
పీయూసీఎల్ ఉత్తరప్రదేశ్ విభాగం తన ప్రాథమిక విచారణలో విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. తన విచారణ ప్రకారం మహాకుంభమేళా తొక్కిసలాటలో చనిపోయినవారి వాస్తవ సంఖ్యను దాచడానికి ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం అనేక విధానాలను ఉపయోగించింది. ఇందులో భాగంగా శవాలను వేరు వేరు చోట్ల పోస్ట్మార్టం కేంద్రాలకు పంపించారు. ఇంకా మరికొన్ని సందర్భాలలో రికవరీ తేదీలను మార్చారు.
– ద వైర్ హిందీ స్టాఫ్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి వాస్తవ సంఖ్యను దాచినట్టుగా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) ఆరోపించింది.
పీయూసీఎల్ ప్రకటన సంచలన విషయాలను తెలిపింది. తమ ప్రాథమిక విచారణలో మహాకుంభమేళా తొక్కిసలాటలో మృతుల వాస్తవ సంఖ్యను దాచడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించిందని పీయూసీఎల్ ఆరోపించింది. దీని కోసం ప్రభుత్వం అనేక విధానాలను అనుసరించిందని తెలిపింది. ‘మృతదేహాలను వేరు వేరు పోస్టుమార్టం కేంద్రాలకు పంపించారు. అంతేకాకుండా వాటి రికవరీ చోటు, తేదీలో మార్పులు చేర్పులు చేస్తూ అవకతవకలకు పాల్పడింది.’ అని పీయూసీఎల్ స్పష్టం చేసింది.
అలాహాబాద్లోని స్వరూపరాణి ఆసుపత్రిలో తమ సభ్యులు విచారణ చేశారని, ఇందులో భాగంగా రిజిస్టర్లో గుర్తుతెలియాని మృతుల చిత్రాలను తగిలించి ఉంచడాన్ని చూశారని పీయూసీఎల్ తన ప్రకటనలో తెలిపింది.
‘మృతుదేహాల పరిస్థితిని చూస్తే అందులో చాలామందిని నుజ్జునుజ్జు చేశారు. కానీ నోటీసులో పెట్టిన ఫొటోలను తీసుకోవడానికి అక్కడి సిబ్బంది నిరాకరించారు’ పీయూసీఎల్ చెప్పింది.
ప్రకటన ప్రకారం ‘జనవరి 29న ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా సందర్భంగా జరిగిన వరుస తొక్కిసలాట ఘటనలపై పీయూసీఎల్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా, తీర్థయాత్రికుల మృతిపై బాధను వ్యక్తం చేస్తుంది. దీంతో పాటుగా తొక్కిసలాట ఘటనలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పారదర్శకతను, జవాబుదారితనాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రజలందరి జీవితాలకు రక్షణగా ఉండాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైంది’ అని చెప్పింది.
తొక్కిసలాటకు గల కారణాలపై ప్రధానమంత్రి నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఎ) తన అంచనాను బహిర్గతం చేయాలని పీయూసీఎల్ డిమాండ్ చేసింది.
ఒక చోట కాదు, అనేక చోట్ల..
గమనించాల్సిన విషయమేమిటంటే మహాకుంభ మేళా తొక్కిసలాట తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో మరణాల సంఖ్య తప్పుదారి పట్టించే విధంగా ఉంది. తొక్కిసలాట జరిగిన దాదాపు పదిహేను గంటల తర్వాత ప్రభుత్వం స్పందించింది. 28 జనవరి రాత్రి వేళ సంగం నోజ్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని, 60 మంది గాయపడ్డారని తెలిపింది.
అయితే, వివిధ మీడియా నివేదికల ప్రకారం తొక్కిసలాట ఒక చోట కాకుండా అనేక చోట్ల జరిగిందని తేలింది. సంగం నోజ్ వద్ద కాకుండా అదే రాత్రి ఇంకొక తొక్కిసలాట ఝూంసీలో కూడా చోటుచేసుకుంది. ‘తమ వద్ద దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు’ అని మేళా డీఐఈజీ వైభవ్ కృష్ణ చెప్పారు.
ఝూంసీ ప్రాంతంలో కూడా తొక్కిసలాట జరిగినట్టుగా పోలీసుల వద్ద సమాచారమే లేనప్పుడు, అక్కడ సంభవించిన మరణాల రేటు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఝూంసీ ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడుతూ ‘అక్కడ 24 మంది ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపారు. ఈ విధంగా చూసుకున్నట్లైతే మృతుల సంఖ్య 54 అవుతుంది.
సమాధానం లేని ప్రశ్నలు..
ప్రశ్నల పరంపర ఇక్కడితో ఆగిపోదు. అనేక ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం లేకుండా ఉన్నాయి. జాతర జరిగే ప్రాంతంలో రెండున్నర వేల కన్నా ఎక్కువగా సీసీ కెమెరాలు, ప్రతిచోట పోలీసుల పర్యవేక్షణ ఉందని తెలిపే ప్రభుత్వం తొక్కిసలాటను ఆపడంలో ఎలా విఫలమైంది? ఝూంసీ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సమాచారం పాలకుల వద్ద ఎందుకు లేదు? ఒకవేళ తొక్కిసలాట సమాచారం లేకుంటే తొక్కిసలాట జరిగిన స్థలంలో చెల్లాచెదురుగా ఉన్న బట్టలు, చెప్పులు ఇంకా ఇతర వస్తువులను పెద్ద పెద్ద ట్రక్కులలో ఎవరి ఆదేశాలతో తీసివేశారు?
ఇదే విషయానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేశారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. అయితే, ఈ పిటిషన్ మీద విచారణను నిరాకరించారు.
దీని మీద భారతీయ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంలో ‘ఇది ఒక దురదృష్టకర ఘటనే కాకుండా బాధను కలింగించే విషయం. మీరు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించండి. అక్కడ ఇంతకు ముందే పిటిషన్ దాఖలు చేసి ఉంది.’ అని ధర్మాసనం తెలిపింది.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.