వరకు నిజాం స్టేట్‌లో ప్రధాన రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొనసాగింది.
అయితే, భారతఉపఖండంలోని మిగిలిన ప్రాంతాలతో నిజాం రాజ్యాన్ని కలపడం కోసం రవాణా వ్యవస్థను పటిష్టం చేశారు. ఇందులో భాగంగా మొదట నిజాం రైల్వేస్ అనే ఒక ప్రయివేటు సంస్థ స్థాపించబడింది. సంస్థను ఎప్పుడైతే ప్రారంభించారో అదే సంవత్సరం సికింద్రాబాద్ నుంచి వాడికి రైల్వే లైన్ మొదలుపెట్టారు. ఈ మార్గం హైదరాబాద్ నుంచి గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే కర్ణాటకలోని వాడి జంక్షన్ ప్రధాన రైల్వే మార్గానికి కలిపారు. దీని నిర్మాణానికి కావాలసిన నిధులను నిజాం ప్రభుత్వం అందించింది. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత సికింద్రాబాద్- వాడి రైల్వే లైన్ 1874 అక్టోబరు 9న ప్రారంభమైంది. సికింద్రాబాద్ స్టేషన్, రైల్వే లైన్ ఒకేసారి పనులు పూర్తి కావడంతో అవి రెండు ఒకేసారి ప్రారంభమై ప్రయాణికులకు రవాణా సేవలు అందించాయి.
కాలక్రమంలో నిజాం ప్రభుత్వం రైల్వేను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ తర్వాత దాని పేరును నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే పేరుతో 1879లో స్థాపించారు. ఎప్పుడైతే నిజాం ప్రభుత్వం ఆధీనంలోకి రైల్వే వ్యవస్థ వెళ్లిందో అభివృద్ధి పనులు వేగాన్ని పుంజుకున్నాయి. ఇందులో భాగంగా కొత్త రైల్వే లైన్స్‌కు మార్గం సుగమమం అయ్యింది.
జాతీయం చేసిన భారతీయ ప్రభుత్వం
నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమైన తర్వాత 1951 నవంబరు 5న నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేను భారతదేశ ప్రభుత్వం జాతీయం చేసింది. దీంట్లో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ కింద ప్రభుత్వరంగ ఇండియన్ రైల్వేలో విలీనం చేశారు.
భారతదేశంలో కలిసిన తర్వాత ఇండియన్ రైల్వే సౌత్ జోన్ పరిధిలోని సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన కార్యాలయంగా ముంబై ఉండేది. 1966 సంవత్సరంలో నూతన రైల్వే జోన్‌గా దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రధాన కార్యాలయంగా సికింద్రాబాద్ ఏర్పాటై, రైల్వే డివిజన్ ప్రధాన కేంద్రంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయం రైల్ నిలయాన్ని 1972లో నిర్మించారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ డివిజనల్ ప్రధాన కార్యాలయాన్ని 1980లో కట్టారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేక మార్పులు చెందుతూ కొత్త రైల్వే లైన్స్‌తో అనుసంధానమై దేశ నలుమూలకు ప్రయాణికులను చేరవేస్తుంది. ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ కొత్త కొత్త హంగులతో ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. కోటలాంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు మరో మార్పు దిశగాముందుకు వెళ్తుంది. అధునీకరణ చెంది మరో ఏడాది వరకు ప్రయాణికులకు సరికొత్తగా అధునాతన సౌకర్యాలతో ప్రయాణికులకు సేవలు అందించనుంది.
– సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.