
మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చేలా ఒత్తిడి చేయటం, పిడికెడుమందిని మాత్రమే ఆహ్వానించటం వంటివే కాదు ట్రంప్ మోడీపై మోపిన భారాలు…
ప్రధాని మోడీ హడావుడిగా ఏర్పాటు చేసుకున్న అమెరికా పర్యటనలో ఏదైనా మంచి జరిగిందా అంటే రెండు సార్లు మోడీ మీడియాను ముఖా ముఖీ ఎదుర్కోవాల్సి రావటమే. బహుశా ఇది మోడీకి అరుదైన అనుభవం అయి ఉండొచ్చు. భారతీయ దౌత్య అధికారులు సాధ్యమైనంత వరకూ స్వతంత్రంగా వ్యవహరించే మీడియా సోదరులను మోడీ సమీపంలోకి రాకుండా జాగ్రత్తపడటమే కాక మీడియా వృత్తినే అపహాస్యంచేసే స్థాయిలో ప్రభుత్వ బాకాలుగా మారిన కొద్దిమందిని మాత్రమే మోడీ మీడియా సమావేశానికి అనుమతించటానికి చాలా కష్టపడ్డారు. ఓ విలేకరి చివరకు ట్రంప్‌ను కూడా పొగడ్తలతో ముంచెత్తే ప్రయత్నం చేస్తే మీరేమి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదంటూ ట్రంప్ వారిని తోసుకుని ముందుకెళ్లిపోయారు.
ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే చిదానంద రాజ్‌ఘట్టా వంటి మెరికల్లాంటి భారతీయ విలేకరులు అరుదుగా ఉన్న నగరం ఏదైనా ఉందంటే అది వాషింగ్టన్ మాత్రమే. ప్రపంచంలోని అనేక దేశాల్లో భారతీయ మీడియా ప్రతినిధులు లేనేలేరు. గతంలో ఇటువంటి లోటును పూరించటానికి ప్రధానమంత్రులు తమ పర్యటనలో భాగంగా అనుభవజ్ఞులైన మీడియా ప్రతినిధులను వెంట తీసుకెళ్లేవారు. ఆ పర్యటనల్లో ప్రధానమంత్రులను ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడిగేవారు. దేశానికి ఎంతో కొంత కొత్త విషయాన్ని చెప్పటానికి అవకాశాలుండేవి. ఈ సాంప్రదాయానికి మోడీ చరమగీతం పాడారు. పైగా అటువంటి అధికారిక పర్యటనల్లో విలేకరులతో మాట్లాడటమే మానేశారు.
పిడికెడుమంది ఎంపిక చేసిన భారత మీడియా ప్రతినిధులే అయినా వారితో ముఖాముఖీ మాట్లాడే పరిస్థితి కల్పించటం ద్వారా ప్రధాని మోడీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద భారాన్నే మోపారు. అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం నుండి అమెరికాకు దిగుమతి అవుతున్న సరుకులు, సేవలపై అదనపు సుంకాలు విధిస్తున్నామని ప్రకటించటంతో మోడీ పర్యటనలో రెండో రోజు మొదలైంది. ముందుముందు మరిన్ని అటువంటి భారాలు మోపనున్నట్లు కూడా ట్రంప్ ఖరాఖండిగా చెప్పారు. దిగుమతి సుంకాలు తగ్గించటం ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన విధానంగా ఉంటుందని మోడీని అనుక్షణం వెన్నంటి ఉండే అధికారులు సైతం చెప్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇందుకు సిద్ధంగా లేదు. బహుశా ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి మేరకైనా అటువంటి చర్యలకు ప్రభుత్వం సిద్ధపడుతుందో లేదో చూడాలి. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో అటువంటి కొన్ని ప్రతిపాదనలున్నాయి. కానీ అంతకన్నా ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నారు ట్రంప్.
మన దేశపు తలసరి ఆదాయం కంటే అమెరికా తలసరి ఆదాయం పది రెట్లు ఎక్కువ. అటువంటి దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కేవలం సుంకాలకు సంబంధించిన డిమాండ్లతో సరిపెట్టుకోకుండా ప్రధాని మెడలు వంచి మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఒప్పించారు. అంత పెద్ద వ్యాపార ఒప్పందాలకు తలొగ్గిన మిత్రుడికి ట్రంప్ ఇచ్చిందేమిటి? తాత్కాలికంగా విదేశీ అవినీతి చర్యల నియంత్రణ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. అలా నిలిపి వేయటం వలన ఫలితం పొందేది ఇంత విశాల భారతదేశంలో ఏకైక వ్యక్తి మాత్రమే. అతనే మోడీకి అత్యంత సన్నిహితుడూ, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ. అమెరికా కంపెనీలు కాంట్రాక్టులు పొందే ప్రయత్నంలో విదేశీ ప్రభుత్వాలతో చట్టవిరుద్ధ మార్గాల్లో వ్యవహరించకుండా నియంత్రించే లక్ష్యంతో అమెరికా పార్లమెంట్ 1977లో విదేశీ అవినీతి చర్యల నియంత్రణ చట్టం ఆమోదించింది.
ఇతర దేశాల్లో ఇటువంటి చట్టం ఏదీ లేదు. కాబట్టి ఆయా దేశాలకు చెందిన కంపెనీలు తమతమ వాణిజ్య విస్తరణలో భాగంగా అనేక దేశాల ప్రభుత్వాలను, కొన్ని సందర్భాల్లో దేశాధినేతలనే ప్రసన్నం చేసుకోవడానికి అన్నిరకాల తప్పుడు పనులకూ పాల్పడుతున్నారు. ఇటువంటి అవకాశాలు అమెరికా కంపెనీలకు లేకపోవటంతో సాపేక్షంగా చూసినప్పుడు ఆ కంపెనీలు కాస్తంత పోటీలో వెనకంజలోనే ఉన్నాయని చెప్పకతప్పదు. జిమ్మీ కార్టర్ ఈ చట్టాన్ని ప్రతిపాదించిన నాటి నుండీ తమది పాలవంటి స్వఛ్చమైన వ్యాపారమని అమెరికా గొప్పలు చెప్పుకొంటోంది. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఏ దేశంతో అమెరికా వ్యాపారం చేయాలనుకుంటుందో ఆ దేశాన్ని అనేక రూపాల్లో లొంగదీసుకుంటుంది. ఏదేమైనా ఉధృతమవుతున్న వాణిజ్య పోటీలో అమెరికా కంపెనీలు రాణించలేకపోవటంతో వెనకబడే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ కు సౌర విద్యుత్ సరఫరా చేసే విషయంలో అవినీతికి పాల్పడ్డారని, ఆ క్రమంలో అమెరికా కంపెనీలను, అమెరికా పౌరులైన మదుపరులను భాగస్వాములను చేశారన్నది నయా కుబేరుడు అదానీ మీద వచ్చిన ఆరోపణ. విదేశీ అవినీతి నియంత్రణ చట్టం ప్రమాణాల ప్రకారం అదానీ మోసానికి పాల్పడినట్లు అమెరికా సెక్యూరిటీస్ ఎక్సేంజి కమిషన్ నిర్ధారించింది. భారతదేశంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ, లేదా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఆరోపణలపై స్పందించకపోవడం, చట్టపరమైన చర్యలకు చొరవచూపకపోవడం ఇక్కడ ఆసక్తికరమైన, గమనించాల్సిన విషయం. అవినీతి, బంధుప్రీతి ఆరోపణల విషయంలో ఇప్పటి వరకూ భారతదేశంలో పాలకులు షరా మామూలే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. విదేశీ అవినీతి నియంత్రణ చట్టాన్ని తాత్కాలికంగా రద్దు చేయటం ద్వారా ట్రంప్ కూడా ఈ విషయాల్లో తనదీ షరామామూలు శైలే అని స్పష్టం చేశారు. అంటే భారతదేశంలో ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్లను అధిగమించే ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం అమెరికా నుండి వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు కొనుగోలు చేసేందుకు సిద్ధపడిరది. ఇచ్చిప్చుకోవడం అన్న సాంప్రదాయానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది?
ప్రధానమంత్రి మోడీ అమెరికా పర్యటనకై మూట ముల్లె సర్దుకుంటున్న సమయంలోనే ట్రంప్ రష్యా, చైనా దేశాధినేతలతో మాట మంతీ కలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీసేనలపై రష్యా సేనలు సాధించిన విజయాన్ని ప్రతి ఏటా మే నెలలో ఓ అంతర్జాతీయ ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు చైనా ప్రీమియర్‌తో పాటు ట్రంప్ కూడా అతిథులు గా హాజరు కావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించారు. అదేవిధంగా ట్రంప్, పుతిన్‌లకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం పలికారు. ఈ ముక్కోణపు ఆహ్వానలను పరిశీలించే రాజకీయ భూగోళం నిపుణులకు యాల్టా సమావేశాలు గుర్తుకు రావటం సహజమే. 1945లో యాల్టాలో జరిగిన సమావేశంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, రష్యా అధ్యక్షుడు స్టాలిన్, బ్రిటిష్ ప్రధాని చర్చిల్లు ముఖా ముఖీ ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈ మూడు దేశాలూ రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ, ఫాసిస్టు నియంతృత్వ శక్తులు ప్రారంభించిన యుద్ధంలో తీవ్రంగా నష్టపోయాయి. అందువలన యుద్ధానంతర ప్రపంచ శాంతి స్థాపనకు సంబంధించిన విధి విధానాలపై చర్చకు అంకురార్పణ జరిగింది యాల్టా సమావేశంలోనే.
ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్‌ల సమావేశం ప్రపంచంలో కోరలు చాస్తున్న యుద్ధాన్ని నిలువరించటంలో ముందడుగు వేయవచ్చు కానీ స్టాలిన్, రూజ్వెల్డ్, చర్చిల్ ల సమావేశం సాధిచినంత స్థాయిలో ప్రపంచ బలాబలాల పొందికలను మారుస్తుందని ఆశించటం ఊహాజనితమే అవుతుంది. బహుశా 1945లో ఆ మూడు దేశాధినేతలు తీసుకున్న నిర్ణయాలను మిగిలిన ప్రపంచ దేశాలు అంగీకరించిన విధంగానే ఇప్పుడు కూడా భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇండొనేషియా, జపాన్ వంటి దేశాలు కూడా అంగీకరించి ఆమోదిస్తే అటువంటి సత్ఫలితాలు సాధించే అవకాశం లేకపోలేదు. యాల్టా సమావేశం తరహా లో 21 వ శతాబ్దానికి దిశా నిర్దేశం చేయటానికి ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్‌లు 2025లో ఏ యుద్ధమూ గెలవలేదు.
1945 నుండి 2025 మధ్యకాలంలో ఎన్నో పరిణామాల కారణంగా ప్రపంచం చెప్పుకోగద్ద రీతిలో మారిపోయింది. ప్రస్తుతం అమెరికా తన స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంటే రష్యా తన గత వైభవాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండిటికీ భిన్నంగా చైనా తన పలుకుబడిని, ప్రభావాన్ని, వైభవాన్ని విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ మూడు దేశాల చుట్టూ అంతర్జాతీయ వ్యవహారాల్లో తమదైన ముద్ర వేయగల స్వతంత్ర దేశాలు కొన్ని ఉన్నాయి. ఈ మూడు దేశాలతో బేరసారాలాడగలిగే శక్తి ఆదేశాలకు ఉన్నది. రాజకీయ భూగోళం గురించి ఓనమాలు తెలీని వారే గ్రీన్లాండ్ అమెరికా సొంతమనీ, ఉక్రెయిన్ రష్యా సొంతమనీ, తైవాన్ చైనా సొంతమని ఈ ముగ్గురు దేశాధినేతలూ తమలో తాము తీర్మానించుకుంటే మిగిలిన దేశాలు చప్పట్టుకొట్టి విందులు చేసుకుంటాయని ఆశిస్తారు.
త్వరలో జరగబోయే యాల్టా 2 సమావేశం పట్ల వలసానంతర విముక్తి, అభివృద్ధి సాధించిన ప్రాన్స్, జర్మనీ, ఇండొనేషియా,జపాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు తమ సొంతదైన ఏ వైఖరి తీసుకుంటాయన్నది ఆసక్తికరమైన అంశం. భారతదేశం కూడా అటువంటి స్వతంత్ర నిర్ణయం తీసుకోగలదని ఆశించటం అత్యాశేమీ కాదు. అత్యాశ కాదు అని ఎందుకంటున్నానంటే గత నెలరోజుల్లో సంబంధి పరిణామాల పట్ల భారతదేశం మిశ్రమరీతిలో స్పందించింది. ట్రంప్ గెలుపు పట్ల భారత పాలకులు ఆందోళనతో కూడిన ఉద్వేగానికి గురయ్యారు. మోడీ`ట్రంప్‌లు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా పోషించిన పాత్రను గమనిస్తే భారతదేశం ఎంతో కొంత లొంగిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప మరీ ప్రాధేయపడే స్థితికి వెళ్లదని చెప్పవచ్చు.
సంజయ బారు
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.