
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో అదానీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తారా అని మీడియా ప్రశ్నించలేదు. దర్యాప్తు చేస్తారా లేదా అన్న విషయాన్ని ప్రధాని మోడీ తనకు తానుగా వెల్లడిరచనూ లేదు.
ప్రధాని మోడీ తన పదవీకాలంలో కేవలం మూడు సార్లు మాత్రమే ముఖా ముఖీ మీడియాను కలిశారు. మూడోసారి తాజాగా ట్రంప్ సమక్షంలో. కొన్ని రోజుల క్రితం మోడీ ముగించుకున్న అమెరికా పర్యటనలో. ఈ సారి కూడా తన కవచకుండల సమానుడైన అదానీ గురించి అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పకుండా దాటేశారు ప్రధాని మోడీ. సోలార్ విద్యుత్ సరఫరా ఒప్పందాల విషయంలో షుమారు రెండున్నర వేల కోట్ల రూపాయల అవినీతికి అదానీ పాల్పడ్డారన్న ఆరోపణల సంబంధించిన ప్రాధమిక ఆధారాల ప్రాతిపదిన అమెరికా న్యాయ శాఖ, అమెరికా స్టాక్ ఎక్సేంజి కమిషన్ వ్యక్తిగతంగా అదానీపైనా, అదాని కంపెని సిబ్బందిపైనా సివిల్ కేసులు, క్రిమినల్ కేసులూ నమోదు చేసింది.
ట్రంప్ మోడీ ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందా అని ఫిబ్రవరి 13 అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓ విలేకరి అడిగారు. దీనిపై స్పందిస్తూ ఈ విషయం వ్యక్తిగతమైనదని చెప్పటానికి ముందు భారతీయులు ఎంత అతిథేయులో వివరించేందుకు పూనుకున్నారు ప్రధాని మోడీ. ‘వసుధైక కుటుంబకం’ అన్న సూత్రంపై ఆధారపడి ఏర్పడిన ప్రజాస్వామిక దేశం భారతదేశమనీ, ప్రతి భారతీయుడూ ఈ కుటుంబంలో భాగమేననీ, వ్యక్తిగత విషయాలను దేశాధినేతల సమావేశాల్లో ప్రస్తావనకు తీసుకురామని శెలవిచ్చారు.
మోడీ ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రపంచకుబేరుల్లో ఒకరైన అదానీకి అత్యంత ఆప్తుడైన మిత్రుడన్న సంగతి లోకవిదితమే. అయితే అవినీతి ఆరోపణలను వ్యక్తిగతమైనవని ప్రధాని ఎందుకు ప్రకటించారన్నది అర్థంకాని ప్రశ్న. గత మూడునెలల నుండీ అదానీపై ఆరోపణలలో పార్లమెంట్ గగ్గోలెత్తుతోంది. స్టాక్మార్కెట్లో అదానీ కంపెనీ విలువలు కూడా దారుణంగా పడిపోయాయి.
విదేశీ అవినీతి నియంత్రణ చట్టం కింద జరుగుతున్న విచారణలపై అధ్యక్షుడు ట్రంప్ ఆర్నెల్లపాటు నిషేధం విధిస్తూ ఫిబ్రవరి 10న ఆదేశాలు జారీ చేశారు.
అదానీపై దర్యాప్తు చేస్తారా అని ఏ విలేకరీ అడగలేదు. మోడీ కూడా అదానీపై వచ్చిన ఆరోపణల విషయంలో తమ ప్రభుత్వం వైఖరి ఏమిటన్నదానిపై నోరు మెదపలేదు. అమెరికాలో మోడీ వ్యవహారశైలి అవినీతి పంకిలమైన చర్యలను కప్పిపుచ్చుకునేందుకు పడిన అగచాట్లనే వెల్లడిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘దేశంలో ఈ ప్రశ్నలు వేస్తే మౌనమే సమాధానం. విదేశాల్లో ఇదే ప్రశ్నలు వేస్తే అవి వ్యక్తిగత విషయాలు. ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావనకు రావు అని దాటవేస్తారు. అదానీ అవినీతి చర్యలు ప్రపంచానికి కనిపించకుండా మోడీ అడ్డుగోడలా నిలిచారు. దేశ సంపదను ఓ మిత్రుడి లాభాలుగా మార్చి జేబులో వేయటమే ప్రధాని మోడీ దృష్టిలో జాతి నిర్మాణం అయినప్పుడు అలాంటి మిత్రులు చేసే అవినీతి చర్యలు వ్యక్తిగత విషయాలవుతాయి.’ అంటూ రాహుల్ విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక ప్రతినిధి ‘అమెరికాలో అనుంగు మిత్రుడికోసం అడ్డంగా నిలిచిన మోడీ’ అని వ్యాఖ్యానించారు. ‘దేశ వనరులు దోచుకుని పంచుకుతినటం వ్యక్తిగత విషయమని చెప్పటం శోచనీయం’ అని ఆ పార్టీ ప్రకటించింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే స్పందిస్తూ మోడీకి ఇష్టం లేకున్నా మీడియాతో ముచ్చటించాల్సి వచ్చిందనీ,తన అయిష్టతనే విలేకరులపై చూపిస్తున్నారనీ ఆరోపించారు. ‘గత 11 ఏళ్లలో దేశంలో మీడియా ముందు నోరు మెదపని మోడీ నేడు అమెరికా అధ్యక్షభవనంలో నోరు తెరవాల్సి వచ్చింది. అందుకే ఆయన ఇంటర్వ్యూలన్నీ ముందస్తు ప్రశ్నలు ముందస్తు సమాధానాలతో నిండి ఉంటాయి.’ అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం అదానీకి అనుమతిలిచ్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న పలు అంశాలను, జాగ్త్రతలనూ గాలికొదిలిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో రాణ్ ఆఫ్ కచ్ వద్ద భారీఎత్తున గాలిమరలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీకి అనుమతులిచ్చింది.
ది వైర్ స్టాఫ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.